*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*ద్రోణ పర్వము చతుర్థాశ్వాసము*
*328 వ రోజు*
*భీముడు కర్ణుని ఎదుర్కొనుట*
వృషసేనుడి రథము ఎకి పారి పోయిన కర్ణుడు " భీమసేనా! " అని ఎలుగెత్తి పిలిచాడు. ఆ పిలుపు విని కోపించిన భీముడు కర్ణుని మీద శరవర్షం కురిపించాడు. కర్ణుడు కూడా భీముని బాణములు తుంచి అతడి మీద అతి క్రూర బాణములు వేసాడు (ఈ సారి పూర్తి శక్తి తో యుద్ధం చేసాడు ). ఇరువురి నడుమ పోరు ఘోరమైంది. భీముడు కర్ణుని రథాశ్వములను, సారథిని చంపాడు. కర్ణుడు చికాకు పడి పక్కకు పోయి వేరొక రథం ఎక్కాడు " అన్న సంజయునితో ధృతరాష్ట్రుడు " ఛా! సుయోధనుడు ఎంతగానో నమ్మిన కర్ణుడు ఇలా చేస్తుంటే బుద్ధి హీనుడైన సుయోధనుడు ఏమనుకున్నాడో ఏమో అన్ని డంబములు పలికిన కర్ణడు ఆతరువాత ఏమి చేసాడు ? " అన్నాడు. సంజయుడు " అవమాన భారంతో రగిలిపోతున్న కర్ణుడు తిరిగి భీమసేనుడిని ఎదుర్కొన్నాడు. ఇరువురి మధ్య పోరు ఘోరమై భీమసేనుడి చేతిలో కర్ణుడి సైన్యం మొత్తము హతమైంది " అనగానే ధృతరాష్ట్రుడు " సంజయా ! కర్ణుడు అర్జునుడిని జయిస్తాడన్న అహంతోనే కదా సుయోధనుడు మదమెక్కి పాండవులతో యుద్ధానికి దిగాడే ఈ కర్ణుడు కనీసం భీమ సేనుడిని కూడా జయించ లేక పోతున్నాడు. వీడు అర్జునుడిని కృష్ణుని మిగిలిన పాండవులను గెలువగలడా. ఆనాడు శ్రీకృష్ణుని సంధి తిరస్కరించినందుకు ఫలితం అనుభవించ తప్పుతుందా ! " అన్నాడు. తన సేన మొత్తం నాశనం కావడం చూసి కర్ణుడు కోపించి భీమునిపై ముప్పై నిశిత శరములు ప్రయోగించాడు. భీముడు కర్ణుడి రధసారధిని చంపి అతడి రధాశ్వములను చంపాడు. కర్ణుడు తన రధమును తానే తోలుతూ భీమునిపై శక్తి ఆయుధమును ప్రయోగించాడు. భీముడు ఆ శక్తిని తునా తునకలు చేసి కర్ణుని తొమ్మిది వాడి అయిన బాణములతో కొట్టాడు. కర్ణుడు మరొక విల్లు తీసుకుని భీమునిపై అవిశ్రాంతంగా శరవర్షం కురిపించాడు. ఇరువురూ సింహనాదాలు చేస్తూ ఒకరితో ఒకరు పోరుతున్నారు. భీముడు కర్ణుని హయనులు చంపి, విల్లు విరిచి, కర్ణుని శరీరమంతా బాణములు గుప్పించాడు.
*భీముడు కురు రాజకుమారులను వధించుట*
కర్ణుడు భీముని చేతిలో ఓడుట చూసి సుయోధనుడు కర్ణునికి సాయంగా దుర్జయుని పంపాడు. దుర్జయుడు అత్యంతసాహసంతో భీమసేనుడిని ఎదుర్కొని భీముడి రధాశ్వములను, సారధిని గాయపరిచాడు. భీముడు ఆగ్రహించి కర్ణుని కంటి ముందే ఒకేబాణంతో దుర్జయుని తల నరికాడు. కర్ణుడు భీముని ఎదుర్కొని భీముని వక్షస్థలం మీద ఒక వాడి అయిన బాణం నాటాడు. భీముడు తన గధ తీసుకుని కర్ణుని రధము విరుగకొట్టాడు. రధము విరిచి, కేతనము తుంచి,సారధిని చంపాడు. అయినా కర్ణుడు వెనుదిరుగ లేదు. సుయోధనుడు తన తమ్ముడైన దుర్ముఖుని కర్ణుడికి సాయంగా పంపాడు. భీముడు ఒక పక్క కర్ణునితో యుద్ధము చేస్తూనే తనను ధైర్యంగా ఎదుర్కొన్న దుర్ముఖుని తొమ్మిది నిశిత బాణములు ప్రయోగించి చంపాడు. దుర్ముఖుని చావు కళ్ళారా చూసిన కర్ణుడు కుమిలిపోయి తిరిగి భీమసేనుడిని ఎదుర్కొన్నాడు. ఇరువురి నడుమ పోరు ఘోరమై భీముడు అత్యంత క్రూరబాణములు కర్ణుడి గుండెలకు గురి చూసి కొట్టాడు. భీమునిని దెబ్బకు తాళ లేక కర్ణుడు తన రధమును పక్కకు తొలిగించాడు " అని సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు విధి వైపరీత్యము కాకుంటే కర్ణుడు భీముని చేతిలో పరాజుతుడు కావడమేమిటి ఈ కర్ణుని నమ్మే కదా నా కుమారుడు సుయోధనుడితో వైరము పెంచుకుని ఈ యుద్ధానికి దిగాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి