26, మార్చి 2025, బుధవారం

పూజారి -- కానుకలు

 పూజారి -- కానుకలు

~~~


మీరు కానుకలు హుండీలోనే వేయండి . పూజారి ప్లేటులో వేయవద్దు.

హుండీలో వేసిన సొమ్ము మాత్రమే భగవంతుడికి చేరుతుంది. 

అని కొన్ని గుళ్ళలో వ్రాసి వుంటారు.


హుండీ ఎవరు తెరుస్తారు ? 

ఆ ఆలయ కార్యనిర్వాహణాధికారి ! ఆయనెవరు ?

 ప్రభుత్వప్రతినిధి ! .

అంటే 

భక్తుడు ప్రభుత్వముద్వారా తన సొమ్మును దేవుడికి పంపుతున్నాడన్నమాట! 

సరే ! 

మరి పూజారి ఎవరు ?

పొద్దున్నే తెల్లవారుఝామునే లేచి భగవంతుడికి మేలుకొలుపులు పాడి (దేవుడికంటే ముందే మేలుకొంటున్నాడన్నమాట)

ఆయనకు అభిషేకాలు చేసి దర్శనానికి వచ్చే భక్తులమదిలో ఒక అలౌకికపవిత్రభావనకలిగేటట్లు అలంకారాలు పూర్తిచేసి ఆయనను అష్టోత్తర, శతసహస్రనామాలతో  పూజించి, స్వామీ ! నీ దర్శనానికి వచ్చే భక్తుల అభీష్టాలు నెరవేర్చు తండ్రీ అని ప్రార్ధించి వచ్చిన భక్తులకు భగవంతుడి ఆశీర్వాదాలు అందజేసే భగవంతుడి బంట్రోతు! ...


మరి ఆయన జీతమెంత ? 

చాలాచాలా తక్కువ ! బ్రతుకు జట్కాబండి ఈడ్వలేనంత!.

పూజారా ! మేము పిల్లనివ్వం ! అంటూ బ్రతుకు అపహాస్యం అవుతుంటే భగవంతుడి సేవ వదులుకోలేక చావలేక బ్రతుకుతున్న పూజారులెందరో.


కట్టుకున్నదానికి కన్నపిల్లలకు న్యాయం చేయలేక బ్రతుకీడుస్తున్న వారు ఎందరో ! కోకొల్లలు!


వారిపట్ల మనకు ఏ బాధ్యతాలేదా?.

మన కుటుంబాలు కార్లలో తిరగాలి.

మన కుటుంబీకులు ఖరీదయిన దుస్తులు వేసుకోవాలి.

విహారయాత్రలకు వెళ్ళాలి.

అందుకు సంపాదన కావాలి ఆ సంపాదన ఇబ్బడిముబ్బడిగా పెరగడం కోసం దేవుడి పూజలు చేస్తాం. ఆ దేవుడికి కమీషన్లు ఇస్తాం !.


కానీ 

ఆ పూజలు చేసే పూజారి బ్రతుకు మాత్రం పట్టించుకోము. ఇదెక్కడి న్యాయం.

నా విన్నపం ఏమిటంటే ! హుండీలో వేసినా వేయకపోయినా పూజారి ప్లేటులో మాత్రం కానుక వెయ్యండి లేదా పూజారి చేతికి కానుకలు ఇవ్వండి !

కానుక వేయకుండా అతడి కడుపు మాడిస్తే మీరు నమ్మిన దేవుడికి మీ కోరికలు తెలియచేస్తూ పూజలు చేసేవారు భవిష్యత్తులో దొరకరు !

ఉదాత్తానుదాత్తస్వరాలతో భగవంతుడిని స్తుతించే పండితుడు చేసే పూజలు నిత్యం చూస్తున్నాం!, ఈ రోజు గుళ్ళల్లో అర్చకులు నిరంతరం సుస్వరంతో మంత్రాలు పఠిస్తూనే ఉన్నారు! .

ఆ వృత్తిలో పూజారులకు తగినంత ఆదాయం వస్తే  వారు సలక్షణంగా మరింత భక్తితో, శ్రద్ధతో పూజలు చేస్తారు ! 

మన సంస్కృతిని నిలబెట్టుకోవడమా ! పడగొట్టడమా ! ఆలోచించండి.

కామెంట్‌లు లేవు: