20, సెప్టెంబర్ 2024, శుక్రవారం

*శ్రీ శంకరాచార్య చరిత్రము 18

 _*శ్రీ  శంకరాచార్య చరిత్రము 18 వ భాగము*_ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*వాదభిక్ష:*


శంకరాచార్యస్వామికి అర్ఘ్యపాద్యాదులిచ్చి భిక్షావందనం చేసి, శిష్య సమేతంగా తన యింట భిక్ష గైకొనమని ప్రార్థించాడు మండన మిశ్రుడు. మండనుడు ఇంతకు ముందు శంకరుని పేరు వినడమే కాని చూచి ఎరుగడు.


"మండనమిశ్రా! నాకు కావలసిన భిక్ష ఇది కాదు. నీ కడకు వచ్చినది నీ నుండి వాదభిక్ష కోరి. ఇపుడు వేద వేదాంగాలన్నీ విచారణ చేయ వలసిన తరుణం. మన ఇద్దరి వాదనలో ఎవరు ఓడితే వారు రెండవవాని ఆశ్రమం స్వీకరించాలి. ఇది పణంగాకోరుతున్నాను. అది నీకు అంగీకార మయితే సిద్ధపడు. పణం లేని వాదంలో పటుత్వం ఉండదు. ఇది నీకు సమ్మతం కాక పోతే 'ఓడిపోతి’ ననుము” అని శంకరుడు మండనునితోఅన్నాడు. మండనుడు దానికి సమాధానంగా “యతివరా! సన్న్యాసులు వివాదాల జోలికి పోకూడదే! ఒకే పక్షానికి చెందకూడదే?” అని ధర్మం ఎత్తి చూపించాడు. “మండనమిశ్ర పండిత వరేణ్యా! లోక క్షేమార్థ మై యతులు వాదాలలో పాల్గొన వచ్చును. కేవలం పాండిత్య ప్రకర్షకో, వినోదార్థమో యతులు వాదంలోనికి దిగరాదు. ధర్మరక్షణా ర్థం విద్యావికసనం కోసం చేయవలసిన కార్యాలు ఎవ్వరైనా చేయాలి యతులతో సహా. నేటి పరిస్థితి అస్తవ్యస్తమై అపరిణత బుద్ధులతో కేవలకర్మ మార్గమే శరణ్యమని చాటుతూ వరిష్ఠమై పరమపదప్రాప్తికి నిశ్చయంగా కావలసిన జ్ఞానమార్గం బొత్తిగా అడుగంటింది నీ వంటి వారి వలన. ఆ దారిని సంస్కరించ వలసిన అవసరం వచ్చింది. నీవు నిశ్చయంగా బ్రహ్మ అంతటి వాడవు. వైదికకర్మను తు.చ. తప్పకుండా ఆచరిస్తు న్నావు. ఇందులో నిన్ను మీరిన వాడు లేనే లేడు. కాని నీ పద్ధతి స్వార్థరహిత మైనదైనా అసంపూర్ణమైనది. నా మతమే పరమ శ్రేష్ఠమైన మతం. ఈ విషయం అంగీకరించి నా మతాన్ని స్వీకరించు. లేదా నాతో వాదానికి దిగు” అని నిష్కర్షగా తేల్చి చెప్పాడు శంకరాచార్యుడు మండనునితో.


మండనమిశ్రుడు వాదానికి అంగీకారంగా “నీ మాటలకు బెదరు తానని తలపోయకు. నా పాండిత్య పటిమ తెలియక ఈ పణం కట్టావు. నాతో వాదించి నెగ్గిన వాడు లేడు.వేద చోదితమైన కర్మ సిద్ధాంతాన్ని విడనాడి నీ ప్రక్క జేరుతానను కొంటున్నావు. అది జరుగుట కల్ల!" అని వాదానికి ఒప్పు కొన్నాడు.


వాద యుద్ధంలో గెలుపు నిర్ణయించ డానికి వ్యాసమహర్షిని, జైమిని మహర్షిని నిర్ణేతలుగా ఉండమని కోరాడు. అప్పుడు ఈ విధంగా వ్యాసుడు సెలవిచ్చాడు. “మండనమిశ్రా! మీ ఇరువురి వాదాలను విని అందుండే మంచి చెడ్డలు తెలిసికొని పక్షపాతము లేకుండా నిర్వర్తించుటకు తగిన వ్యక్తి నీ భార్య ఉభయ భారతి. ఆమె సరస్వతి అవతారము. సర్వజ్ఞురాలు. మీ ఉభయులు ఉభయ భారతి మధ్యవర్తినిగా ఉండడానికి అంగీకరిం చండి”.


ఇద్దరూ తమ అంగీకారం తెలిపారు. మండనమిశ్రుడు శంకరాచార్యుని విష్ణు స్థాన మందుంచి పితృ కర్మను పూర్తి చేశాడు. ఆరాత్రి శంకరుడు శిష్యులతో కలిసి రేవాతీరాన గల ఒక దేవాలయంలో బస చేశారు.


*పరిషత్సభ:*


శంకరునికీ మండనునికీ మధ్య జరిగే వాద చర్చ కేవలం వారిద్దరికే సంబంధించినది కాదు. దేశానికి కనువిప్పు కలిగించడానికి జ్ఞాన పద్ధతిని సుస్థిరం చేయడానికి ముముక్షు జనావళికందరికీ తెలియ జేయడానికి కంకణం కట్టుకొన్న శ్రీశంకరాచార్య మహాత్ముని 'జ్ఞానయజ్ఞం' లోని ప్రముఖ ఘట్టమది. ఆ మహా సన్నివేశాన్ని దర్శించే పుణ్యభాగ్యం ఎందరికి దొరుకు తుంది? పరిషత్సభ జరుగుననే వార్త వినగానే మాహిష్మతీ పురంలోని ప్రముఖ పండితులు, వేదాంతులు సభాభవనానికి ముందుగానే చేరుకున్నారు. శంకరాచార్యులు శిష్య సమేతంగా ప్రవేశించి నపుడు వారు అందరు ఘనస్వాగతం పలికారు. ఆధ్యక్షస్థానానికి ఎడమ పార్శ్వ మందు శంకరులను ఆసీనులను చేశారు. కుడి వైపు మండనుని స్థానము. దేదీప్యమాన మైన దివ్యకాంతులతో రాజిల్లుతూ అపర భారతియా అనిపిస్తూ ప్రవేశించిన ఉభయ భారతికి గౌరవంగా సభికులందరూ లేచి నిలబడ్డారు. కరతాళ ధ్వనుల మధ్య ఉభయభారతి అధ్యక్ష సింహాసనాన్ని అధిరోహించింది.


శంకరాచార్యులు లేచి 'నారాయణ స్మరణలు'చేసి ఈవిధంగా సెలవిచ్చారు


“నారాయణ స్వరూపులారా! బ్రహ్మజ్ఞానసంపన్నులు, ముముక్షువులు, వేదాంతులు, శాస్త్రజ్ఞులు, సగుణ నిర్గుణోపాసకులు మున్నగు మహామహు లెందరో ఇచ్చట సమావేశ మయ్యారు. మహెూతృష్టమైన నిర్ణయం ఈ సభలో జరుగనున్నది. అద్వైత సిద్ధాంతాన్ని దేశంలో స్థిరపరచడమే నా ఆశయం. మండనమిశ్ర మహాశయుని మతాన్ని ఖండించి అద్వైత మతాన్ని సిద్ధాంతం చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఈ సభలో నా ఈ నిశ్చయాన్ని ధ్రువపరచలేక పోయి నచో పరమ పవిత్రమైన ఈ కాషాయవస్త్రాలను, దండ కమండలాలను విడనాడి శిఖాయజ్ఞోప వీతధారినై గృహస్థాశ్ర మాన్ని స్వీకరిస్తాను" అని ప్రతిజ్ఞ చేశారు. సూచికాపాత శబ్దం లేకుండా గంభీరంగా ఉన్న ఆ సభను మరల ఉద్దేశించి శంకరుడు ఈ వాదరణంలోని జయాప జయాలు తేల్చడానికి ఉన్న మహాసభాధ్యక్షురాలైన ఉభయభారతి చేసే నిర్ణయానికి బద్ధుడనని పలికారు. 


శంకరాచార్యుని ప్రతిజ్ఞ విన్న మండనమిశ్రుడు తాను కూడ ప్రతిన చేయవలసి ఉన్నదని యెంచి ఈ విధంగా పలికాడు. "శంకరాచార్యా! కర్మ వలననే పునరావృత్తి రహితమైన ముక్తి సాధ్యం. దీనికి వేదమే పరమప్రమాణము. బ్రతికినంత కాలము జీవి సత్కర్మాచరణము నందే మునిగి యుండాలి.


కర్మచక్కగా పూర్తి కావడంతో ముక్తి లభించి తీరుతుందని శ్రుతులే చెప్పుచున్నవి. పరమాత్ముడున్నా డనుటకు ప్రత్యక్ష ప్రమాణములు కానరావు. వేదాంత మనేది పరవిద్య. పైగా ప్రమాణ రహిత మైనది. ప్రత్యక్ష ప్రమాణం కలది వేదమొక్కటే. ఇయ్యది నా సిద్ధాంతము. దీన్ని నేను ఒప్పించ లేకున్నచో నా తెల్ల వస్త్రాలు విసర్జించి, కాషాయపు గుడ్డలు ధరించి గృహస్థాశ్రమం వర్జిస్తాను. ఈ శంకరా చార్యునికే శిష్యుడనై జుట్టూ జందెమూ తీసి వేదాంత తత్త్వాన్ని ప్రచారం చేస్తాను. ఇందులో గెలుపెవ్వరిదో నిర్ణయించే అధికారం నా సహధర్మచారిణి ఉభయభారతికి ఉందని ఒప్పుకొంటు న్నాను”. ఇది మండనమిశ్రుని ప్రతిజ్ఞ.


*ఉభయభారతి ప్రతిజ్ఞ:*


సభలో గల వారికి అనేక సందేహాలు, భావాలు పొడసూపా యి ఆ పరిస్థితులను చూచి. ‘తన భర్త మండనుడు. ఓడిపోతే ఓడినట్లు ప్రకటించాలి. భర్త నెగ్గుతాడన్న నమ్మకం ఏది? భర్త ఓడితే తానోడినట్లు కాదా? భర్త ఓడిపోతుంటే చూస్తూ ఊరకుండడమేనా సహధర్మచారిణిగా? భర్తకు గౌరవాన్ని సమ కూర్చవద్దా? అలా చేస్తే పక్షపాత బుద్ధి అగుతుంది కదా! ఉభయభారతి సర్వ సమర్థురాలు. స్త్రీ ఏం చేసినా చేయగలదు' ఈ విధంగా కొనసాగు తున్నాయి సభాసదుల మనోభావాలు. కాని మండనమిశ్రుడు బ్రహ్మ అంశలోను, ఉభయభారతి సరస్వతీదేవి అంశలోను జనించారని, చిన్నవాడైనా శంకరుడు సర్వజ్ఞుడనీ వారికి తెలియదు. మువ్వురూ మువ్వురే. వారికి ధర్మమే రాచబాట. అందు వలననే ఉభయభారతి అధ్యక్ష స్థానంలో ఉండడానికి అంగీకరించారు శంకరులు. తాను గృహిణి. గృహ కృత్యాలు యథావిధిగా నిర్వర్తించాలి. భర్తకు, అతిథి అభ్యాగతులకు కావలసిన వంట తానే చేయాలి. ఇటు వాదోపవాదాలు వింటూ కూర్చుంటే సభ ముగిసే వరకూ ఆగాలంటే ప్రొద్దుపోతుంది. మధ్యలో నిష్క్రమించి వాదాల్ని ఆపమనడం సరి కాదు. అందుచేత ఉభయభారతి ఈ విధంగా నిర్ణయం తీసుకొంది. రెండు పూలదండలందుకొని వాది ప్రతివాదుల గళ సీమల నలంకరించి “ఎవరి కంఠాన గల హారం వాడిపోతుందో వారు ఓడిపోయినట్లు నిర్ణయం" అని ప్రతిన చేసి వాదోపవాదము లకు అనుమతి ఇచ్చి ఇంటిలోనికి వెళ్ళి పోయింది.


*వాదోపవాదములు:*


బ్రహ్మ అంశమున మండనుడు అవతరిం చగా సాక్షాత్ శివుడే

శంకరాచార్యుడు. కర్మకే ప్రాముఖ్యము ఇస్తూ శాస్త్రాధారాలు చూపు తాడు మండనుడు. కర్మకు అతీతమైనది జ్ఞానార్జన. దానికై యత్నించవలెనని కర్మలో కూరుకుపోకూ డదని శంకరుల వాదన. పరాత్పరుడు ఉన్నాడనును శంకరుడు. ప్రత్యక్ష ప్రమాణమున్నదే నమ్మాలని మండను డు. జీవాత్మకు పరమాత్మకు అభేద మంటాడు శంకరుడు. ఇరువురు శాస్త్రాధారా లు చూపిస్తారు. సత్యాసత్యాలు వినాలనే కౌతుకంతో దేవతలే వచ్చారు ఆ శుభ సభా భవనానికి. తొందరపాటు గాని కోపతాపాలు గాని లేకుండా గంగా ప్రవాహంలా సాగిపోతు న్నాయి ఇద్దరి వాగ్ధారలు. అనర్గళమైన పదజాలంతో విస్తృత మైన శాస్త్ర చర్చలతో పండితులకు వీనుల విందే కాక ఆహ్లాద కరంగా సాగుచు న్నాయి వాదనలు. వేదములు స్వతః ప్రమాణములు కర్మైక పరములు అని మండనుడు వచించి తగిన శాస్త్రధర్మములు వినిపిస్తున్నారు. వేద వాక్కులు వేయి వినిపించినను కాదంటు న్నారు శంకరులు. వేదాలకతీతమైనది వేదాంతమేనని ఉపనిషత్తుల ఆధారంతో నిరూపిస్తు న్నారు. కర్మకాండను ఖండిస్తూ జ్ఞానకాండను ప్రతిష్ఠిస్తున్నారు శంకరులు. శ్రోతలకు వారిద్దరు ఒకరిని మించిన వారొకరులా కనిపిస్తున్నారు. జయం ఎవరిని వరిస్తుందో తెలియరానిదిగా ఉంది.

ఆరు రోజులు ఆవిధంగా ఖండనలు, ప్రతిఖండనలతో మారు మ్రోగింది ఆ మహా పరిషత్సభాప్రాంగణం! క్రమంగా శంకరుని వాదాలకు మండనుని దగ్గర  సముచిత సమాధానము లభించ డం తగ్గిపోయి మండనుని మతబలం సన్న గిలింది. ఆయన ముఖవైఖరి నీరు గారడం చూచి శంకరుడు మండనుని మరల ప్రేరేపిస్తూ “మండనమిశ్ర పండిత వరేణ్యా! పలుకాడ వేమి? నీ కర్మసిద్ధాంతం ఇక మంట గలిసి నట్టేనా?” అని మండనునకు ఒక అవకాశమిచ్చాడు ఆ యతీంద్ర స్వామి. ఆ అదను చూచి ఇక వేదాంతము మీద సాగించాలి చర్చ అనుకొన్నాడు మండనుడు.

"శంకరాచార్యస్వామీ! జీవేశ్వరులకు భేదం లేదందురు అవి ఒకటే కాని రెండు కావందురు. జీవాత్మ, పరమాత్మ ఒకటే అనుట శుద్ధ అబద్ధము. కంచు కాగడా వేసినా ఈ మాట వేదాలలో ఎక్కడా కానరాదు. పైగా అది గొప్ప తత్త్వమని, జనన మరణ రాహిత్య మని ప్రమాణములు లేకుండా  వేదాంతులు వింతగా వల్లిస్తారు. ఉపనిషత్తులు పురుషార్థాన్ని వెలిబుచ్చనందున ప్రయోజనం శూన్య మైంది. గడుసుగా చెప్పే ఉపమానాలు కాదు ప్రత్యక్ష ప్రమాణములు లేనందున మేమంగీక రించ లేము. వేదములే స్వత:ప్రమాణములు. కనుక మీరుచెప్పే జీవేశ్వరాభేదము నిరాధారమైనది. ప్రత్యక్ష ప్రమాణములు ఉన్న చూచెదము గాక!" అని తీవ్ర ధోరణిలో హుంకరించాడు మండనమిశ్రుడు.


శంకరుడు బ్రహ్మజ్ఞాన సంపన్నులైన వారి అనుభవములను ఎత్తి చూపారు. అవి నమ్మ లేదు మండనుడు. పంచమహా భూతములు ఎలా ఉత్పత్తి అయ్యాయో వాటి కలయిక వలన ఏయే వస్తువులు జనించినవో, మానవుని లోని జ్ఞానేంద్రియాలు ఎట్లు సమీకరణ గావింప బడినవో, జడములకు అజడములకు గల తారతమ్యము వివరించి, శరీరాంతర్గ తమై యున్న జ్ఞానము యొక్క విశిష్టతను వివరించి, ఆత్మస్థితిని, ఆ రెండింటికి గల సామ్యమును తెలిపారు.


మహావాక్య విచారణ గూర్చి చెప్పినా అవి మంత్రములనీ, విధి వాక్యములనీ త్రోసి పుచ్చాడు మండనుడు. శంకరులంత మోక్షమన నేమో తెలియజెప్పారు. తత్త్వజ్ఞానం కలిగి సంకల్పములు నశిస్తే గాని మోక్షం సిద్ధించదని చెప్పారు. శ్రుతి స్మృతి ప్రమాణాల ఆధారంగా మండన వాదాన్ని శతవిధాలఖండించారు. శంకరుడన్న దాన్ని కాదన లేని స్థితికి వచ్చాడు మండన మిశ్రుడు. అప్పుడు అధ్యక్షురాలైన ఉభయ భారతి సంతోషభరితు రాలవడం అందరూ గమనించారు. శంకరుని మెడలోని మాల దేదీప్యమానంగా వెలుగొందడం మండ నుని మెడనున్న మాల వాడిపోవడం సభలో నున్న వారందరు చూచారు. దేవతలు పుష్పవర్షం కురిపించారు.


*కాలడి శంకర కైలాస శంకర* 

*శ్రీ  శంకరాచార్య చరిత్రము*

*18 వ భాగము సమాప్తము*

💐💐💐💐💐💐💐💐💐💐💐💐

కామెంట్‌లు లేవు: