24, ఆగస్టు 2023, గురువారం

 Toggle navigation

Sri Bhagavadgeetha Madanam-2    Chapters   

12. అజామిళోపాఖ్యానము

భగవన్నామ మాహాత్మ్యము

శ్రీ మహాభాగవతములో అజామీళో పాఖ్యానము భగవన్నామ సంకీర్తన యొక్క ప్రాశస్త్యమును చాటుచున్నది. నామ జపము నిరంతరమగు భగవత్‌ స్మృతికి సాధనము. నామానుసంధానము వలన మనోలయము సిద్ధించును. నామ జపమునకు సమస్త జనులకును జాతి భేదము లేక అధికారము కలదు. భూత హింసలేదు. దేశకాల నియమములు లేవు. ''యజ్ఞానాం జప యజ్ఞోస్మి'' అని భగవంతుడు యజ్ఞములలో జప యజ్ఞము తానని గీతలో తెలిపెను. కలికాలమున ''నారాయణస్య నామోచ్చారణ మాత్రేణ నిర్ధూత కలి ర్భవతి.'' నారాయణ నామ జపముచే కలిదోషముల దరింప వచ్చునని కలిసంతారణోపనిషత్తు తెలుపు చున్నది. ''నామ నామినో రభేదః'' నామమునకును భగవంతునకును అభేదము. నామ జపము సర్వ పాపహరము, ముక్తి ప్రదమని భాగవతము కొనియాడు చున్నది.

క|| ధీమహిత! భవన్మంగళ

నామ స్మరణాను కీర్తనము గల హీనుల్‌

శ్రీమంతు లగుదు రగ్ని

ష్టోమాది కృదాళి కంటె శుద్ధులు దలపన్‌

భాగవతము 3-1035

క|| నీ నామస్తుతి శ్వపచుం

డైనను జిహ్వాగ్రమందు ననుసంధింపన్‌

వానికి సరి భూసురుడుం

గానేరడు చిత్రమిది జగంబుల నరయన్‌

భాగవతము 3-1037

పూర్వము కన్యాకుబ్జమను పురమున అజామీళుడను బ్రాహ్మణుడుండెను. అతడు బాల్యమున వేదాధ్యయనము సేసి గురు శుశ్రూష నొనర్చి మంత్రసిద్ధి బడసెను. మంచి గుణములు, సత్య భాషణములు కలిగి ఆచారవంతుడై నైష్ఠికుడై యుండెను.

కొంత కాలమునకు నవ యవ్వన మతని మేన పొడసూపెను. ఒకనాడు సమిధలకై అరణ్యమునకేగి అందు ఒక వృషలి విటునితో ఒక లతా భవనంబున కామకేళి దేలుట తిలకించెను. అట్లు తిలకించిన అజామీళుడు మన్మ ధోద్దీపితుడై కులాచారము మంటగల్పి ఆ కులటను జేరి పిత్రార్జితము నామెపాలు జెసెను. సుగుణాభిరామ యగు నిజభామను వదలి వేసెను. ఇట్లు మోహ జలధిలో మునిగి పాపవర్తనుడై మెలగి పతితుడయ్యెను. అతనికి వార్థక్యము వచ్చెను. తన చిన్నకొడుకగు నారయణుని యందు బద్ధాను రాగుడై తనకు రాగల మృత్యువును గూర్చి ఆలోచించడయ్యెను.

క|| అత్యంత పాన భోజన

కృత్యంబుల పొత్తుగలిగి, క్రీడల తత్సాం

గత్యంబు వదల కాగతి

మృత్యువు గన నేరడయ్యె మిక్కిలి జడుడై

భాగవతము 6-65

ఇట్లుండ అతనికి మరణకాల మాసన్న మయ్యెను. యమకింకరులు అగుపడగా భీతినంది అజామీళుడు.

క|| దూరమున నాడు బాలుడు

బోరన తన చిత్తసీమ బొడగట్టిన నో

నారాయణ నారాయణ

నారాయణ యనుచు నాత్మ నందను నొడివెన్‌

భాగవతము 6-72

అప్పుడు విష్ణుదూత లరుదెంచి యమ పాశముల ద్రుంచి అతనిని విడిపించిరి. ''ధర్మ పరిపాలకులమైన మమ్ముల నెందు కడ్డగించితి'' రని యమదూతలు ప్రశ్నించిరి. దానికి బదులుగా విష్ణుదూత లిట్లనిరి.

ఆ|| బిడ్డపేరు పెట్టి పిలుచుట విశ్రామ

కేళినైన మిగుల గేలినైన

బద్య గద్య గీత భావార్థములనైన

గమలనయను దలప గలష హరము

భాగవతము 6-122

శక్తివంతమైన ఔషధము తెలియక సేవించినను రోగమును మాన్పునట్లు శ్రీహరి నామోచ్చారణము మోక్షప్రదము. అజామీళుడు మరణ సమయమున హరి నామోచ్చారణ మొనర్చెను. ఇట్టి సజ్జన ధర్మము వ్యర్థము కాదని విష్ణుదూతలు భాగవత ధర్మమును వివరించిరి.

అజామీళుడు వారి సంవాదము నాలించి పశ్చాత్తాప తప్తుడై యత చిత్తేంద్రియ మానసుడగుచు యోగమార్గంబున దేహంబు విడిచెను. భగవన్నామ గ్రహణంబున ముక్తి మార్గావలంబియై తుదకు మోక్షమును పొందెను.

కలియుగమున ముక్తిని పొందుటకు ''నామస్మరణా దన్యోపాయం నహి పశ్యామో భవ తరణ'' అన్నారు.

శ్లో|| ధ్యాయన్‌ కృతే యజన్‌ యజ్ఞైత్రేతాయాం ద్వాపరేర్చయన్‌

యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవమ్‌

విష్ణు పురాణము.

కలియుగమున నామకీర్తనము చేతనే ధ్యానము యజ్ఞము అర్చన మొదలగువాని ఫలమును పొందవచ్చును.

నామస్మరణ మహిమను, భగవద్గీత, రామస్తవ రాజము, భగవన్నామకౌముది మొదలగు గ్రంధములు వివరించుచున్నవి.

శ్లో|| యం యం వాపి స్మరన్‌ భావం

త్యజ త్యంతే కలేవరం

తం తమే వైతి కౌన్తేయ!

సదా తద్భావ భావితః గీత 8-6

ఎవడు మరణకాలమందు ఏ భావమును స్మరించుచు శరీరమును విడుచునో వాడెల్లప్పుడును, ఆ భావమునే పొందును.

శ్లో|| అన్తకాలేచ మామేవ

స్మరన్‌ ముక్త్వా కళేబరమ్‌

యః ప్రయాతి సమద్భావమ్‌

యాతి నాస్త్యత్ర సంశయః గీత 8-5

ఎవడు మరణకాలమున నన్నే చింతించుచు దేహమును వదలునో అతడు నన్నే పొందును. సంశయములేదు. అజామిళు డిట్లు మరణకాలమున ''నారాయణ'' యని కొడుకును సంబోధించిన మాత్రముననేముక్తుడయ్యెను.

శ్లో|| ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్‌ మా మనుస్మరన్‌

యః ప్రయాతి త్యజన్‌; దేహం సయాతి పరమాం గతిమ్‌ గీత 8-13

యోగ అవసాన సమయమున ఓంకారరూప బ్రహ్మ మంత్రమునుచ్చరించిన వరమపద ప్రాప్తి నొందును.

కాబట్టి భగవద్గీతలో సర్వకాల సర్వావస్థల యందును భగవంతుని తలచవలెనని తెలుపబడినది..

శ్లో|| తస్మాత్‌ సర్వేషు కాలేషు మా మనుస్మర గీత 8-7

భాగవతమునకూడ అవసానకాలమున హరిస్మరణ మోక్షదాయకమని తెల్పుచున్నది.

సీ|| అనఘాత్మ! మఱి భవదవతార గుణకర్మ

ఘన విడంబన హేతుకంబులైన

రమణీయమగు దాశరథి వసుదేవకు

మారాది దివ్య నామంబు లోలి

వెలయంగ మనుజులు వివశాత్ములై యవ

సాన కాలంబున సంస్మరించి

జన్మ జన్మాంతర సంచిత దురితంబు

బాసి కైవల్య సంప్రాప్తు లగుదు''రు

భాగవతము 3-304

రామకృష్ణ నామములు వివశాత్ములై అవసాన కాలంబున సంస్మరించినను కైవల్యము ప్రాప్తించునని భాగవత మతము.

గీ|| జనులకెల్ల శుభము సాంఖ్య యోగము దాని

వలన ధర్మనిష్ఠ వలన నైన

అంత కాలమందు హరిచింత సేయుట

పుట్టువులకు ఫలము భూవరేంద్ర!

భాగవతము 2-5

అట్లే మల్లయామాత్య ప్రణీతంబైన రామస్తవ రాజమను గ్రంధమున నామ సంకీర్తన ఘట్టమున రామకృష్ణ నామ మాహాత్మ్యము వర్ణింప బడినది. ఆ ఘట్టమునందలి పద్యములను ఉదహరింతుము.

గీ|| పాండవోత్తమ! విను పరబ్రహ్మమైన

రామకృష్ణుల నామ కీర్తనల మహిమ

లేమి జెప్పుదు? ధాత్రిలో నెవ్వరైన

వాంఛ నొకమారు బల్క బావనుల జేయు.

గీ|| నామకీర్తన సరిసాటి భూమి గలదె

తెలియనేరని మూర్ఖులు తీర్థయాత్ర

లంచు దేవతాసేవ లట్లంచు, నుండ

బట్టక తిరుగు గ్రహచార బాధగాక.

క|| జారుండై నను వృద్ధా

చారుండైనను, గృహస్ధ సంచారుండై

శ్రీరామా యని ఒకపరి

నోరాడిన జాలు వాని నూరేడులకున్‌.

సీ|| తెల్లవారక తొలి చల్లని నీటిలో

వాయక నొడలెల్ల వణకువారు

నీరు కావులు గట్టి నీళ్ళు దర్భలచేత

సవ్యాప సవ్యముల్‌ జల్లువారు

బిగుసుక ముక్కులు బిగియించి గొణుగుచు

మా గన్ను వేయుచు తూగువారు

సాముజేసిన యట్లు సాగిల బడి పడి

బ్రొద్దుకై నిల్వగ బోవువారు.

బిర బిరను చెట్ల చుట్టును తిరుగువారు

నేయి జిదుగులు నగ్నిలో వేయువారు

వైశ్వదేవాది పూజల వరలు వారు

కీర్తనల సేయువారల క్రిందివారు

క|| ఆర్తా వేశముచే హరి

కీర్తన పరుడైన వాడు కృష్ణాయనుచున్‌

మూర్తి భజించిన యొక్క ము

హూర్తములో స్వామివద్ద నించుక యుండున్‌

పై పద్యముల భావము పరికించిన అది అర్థ వాదముగా తోచకమానదు. కాని శ్రీస్వామి అఖండానంద సరస్వతి వ్రాసిన ''భగవన్నామ కౌముది'' యందు భగవన్నామ జపమునకు చెప్పబడిన మహిమ అర్థవాదము కాదని చెప్పబడినది. ''కేవలయా భక్త్యా'' అను భాగవత వచనముచేత, ప్రకాశ మేర్పడగనే అంధకారము పూర్తి తొలగునట్లు, శ్రవణ కీర్తన స్మరణరూపమైన భక్తి చేతనే పాపక్షయ మగుచున్నది. అందులకే శ్రీ శంకరాచార్యులు భగవద్గీతా వ్యాఖ్యానమునందు '' భక్తి మాత్రేణ కేవలేన శాస్త్ర సంప్రదానే పాత్రం భవతి'' అని భక్తుడైన వానికి గీతాశాస్త్రము పదేశించ వచ్చునని తెలిపెను.

పాపక్షయమునకు ఇతర వైదిక ప్రాయశ్చిత్త కర్మల ఆవశ్యకత కూడ లేదు, కర్మాత్మకమగు వైదిక ప్రాయశ్చిత్తము అనగా వ్రతాదులు, పాపక్షయము మాత్రమే కలిగించును. కాని వాసనా క్షయము కలిగింప జాలవు. వాసనా క్షయము భక్తి చేతను, జ్ఞానముచేతను మాత్రమే కలుగును. ఇది భాగవత మతము. ప్రాయశ్చిత్త కర్మ వాసనా క్షయము కలిగింపజాలదు. కాబట్టి తిరిగి పాపము చేయుటకు అవకాశమున్నది. శ్రవణ కీర్తన స్మరణ రూపమైన భక్తి సర్వపాపములను నిర్మూలించెను.

శ్లో|| ఏతావతాల మఘ నిర్హరణాయ పుంసాం

సంకీర్తనం భగవతో గుణ కర్మ నామ్నాం

వికృశ్య పుత్ర మఘవాన్‌ య దజామిలో ೭ పి

నారాయణతి మ్రియమాణ ఇయాయ ముక్తిమ్‌.

అజామీళుడు మహాపాపి. మరణ సమయమున కొడుకు నుద్దేశించి నారాయణా అనెను. అతడు భగవంతుని స్మరించ లేదు. అనగా బుద్ధి పూర్వకముగా భగవన్నామోచ్చారణ చేయలేదు కదా! అయినను ముక్తి లభించినది.

ఆ|| బాంధవముననైన, బగనైన, వగనైన,

బ్రీతినైన, ప్రాణ భీతినైన,

భక్తినైన, హరికి పరతంత్రులై యుండు

జనులు మోక్షమునకు జనుదు రధిప!

భాగవతము 10-973

ఆ|| బిడ్డ పేరు పెట్టి పిలుచుట విశ్రామ

కేళినైన మిగుల గేలినైన

బద్య గద్య గీత భావార్థములనైన

గమలనయను దలప గలుష హరము

భాగవతము 6-122

క|| డెందంబు పుత్రు వలనం

జెందినదని తలప వలదు శ్రీపతి పేరే

చందమున నైన బలికిన

నందకధరు డందు గలడు నాథుం డగుచున్‌

భాగవతము 6-121

క|| కామంబు, పుణ్యమార్గ

స్థేమంబు, మునీంద్ర పాద చేత స్పరసీ

ధామంబు, విష్ణు నిర్మల

నామంబు దలంచువాడు నాధుడు గాడే.

శ్లో|| విద్యా తపః ప్రాణ నిరోధ మైత్రీ

తీర్థాభిషేక వ్రతదాన జపై#్యః

నాత్యంత సిద్థిం లభ##తే న్తరాత్మా

యధా హృదిస్థే భగవ త్వనన్తే.

పాపక్షయమునకై ఏకైక నామ జపమే చాలును. ఇతర కర్మలు దానితో చేయ నవసరములేదు. తపస్సు వ్రతము దానము జపము ఇత్యాదులచే పూర్ణ సిద్ధి లభింపదు. భగవన్నామ సంకీర్తనమే పూర్ణ సిద్ధిని కలిగించును.

శ్లో|| పాపే గురూణి గురుణి స్వత్పా న్యల్పేచ తద్విదః

ప్రాయశ్చిత్తాని మైత్రేయ జగుః స్వాయంభు వాదయః

శ్లో|| ప్రాయశ్చిత్తా న్యశేషాణి తపః కర్మాత్మకానివై

యానితేషా మశేషాణాం కృష్ణాను స్మరణం పరమ్‌

తపస్సు కర్మ మొదలగు ప్రాయశ్చిత్తములను పెద్దవి చిన్నవి అను పాపములకు తగినట్లు వేరువేరుగా మన్వాదులు విధించిరి. కాని అన్ని పాపములకు ప్రాయశ్చిత్తము కృష్ణానుస్మరణ మొక్కటే.

కృష్ణనామ స్మరణ మనగా కృషితి=సంసారమును భంగము చేయునది అని అర్థము; లేదా కర్షతి=అజ్ఞానమును భంగము చేయునది అని అర్థము. కాబట్టి అజ్ఞాన నిరసనమైన బ్రహ్మ విద్యయే కృష్ణాను స్మరణమని కొందరి వాదము. కాని అనుస్మరణమనగా కీర్తనమేనని క్రింది శ్లోకమునుండి గ్రహింపవచ్చును.

శ్లో|| క్వ నాకపృష్ఠ గమనం పునరావృత్తి లక్షణం

క్వ జపో వాసుదేవేతి ముక్తిబీజ మనుత్తమమ్‌

పునర్జన్మ కలిగించు స్వర్గలోక గమన మెక్కడ? ముక్తి బీజ మగు వాసుదేవ నామమెక్కడ? ఇంకను

శ్లో|| అవరే నాపియన్నామ్ని కీర్తితే సర్వపాతకైః

పుమా స్వముచ్యతే సద్యః సింహసై#్త న్మృగైరివ

వివశముగా నామ కీర్తనము చేసినప్పటికిని తక్షణమే సర్వపాపములనుండి విముక్తుడు కాగలడు.

శ్లో|| ఏతేనై వ హ్యఘోనోస్య కృతం సాదఘ నిష్కృతమ్‌

యదా నారాయణా యేతి జగాద చుతరక్షరమ్‌

అజామీళుడు పుత్రుని కొర కుచ్చరించిన నారాయణ నామము భగవన్నామ జపదృష్ట్యా ఉచ్చరింపబడినది కాదు. (నామాభాసము) ఈ ఉచ్చారణలో శ్రద్ధగాని ఆవృత్తిగాని ఫలకాంక్షగాని లేదు. అయినను మోక్షఫలము సిద్ధించినది కదా!

ఇట్టి అభిప్రాయమే రామనామ జపమును గూర్చి సీతరామాంజనేయ సంవాదమున కలదు.

తే|| రామరామ యటంచును గాముకుండు

మోహమున బ్రేయసిని బిల్వ మోక్షమొసగు

రామనామంబు హిమశైలరాజ తనయ!

గాన వర్ణింపగా జాల దాని మహిమ.

గోపన్న దాశరథీ శతకమున ''నీ నామము దాచుకో లేవు గదా?'' యని రాముని ప్రశ్నించెను.

ఉ|| నీలఘనాభ మూర్తివగు నిన్ను గనుంగొన కోరి వేడినన్‌

జాలముసేసి డాగెదవు సంస్తుతి కెక్కిన రామనామమే

మూలను దాచుకో గలవు.

శ్లో|| అజ్ఞానా దధవాజ్ఞానా దుత్తమ శ్లోక నామయత్‌

సం కీర్తిత మఘం పుంసాం దహత్సే ధో యధానలః

జ్ఞానముతోగాని, అజ్ఞానముతోగాని చేసిన భగవన్నా మోచ్చారణము పాపక్షయము చేయుచున్నది. నామ కీర్తమునకు జ్ఞాన మవసరము లేదు. కీర్తనతో పాపక్షయమైన తరువాత జ్ఞానోదయ మగును. వాల్మీకి కేవల రామనామ జపముననే తరించెను. భగవన్నామ స్మరణము మాటిమాటికి చేయుటచేత అంతఃకరణము శుద్ధి పొందును. దానితో పాపక్షయము వాసనాక్షయము రెండును సిద్ధించును. భగవ ద్విషయమైన వాసనలు వృద్ధి పొందుచూ పాప వాసనలు క్షీణించును. ఆ పైన శుద్ధ సత్త్వగుణము కలిగి ఆత్మ జ్ఞానము సిద్ధించును, ''సత్వాత్‌ సంజాయతే జ్ఞానమ్‌'' నారదునకు రజో తమోగుణ పరిహారిణియగు భక్తి కలిగి సత్వగుణ మేర్పడెనని భాగవతము తెలుపుచున్నది.

శ్లో|| మ్రియమాణో హరేర్నామ గృహ్ణాన్‌ పుత్రోపచారితమ్‌

అజామీలోప్యగాద్ధామ కిముత శ్రద్ధయా గృణన్‌.

మరణాసన్న దశలో నారాయణ శబ్ద మాత్రోచ్చారణము వలన అజామీళుడు ముక్తి నందెనుగదా? ఇక శ్రద్ధతో నామస్మరణము జేయు వారి విషయము చెప్పనేల?

వేదాంత శ్రవణము జేసినను ప్రతి బంధకము వలన జ్ఞానము కలుగనిచో ఆ ప్రతి బంధకమును భక్తి తొలగించును.

ఉ|| కొంజిక తర్కవాదమను గుద్దలిచే బరతత్త్వ భూస్థలిన్‌

రంజిల ద్రవ్వి కన్గొనని రామ విధానము నేడు భక్తి సి

ద్ధాంజనమందు హస్తగత మయ్యె - దాశరధీశతకము

వేదాంత శ్రవణము భక్తుడు చేయనిచో దేహాంతమున భగవంతుడే తత్త్వజ్ఞాన ముపదేశించు. మోక్షము నొసగును.

''దేహాంతే దేవః పరం బ్రహ్మతారకం వ్యాచష్టే

ఏనాసా వమృతీ భూత్వా సోమృతత్త్వంచ గచ్ఛతి''

శ్రీ నృసింహతాపిని ఉపనిషత్తు

శ్రీరామనామ జప మెంతటి ఫలమును జేకూర్చునో చూడుడు.

శ్లో|| ఆకృష్టిః కృతచేతసా సుమహతా ముచ్చాటనం చాం హసాం

ఆచండాల మమూక లోక సులభో విశ్వశ్చ మోక్ష శ్రియః

నోదీక్షాం నచదక్షిణాం నచపురశ్చర్యాం మనాగీక్షతే

మంత్రోయం రసనా స్పృగేవ ఫలతి శ్రీరామ నామాత్మకః

రామ నామముచే మహాత్ములు ఆకర్షింపబడిరి కాన ఆకర్షణ విద్య మోక్ష లక్ష్మిని కైవశము గావించును గాన వశీకరణవిద్య పాపములను పారద్రోలుటచేత ఉచ్చాటనవిద్య.

జాతి భేదము పాటించ పనిలేదు: దీక్ష దక్షిణ జపము అవసరము లేదు. ఈ శ్రీరామనామ మంత్రము మాత్రమే సర్వమంగళములను చేకూర్చును.

విష్ణు సహస్ర నామమున నారాయణ జపము అభయ ప్రదానము చేయునని సూచించినది.

శ్లో|| ఆర్తా విషణ్ణా శిధిలాశ్చ భీతా

ఘోరేషుచ వ్యాధిషు వర్తమానాః

సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం

విముక్త దుఃఖాః సుఖినో భవన్తి

............ భేకగళంబు లీల నీ

నామము సంస్మరించిన జనంబు భవం బెడబాసి తత్పరం

ధామ నివాసు లౌదురట .............

-దాశరథీ శతకము

''తెలిసి రామభజన సేయనే '' అని త్యాగరాజు అన్నప్పటికిని గోపన్న కప్పలు అరచిన విధమున కేవల రామనామము మాత్రమే జపించినను మోక్షము కల్గునని తెల్పెను. ఇందుకు నిదర్శనము వాల్మీకి మహర్షి.

ఇట్టి నామజప ప్రాశస్త్యము తెల్పుటకై అజామీళోపాఖ్యానము భాగవతమున చెప్పబడినది.

సీ|| బ్రహ్మ హత్యానేక పాపాటవుల కగ్ని

కీలలు హరినామ కీర్తనములు

గురు తల్ప కల్మష క్రూర సర్పములకు

గేకులు హరినామ కీర్తనములు

తపనీయ చౌర్య సంతమసంబునకు సూర్య

కిరణముల్‌ హరినామ కీర్తనములు

మధుపాన కిల్బిష మదనాగ సమితికి

గేసరుల్‌ హరినామ కీర్తనములు

మహిత యాగోగ్ర నిత్య సమాధి విధుల

నలరు బ్రహ్మాది సురలకు నందరాని

భూరి నిర్వాణ సామ్రాజ్య భోగభాగ్య

ఖేలనంబులు హరినామ కీర్తనములు భాగవతము 6-118

ఈ కథవలన తెలిసికొన దగిన విషయములు:-

1. భగవన్నామ మాహాత్మ్యము పొగడ సాధ్యముకాదు.

2. అంత్యకాలమున నారాయణనామ స్మరణము అవశ్యకర్తవ్యము.

3. హరినామ స్మరణము తెలిసి జేసినను తెలియక జేసినను పాప హరము, మోక్షప్రదము.

4. భగవద్భక్తుడు కర్మవశమున పతితుడైనను శ్రీహరియే అతనిని కాపాడును.

5. శ్రీ రమణ మహర్షి నామజపమును గూర్చి ఇట్లు తెలిపెను.

నిరంతరము నామజపము మానసికముగా చేయవలయును. ఈ జపము దైనందిన కార్యములు చేయుచున్నపుడును జరుగుచుండును. డ్రైవరు మనతో మాటలాడు చుండియు కారును నడుపుచుండును కదా? మనము ఇతరులతో మాట్లాడునప్పుడు చదువునప్పుడు మానసిక జపము జరుగదు.

నిద్రించుటకు ముందు మానసికముగా నామజపము చేయుచున్న ఎడల నిద్రలోకూడ ఆ జపమట్లే జరిగి నిద్రలేవగనే ఆ జపమే మానసికముగా జరుగుచుండుట గమనింప వచ్చును. దీనినే ఆత్మజప మని మహర్షి తెలిపెను.

ఇట్లు నిరంతర జపము నలవరచుకొన్న వాడే అంత్యకాలమున భగవన్నామోచ్చారణ చేయును. లేని యెడల కఫవాత పిత్త ప్రకోప ముల వలన తెలివితప్పి యుండును. భాగవతమున

సీ|| వాసుదేవ శ్లోక వార్త లాలించుచు

గాల మే పుణ్యుండు గడపుచుండు

నతని యాయువు దక్క యన్యుల యాయువు

నుదయాస మయముల నుగ్రకరుడు

వంచించి కొనిపోవు. - భాగవతము 2-47

అని చెప్పబడియున్నది. అందువలన దాశరథీ శతకములోని గోపన్న వాక్యములు పాటింపదగినవి.

ఉ|| ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చినవేళ, రోగముల్‌

గొప్పరమైనచో గఫము కుత్తుక నిండినవేళ, బాంధవుల్‌

గప్పినవేళ, మీ స్మరణ కల్గునొ? కల్గదొ? నాటి కిప్పుడే

తప్పక చేతు మీ భజనత దాశరథీ! కరుణాపయోనిధీ!

Sri Bhagavadgeetha Madanam-2    Chapters   

 

కామెంట్‌లు లేవు: