శు భో ద యం 🙏
సంగీత-సౌందర్య దర్శనం!
రాయల నాటి అష్ట దిగ్గజాలలో ఒకరైన భట్టుమూర్తి (రామరాజ భూషణుడు) తన
వసుచరిత్రలో సంగీతంతో బాటు
సౌందర్య వర్ణనం గూడా మేళగించి అందమైన ఒక పద్యం చెప్పాడు. నేడు , అది మీకోసం
.చిత్తగించండి!
మ: " పదమెత్తం గలహంసలీల , నధర స్పందంబుఁ సేయన్ ,శుభా
స్పదమౌ రాగ కదంబకంబు , శ్రుతిఁ జూపన్ శ్రీవిలాసంబు , కే
ల్గద లింపన్ సుకుమార పల్లవ న వైలాలక్ష్మి , వీక్షింప ష
ట్పదియున్ బొల్చుఁ , దరంబె కన్నెఁ గొనియాడన్ ,గేయవాక్ప్రౌఢిమన్;
వసుచరిత్రము: తృతీయాశ్వాసము -59వ పద్యము;
సందర్భం: మంజు వాణి ప్రణయ దౌత్య ము; వసురాజుతో గిరికను గూర్చి చెప్పుట;
రామ రాజ భూషణుడు సాహిత్యమునందే గాదు ,సంగీతమునందుఁ గూడ నిష్ణాతుడు.
సందర్భమును బట్టి అవకాశము ననుసరించి సంగీత విషయములను గూడ
వసుచరిత్రమునందు నిపుణముగా నుపదేశమొనరించెను. ప్రస్తుత పద్యంలో గిరిక
సౌందర్యముతో బాటు ఆమెగాన కళానైపుణ్యమును గూడ జోడించి నిపుణముగా
నీపద్యమును విరచించినాడు.శ్లేష వలన(శబ్దశక్తి మూలక శ్లేష ) ఇది సాధ్యపడినది.
అర్ధములు:- పదము-కాలు,పాట; కలహంసలీల- రాయంచవలె,హంసధ్వనివలె;
రాగకదంబకంబు:-కడిమిపూల యెర్రదనం, రాగమాలికలు; శ్రుతి- చెవి,
నాదముయొక్కస్థాయి; శ్రీవిలాసంబు- శ్రీకారపు సొంపు, శ్రీరాగము ; నవ+ఏలాలక్ష్మి-కొత్త
ఏలకీతీగె సొగసు,
కొత్తవియగు ఏలల యందము; షట్పది- తుమ్మెద, షట్పద గానము;
వ్యాఖ్యానము: ఆకన్య కాలు కదిపినదా కలహంస నడకలే! పెదవి విప్పెనా అనురాగరాగ
రంజితమే! చెవి జూపెనా శ్రీకార
శోభలే! చేయికదపెనా వసంత లాస్యమే(నవ యేలకీలతలూగిన చందమే)
వసంతలక్ష్మివలె ఉంటుందని చెప్పటం) కన్నులు తెఱచినదో
తుమ్మెదల చాలనమే (కనులు నల్లనై తుమ్మెదలను బోలియుండుననుట)
మ్మెదలకు ద్విరేఫమను నామాంతరమున్నది.రారా యనుట.కన్నులు విప్పెనా
అది ప్రణయాహ్వానమే! యిట్టి లోకోత్తర సౌందర్యముగల కన్య గిరిక యని సౌందర్యపరమైన యర్ధము.
సంగీతము:- ఈకన్య పాట నందుకొన్నదో హంసధ్వని రాగమే! పెదవి విప్పెనా
రాగమాలికలే !శ్రుతి ప్రకటమొనరించెనా శ్రీరాగమే!(పలుకును) చేతులతో తాళము
నందుకొన్నదా సుకుమారమైన యేలలను గీతములే!(పలుకును) కనులు దెరచి
చూచెనా షట్పదులే!( తుమ్మెదపదములు పలుకును) ఆమెసంగీత పాటవమును
యేమని చెప్పను? అంటోంది మంజువాణి.అంటే చెప్పటానికి మాటలు చాలవని ఆమె ఆంతర్యం.
బాహ్య సౌందర్యమేగాదు, మనోల్లాసాన్ని కలిగించే సంగీతంలోకూడా గిరిక దిట్ట!
అని చెపుతున్నది. ప్రభువులుసౌందర్య,సంగీతాది సత్క ళారాధకులు.
ఇదండీ! భట్టుమూర్తిగారి సంగీత సౌందర్యాల "జుగల్ బందీ"!
స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి