10, సెప్టెంబర్ 2024, మంగళవారం

*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 6

 _*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 6 వ భాగము*_ 

🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓


*శంకరుడు పూర్ణానదిని తన ఇంటికి తెచ్చుట:*


అది మండువేసవి.మిట్టమధ్యాహ్న వేళ. నిప్పులు చెరిగే మండు టెండకు వడగాడ్పు తోడయ్యింది. ఆర్యాంబ పూర్ణలో మునిగిబిందెడు నీళ్ళు తెచ్చుకొందామని బయలు దేరింది. నది ఊరికి ఎంతో దూరంలో లేదు. ఇసుకదారిలో వెళ్ళాలి. కొంత దూరం వెళ్ళాక ఆర్యాంబ కాళ్ళు కాలి, తలమాడి పోయి ఒళ్ళు తెలియక పడి పోయింది. ఒక పుణ్యాత్ముడు చూచి లేవనెత్తి ఉపచారాలు చేసాడు. మరొకరు శంకరునికి కబురు చేశారు. ఆర్యాంబను ఆ ఊరిలో అందరు తల్లిగా ఎంతో గౌరవంగా చూసుకొనేవారు. పరుగున వచ్చి తల్లిని చూచాడు శంకరుడు. ఇంటికి చేర్చి అక్కడ ఉపచర్యలు చేస్తున్న కొడుకును చూచి ఆమె అడిగింది: “నాయనా! ఈమండు టెండలో ఎలా రాగలిగావు? నాకోసం ఎంత శ్రమపడుతున్నావో కదా!” అంటూ కుమారుని చూచుకొని కడుపుకు హత్తుకొంది. అప్పుడు తల్లితో: “అమ్మా! పెద్దదానివైనావు ఈ వయస్సులో ఎందుకిలా శ్రమ పడతావు. ఇంటిదగ్గర నూయి ఉన్నది కదా. ఆ నీళ్ళు వేడిచేసికొని వేన్నీళ్ళ స్నానం చేసుకోవచ్చు గదా. నేనే నూతిలో నీళ్ళు తోడి పెడతాను. రోజూ రెండు తడవులు నదికి వెళ్ళి రావడం ఎంత కష్టమో తెలుసా? శ్రమపడకు.నదికి వెళ్ళకు” అంటూ కాళ్ళా వ్రేళ్ళా బ్రతిమి లాడాడు శంకరుడు. ఆ బిడ్డ మాటలకు ఆనందంలో మునిగిన తల్లికి ఆనందబాష్పాలు జలజలారాలుతుండగా“నాయనా! నీవింకా పసిపాపవు. నీవు నీళ్ళు తోడడమేమిటి? అంత మాట అన్నావు. నాకదే ఆనందం. మీ నాన్న గారు కూపోదకం స్నానానికి పనికి రాదన్నారు.” అని చెప్పింది ఆర్యాంబ. ఇంక మా అమ్మ నదికి వెళ్ళడం మానుకోదు అని ఎరిగి ఆ తల్లితో అన్నాడు.“అమ్మా! నీమాట కాదంటానా? నీ పాదాల కడకే వస్తుందిలే ఆ మహానది. ఇంక నీ ఇష్టం వచ్చినట్లు స్నానాలు చేయ వచ్చు” అని చటుక్కున అన్నాడు. ఆ మాటల లోని ప్రేమాధిక్యాన్ని గుర్తించిన ఆర్యాంబ సంబర పడి పోయింది. అమ్మ చంక దిగి అటూ ఇటూ తిరుగుచున్న శంకరుని మనస్సులో పట్టుదల ప్రవేశించింది. తిన్నగా పూర్ణానదీతీరం చేరాడు. రెండు చేతులనూ మొలకు ఆన్చి అలనాడు గంగ రాకకై ఎదురు చూస్తున్న గరళకంఠునిలా పూర్ణానది వైపు తిరిగి చూపు నిలిపి తన అభీష్టం తెలిపి మౌనంగా ఒక క్షణం నిలబడ్డాడు. గిఱ్ఱున ఇంటికి తిరిగి వచ్చాడు. ప్రొద్దు గ్రుంకే సమయం అది. వాతావరణం క్షణంలో మారింది. ఆకసాన నిండా కప్పిన కారు మబ్బులు. ఉఱుములూ, మెఱుపులతో పిడుగులతో ప్రారంభమై చినుకూచినుకూ గాలివానగా మారి కుండపోతగా కురిసింది వర్షం. రాత్రంతా ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లు కని విని ఎరుగని వర్షం. ఆ నీరంతా పూర్ణానది తన పొట్టలో ఇమిడ్చుకొని పొంగు హద్దు మీరగా ఊరు మీదకు వచ్చింది. వచ్చివచ్చి శంకరుని ఇంటి గుమ్మం ప్రక్కగా ఒరుసుకొని వెళ్ళింది. ఆర్యాంబ తలుపు తీసికొని చూచుకొనే సరికి పూర్ణానది తన గుమ్మం దగ్గఱగా ప్రవహించడం చూచింది. "ఆమ్మా! చూచావా! పూర్ణకు నీ మీదనున్న ప్రేమ.” అని చమత్కరించాడు. “బాల వాక్యం బ్రహ్మవాక్యం” అన్నారు పెద్దలు.


*కేరళదేశాధిపతి పిలుపు:*


ఆప్రాంతాన్ని పాలించే నృపాలుడు రాజశేఖరుడుఅను పేరుగలవాడు. ధర్మపాలన చేస్తూ, దేశానికి రక్షణ ఇస్తూ, భక్తులనూ యతులనూ గౌరవిస్తూ, ప్రజలకు ప్రీతిపాత్రుడై ఏలుతున్నాడు.బాలుడై బ్రహ్మచారియై, విద్యా వినయ సంపత్తులలో అద్వితీయుడై విఖ్యాతి నందుకొనుచున్న అద్భుత బ్రహ్మచారిని కనులారా చూడాలనిపించి,కబురు పంపించాడు యోగ్యుడైన మంత్రిని శంకరుని వద్దకు పంపి. ఆ ఆజ్ఞను శిరమున దాల్చి పరివారంతో ప్రయాణమైన మంత్రి కొన్ని రోజులకు శంకరుని ఊరు చేరుకొన్నాడు. శంకర బాలుని చేరి నమస్కారము లర్పించి వినయం ఉట్టిపడేటట్లు ఇట్లా నివేదించాడు:


"స్వామీ! మన కేరళదేశానికి రాజుగా ఉన్న రాజశేఖరుడు పంపగా రాజాజ్ఞానుసారం మీ దర్శనానికి వచ్చాము. మన రాజు ఎల్లవేళలా ప్రజాభీష్టాన్నే కోరు కొంటూ ప్రజలను తన బిడ్డల వలె చూచుకొనుచున్నవాడు. సామంత మంత్రి సేనానాయక పండిత ప్రముఖకళావిదులతో నిండిన నిండు సభలో కొలువుండి శాస్త్ర చర్చలతో ధర్మసందేహవిచారణలో అనునిత్యము గడపడం, ధర్మం ఉన్నచోటే జయమున్నదని నమ్ముతున్నవాడు. తమ కీర్తి ప్రభలకు అత్యంత సంతోషితుడై, తమ పాదధూళితో మా రాజ భవనాన్ని పావనం చేయాలని కోరుకొంటూ మీకు విన్నపం సమర్పించ మన్నాడు. మీ రాకతో రాజగృహమే కాక కేరళ రాజ్యమే సుఖంగా ఉంటుంది. మా రాజు కోరికను మన్నించి దయచేయండి” అన్నాడు. దానికి సమాధానంగా శంకరు డిట్లా అన్నాడు: “నేను బ్రహ్మచారిని. బ్రహ్మచర్యవ్రతాన్ని నియమబద్ధంగా ఆచరించాలి కదా. మూడు వేళలా స్నానాలు చేస్తూ సంధ్యోపాసన చేయాలి. దినకరుణ్ణీ, పావకుని, గురువులనూ తప్పక కొలువాలి. అర్హదినాలలో ఉపవాసాలు చేయాలి. తక్కిన సమయాలలో వేదాన్ని అధ్యయనం చేయాలి. శిష్యులకు విద్య గఱపాలి. మా తల్లి పెద్దది. ఆమె సంరక్షణ చేయాలి.ఇక తీరిక ఎక్కడుంటుంది చెప్పండి? ఈ పరమ పునీతమైన నియమాలను విడనాడి గజ వాహనాలు, రాజభోగాలు మాకేల? మా సందేశంగా రాజున కిట్లనుడు: పితృదేవతలకు ఋషులకు ప్రజలు ఎప్పుడూ ఋణపడి ఉంటారు. ఎందుకంటే వారు ప్రజల శ్రేయోభిలాషులు. రాజా! ప్రజలు ఆ ఋణం తీర్చుకొనేటట్లుకనిపెట్టాలి.


ఆ విధులన్నీ జనులు పాటించేలా చూడడం నీ బాధ్యత". అలా సందేశం పంపాడు శంకరుడు.


*శంకరుని కడకు రాజు వచ్చుట:*


ఆతృతతో ఎదురు చూస్తున్న రాజును కలిసి విన్నవించాడు మంత్రి: “మహారాజా! అ శంకరుడు కేవల బ్రహ్మచారి కాదు. మానవ రూపంలో ఉన్న జగదీశ్వరుడే, సందేహము లేదు. ఏ పూర్వ పుణ్య ఫలమో మాకు ఆయన దర్శనమయినది. కైలాసవాసునిలా బాలసూర్యునిలా ప్రకాశిస్తున్నాడు. ఏడేండ్లు నిండ లేదు. అతని మేను మల్లె పూరంగును మించి మిల మిల మెఱసిపోతున్నది. ఆయన ఏ మణులు ధరించలేదు. ధరిస్తే ఆ మణులే ఈ మహాను భావుని తేజస్సులో మాయమౌతాయి నిస్సందేహంగా. ముఖాన్ని చంద్రబింబంతో పోల్చడం కవుల చేతకానితనం అవుతుంది. కండ్లు రెండూ సూర్యచంద్రులే. ఆ బాల శంకరుని చూడగా చూడగా ఒకప్పుడు భారతి వలెను, ఒకసారి మహేశ్వరుని వలెను, మరొకపరి కమలనాభు నిలా కన్పట్టుతాడు. ప్రభూ! పంచభూతాలు, అష్ట దిక్పాలకులూ, ఇంద్రాది దేవతలూ, రుద్రగణాలు,పదునాల్గు భువనాలు, సమస్త చరాచర సృష్టి జాల మంతా ఆయనలోనే ఇమిడిపోయినట్లు అగుపడు తుంది" అని పరమానందంతో శంకరుని సందేశాన్ని కూడా రాజుకు తెలియ జేసాడు మంత్రి. “మంత్రిశేఖరా! ఇంక తడవెందుకు సుముహూ ర్తం నిర్ణయం చేసి మన ప్రయాణానికి సన్నద్ధం చేయండి” అని రాజు ఆదేశించాడు.రాజు, పరివారము శంకరుని ఊరు చేరగానే ఊరు బయట దూరంగా నిర్మించిన డేరాలలో పరివారా న్నుంచి రాజశేఖరుడు ఒక్కడు పాదచారియై వడి వడిగా అడుగులు వేసికొంటూ శంకరుని దర్శనానికి బయలుదేరాడు. అల్లంత దూరాన ఉన్నప్పుడు రాజుకు మహాద్భుత దృశ్యాలు కన్పట్టాయి. ఒక దివ్యసభ కండ్లకు కనబడింది. మహర్షి గణాల మధ్య శారదాదేవితో చతురాననుడు సింహాసనా సీనుడై ఉన్నాడు. “ఆహా! సత్యలోకమా! ఏమి అదృష్టము!” అనుకొను నంతలో దృశ్యం చెల్లాచెదరయ్యింది. ఇంతలో మరొక దృశ్యం. తెల్లని పాలసముద్రం. ఆదిశేషుని పాన్పుపై పద్మనాభుడూ, పాదాలు ఒత్తుతున్న లక్ష్మీదేవి. ప్రక్కనే శూలము, కపాలము, దండము చేతులలో ధరించి మెడలో సర్పహారాలతో గరళ కంఠుడు, సామగానమాల పించు నారదాది దేవర్షులు పరివేష్ఠించి ఉన్న పరమాత్ముని ప్రార్థిస్తున్నాడు రాజు.


ప్రార్థన ముగియు నంతలోనే ఆ దృశ్యం తెర మఱుగైంది. మరి కొంత దూరం వెళ్ళాక ఇంకొక దివ్యదర్శనం. మేరు పర్వతం మీద పార్వతీపతి తాండవ నృత్యం చేస్తున్నాడు. ప్రక్కనే గిరిజాదేవి ఎద్దు మీద చేయి వేసి ఆన్చి నిలబడి ఉంది. నారదాదులు నమస్కరిస్తున్నారు. తమ సతులతో బ్రహ్మ, విష్ణుమూర్తి, దేవేంద్రుడు విచ్చేసి ఉన్నారు. గంగాధరునితో వారందరూ ఏవేవో అడుగు తున్నారు. వారివారి కోరికల్ని ప్రసాదిస్తూ అతి శీఘ్రంగా బయలు దేరాడు పశుపతి. ఆ దృశ్యం చూచీ చూడకుండానే అంతలో అదృశ్యమయ్యింది. అక్కడ నలుగురు బ్రహ్మచారు లున్నారు. గోష్పాదమంత శిఖ, తెల్లని యజ్ఞోప వీతము, చేత పాలాశ దండము, మొలకు మౌంజి త్రాడు, వెన్నరంగు శరీరచ్ఛాయ కలిగి తామర రేకల వంటి కన్నులతో, తెల్లని కౌపీనము, విభూతి రేఖలు, మొలకు కృష్ణాజినము ధరించి దేదీప్య మానంగా వెలిగి పోతున్నాడు బాలుడు ఏడెనిమిది ఏండ్ల ప్రాయము వాడు. ఆ బాలుడే తాను కలుసుకొనడానికి వచ్చిన దివ్యబాలుడని ఎవరూచెప్పనక్కర లేకుండానే తెలిసి పోయింది రాజుకు. భక్తితన్మయుడై సాష్టాంగ నమస్కారం చేశాడు. శంకరుని ఆశీర్వచనం వినిలేచాడు. ముకుళిత హస్తుడై కులగోత్రాలు చెప్పుకొని వినయ విధేయతలతో నిలబడ్డాడు రాజశేఖరుడు. తనకు దగ్గరగా ఒక దర్భాసనం ఇచ్చి కూర్చోబెట్టినాడు. సింహాసనమూ, హంస తూలికాతల్పమూ ఈ దివ్య దర్భాసనానికి సరిరావు అనిపించింది రాజశేఖరునికి.


బ్రహ్మచారికి నమస్కరిస్తూ “మహానుభావా! అనేక జన్మలలో సంపాదించు కొన్న పుణ్యం తమ దర్శనంతో పండింది. నేడు నేను, నా కుటుంబము, నా ప్రజలు పరమ పవిత్రులం అయి పోయాము. మీరందించిన సందేశం నాకు శిరోధార్యం. తప్పక అలాగే ఆచరిస్తాను" అని పరమానంద పూర్వకంగా నివేదించుకొన్నాడు రాజు శంకరునితో.రాజు మాటలకు సంతోషించిన శంకరుడు అతనితో ఈ విధంగా ప్రసంగించాడు: “రాజా! నీకు కుశలమే కదా! నీ పేరు ప్రసిద్ధ మైనది. ధర్మాన్ని తప్పకుండా పాలిస్తున్నావు కదా! ఎల్లవేళల రాజ్యప్రజల గురించి ఆలోచిస్తున్నావు కదా! దేశంలో అందరూ ఎవరి వృత్తులు వారు నిర్వర్తిస్తున్నారు గదా! విజ్ఞులైన పండితులను, దైవాజ్ఞలను ఆదరిస్తు న్నావు కదా! సమర్థులైన వారినే తగు స్థానములలో నియమిస్తున్నావు కదా! దుర్గాల్ని వైరిదుర్భేద్యంగా కాపాడు కొంటున్నావు కదా! ధరాతలం సస్యశ్యామల మై ఉన్నదా! " ఈవిధంగా యోగక్షేమాలు అడిగి తెలిసి కొన్నాడు ఆ విశిష్ట వటువు. శంకరునికి వందనం చేసి, విడచి వెళ్ళలేక వెళ్ళలేక సెలవు తీసికొన్నాడా రాజశేఖర ప్రభువు తన జన్మ ధన్యమైనదన్న సంతుష్టితో.


*కైలాస శంకర కాలడి శంకర* 

*శ్రీ శంకరాచార్య చరిత్రము*

*6 వ భాగము సమాప్తము*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: