మదరాసు ప్రశస్తి నమ్మలేని కథలతో ఏర్పడినది కాదు. నిజమైన ఆసక్తికరమైన సంఘటనలతో ఏర్పడిన నగరం.
మదరాసు నగర కథలకు చరిత్ర పుస్తకంలో ప్రత్యేక పుటలు ఉన్నాయన్నది అతిశయోక్తికాదు.
ఆంగ్లేయులు మదరాసుకు వచ్చిన తర్వాత indo saracenic కట్టడ కళ ప్రవేశపెట్టడం జరిగింది.
ప్రభుత్వ కట్టడాలు, ఉన్నత పదవులలో ఉన్న ప్రభుత్వ అధికారుల భవంతులూ ఈ ఇండో సారసెనిక్ పద్ధతిలో నిర్మించేవారు.
మొగఘలాయ భవన నిర్మాణ తీరుతెన్నులతో పాటు భారతీయుల దేవాలయాల కట్టడాలను కలిపి ఈ ప్రత్యేకమయిన కట్టడ కళను ఆంగ్లేయులు రూపొందించారు.
అప్పట్లో ఐరోపియన్లు భారత దేశ చిత్రకళా సంపదను చూసి ఆశ్చర్యపోయేవారు.
ప్రత్యేకించి ఇక్కడ బ్రహ్మాండమైన కోటలను, భవనాలను, ఆలయ కట్టడాలను ఆశ్చర్యంగా చూసేవారు. అలాగే ఆలయ కట్టడాలపై చెక్కిన శిల్పాలు వారిని అమితంగా ఆకట్టుకునేవి. ఈ కట్టడాలన్నింటిని మేళవించి వారు సృష్టించిన ఆర్కిటెక్ కి పెట్టిన పేరే indo saracenic కళ.
ఈ పద్ధతిలో నిర్మించిన భవనాలలో నూటికి తొంభై శాతం వరకూ ఎర్ర రంగులో ఉండేవి.
అందుకే వీటిని ఎర్ర కట్టడాలు రెడ్ బిల్డింగ్స్ అనేవారు.
అయినా కొన్ని భవనాలు శ్వేత వర్ణంలో ఉండేవి.
మొఘలాయుల కాలంలోనే ఇలాంటి కట్టడాలు లేకపోలేదు. అనేక కోటలు ఎర్ర రంగులో ఉండేవి. తాజ్ మహల్ వంటి కట్టడాలు శ్వేత రంగులో ఉండేవి.
కానీ ఆంగ్లేయుల పాలనలో నిర్మించిన ప్రభుత్వ కట్టడాలు చాలా వరకు ఎర్ర రంగులో దర్శనమిచ్చేవి. దేవాలయాలు శ్వేత వర్ణంలో కనిపించేవి.
భగవంతుడు ఉండే చోటు పవిత్రమైనదని చెప్పడానికి శ్వేత వర్ణ భవనాలు, ప్రభుత్వాధికారాన్ని ఎర్ర (రక్తవర్ణం) రంగు కట్టడాలుగా చిత్రకారులు బొమ్మలు గీయడం గమనార్హం.
వందల సంవత్సరాలైనా ఇప్పటికీ మద్రాసు మహా నగరంలో ఈ కట్టడాలు చెక్కుచెదరక కనిపించడంలో బ్రిటీష్ వారి ప్రజ్ఞను ప్రశంసింంచక తప్పదు. వారి పర్యవేక్షణలో కట్టడ పనుల బాధ్యతలను భారతీయులకే ఇచ్చేసేవారు.
చాలా ధరకు ఈ కట్టడాలలో స్తంభాలను చూడవచ్చు.
వాటికోసం లెక్కలేనన్ని చెట్లు ఖావలసి వచ్చేవి. ఆ రోజుల్లో చాలా వరకు నాట్టుకోట్టయ్ చెట్టియారులు సముద్ర ప్రయాణం చేసి బర్మా, సింగపూర్, మలేసియా తదితర ప్రాంతాలలో వ్యాపారాలు చేస్తుండేవారు.
కట్టడాలకు కావలసిన నాణ్యమైన శ్రేష్టమైన బర్మా టేకును ఎంపిక చేసి ఆ దేశం నుంచి తీసుకురావడానికి ఈ చెట్టియార్లు సాయపడేవారు.
అలాగే భారత కాంట్రాక్టర్లు తక్కువ కూలీకి ఎక్కువ ననులు చేసే వారిని గుర్తించి వారితో కట్టడాల పని కానిచ్చేసేవారు.
ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో అధిక శాతం కట్టడాలు ఉన్న ప్రాంతంగా మద్రాసు చరిత్రపుటలకెక్కింది.
వీరి హయాంలో దాదాపు రెండు వేలకు పైగా కట్టడాలుండేవి. వాటిలో కొన్నింటిని ఆధునీకరించారు.
విలియం హోడ్జస్, డేనెల్ అనే ఇద్దరి చిత్రాలను ఆధారంగా చేసుకుని కట్టిన మొదటి indo saracenic భవనం మద్రాసులోని చేపాక్ భవనం. ఇది ఆర్కాట్ నవాబుల అధికారిక నివాసం.
అనంతరం మన దేశమంతటా ఇటువంటి ఎర్ర రంగు కట్టడాలు నిర్మితమయ్యాయి..
దక్షిణ భారత దేశంలోని మొట్టమొదటి రైల్వే నిలయమైన రాయపురం స్టేషన్ ని ఈ indo saracenic పద్ధతిలోనే నిర్మించారు..
మద్రాసులోని సెంట్రల్ రైల్వే స్టేషన్, జనరల్ పోస్టాఫీసు కార్యాలయ భవనం, దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయ భవనం,
మద్రాసు హైకోర్టు భవనం, సెయింట్ హౌస్, మద్రాసు విశ్వవిద్యాలయం, గిండీ ఇంజినీరింగ్ కాలేజీ, ఎగ్మూరులోని ప్రభుత్వ.మ్యూజియం, రిప్పన్ బిల్డింగ్ ( సెంట్రల్ రైల్వే స్టేషన్ సమీపంలో), మౌంట్ రోడ్డులోని హిగ్గిన్ బాతమథమ్స్ (శ్వేతవర్ణం) , సెయింట్ జార్జ్ కోట, అమీర్ మహల్, ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ మొదలైన కట్టడాలన్నీ ఇప్పటికీ అలానే చూడవచ్చు.
అలాగే విక్టోరియా భవనానికో ప్రత్యేకత ఉంది. మద్రాసులో మొట్టమొదట సినిమాలను ప్రదర్శించింది విక్టోరియా ఆడిటోరియంలోనే. మద్రాస్ ఫోటోగ్రాఫిక్ స్టోర్ యజమాని డి. స్టీవెన్సన్ పది లఘు చిత్రాలను ఇక్కడ ప్రదర్శించారు.
1892 లో మద్రాసు విక్టోరియా ఆడిటోరియంలో జరిగిన మహా జన సభకు చరిత్ర పుటలలో ప్రత్యేక స్థానముంది. ఈ సభకు నీలగిరి ప్రతినిధిగా పాల్గొన్న అయోధిదాస పండితుడు అంటరానివారికి కూడా ఆలయప్రవేశం కల్పించాలని తన వాణి వినిపించారు.
ఇదే విక్టోరియా ఆడిటోరియంలో మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, గోపొల కృష్ణ గోఖలే, తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతియార్, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితరులు ప్రసంగించారు. అలాగే తమిళులు శంకరదాస్ స్వామి, పమ్మల్ సంపత్ ముదలియార్ వంటివారు తమ నాటకాలను ప్రజర్శించారిక్కడ.
ఇక రాయపేటలో indo saracenic పద్ధతిలో నిర్మితమైన అమీర్ మహల్ భవనం ఆర్కాట్ నవాబు వంశీయులకు చెందినది. ఈ భవనం నుంచే ఆంగ్లేయులు తమ కార్యక్రమాలను కొనసాగించారు. ఈ భవనంలో మొత్తం డెబ్బయ్ గదులున్నాయి.
మద్రాసులోని రిప్పన్ బిల్డింగుని శ్వేత భవనం అని కూడా అంటారు. దీని రూపకర్త
హారిస్. నిర్మించింది లోకనాథ్ ముదలియార్. ఇది నిర్మించడానికి నాలుగేళ్ళు పట్టింది.
ఈ భవనంపైన కనిపించే గడియారాన్ని 1913 లో వోక్స్ అండ్ కో తయారు చేసింది.
నగర పాలన నిర్వహణకు మూలకర్త అయిన రిప్పన్ పేరుని ఈ భవనానికి పెట్టారు.
- యామిజాల జగదీశ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి