పోతనగారి మనో విశ్లేషణ!
శా: " లగ్నంబెల్లి , వివాహముంగదిసె , నేలారాడు గోవిందు , డు
ద్విగ్నంబయ్యెను మానసంబు , వినెనో వృత్తాంతమున్ , బ్రాహ్మణుం
డగ్నిద్యోతనుఁడేటికిం దడసె , నాయత్నంబు సిధ్దించునో ?
భగ్నంబై చనునో ? , విరించి కృత మెభ్భంగిన్ బ్రవర్తించునో ?
రుక్మిణీ కళ్యాణము- ఆం- భాగవతము-దశమస్కంధము- 1773 పద్యం: బమ్మెఱ పోతన మహాకవి.
చిన్న నాటినుండి కన్నయ్యను పెండ్లియాడాలనే రుక్మిణి తలంపునకు భిన్నంగా శిశుపాలునితో ఆమెవివాహం
నిశ్చయింప బడింది. అతనిని పెండ్లియాడే ఉద్దేశ్యంలేని రుక్మిణి, అగ్నిద్యోతనుడను బ్రహ్మణుని ద్వారా కృష్ణునకు ప్రణయ సందేశ
మంపింది. " కృష్ణా నేను నీయందు బధ్ధానురాగను. శిశుపాలుని బారి నుండి తప్పించి నన్నేలుకొనుము. నీవు ససైన్యముగ విచ్చేసిన చో
నీవెంట వచ్చెదను. నన్ను నమ్ముమని " సందేశసారాంశము.
అగ్ని ద్యోతను డామె సందేశమును గొని ద్వారక కేగెను. అతని నుండి సమాధానమా ,లేదు. గోవిందుడా, రాలేదు. రేపే వివాహము. బలిమిమై వివాహము జరిపించుటకు అన్నరుక్మి సర్వ సన్నధ్ధుడైనాడు. ఈస్థితిలో డోలాయమానమైన యామె మనో విచేష్టతములను బమ్మెఱపోతన బహు రమ్యముగా చిత్రించినాడు.
తొలుత "ఘనుడాభూసురుడేగెనో? " యనుపద్యముతో నీమనో విశ్లేషణ మారంభమైనది. అసలా ముసలిబ్రాహ్మణుడంతదూరం వెళ్ళియుంటాడా? మార్గాయాసంతో మధ్యలో యెక్కడైనా కూలబడి యుండడుగదా?
ఇతను చెప్పింది కృష్ణుడు విన్నాడో వినలేదో? వస్తాడో రాడో? నాఅదృష్టం యెలాఉందో మరి?
ఇలా సాగిపోతున్నాయి.రుక్మిణి ఆలోచనలు. ముహూర్తం దగ్గర పడిన కొద్దీ ఆమెకు కంగారు యెక్కువౌతున్నది.
" రేపే వివాహం. ముహూర్తంకూడా దగ్గరపడింది. ఇంతవరకూ గోవిందునిజాడ లేదు. మనస్సు ఉద్విగ్నంగా ఉంది ( కంగారు గాబరా యేడుపు యివన్నీ కలిస్తే వచ్చే వికారం) ఈబ్రాహ్మణుడు చెప్పనది విన్నాడో లేదో? బ్రహ్మణుడేల యాలసించెనో? నాప్రయత్నం ఫలవంతమగునో లేదో? బ్రహ్మ నిర్ణయం యేవిధంగా ఉందో? "- ఇది ఆమె మనస్సులోని డోలాయమాన మగుచున్న
భావనలు.
లోకంలో మనకు అనుభవమే ! యేదైనా పనిమీద మనంపంపినవారు సరియైన సమయానికి రాకపోతే, వారినుండి యెలాటి వర్తమానం లేకపోతే మనం పడే మనోవేదన చెప్పటానికి మాటలుండవు. అలాంటి సన్నివేశచిత్రణను మనవారిప్పుడు
"చైతన్యశిల్పం"- అనేపేరుతో వ్యవహరిస్తున్నారు. ఇదే వ్యవహారాన్ని యింత చక్కగా మనకందిన పోతనగారి మనోవిశ్లేషణా సామార్ధ్యన్ని బహుధా ప్రశంసిస్తూ, ఆమహాకవికి కైమోడ్పులతో
స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి