మాతృదేవతాయై నమః: పితృదేవతాయై నమః
పురాణాలను పుక్కిట పట్టిన వంశమది. ఇంటి పేరు పురాణపండ. స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని కాకరపర్రు. పండితుల కర్మాగారంగా ఆ గ్రామం ప్రసిద్ధికెక్కింది. అక్కడి వారే పురాణపండ రామ్మూర్తిగారు. ఉషశ్రీ గారి తండ్రి. తొలి రోజుల్లో ఆయన జ్యోతిశ్శాస్త్ర పండితులు. ఆయుర్వేద వైద్యులు. కారణాంతరాల వల్ల తూర్పుగోదావరి జిల్లా ఆలమూరుకు తరలి వచ్చారు. అక్కడి నుంచి ఆయన పురాణ ప్రవచనాలకు శ్రీకారం చుట్టారు. 1950దశకం నుంచి 1980వరకూ నిరాఘాటంగా ఆయన ప్రవచనాలు సాగాయి. భీమవరం సోమేశ్వరాలయంలో 1970 నుంచి 78 వరకూ ఏకధాటిగా భారత ప్రవచనాలను వినిపించారు. కాకినాడ దేవాలయం వీధిలో కూడా ఆయన ప్రవచనాలు ప్రతిధ్వనించాయి. ఉభయగోదావరి జిల్లాలలో ఆయన ప్రవచనం వినని వారుండరంటే అతిశయోక్తి కాదు. పురాణవాచస్పతి, ఉపన్యాస సార్వభౌమ బిరుదులందుకున్నారు. గజారోహణ సత్కారాన్నీ అందుకున్నారు. కొన్ని గంటల పాటు నిలబడి ఉపన్యసించడం ఆయన ప్రత్యేకత. రామ్మూర్తిగారు నిలబడి ప్రవచనాలు చెబుతుండడం చూసి, వచ్చిన వారు సైతం గౌరవసూచకంగా నిలబడే వినేవారట. దేవాలయం వీధి కిటకిటలాడిపోయిన సందర్భాలు అనేకం. ఆయన ప్రవచనాలకు ఇసకేస్తే రాలనంతమంది జనం వచ్చేవారు. ఎటువంటి పుస్తకమూ ముందు పెట్టుకోకుండా ఆయన ప్రవచనాలు చెప్పేవారు. రాజమండ్రిలో భరద్వాజ ప్రెస్‌ను స్థాపించారు. భారతాన్ని తెలుగులోకి అనువందించారు. ఆ ప్రెస్‌లోనే ముద్రించారు. ఈ చిత్రంలో ఉన్నది ఉషశ్రీ గారి జననీ జనకులు రామ్మూర్తిగారు, అన్నపూర్ణగారు. ఇలాంటి వ్యక్తులను చూసినా చాలు.. జన్మలు ధన్యమవుతాయి. ఉషశ్రీగారు తన జననీ జనకుల గురించి కావేరి క్యాసెట్స్ వారు రూపొందించిన శ్రీమద్భాగవతం ఆడియో క్యాసెట్ ప్రారంభంలో వివరించారు. పితృదేవతాయై నమః, మాతృదేవతాయై నమః అంటూ ఆ క్యాసెట్ ప్రారంభమవుతుంది.
సేకరణ .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి