10, సెప్టెంబర్ 2024, మంగళవారం

*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 8

 _*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 8 వ భాగము*_ 

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿


*సన్న్యాసాశ్రమ స్వీకార బీజము*


ఒకనాడు శంకరుని చేరి ఆర్యాంబ “నాయనా! ఎప్పుడూ ఇంటిపట్టున ఉండవు కదా! ఇలా ఇల్లూ వాకిలీ వదలి పెట్టి వెళ్ళిపోతూ ఉంటే నేను ఏమైపోతాను? వచ్చిన పెండ్లి వారు అందరూఇంటివద్ద ఉండవని చెప్పుకొంటున్నారు. అందరి ఇళ్ళకూ వెళ్ళడం ఎందుకు? ఇక్కడనేగోష్ఠి పెట్టుకోవచ్చు గదా! నీ ఉపనయనం తరువాయి ఎలాగూ తీరింది.  ఇంక పెళ్ళి చేస్తాను. కోడలు రావాలని ముచ్చట పడు తున్నాను. నీకు బిడ్డలు కలగాలని ఆ బిడ్డలను ముద్దాడాలనీ ఉంది. ఎప్పుడు తీరుస్తావోగదా నా కోరిక!” అని చెప్పిన తల్లి మాటలకు ఇలా సమాధానం చెప్పాడు శంకరుడు: "అమ్మా! నా కోసం బెంగ పెట్టుకోకు. నీకు మాత్రం ఊళ్ళో వారి మీద ప్రేమ లేదా? అందరి యిళ్ళూ నీకు సమానమే. దేశమంటే ధర్మమంటే నీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు. వేద ధర్మాలన్నీ పాడయి పోతున్నాయి అని ఎన్నో సార్లు నాతో అన్నావు. నేను మాత్రం నీలాగున తలపోయడం తగదా? కాని దానికి నేను పూనుకొంటే కష్టంగా ఉంటుంది. నేను పెండ్లి ఆడాలనీ, వైదికధర్మాలు కాపాడాలనీ నీ ఆకాంక్ష. నీ కోరికమంచిదే. కాని దేశ మంతటా  నీవనుకొన్నట్లు  ఆచరించేటట్లు చేయవలసి ఉంది. నిజానికి మన ఇద్దరి ఆశయాలు ఒకటే" చల్లగా తన కోరికను వెల్లడించాడు శంకరుడు. దానికి మండి పడి ఆర్యాంబ “చాల్లే చెప్పావు. కుఱ్ఱనాగమ్మవు. నీ కోరికలిప్పుడా? పెళ్ళి చేసుకోవాలి. పిల్లలను కనాలి. మనుమలూ, ముని మనుమలూ కలగాలి. అప్పుడు నీ కోరిక తీర్చుకో”. కొడుకు కోరికను మొక్కను మొదట్లోనే తుంచినట్లు పలికింది. మళ్ళీ అంటుంది “సంసారం ఈది ఈది వైరాగ్యానికి వెళ్ళాలి. అప్పుడే అది నిలబడు తుంది. బౌద్ధ సన్న్యాసు లను చూస్తున్నావు కదా! వాళ్ళ జీవితాలు ఎలా వెళుతున్నాయో” తల్లితో శంకరుడిలా నచ్చ జెప్పు తాడు: “అమ్మా! నీ ఊహలు నా ఊహలు వేరుకాదు. నిన్ను చూచు కొన్నట్లుగానే తల్లులందరినీ చూచుకోవలదా? నేను బౌద్ధుల వంటి సన్న్యాసం కోరు కోవడం లేదు. అదియా నీ బెంగ!” అని అప్పటికి తల్లికి ధైర్యం చెప్పాడు.


*సోదరునితో ఆర్యాంబ చర్చ:*


ఆర్యాంబకు తోడబుట్టిన వాడు చెట్టంతవాడు ఉన్నాడు. అతని పేరు జయదేవుడు. ఆమె పుట్టింటి వారు తరచు రావడం పోవడం ఉంది. తన మేనల్లుడు అవతార పురుషుడని విని ఎంతో సంబర పడిపోయే వాడు. శంకరుడు సన్న్యసిస్తాడని ఆ నోటా ఈనోటా తెలిసి క్రుంగిపోయాడు. వ్రేలెడు లేడు సన్న్యాసమా! నా సోదరి ఎంత బాధ పడు తోందో! కనుక్కుందామని వచ్చాడు శంకరుని ఇంటికి.  ఆదరించి సంతోషంగా లోపలికితీసుకొని వెళ్ళింది ఆర్యాంబ అన్నగారిని. పుట్టినింటి వారందరి యోగ క్షేమాలు అడిగి తెలుసుకొంది. అల్లుడు కనబడడే? అని అడిగాడు. “ఏం చెప్పమంటావు అన్నా! వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్లే అలవాటు లేదు. వెళ్ళడాని కి రావడానికీ ఒక వేళ అంటూ లేదు. నేనెంత పోరినా ప్రయోజనం లేదు. చూడగా చూడగా వాడు ఇంట్లో ఉంటాడనిపించడం లేదు. కాని నేనంటే హద్దు లేని ప్రేమ. నా మీద ఈగ వాలనివ్వడు. తన బ్రహ్మ చర్య నిష్ఠలో అంతరాయం రానీయడు. నా కష్టం చూచి పూర్ణానది నీ కాళ్ళ దగ్గఱకు వస్తుందిలే అన్నాడో లేదో అలాగే జరిగింది. ఊరివారంతా నీ పుత్రుని మహిమే అన్నారు. ఎందరెందరి తోనో వాదిస్తాడు.వాళ్ళ మతాలను ఖండిస్తాడు. ఒప్పుకొని వెళ్ళిన వారందరూ ఆనందంగానే వెడతారు. దేశంలో తల ఒక మతమూ అవలంబి స్తున్నారట. కర్మకాండ కాలిపోయినదట. దారి తెన్ను తెలియక ఒకరినొకరు ద్వేషించు కొంటూ నిందించు కుంటూ అజ్ఞానాంధకారంలో ఉన్నా రట. పరిస్థితి చక్క దిద్ది ధర్మం నిలబెట్టవలసిన సమయమట. లోకంలోని ఇళ్ళన్నీ తనవేనట. తల్లులందరూ తన తల్లులే నట. నా ఆలనా పాలనా ఎవరికి  కావాలి చెప్పు.   నీ కన్నీ బోధ పరచాను. నాకేం చేయాలో తెలియ డం లేదు. నీవే ఏదో ఉపాయం చూడాలి” తన గోడు వెళ్ళబోసుకొంది. అప్పుడు జయదేవుడు ఇలా అన్నాడు చెల్లెలితో: "శంకరుడు మామూలు బాలుడు కాదు.సర్వజ్ఞుడు. మాటలతో వానిని ఒప్పించడం నీ తరం నా తరం కాదు. నాకొక ఆలోచన వచ్చింది. ముందు వానికి పెండ్లి చేద్దాము. అప్పుడు సన్న్యాసం తలపు సన్నగిలవచ్చు. పైగా పెళ్ళి కుదిర్చేదీ చేసేదీ పెద్ద వాళ్ళం మనమే కదా! ఆ పైన మన మాట కాదంటాడా?".


పుత్రుని మనోభావనలు ఉద్దేశాలు విశాలము ఉదాత్తమైనవని తెలుసా తల్లికి. “నాయనా! నన్ను విడచి వెడతా వన్న మాట. నీ తండ్రి నింత బూడిద చేసికొనే యోగం ఆనాడు నీకు లేక పోయింది. నాకు కూడా అటువంటి గతే పట్టిస్తావా నాయనా! నీ చేతులారా నన్నింత బూడిద చేసికో. నా కోరిక అదే. ఆ తర్వాత నీ ఇష్టం. నాఇష్టంతో పని ఉండదు.  సన్న్యాసం ఇప్పుడు పుచ్చుకుంటే నా కోరిక తీరదు గదా! నన్ను కాదనకు" అని తన అనుమానాన్ని వ్యక్తంచేసింది ఒకనాడు తనయుని దగ్గఱ. దానికి బదులుగా "అమ్మా! నీ కోరిక ఏనాడు తీర్చలేదు? ఇంత దానికే భయపడి పోతావా! ఎన్ని కష్టాలైనా, ఎన్ని గడ్డు అడ్డాలు వచ్చినా తప్పక నీ కోరికతీరుస్తాను. నన్ను నమ్ము. నా మాటపై మొదట నమ్మకం లేకపోవడం తర్వాత ఆశ్చర్యపోవడం నీకు మామూలే కదా! నా జన్మ అందరికోసం. నీ అనుమతికోసం ఎదురుచూస్తోంది" తల్లి మౌనం వహించడంతో అర్ధాంగీకార మని తెలిసింది.


*సన్యాస కాండ: మానసిక సన్న్యాసము:*


శంకరుడు తల్లిని ఒక్క క్షణం కూడా విడిచి పెట్టి ఉండడం లేదు. ఒక రోజు ఆర్యాంబ నదికి స్నానానికి బయలుదేరింది. శంకరుడు తోడి బాలురు కూడా వచ్చారు. ఒడ్డు దరినే మొలలోతు నీళ్ళలో స్నానం చేస్తోంది ఆర్యాంబ. పిల్లలందరికీ ఈత కొట్టడం వచ్చు. మెల్లగా దిగి బారలు వేస్తున్నారు. సరదాగా చిన్న చిన్నఆటలు ఆడుతున్నారు. వెనుకఈత ఈదుతున్నాడు శంకరుడు. అది ఆ పిల్లలకు రాదు. అంతలో శంకరుడుమునగడం తేలడం చూస్తున్నారు. అదిఈతలా లేదు. అనుమానం వచ్చి “మొసలేమోరా!”అని ఒకడు, “ఏదో పట్టుకొని పోతున్నట్లు ఉంది” అని ఇంకొక బాలుడు అంటున్నారు. “మొసలి లాక్కు పోతుంది వాళ్ళమ్మకు చెప్పండి రా” ఇంకొకడన్నాడు. అది చూచిన ఆర్యాంబ గొల్లుమంది. "అమ్మా! అమ్మా! అమ్మా!” అంటున్నాడు శంకరుడు మునుగుతూ తేలుతూ. “నాయనా! నాయనా!” అని తల్లి రోదన. ఇంతలో శంకరుని నోట నుండి “అనుమతి! అనుమతి! అనుమతి!” ఆతురతతో శంకరుని ప్రార్థనాస్వరం.ఆ మాటలు కడసారి మాటలు లా అనిపించా యామెకు. మరల "ఉత్తమ మరణం! ఉత్తమ మరణం! … అనుమతి! ...” అన్న పలుకులు తెలిసీతెలియనిధ్వనిలో ఆమె చెవులకు సోకాయి. “నా బిడ్డను రక్షించుదేవా ఆపద్బాంధవా! కరుణించు” దీనాతి దీనంగా వేడుకొంటోంది. “ఓ పంచభూతములారా! ఈశ్వరా! భాస్కరా! దేవతల్లారా! అనుమతి ఇచ్చాను నాయనా! నా బిడ్డ సన్న్యాసిగానైనా బ్రతికిఉంటే సంతోషిస్తాను" త్రికరణ శుద్ధిగా అనేసింది ఆర్యాంబ. ఆ శపథం వినీ వినగానే శంకరుడు “సన్న్యస్తం మయా" అన్నాడు మునుగుతూ తేలుతూ. ఎనిమిదేండ్లు నిండీనిండని బాల శంకరుడు మకరి బంధంలో నుండి బయట పడ్డాడు. మకరిని సంహరించి కరిని బ్రోచిన దైవంకరుణతోఈదుకొంటూ వచ్చిన బిడ్డను కౌగిట ఇరికించు కొంది ఆ తల్లి.


*తల్లికి శంకరుని వాగ్దానము* 


“సన్న్యస్తం మయా” అన్న మాటతో శంకరుని బంధనాలన్నీ పటా పంచలై సర్వస్వతంత్రుడైనాడు ఆ క్షణం నుండి. ఒక క్రొత్త పుట్టుకకు నాంది ఆ క్షణం. ఆర్యాంబ ఏమో పెన్నిధి దొఱకిన పేదలా శంకరుని చంక నుండి దింపడం లేదు. తోడి వారితో కలిసి ఇల్లు చేరుకుంది. శంకరుడు తల్లితో “అమ్మా! నన్ను బ్రతికించుకొని నీకు లోకంపై ఉన్న ప్రేమను చాటుకున్నావు. నిజానికి ఈ నాటితో లోకమాత వయ్యావు. నీ కరుణతో లోకానికి అక్షయమైన జ్ఞాన భిక్షనందించావు. జగత్ప్ర ఖ్యాతి వడసిన మా నాన్న గారి సహచర్యభాగ్యం నీకు లభించింది. తల్లీ! నీకు ఏ లోటూ లేకుండా చూచు కుంటాను. నా తండ్రి ధనం మన వంశీయుల చేతుల్లో ఉంచితే నిన్ను బంగారం లా చూచు కొంటారు. నన్ను నమ్ము” అన్న తనయుని మాటలు అమృతాలుగా భావించి ఇలా అడుగు తుంది: “నాయనా! సరే కానీ, ఇంతబ్రదుకు బ్రదికి ఇంత గొప్ప పుత్రుణ్ణి కని నా అంత్య క్రియలు కడకు జ్ఞాతుల చేతుల్లో పెట్టి వెడతావా? నీవన్న మాట మరచావా? చెప్పు”. దానికి శంకరుడు "అమ్మా! నీకు ఇచ్చిన మాట ఎలా మరువగలను? ఆడిన మాట తప్పడం మహా అపరాధం కదా! నేనే వచ్చి నీ అంత్య క్రియలు చేస్తాను. మాట తప్పను. తప్పను. అంతే కాదు. అవసానకాలమందు నన్ను స్మరించుకో. ఎక్కడ ఉన్నా మనో వేగంతో వచ్చి నీ ముందు వాలుతాను. నీ ముప్పు గడిపి నీ మెప్పు అందుకొంటాను” అని తల్లికి నచ్చజెప్పుతాడు.


*కైలాస శంకర కాలడి శంకర* 


*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము*

*8 వ భాగము సమాప్తము*

🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃

కామెంట్‌లు లేవు: