10, సెప్టెంబర్ 2024, మంగళవారం

శివ మహిమ



శివ మహిమ-- ధూర్జటి !


             మ: తన యిల్లా లఖిలైక మాత , తన సంతానంబు భూతవ్రజం ,


                     బను లాపంబులు వేదముల్ , తన విహారాగారముల్ మౌనిహృ


                      ద్వనజంబుల్ , తన సేవకుల్ కమలజాత శ్రీధరుల్గాఁ జెలం


                       గిన దేవోత్తము నమ్మహాత్ముఁ దరమే కీర్తింపఁగా నేరికిన్ ?


                             శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యము- అవతారిక -10 వపద్యము: మహాకవి ధూర్జటి .


                                     శ్రీ కృష్ణరాయ సార్వ భౌముని భువన విజయమునలంకరించిన యష్టదిగ్గజ కవులలో నొకడు ధూర్జటి!


పరశివ తత్వము ననుసరించెడి శైవుడు. అయిన నేమి యతడు మానసికముగా నద్వైతి. శివకేశవుల యెడ నారాధనా భావముగలవాడు. శ్రీ కాళహస్తీశ్వర శతకము. శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యము ఇతని రచనలు. రెండును పరమేశ్వరాంకితములే!

ఇదియాతని స్వతంత్రతకు నిదర్శము. రాయల కొలువున నున్నను రాచరికమును తూర్పారబట్టిన ఘనుడు ధూర్జటి.


                 " రాజుల్ మత్తులు వారిసేవ నరకప్రాయంబు"- అంటూ రాజసేవ యెంత దుర్భరమైనదో వివరించినాడు.


                ప్రస్తుత పద్యము శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యమున అవతారిక లోనిది. తన గ్రంధమునకు కృతిపతియగు పరమశివుని

గూర్చి సభక్తికముగా చేసిన విన్నపమిది. స్వామీ సర్వశక్తి సమన్వితుడవే , నిన్నేమని ప్రస్తుతించనయ్యా! అదినాతరమా! అంటూ

పరమ శివునకు గల ప్రత్యేకతలను యీవిధముగా ప్రకటించుచున్నాడు.


             తనయిల్లా లఖిలైకమాత ! లోకమాత యైన జగజ్జననినియగు పార్వతీమాత నీకు భార్య. 


                  లోకంలో అందరూ అనేమాట - "యిల్లాలివల్ల యింటికి పేరని' పార్వతి జగజ్జనని . 'ఆకీట బ్రహ్మ పర్యంతం' యీసృష్టకంతకూ

ఆమెయే జనని ,అంటే విశ్వజనని."యాదేవీ సర్వ భూతేషు ప్రాణరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః" అంటున్నాయి పురాణాలు. కాబట్టి సర్వలోక సంరక్షణాభారమును మోసేతల్లి నీయిల్లాలు. ముగురమ్మల మూలపుటమ్మ. ఆయమ్మకు అనుశాసకుడవీవు స్వామీ ! నీవైభవమేమని చెప్పను?


                     ఇక నీ సంతానమా సర్వ భూత సముదాయము. ఇక్కడ భూతమనగా పిశాచమని భావింపరాదు. ప్రకృతిని నడిపించు శక్తులుగా భావించాలి. ఫలితార్ధం . సర్వప్రకృతిని శాసింపగల వారు నీసంతానం.తద్వారా ప్రకృతియంతా నీవశంస్వామీ!

నీకు గనక కోపంవస్తే లోకాలన్నీ మాయమే! 


         " అనులాపంబులు వేదముల్"-        


   నీ నోట పలికే మాటలన్నీ వేదములే! నీవు వేద ప్రచోదకుడవు. నీయనుగ్రహము వలననే వేద విజ్ఙానమంతా లోకంలో వ్యాపిస్తోంది. శబ్దానికి అనుశాసనం ముఖ్యం. అంటే నియమం. అదివ్యాకరణంవల్ల కలుగుతుంది. ఆవ్యాకరణం మాహేశ్వర ప్రోక్తం. సంస్కృత వ్యాకరణమంతా మాహేశ్వర సూత్రముల ననుసరించియే నడుస్తుంది. 


                          "తన విహారాగారముల్ మౌనిహృద్వనజంబుల్:" నీవు నిరంతరం మహామునుల హృదయకమలాలలో విహరిస్తూఉంటావు స్వామీ! నిన్ను దర్శించాలంటే మునులకే సాధ్యం మావంటి వారికది యెలా సాధ్యమౌతుంది? మాలో సద్భక్తిని గలిగించు. మమ్ము గూడా మునులను చేయి మాహృదయాలలోగూడ విహరించు. అంతవరకూ నీదర్శనం మాకుసాధ్యమా?స్వామీ!


                 తన సేవకుల్ కమలజాత శ్రీధరుల్"- ఇక నీ సేవకులా బ్ర హ్మ , విష్ణువులు.వారు సామాన్యులా? సకలజగత్ సృష్టికర్త బ్రహ్మ. సకల లోక పోషకుడు విష్ణువు.వీరిద్దరూ నీసేవకులు. నీయాజ్ఙకులోబడి సృష్టి బ్రహ్మ నిర్వహిస్తే , నీయానతో పరిపోషణ విష్ణువు కొనసాగిస్తాడు. అంతా నీవశం.


                           ఇలాంటి సర్వ శక్తి సమన్వితుడవైన నిన్ను యేమని వినుతించ గలను? స్వామీ!


                                        నేనశక్తుడను. స్వామీ నమస్కారమయ్యా! పరమేశ్వరా! నమస్కారము!


                                                                      అంటున్నాడు ధూర్జటి!


                                                      ఓం నమః శివాయ! ఓం నమః శివాయ!


                                                                             స్వస్తి!🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: