7, ఆగస్టు 2024, బుధవారం

పూజలు 3*

 *దేవాలయాలు - పూజలు 3*


సభ్యులకు నమస్కారములు.


*పూర్వకాలంలో* దేవాలయ నిర్మాణంలో మొట్ట మొదటి అంశము భూమిని ఎన్నుకునుట. అధిక సంఖ్యలో దేవాలయాలు సాధారణంగా నదీ తీరారలో గాని, నీటి బుగ్గలు ఉన్న పర్వతాగ్రాల పైనగాని కట్టబడి ఉండడం వయోధికులందరికి తెలిసిన విషయమే. పుణ్య క్షేత్రాల సమీపంలో, నదీ తీరాన, సముద్ర మరియు నదీ సంగమ స్థానాలలో, పర్వతాగ్రాన, ఉద్యాన వనాలలో, రమ్య ప్రదేశాలలో మరియు సిద్ధుల ఆశ్రమ ప్రాంతాలలోనూ దేవాలయాల నిర్మాణ సంకల్పము జరుగుచుండేది.


ఈ క్రమంలో ఉన్న దేవాలయాలలో కొన్నిటిని *తీర్థాలు* మరియు *క్షేత్రాలు* అని చెప్పబడుచున్నాయి.

*తీర్థము* అను పదమునకు సామాన్య అర్థము...దేవాలయాలలో అర్చక స్వాములు భక్తులు పుచ్చుకునుటకు ఇచ్చు పవిత్ర జలము. *తీర్థము* కానీ తీర్థము యొక్క విశేషార్థము...*పుణ్య క్షేత్రము లేక దేవాలయము*...అందునా ఋషులు, మహర్షులు తపోస్నానమాచరించే *కోవెలలు* గల దేవాలయాలు. *క్షేత్రము* అను పదమునకు ఉన్న నానార్థములలో *నిద్ర చేయదగిన ప్రదేశము* అని తెలుపబడినది. క్షేత్ర ప్రాముఖ్యతను వివరంగా తెలుసుకుంటే...కొన్ని క్షేత్రాలు భక్తి ప్రధానము, మరికొన్ని ఇష్ట సంప్రాప్తి, కొన్ని కష్ట నివారణ మిగిలినవి తత్వ మరియు జ్ఞాన ప్రదము. మరికొన్ని దేవాలయాలు *స్వయంభూ దేవాలయాలు*

ఆయా అవతార పురుషులు తమ అవతార విశేషాలను తెలియజేస్తూ ప్రకటింప జేసుకొన్నవి... ఉదాహరణకు తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి.


దేవాలయ వ్యవస్థ సులభ గ్రాహ్యము కొరకు దేవాలయములను రెండు విభాగాలుగా పేర్కోనవచ్చును. 1) గ్రామ దేవతా గుడులు. 2) శిష్టాచార దేవాలయాలు.

 *1) గ్రామ దేవతా గుడులు* గ్రామ రక్షణకై తర తరాలుగా గ్రామ సంస్కృతిలో నిలదొక్కుకున్న మరియు పూజలందుకుంటున్న గుడులు. ఉదాహరణకు...ఎల్లమ్మ, గంగమ్మ, మారమ్మ, పోచమ్మ, మైసమ్మ, రేణుకమ్మ మొదలగునవి. ఈ దేవాలయాలన్నీ శక్తి (స్త్రీ) కేంద్రాలు. వాస్తు మరియు శిల్ప రహితంగా ఉన్నా ఈ గుడులు సుందరంగా ఉంటాయి. ఈ దేవాలయాలలోని పూజాదికాలలో షోడశోపచారాలు అంతగా ప్రతిబింబించవు. బ్రాహ్మణేతర జాతుల చేతకూడా పూజలందుకుంటున్నవి... ఉదాహరణకు ప్రఖ్యాత సమ్మక్క సారలమ్మ జాతరలాంటి వన దేవతలు.


*2) శిష్టాచార దేవాలయాలు*. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, విఘ్నేశ్వర, శ్రీ లక్ష్మీ, శ్రీ దుర్గా, శ్రీ సరస్వతి మరియు వారి దేవతా గణాల (తదితర) ఆలయాలు. ఈ ఆలయాలలో పూజలు ఆగమ శాస్త్రం నిర్దేశించిన విధంగా అనగా పంచోపచారాలు (5), షోడషోపచారాలు (16) మరియు చతుష్షష్టి (64) ఉపచారాలు జరుపబడుతూ ఉంటాయి. శిష్ట దేవాలయాలు వాస్తు శాస్త్ర అనుగుణంగా నిర్మించ బడుతాయి. దేవాలయాల వాస్తు ఆగమాల ఆధారంగా ఉంటాయి. ఆగమాలలో దేవాలయ నిర్మాణం, పూజా విధానాల మరియు ఉత్సవాల ప్రస్తావన ఉంటుంది. *కామిక కారణ ఆగమాలలో* దేవాలయ నిర్వహణా నియమ నిబంధనలు చెప్ప బడినవి. 


*మాన్యులకు విజ్ఞప్తి*

*దేవాలయము - పూజలు* అను విషయముపై ధారావాహిక రచనా నిర్మాణము బహు సున్నితము, విస్తృతమే గాకుండా క్రమానుసారమైన, ప్రామాణిక, సుస్థాపిత విశేష్య అంశము గనుక, ఈ గ్రూప్ లోని మాన్యులు... ఈ రచనలలో అన్యమైన, అసంగత, అసంబద్ధ, అప్రస్తుత, అనంగీకార ప్రస్తావనలు ఉంటే తెలుపగలరు, సరిదిద్దగలరు.

🙏🙏


ధన్యవాదములు.

*(సశేషము)*

కామెంట్‌లు లేవు: