🙏 తెలుగు భాషావిర్భావము-వాఙ్మయ వికాసము🙏 రెండవ భాగము
ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనకకు మనము తెలుసుకోవచ్చు, కానీ తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6 వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శకం ఎ.డి.కి చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం 'నాగబు'. చక్కటి తెలుగు భాషా చరిత్రను (సాహిత్యమును) మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించ వచ్చు.
13వ శతాబ్దంలో అథర్వణ ఆచార్య తెలుగు వ్యాకరణాన్ని త్రిలింగ శబ్దానుశాసనము (లేదా త్రిలింగ వ్యాకరణం) అని పిలిచారు. 17వ శతాబ్దానికి చెందిన అప్పకవి త్రిలింగ నుండి తెలుగు ఉద్భవించిందని స్పష్టంగా రాశాడు. అప్పకవి పూర్వీకులకు అటువంటి వ్యుత్పత్తి గురించి తెలియదు కాబట్టి ఇది "విచిత్రమైన భావన" అని పండితుడు చార్లెస్ పి. బ్రౌన్ వ్యాఖ్యానించాడు.
మరొక కథనం ప్రకారం తెనుగు అనేది ద్రావిడ పదం *తెన్ అంటే దక్షిణం కు అంటే భాష. దక్షిణ దిశలో నివసించే ప్రజలు మాట్లాడుకునే భాష తెనుగు. మునుగు అనే పదం ములుగు అయినట్లే తెనుగు అనే పదం తెలుగు అయింది.
అమరావతిలోని నాగబు అనే పదము విక్రమేంద్రవర్మ చిక్కుళ్ళ సంస్కృత శాసనంలోని "విజయరాజ్య సంవత్సరంబుళ్" మనకు కనిపిస్తున్న మొదటి తెలుగు పదాలు. నాగార్జునకొండ వ్రాతలలో కూడా తెలుగు పదాలు కనిపిస్తాయి. ఇవన్నీ ప్రాకృత శాసనాలు లేదా సంస్కృత శాసనాలు. కనుక తెనుగు అప్పటికి జనసామాన్యంలో ధారాళమైన భాషగా ఉన్నదనడానికి ఆధారాలు లేవు. ఆరవ శతాబ్ది తరువాత బ్రాహ్మీలిపినే కొద్ది మార్పులతో తెలుగువారు, కన్నడంవారు వాడుకొన్నారు. అందుచేత దీనిని "తెలుగు-కన్నడ లిపి" అని పరిశోధకులు అంటారు.
6,7 శతాబ్దాలలో పల్లవ చాళుక్య సంఘర్షణల నేపథ్యంలో రాయలసీమ ప్రాంతం రాజకీయంగా చైతన్యవంతమయ్యింది. ఈ దశలో రేనాటి చోడులు సప్తసహస్ర గ్రామ సమన్వితమైన రేనాడు (కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలు) పాలించారు. తెలుగు భాష పరిణామంలో ఇది ఒక ముఖ్యఘట్టం. వారి శాసనాలు చాలావరకు తెలుగులో ఉన్నాయి. వాటిలో ధనంజయుని కలమళ్ళ శాసనం (కడప జిల్లా కమలాపురం తాలూకాలో ఉంది ) మనకు లభిస్తున్న మొదటి పూర్తి తెలుగు శాసనంగా చరిత్రకారులు భావిస్తున్నారు. అంతకుముందు శాసనాలలో చెదురు మదురుగా తెలుగు పదాలున్నాయి గాని సంపూర్ణమైన వాక్యాలు లేవు.
ఆ తరువాత జయసింహవల్లభుని విప్పర్ల శాసనము 641 సంవత్సరానికి చెందినది. 7,8, శతాబ్దులలోని శాసనాలలో ప్రాకృత భాషా సంపర్కము, తరువాతి కాలంలో సంస్కృత భాషా ప్రభావం అధికంగా కానవస్తాయి. 848 నాటి పండరంగుని అద్దంకి శాసనములో ఒక తరువోజ పద్యమూ, తరువాత కొంత వచనమూ ఉన్నాయి. 934 నాటి యుద్ధమల్లుని బెజనాడ శాసనములో ఐదు సీసము (పద్యం) పద్యాలున్నాయి. వేయి ప్రాంతమునాటిదని చెప్పబడుతున్న విరియాల కామసాని గూడూరు శాసనములో మూడు చంపకమాలలు, రెండు ఉత్పల మాలలు వ్రాయబడ్డాయి.వీటి ఆధారాల కారణంగా నన్నయకు ముందే పద్య సాహిత్యం ఉండి ఉండాలని నిశ్చయంగా తెలుస్తున్నది. కాని లిఖిత గ్రంథాలు మాత్రం ఇంతవరకు ఏవీ లభించలేదు.
తెలుగు బాష కొల్లలుగా క్రొత్త పదాలను తనలో కలుపుకుంది.తెలుగు బాష కోటి కిటికీల గాలి కలిగిన మేడవంటిది . అన్నీ వైపుల నుండి వీచే గాలులను ఆహ్వానించి, ఆతిధ్యమిచ్చి గౌరవించింది. తెలుగుకి గల హృదయ వైశాల్యము అనన్యము. తెలుగు,సంస్కృత పదాలు క్షీరనీర న్యాయంలో కలిసిపోతాయి. అదే తెలుగు బాష విశిష్టత.
సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి