24, ఆగస్టు 2023, గురువారం

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-29🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-29🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


తొండమానుడు ఆలయ నిర్మాణమునకు తక్షణమే పూనుకొనినాడు. అతితక్కువ రోజుల్లోనే ఆనందనిలయం గోపుర, ప్రాకార, మంటపాలూ, మెట్లూ కట్టించాడు. పూల బావిని బాగుచేయించినాడు. ఆలయ నిర్మాణపు ముగింపు గూర్చి శ్రీనివాసునకు కబురు పంపినాడు. 



వేద వేదాంగ నిష్ణాతులైన బ్రాహ్మణులు శ్రీనివాసుడు ఆలయములో ప్రవేశించడానికి సముహూర్తం నిర్ణయించినారు. ఆ ప్రవేశోత్సవం చూడడానికి సర్వలోకాల వారున్నూ విచ్చేసారు. పద్మావతీ శ్రీనివాసులు చక్కగా ముస్తాబై ముహూర్తము సమీపించగానే విప్రాశీర్వచన శ్లోక శుభమంత్రములు చెలగుచుండ, వివిధ మంగళ వాయిద్యములు మ్రోగుచుండ, మునీంద్రులు ఆశీర్వచన శుభవాక్యాలు పలుకుచుండ, బ్రహ్మాది దేవతలు పుష్పవర్షం కురిపించుచుండ, జయ జయ నినాదముల మధ్య ఆనంద నిలయమున ప్రవేశించినారు.


కలియుగదైవమైన శ్రీనివాసుడు వుండు శ్రీ వేంకటాచలము ఒక ఆమడవెడల్పు, ముప్పయి ఆమడల పొడవు విస్తరించి వుంది


. శ్రీమద్వేంకట శైలరాజ శిఖరే శ్రీ శ్రీనివాసో హరి:

   శ్రీమత్ స్వామి సరోవర ప్రభృతిభి: పుణ్యైరనేకైర్యుతే

   తీర్థై:ప్రాజ్ముఖ సంస్థితి ర్విజయతే శ్రీతొండమానాదిభి:

   దృష్ట: శ్రీ నవసూరి సంస్తుత వపు స్త్వాలింగ్య పద్మావతీమ్‌||

   శ్రీ వేంకట గిరీశోయం అలర్ మేల్ మంగనాయకీమ్‌|

   ఆశ్రితో రాజతే నిత్యం ఆనంద నిలయాలయ:||


   మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠ ముత్తమమ్‌

   స్వామిపుష్కరిణీ తీరే రమయా సహమోదతే.


శ్రీమన్నారాయణుడు పరమానంద స్వరూపమైన శ్రీవైకుంఠమును విడచి స్వామి పుష్కరిణీ తీరమున లక్ష్మీదేవితో కలసి ఆనందించుచున్నాడు, అనియు


   "శ్రీవైకుంఠవిరక్తాయ స్వామిపుష్కరిణీ తటే

    రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్‌"


("శ్రీవైకుంఠమున విరక్తుడైన స్వామి, స్వామి పుష్కరిణీ తీరమున లక్ష్మీదేవితో కలసి ఆనందించుచున్నాడు") 


అనియు చెప్పినట్లుగా శ్రీవైకుంఠనికేతనుడైన స్వామి భక్త సంరక్షణ దీక్షితుడై తిరుమలపై వేంచేసియున్నాడు.


   "కృతేయుగే నారసింహ: త్రేతాయాంరఘునందన:

    ద్వాపరే వాసు దేవశ్చ కలౌవేంకటనాయక:"


అని చెప్పినట్లుగా కృతయుగమున నరసింహస్వామి, త్రేతాయుగమున శ్రీరామచంద్రులు, ద్వాపరయుగమున శ్రీకృష్ణపరమాత్మ; కలియుగమున శ్రీవేంకటేశ్వరస్వామి భక్తరక్షణ దీక్షితులై యున్నారు.



శ్రీనివాసునకు బ్రహ్మోత్సవము

ఆనందనిలయం ప్రవేశోత్సవము జరిగిన తరువాత బ్రహ్మదేవుడు శ్రీనివాసుని చెంతకు వచ్చి ‘ఆదిపురుషా! నేను నీ చెంత రెండు ఆఖండజ్యోతులు వెలిగించెదను. లోక కళ్యాణకరంగా అవి ఎప్పుడూ నీ వద్ద వెలుగుతూండవలెను. ..


నీవు కలియుగపుమానవుల కొరకై యుగాంతము వరకూ యిచ్చటనే నివసించుచు భక్తులకు దర్శనభాగ్యము కలుగజేస్తూ వుండవలెను.


 నేను నీకు ఒక ఉత్సవము చేయగలను. దానికి మీరు అంగీకరించ గలందులకు కోరుచున్నాడు. అనగా శ్రీ వెంకటేశ్వరుడు అంగీకరించినాడు. 


బ్రహ్మదేవుడు రెండు అఖండ దీపాలు వెలిగించి, ఇవి కలియుగాంతం వరకూ వెలుగుతూంటాయని చెప్పాడు.


బ్రహ్మోత్సవము ప్రారంభమైనది.


 పగలూ రాత్రీ అనక, ఏకటాకిని అలాగే ఉత్సవము జరుగసాగినది. 


ఆశ్వయుజ శుక్ల పాడ్యమి మొదటి రోజున అంకురార్పణ జరిగినది. ధ్వజారోహణము, శేషవాహనము, గజవాహనము, సింహవాహనము, ముత్తెంపుపందిరి, కల్పవృక్షవాహనము, సర్వభూపాల వాహనము, మోహినీ అవతారము గరుడసేవ, హనుమంత వాహనము, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలు, రథోత్సవము అశ్వవాహనము ఇవి అన్నీ తొమ్మిది రోజులపాటు రకరకాలుగా ఉత్సవాలు జరిగాయి. 


పదియవ రోజున అలంకారాలతో నిండిన పల్లకీ ఉత్సవము జరిగినది. ఆనాడే స్వామి పుష్కరిణీ తీర్థములో అవబృథస్నానము కూడా జరిగినది. వేలకొలదీ భక్తులు యీ ఉత్సవాలకు హాజరయ్యారు.


ఎక్కడ విన్ననూ ‘గోవిందా, గోవిందా’ అనే హరినామస్మరణమే! శేషాచలము! బ్రహ్మోత్సవ సమయములో వైకుంఠాన్ని తిరస్కరించేటటువంటి ప్రకాశంతముగా వుంది. భక్తులు శ్రీ వేంకటేశ్వరునకు కానుకలూ అవీ సమర్పించి, అనంతరము వారి వారి యిండ్లకు వెళ్ళిపోయారు. బ్రహ్మదేవుడు శ్రీనివాసునితో చెప్పి సత్యలోకానికి వెళ్ళి పోయాడు.



తిరుమల నాయక గోవిందా, తులసీమాల గోవిందా, శేషాద్రి నిలయ గోవిందా, శ్రేయోదాయక గోవిందా, |


గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||29||



*శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: