15, డిసెంబర్ 2023, శుక్రవారం

పెరియ పురాణం⚜️

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 29*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 

*తిరుమూల నాయనారు*


కైలాసంలో నందీశ్వరుని వద్ద ఉపదేశం పొందిన సుందరుడనే

మహాభక్తుడు ఉండేవాడు. నంది దేవునిచే 'నాధర్' అని పిలువబడిన

వాడితడు. తిరుమూలర్ అనే పేరుతో లోకంలో ప్రసిద్ధి చెందిన శివ భక్తుడితడు. అణిమాది అష్టసిద్ధులను కైవశం చేసుకొన్న యోగి పుంగవుడు

తిరుమూలర్.


పొదిగై పర్వతంలో నివసిస్తున్న అగస్త్య మహర్షితో కలసి ఉందామనే

కోరికతో తిరుమూలర్ పొదిగైమలైకు బయలుదేరాడు. చిదంబరం మొదలైన

శివాలయాలను దర్శించుకుంటూ కావేరీ నదీ తీరం చేరుకున్నాడు. అక్కడ

ఒకచోట పశువులన్నీ మేత మేయక గుమికూడి కన్నీరు విడుస్తూ దుః

ఖిస్తుండడం చూశాడు. దీనికి కారణమేమిటని ఆలోచించాడు.

సానూరు అనే గ్రామంలో ఒక గొల్లవాడుండేవాడు. అతని పేరు మూలన్. 


అతడు పశువులను మేపుతుండేవాడు. అతడు పశువులను తన

ప్రాణంకంటె మిన్నగ భావించి ప్రేమతో రక్షిస్తూ వచ్చాడు. ఒకరోజు అతడు

పాముకాటుచే మరణించాడు. అందువలన పశువులన్నీ అతని కళేబరం

చుట్టూ నిలబడి కన్నీటి వర్షాన్ని కురిపించాయి. 


ఈ దృశ్యాన్ని చూసిన

తిరుమూలర్ హృదయం కరిగిపోయింది. వెంటనే అతడు పరమేశ్వరాను

గ్రహంచే పశువుల దుఃఖాన్ని నేను నివృత్తి చేస్తాను. ఇతడు పునర్జీవితాన్ని

పొందితేగాని పశువుల దుఃఖము తొలగిపోదు అని భావించాడు.

తిరుమూలర్ తన శరీరం నుండి ప్రాణాలను వేరు చేశాడు. 


శరీరాన్ని ఒకచోట భద్రపరచి తాను నేర్చుకొన్న యోగ విద్యాబలంచే తన ప్రాణాలను

చనిపోయిన గొల్లవాడి శరీరంలో ప్రవేశపెట్టాడు. చనిపోయిన గొల్లవాడి

శరీరాకృతిలో తిరుమూలర్ పైకి లేచాడు. గొల్లవాడు ప్రాణాలతో పైకి లేవడాన్ని చూసి పశువులన్నీ చాలా సంతోషించాయి. వాటిని మంచి పచ్చిక

బయళ్లలో మేయడానికి విడిచాడు. మధురమైన కావేరీ జలాలను తాగించాడు.


సాయంత్రం కాగానే పశువులు తమ దూడలను తలచుకుని

ఇంటిముఖం పట్టాయి. తిరుమూలర్ కూడ వాటిని వెన్నంటి వెళ్లాడు.

మూలని భార్య తన భర్త ఇంకా ఇంటికి రాలేదని అతన్ని వెతుక్కుంటూ

వెళ్లి పశువుల వెంట వస్తున్న తన భర్తను చూసింది. అతడున్న ధోరణి

గమనించి అతనికి ఏదైనా కీడు జరిగిందేమోనని భయపడింది. 


అతన్ని పట్టుకొని తన ఇంటికి బలవంతంగా తీసుకు వచ్చింది. అతడు

యోగాసనంలో కూర్చుండి పోయాడు. తన భర్త పరిస్థితిని గురించి ఊళ్లో

వాళ్లకు తెలియజేసింది. తిరుమూలర్ విచిత్ర ధోరణిని గమనించిన

ఊరిపెద్దలు “ఇది పిచ్చిగాని మైకంగాని కాదు. ఇతనికి ప్రపంచ వ్యామోహం

ఏమీ లేదు. ఇతడు శివయోగంలో లీనమై ఉన్నాడు. 


ఇతడు సంసార

బంధాలన్నింటినీ వదలుకొన్న జ్ఞాని" అని చెప్పారు. మూలని భార్య వెక్కి

వెక్కి ఏడ్చింది. అక్కడున్న వారు ఆమెను ఓదార్చి వెళ్లిపోయారు.

తిరుమూలర్ భగవద్ధ్యానం చేస్తూ తిరువావడుతురై పవిత్రక్షేత్రం

చేరుకుని స్వామిని దర్శించు కొన్నాడు. దేవాలయం పక్కనే ఉన్న అశ్వత్థ

వృక్షం కింద ఆసీనులై యోగనిష్ఠలో కాలం గడిపాడు. 


సంవత్సరానికొక

పద్యం వంతున మూడువేల సంవత్సరాలకు మూడువేల పద్యాలను

రచించాడు. ఇది 'తిరు మంత్రము' అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. తన

మనసులో సదా పరమేశ్వరుని ధ్యానిస్తూ వచ్చిన తిరుమూలర్ చివరగా

శివునిలో ఐక్యమయ్యాడు.


*ఇరవై తొమ్మిదవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: