6, డిసెంబర్ 2022, మంగళవారం

మత్స్యయంత్రం విశిష్టత -

 మత్స్యయంత్రం విశిష్టత  - 


        వేదసముద్ధరణ కొరకు అవతరించిన శ్రీ మహావిష్ణు స్వరూపమే " మత్స్యముర్తి" గా ఖ్యాతి వహించింది. విష్ణుదేవుని పది అవతారాలలో ఇది మొదటిది. మత్స్యయంత్రం అన్ని యంత్రాల కన్నా విశిష్టమైనది. ఈ యంత్రప్రస్తారము నందు గల ఏడు ఆవరణాలలోను అతి ప్రధానమైన బీజాక్షరాలు లిఖించబడినవి. శైవ , శాక్త, వైష్ణవ , గాణాపత్య , సౌర సాంప్రదాయములకు సంబంధించిన ముఖ్యతిముఖ్యములైన బీజాప్రస్ధారము గల ఈ యంత్రం వాస్తు సంబంధముగాను , సాధారణ గృహస్తు జీవితము నందు అత్యంత ఉపయుక్తముగా ఉన్నది. 


                గృహ మరియు స్థల సంబంధ ఏ దిశలయందైనను సంభవించు వివిధ దోషములను , తూర్పు సింహద్వార  గృహములకు కలుగు పలు దోషములను , అదేవిధముగా దక్షిణ , పశ్చిమ , ఉత్తర సింహద్వార గృహముల  దోషములను , ద్వారావేదలచే సంభవించు దోషములను , స్తంభ , కుడ్య , గవాక్ష వేదలచే కలుగు దోషములను , పిశాచ స్థాన , పైశాచిక వేధా దోషములను , దైవదృష్టి , గ్రహదృష్టి , విప్రదృష్టి మొదలగు దృష్టిదోషములను , వృక్షముల వలన సంభవించు అనేకానేక దోషములను , స్థలాంతర్గత , వర్గరాహిత్యము , ముఖ్యముగా ఈశాన్య స్థానము నుండి సంభవించే దోషములను ఈ యంత్రం పరిహరించి , వాస్తుశుభత్వం చేకూర్చును. శాస్త్రవిహితము కాని మరియు అనేకవిధములైన వాస్తుదోషములను కూడా ఈ మత్స్యయంత్రం తొలిగించును. 


             జీవితము నందు వృద్ది , కీర్తి , జయము , సంపద , సుఖము , ఆనందములను కోరు గృహస్తులుకు ఈ మత్స్యయంత్రం కోరికలు తీర్చు కామధేనువు వంటిది. స్వగృహమైన, పరగృహమైన లేదా ఎచ్చట నివసించుచున్నను మత్స్యయంత్రం ఉంచుకొనుట వలన విశేష లాభములు పొందగలరు. ఈ యంత్రం కేవలం గృహముల యందే కాక దేవాలయాలు , ధర్మశాలలు , హోటల్స్ , గవర్నమెంట్ ఆఫీసులు , భారీ మరియు చిన్న తరహా మెషినరీ స్థలములు , కర్మాగారములు , వ్యాపార స్థానములు మొదలగు ప్రదేశముల యందు కూడా ఈ మత్స్యయంత్రం ఉంచుట వలన సత్ఫలితాలు కలుగగలవు. 


                    వాహనముల యందు ఈ యంత్రం ఉంచిన ప్రమాద రహితమైన గమనమును కొనసాగించుతూ యజమానికి క్షేమాన్ని కలిగించును. విద్యాలయాల మూల యందు ప్రతిష్టించిన అఖండాభివృద్ధి కలుగును. దేవాలయ ప్రాకారముల యందు స్థాపించిన విశేష జనాకర్షణ కలిగించి అభివృద్ధిదాయకముగా ఉండగలదు. వైద్యశాలల యందు స్థాపించిన అచ్చటిరోగులకు శీఘ్రముగా ఆరోగ్యాన్ని చేకూర్చి దీర్ఘాయుష్షుని పెంపొందించును. గ్రామమధ్యమున స్థాపించిన ఆ గ్రామము అన్ని రకాలుగా అభివృద్ధి చెందును . అభివృద్ధిని చేకూర్చడంలో దీనికి సాటియగు యంత్రం ఇంకొటిలేదు . 


            మత్స్య యంత్రం రాగిరేకుపైన చెక్కించుట కొన్ని శాస్త్రాలు నిషేదించినవి. 5 * 5 అంగుళముల సమచతురస్రాకారం కలిగిన రేకుపైన ఈ యంత్రము చెక్కించి దశవిధ సంస్కారములు , ప్రాణప్రతిష్ట , జీవకళాన్యాసములు జరిపిన పిమ్మట ఒక లక్ష పర్యాయాలు గాయత్రి మహామంత్రమును , ఒక లక్షపర్యాయాలు మత్స్యగాయత్రి మంత్రమును కనీసముగా పదివేల పర్యాయాలు దీక్షానియమాలతోటి జపించి ఆ జపమును యంత్రమునకు ధారపోసి తారాబల , చంద్రబలములతో కూడిన శుభముహుర్తము నందు యంత్రమును ప్రతిష్టావిధిని అనుసరించి గృహము లేదా వ్యాపారస్థలము నందలి మధ్యభాగమున గాని లేదా ఈశాన్య దిశయందు గాని స్థాపించిన యెడల సర్వారిష్టములను , సమస్తదోషములను పరిహారము గావించి ఆ గృహవాసులకు దీర్గాయుష్షుని , సర్వశుభాలను కలుగచేయును . 


        మత్స్యయంత్రంను కొంతమంది భూమి యందుగాని , మరికొంతమంది ఈశాన్యములో తూర్పుగోడ లోపల స్థాపించు ఆచారం కలదు. కొన్ని సందర్భాలలో సాధన లేకుండా పూజామందిరము నందు కూడా పెట్టుకొని పూజించవచ్చు. 


   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 

కామెంట్‌లు లేవు: