10, సెప్టెంబర్ 2024, మంగళవారం

శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 7

 _*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 7 వ భాగము* 

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿


*రాజుకు శంకరుని వరము:* 


వెళ్ళే ముందు రాజుకు ఒక కోరిక ఉదయించింది.రాజశేఖర మహా రాజు కేవలం ప్రతాపవంతుడైన ప్రభువు మాత్రమే కాదు. కవి, విద్వాంసుడు, శాస్త్రకోవిదుడు. నిత్యము కవితా రసాస్వాదనలో తనియు కళాప్రపూర్ణుడు. రాజశేఖరుడు సంస్కృత భాషలో ముచ్చటగా మూడునాటకాలు రచించాడు. తన ఆస్థానంలో నున్న కవులు పండితులు ఎంతో మెచ్చుకొన్న కృతులవి. కాని రాజుకు తృప్తి లేదు. ఏలన రాజు కదా అని విరుద్ధంగా ఎవరు మాట్లాడుతారు? శంకరుడు సహజకవీంద్రుడని విని ఆయన అభిప్రాయమే విశ్వసనీయమని తలచి శంకరునిచేరి ఒక పళ్ళెరములో పది వేల బంగారు నాణెములను ఉంచి, అందులో తాను రచించిన నాటక ప్రతులను పెట్టి భక్తితో శంకరునికి సమర్పించాడు. "స్వామీ! ఈ నాటకాలు మూడూ నాచే దేవభాషలో రచించ బడినవి. దయతో తాము ఒక్కపరి పరిశీలించిన నా ఆనందానికి మేర ఉండదు. తమ అభిమతాన్ని ప్రసాదించెదరు గాక!" వినయ భయభక్తులతో వేడుకొన్నాడు. అపుడు శంకరుడు రాజుకు నాటకాలనందించి చదివి వినిపించ మన్నాడు.


ఇష్టదేవతా ప్రార్థనలు చేసి రాజశేఖరుడు తన రచనలను శంకరునికి రమ్యమైన స్వరంతో శ్రావ్యంగా వినిపించాడు. “రాజశేఖరా! నీ నాటకాలు పండితులనూ, కవులనూ అలరించేలా నవరస పూర్ణమై క్రొత్తపోకడలతో ప్రకాశిస్తున్నాయి. నాకు ఆనందాన్నిచ్చాయి. అందు వలన నేను నీకొక వరము ఇవ్వ దలచాను కోరుకో రాజా!" అని పలికిన బాలుని మాటలకు ఉబ్బి తబ్బిబ్బయి రాజశేఖరుడు "స్వామీ! మీ దయ వలన రాజ్యం సుభిక్షంగా సురక్షితంగా ఉంది ఇప్పుడు నా పరోక్షాన దేశాన్ని ఇంకా మెఱుగుగా పాలించే నాథుడుండాలి కదా! అదేకొఱత. నా మనసు లోని దిగులు.

సత్పుత్రుణ్ణి ప్రసాదించండి" అని కోరుకున్నాడు. అలానే అనుగ్రహించి పుత్రకామేష్టి చేయమని చెవిలో చెప్పాడు శంకరుడు. "బ్రహ్మచారిని. నాకీ ధనమేల? ఈ ఊరి జనులకు పంచి పెట్టండని ఆనతిచ్చాడు బ్రహ్మచారి శంకరుడు.


*శంకరుని శిష్యులు:*


బాల్యంలోనే గురువయ్యాడు శంకరుడు. ఎందరెందరో ఆయన కడ వేదం నేర్చుకొని వేద పారంగ తులయ్యారు. శాస్త్రాలను క్షుణ్ణంగా చదువుకొన్నవారు కూడ వాటిలోని సూక్ష్మాలను తెలిసి కొనడానికి శంకరుని వద్దకు వచ్చేవారు. అట్టి వారందరికీ ధర్మమర్మాలను విశదీకరించే వాడు. విద్యార్థుల స్థాయి నెంచుట కోసం అప్పుడు రహస్య పరీక్షా పద్ధతిని ప్రవేశ పెట్టాడు. ఆ విధంగా శంకరుని శిష్యులు మణిపూసలవలె అందరి మన్ననలూ పొందేవారు. శంకరుడే కాదు శంకర శిష్యుడన్నా పండిత ప్రకాండులకు సైతం హడలే, ఆనందమే! మహిమాన్వితుడు కావడంతో బాలుడైనా శంకరుని దైవంగానే భావించుకొనే ఆ శిష్యులు కూడ పురా జన్మఫలంగా ఆ భాగ్యం పొందారు. శంకరుడన్న గురుడే. గురుడే శంకరుడు.


*మాతృస్థాన విశిష్టత:*


‘న మాతు: పరదైవతమ్’ మంత్రాలలోని కెల్ల గాయత్రీ మంత్రం శ్రేష్ఠం. దైవాలలో కెల్ల మాత శ్రేష్ఠదైవతం. ఎందు వలన? బీజోత్పత్తి నాటి నుండి తన గర్భంలో పదిలంగా కాపాడుతూ, తన జీవ సత్యాలు బిడ్డకు సమర్పించుతూ, తన్మూలాన తాను బలహీనురాలయినా భరిస్తూ, నవ మాసాలు, నవ రాత్రులు, నవ ఘడియలు మోసి, దుర్భర వేదన అనుభవించి కన్న బిడ్డను కంటిరెప్ప వలె కాపాడుతూ ఉంటుంది. బిడ్డను చంక నుండి దింపదు. దించితే ఏడుస్తాడని చంకనే ఎత్తుకొని అహరహము పనులు చేసి కొంటుంది. చంకలోని బిడ్డ కంటిలో గుచ్చుతాడు. మెడలోని మాంగల్యాన్ని పీకుతాడు. అవన్నీ ఇష్టంగా సహిస్తుంది. బిడ్డ మల మూత్రాదులను ఓపికతో బాగు చేస్తుంది. ప్రేమకు, సహనానికి, వాత్సల్యానికి, కారుణ్యానికీ మారు పేరే అమ్మ! బిడ్డ పెరిగి చెడ్డ వాడయినా తల్లి ప్రేమ పోగొట్టు కోదు. ఇన్ని పాట్లుపడి పెంచిన తల్లి ఋణం ఎన్ని జన్మలెత్తినా తీరనిది అంటారు. నరుడై పుట్టినవాడు ఋణాలు తీర్చుకోవాలి.ఋణాలు మిగిలిఉంటే జన్మ రాహిత్య మెలా? కనుక తల్లికి పుత్రుడు భక్తి శ్రద్ధలతో సేవ చేయాలి. తల్లి ఏర్పఱచిన ప్రేమ పాశాన్ని తల్లియే తొలగించాలి. అప్పటికి గాని జనని ఋణం తీరదు. ఈ ధర్మాలన్నీ శంకరునికి పుట్టుకతోనే ఎఱుక. తల్లికి అపార సేవ చేసేవాడు.


*పెండ్లి ప్రయత్నము:*


తాను అత్తగారు కావాలని ప్రతీ తల్లికీ ఉండడం సహజం. కాని ధర్మబద్ధ మైన ఆంతర్యం వేరు. కుమారునికి పెండ్లి జరిగితే పితృదేవతల ఋణాలు తీరే దారి ఏర్పడుతుంది. ఆర్యాంబ పుట్టింటి వారు కూడా ఆర్యాంబకు కోడలు రావాలని ఉబలాట పడు తున్నారు. శంకరుని కీర్తి దేశం దశ దిశలా వ్యాపించి ఉండడంతో ఆడపిల్లలు కలవారెందరో శంకరుని అల్లునిగా పొందాలని ఉవ్విళ్లూరు తున్నారు. వచ్చి చూచి తలలూపి తమ అభిమతం ఆర్యాంబ చెవిలో చెప్పి వెడుతున్న వారెందరో. ఆర్యాంబ ఉబలాటం మేరలు దాటుతోంది. తన కుమారుడు తండ్రి వలెనే గృహస్థుడై యజ్ఞ యాగాదులు చేసికొంటూ, అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ పిల్లా పాపలతో కళకళలాడుతూ ఉండే భాగ్యాన్ని కనులార చూడాలని ఆమె ఆకాంక్ష. అదేమీకాక, పరమహంస పరివ్రాజకుడై జగద్గురుడై ఆసేతు హిమాచల పర్యంతం దిగ్విజయ యాత్ర చేసి, ధర్మస్థాపన చేసి ఆచంద్రతారార్కం నిలిచిపోతాడని ఆ ముద్దరాలెఱుగదు.


శ్రీరామునికి నిశ్చయించిన పట్టాభిషేక సంరంభం ఆగకపోతే రాముడు అడవులకు వెళ్ళడం ఎప్పుడు, దుర్వారులు ఖర దూషణాది రాక్షసులను, రావణ కుంభ కర్ణాది దుష్టులను మట్టు పెట్టే దెపుడు అనే ప్రశ్న వచ్చేది.


అదే విధంగా ఆర్యాంబ ఉత్సాహ పడిన రీతిగా శంకరుడు గృహస్థుడై ఇంటి పట్టున ఉండి తన సంసారాన్ని తల్లిని కని పెట్టుకొని కాలం గడుపు తుంటే భారత భూమిలో కావలసియున్న అద్వైత ధర్మపరిరక్షణ మరి ఎవరి వలన సాధ్యం అన్న ప్రశ్న ఉదయించింది మహర్షి సత్తములకు. వెంటనే బయలుదేరి చేరారు శంకరుని ఇంటికి. మహర్షులు వేంచేయగానే కనిపెట్టి వారికి అర్ఘ్య పాద్యాది అర్చనలు చేశారు శంకరుడు, ఆర్యాంబ. ఆర్యాంబ అడిగింది ఋషులను ఈ విధంగా: "మహర్షివరులారా! మీ రాకతో మా యిల్లు పావన మయ్యింది. పిల్లవాడు నా బిడ్డడు. మీరు మహనీయ తపోధనులు. మీ మీ తపో వ్యాసంగాలను మాని మమ్ములను ఈ విధంగా అనుగ్రహించడం మా అదృష్టం. మీ సేవలు చేసికొనే భాగ్యాన్ని మాకు ఒసగారు మా పూర్వ పుణ్యవిశేష ఫలంగా. మా పాపాలు నేటితో పటాపంచలయినట్లు తోచు చున్నది” అంటూ ఆర్యాంబ మునులకు నమస్కరించినది. మహర్షులాశీర్వదించారు.


మరల మునులతో అంటుంది ఆర్యాంబ: "స్వాములారా! ఈ నా కుమారుడు పుట్టినప్పటి నుండి కని విని ఎఱుగని ప్రజ్ఞలు చూపిస్తున్నాడు. మూడో యేటకే శాస్త్రాలన్నీ క్షుణ్ణంగా నేర్చు కున్నాడు. పెద్ద పండితులను నిర్భయంగా సునాయా సంగా జయిస్తున్నాడు. వాదంలో ఓడిపోయిన వారు వీణ్ణి ఏదైనా చేస్తారేమోనన్న భయం నన్ను పట్టి పీడిస్తోంది. తన మతం వదలడు. ఇతరమతాలు మతి లేని వంటున్నాడు. ఓడిపోయిన వారు నవ్వుతూ పోతున్నారు. ఈ బాలునిపై ఎంత అభిమానం లేకపోతే మీరిలా వస్తారు? మీ రాకలో ఏదైనా పరమ రహస్యం ఉండాలి. నేను వినదగినదయితే చెప్పండి" అని వేడుకొన్నది ఆమె. అందుకు సమాధానంగా మహర్షులు ఆర్యాంబతో "అమ్మా! నీవూ నీ భర్త శివగురుడు పార్వతీపతిని గూర్చి తపస్సు చేయగా ఉద్భవించినవాడు ఈ బాలుడు. ఆ పరమేశ్వరుడు నీ పతిని కోరుకొమ్మన్నాడు: పూర్ణాయుర్దాయము కల పేరు ప్రతిష్ఠలు లేని పలువురు పుత్రులు కావాలా, లేక పూర్ణాయువు లేని లోకోద్ధారకుడగు సత్పుత్రుడు కావలెనా యని. సత్పుత్రునే కోరుకొన్నాడు నీ భర్త. నిన్ను బాధపెట్టడం ఇష్టం లేక శివగురుడీ విషయం నీకు చెప్పిఉండక పోవచ్చును. ఆ నాటి మాట అటుంచు. నేడు మీ పుట్టుకలు సార్థక మయ్యాయి. ఈ యీ నీ బిడ్డ సాక్షాత్తూ పరమేశ్వరుని అవతారము. ఆ పరాత్పరుడే నీ కుమారుడై నీ ముందు తాండవిస్తున్నాడు తెలిసిందా! నీవు శంకరుని కొక్కతివే తల్లివి కాదు. నీవు లోకమాతవు. నీ బిడ్డ మహిమలు హిమవన్నగం వలె మహెూన్నతాలు. ఆయనను దర్శించడానికే మేము వచ్చినది” అని రహస్యాన్ని చల్లగా వెలిబుచ్చారు మహర్షులు. ఆ మాటలు విన్న ఆర్యాంబ దిగ్భ్రాంతురాలై ఒక ప్రక్క తన కొడుకు గుఱించి చెప్పిన పరమరహస్యం విని మనస్సులోని ఆనందం పెల్లుబకగా అంతలోనే ములుకులు వలె నాటాయి బిడ్డ ఆయువుగుఱించి వారు పలికినమాటలు. ఆమె తేరుకొనే లోపల మునులు మరల అన్నారు: "తల్లీ! అల్పాయువు గూర్చి అలజడి పడకు. మరో ఎనిమి దేండ్లు సంపాదించుకొంటాడు. తిరిగి ఇంకొక పదేండ్లు ఉండడానికి వరం పొందుతాడు.


అంతటితో ముప్పది రెండేళ్ళ ప్రాయం. అమ్మా! అవతార పురుషులకు ఆయువుతో నిమిత్తమేల? ఆ సర్వేశ్వరుడు అంతటా నిండిఉంటాడు. అట్టివానికి జనన నిధనాలు ఉండవు. ఎల్లప్పుడూ మనందరితో ఉండే పరమాత్ముని గూర్చి ఎందుకు గుండెలు నీరు చేసికోవడం?".


*తల్లికి శంకరుని ఓదార్పు:*


మహర్షులువచ్చిరన్న సంతోషం పరితాపంగా మారిందిఆర్యాంబకు. ఆ విషయం తలపుకు వస్తే చైతన్యం తప్పి కూలబడి పోతున్నది. బిడ్డ మీద గంపెడాసలు పెట్టుకొన్న తల్లి ఆ ఖేదాన్ని ఎలా భరించగలదు? ఆనాటి కానాడు ఆర్యాంబ క్రుంగి పోతోంది. తన తనయుని యిల్లు వెయ్యిళ్ళ మొదలు కావాలనుకునే ఆమె ఈ పరిస్థితిని తట్టుకోలేక పోతోంది. కుమారుని చూడకుండా ఉండలేదు. చూచినపుడల్లా కండ్ల నీరు ధారాపాతమే. అతడు చూడకుండా బట్టతో ఒత్తుకొనేది. చూస్తే బిడ్డడేమౌతాడోనని బెంగ. తల్లి పడుచున్న వేదనను చూచి "అమ్మా! మునుల మాటలకింత బాధపడడం ఎందుకు? వెర్రిదానవు కదా! మనము ఎవ్వరం నిజం కాదు తెలుసునా?కొందరు ముందు కొందరు తర్వాత. అందరికీ అంతే. నీటి బుడగలు ఎంతసేపు నిలకడగా ఉంటాయి? మన పుట్టుకలు కూడా అట్టివే. ఈ దేహం కట్టుకొన్న వస్త్రం లాంటిది. శిధిల మైతే పారవేసి క్రొత్త బట్ట కట్టుకొంటాం. అంతే ఈ నశ్వర శరీరం కూడా. శరీరాల మీది మమకారం విచిత్రమైనది. జీవుల తాపత్రయం ఇది. ప్రయాణాలలో మన కెందరో తారసపడతారు. పరిచయమౌతారు. తర్వాత ఎవరి దారిన వారు పోతారు. అదే మన జన్మ విషయంకూడా. పోయే టప్పుడు మనం చేసిన పుణ్య పాపాలు మాత్రమే మూట కట్టుకొని తీసికొని వెడతాము తరువాతి జన్మలో తత్ఫలాలనుభవించ డానికి. పుణ్యపాపాల అనుభవం పూర్తి కాగానే ఈ పాంచభౌతిక కాయంతో నిమిత్తం లేదు. ఆ జీవి ఒక్క క్షణమైనా ఉండదా శరీరంలో. దీన్నే కాలచక్ర మన్నారు. ఈ చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. అమ్మా! అందరిలాగా మాయలో పడిపోకు” అని పరిపరి విధాల అనునయ వాక్యాలతో ఊరడిస్తూ తల్లికి జ్ఞాన బోధ చేశాడు తనయుడు.


*కైలాస శంకర కాలడి శంకర*


*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము*

*7 వ భాగము సమాప్తము*

♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️

కామెంట్‌లు లేవు: