26, మార్చి 2025, బుధవారం

తిరుమల సర్వస్వం 189-*

 *తిరుమల సర్వస్వం 189-*

*శ్రీవారి ఆభరణాలు -1*



 *తిరుమలేశుడు నైవేద్యప్రియుడే కాదు, అలంకారప్రియుడు, ఆభరణ ప్రియుడు కూడా!* 


 కలియుగ ఆరంభంలో పద్మావతి పరిణయ సందర్భంగా మామగారైన ఆకాశరాజుతో మొదలై; వేలాది సంవత్సరాలుగా ఎందరో మహారాజులు, రాజాధిరాజులు, సామంతరాజులు, జమీందార్ల నుండి సామాన్యుల వరకు; శ్రీవారికి లెక్కలేనన్ని ఆభరణాలను భక్తితో సమర్పించుకున్నారు. ఇంకా సమర్పిస్తూనే ఉన్నారు. శ్రీవారి భక్తులైన ఎందరో పాలకులు బంగారు ఆభరణాలతో తులాభారం తూగి, వాటిని వినమ్రంగా శ్రీవారికి సమర్పించుకున్నారు. భక్తులు నేరుగా అర్పించుకున్న ఆభరణాలే కాకుండా, హుండీలో వచ్చిన ఆదాయం ద్వారా కూడా ఆయా కాలాలలో ఉన్న దేవస్థానం యాజమాన్యాలు తరచూ మేలిమి బంగారంతోనూ, వజ్రవైఢూర్యాల వంటి నవరత్నాల తోనూ కూడిన అమూల్యమైన ఆభరణాలను తయారుచేయిస్తూనే ఉన్నారు. 


 దేవాలయ చరిత్రలో స్వర్ణయుగంగా చెప్పబడే విజయనగర రాజుల పరిపాలనా కాలంలో అయితే శ్రీవారికి ఆభరణాలు కానుకగా సమర్పించే విషయంలో రాజుల మధ్య తీవ్రమైన స్పర్థ నెలకొని ఉండేది. పోటీలు పడి ఆభరణాలు సమర్పించుకునే వారు. ఆ లక్ష్మీవల్లభునికి ఎన్ని ఆభరణాలు చేయిస్తే అంత గొప్పగా భావించేవారు. ముఖ్యంగా, శ్రీకృష్ణదేవరాయల వారు తన 21 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఏడు సార్లు స్వామివారిని ఒంటరిగాను, కొన్నిసార్లు సతీమణుల సమేతంగానూ దర్శించుకొని, వారిని ఆపాదమస్తకం బంగారు ఆభరణాలతో ముంచెత్తాడు. అంతే కాకుండా బంగారు, వెండి పాత్రలను సైతం సమర్పించుకుని, ఆనందనిలయానికి బంగారు పూతపూసి, ఆలయం మొత్తాన్ని బంగారుమయం చేశాడు. 


 నిజానికి ఈ అమూల్యమైన ఆభరణాలు, హుండీ ద్వారా వచ్చే అపారమైన ఆదాయం వల్లనే మహమ్మదీయులు, బ్రిటిష్ వారు వంటి అన్యమతస్తుల దృష్టి కూడా శ్రీవారి ఆలయం పై పడింది. వాటిని చేజిక్కించుకోవాలని పరాయిపాలకులు శతథః ప్రయత్నించినప్పటికీ, ఆయా సమయాల్లో తిరుమలేశుణ్ణి ప్రాణం కంటే అధికంగా ఆరాధించే భక్తుల, అర్చకస్వాముల మరియు ప్రాంతీయ పాలకుల సమయోచిత నిర్ణయాలతో, వారు చూపించిన తెగువ వల్ల శ్రీవారి ఆభరణాలు చాలావరకూ రక్షింపబడి, ఆ వారసత్వ సంపద భావితరాల వారికి భద్రంగా అందింది.


 *శిలాశాసనాల ద్వారా అందిన సమాచారం* 


 పన్నెండో శతాబ్దం నుండి పాలకులు, శ్రీమంతులు సమర్పించుకున్న ఆభరణాల వివరాలను చాలా వరకు ఆలయకుడ్యాలపై చెక్కబడియున్న శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు. అంతకు ముందు సమర్పింపబడ్డ ఆభరణాల వివరాలు తెలిపే శాసనాలు అతికొద్ది మాత్రమే లభ్యమయ్యాయి. ఆలయానికి తరచూ మరమ్మత్తులు జరగటం, పాత కుడ్యాల స్థానంలో కొత్తవాటిని నిర్మించడం మొదలైన కారణాలవల్ల చారిత్రకాధారాలు చాలావరకు లుప్తమై పోయాయి.


 *స్థూలంగా శ్రీవారి ఆభరణాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.*


 *సదాసమర్పణ ఆభరణాలు* 


 స్వామివారికి నిత్యం అలంకరిస్తూ ఉండే ఆభరణాలను *'సదాసమర్పణ ఆభరణాలు'* గా పేర్కొంటారు. అంటే, ఈ అభరణాలతో 'ఎల్లవేళలా' స్వామివారిని అలంకరిస్తుంటారన్నమాట. స్వర్ణకిరీటాలు, బంగారు కర్ణాభరణాలు, భుజకీర్తులు, చంద్రహారాలు, నాగాభరణాలు, స్వర్ణ శంఖుచక్రాలు, సూర్యకఠారి, ఇలాంటివెన్నో ఆభరణాలు ఈ కోవకు చెందుతాయి. వంతుల వారిగా వీటిలో కొన్నింటిని ప్రతినిత్యం శ్రీవారికి అలంకరించగా, మిగిలిన వాటిని బంగారువాకిలికి ఆనుకొని ఉన్న స్నపనమండపం లోని బీరువాలలో, ప్రధానార్చకుల పర్యవేక్షణలో భద్రపరుస్తారు. కోట్లాది రూపాయల విలువైన ఈ ఆభరణాలను భద్రపరచడం స్వామివారి కైంకర్యాలలో సదా మునిగి ఉండే అర్చకులకు కత్తి మీద సాము లాంటిదే! అయినప్పటికీ, భగవంతుని మీద భారం వేసి ఆ ఆభరణాల సంరక్షణా భారాన్ని సమర్థవంతంగా, దోషరహితంగా తరతరాల నుండి నిర్వహిస్తూ వస్తున్నారు.


 *విశేషసమర్పణ ఆభరణాలు* 


 విశేషసందర్భాలలో అంటే ప్రముఖ హైందవ పర్వదినాలలో, మరియు దేశాధినేతల వంటి ప్రముఖ వ్యక్తులు స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఈ ఆభరణాలను స్వామివారికి అలంకరించి వారిని సర్వాంగసుందరంగా ముస్తాబు చేస్తారు. వజ్రఖచిత ఆభరణాలైన కిరీటం, శంఖుచక్రాలు, కటి వరద హస్తాలు వంటి ఆభరణాలను *'విశేష సమర్పణ ఆభరణాలుగా'* వ్యవహరిస్తారు. వీటన్నింటిని *'పారుపత్యదారు'* గా పిలువబడే ఆలయ ఉన్నతాధికారి అధ్వర్యంలో స్నపనమంటపం లోనే వేరే బీరువాలలో భద్రపరుస్తారు. 

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: