ఓంకారము యొక్క చతుష్పాదములు - వివరణ
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
*చలాచల బోధ*
ప్రసాద్ భరద్వాజ
‘ఓం’ అనే అక్షరము సర్వము అయివున్నది. భూత భవిష్య వర్తమానములలో ఓం అనునదే వున్నది. త్రికాలాతీతమైనది ఏదైతే వున్నదో అది కూడా ఓంకారమే అవుతున్నది. ఇదంతయూ బ్రహ్మమే. ఈ ప్రత్యగాత్మ కూడా బ్రహ్మమే. అట్టి ఈ ఆత్మ చతుష్పాదములు కలది.
ప్రథమ పాదము వైశ్వానరుడు. అతని కర్మక్షేత్రము జాగ్రదావస్థ. అతడు బహిః ప్రజ్ఞ కలవాడు. అతనికి సప్త అంగములు, 19 ముఖములు కలవు. అతడు స్థూల విషయములనే అనుభవించును.
ద్వితీయ పాదము తైజసుడు. అతని కర్మక్షేత్రము స్వప్నావస్థ. అంతః ప్రజ్ఞ కలిగివున్నాడు. సప్త అంగములు మరియు 19 అంగములు కలిగివున్నాడు. అతడు మానసిక ప్రపంచము నందలి, సూక్ష్మ విషయములను అనుభవించుచున్నాడు.
తృతీయ పాదము ప్రాజ్ఞుడు. నిద్రపోవువాడు. ఎచట ఎట్టి కోరికలను కోరడో, స్వప్నమును కూడా చూడడో అదే సుషుప్తి అవస్థ. అతని యందు అన్ని అనుభవములు భేదరహితమై ఏకీభవించుచున్నవి. అతను సంపూర్ణ చైతన్యము యొక్క ప్రజ్ఞానఘనరూపమై వున్నాడు. ఈ సుషుప్త్యావస్థ జాగ్రత స్వప్నములయందు ఆ చైతన్యమును ప్రసరింపచేయుటకు ముఖద్వారమై వున్నది.
నాల్గవ పాదము తురీయము. ప్రత్యగాత్మ. అది అంతః ప్రజ్ఞకాదు. బహిః ప్రజ్ఞ కాదు. ఉభయతా ప్రజ్ఞ కలది కాదు. ప్రజ్ఞాన ఘనమూ కాదు. ప్రజ్ఞయూ, అప్రజ్ఞయూ కాదు. అది అదృష్టము. అవ్యవహారము, అగ్రాహ్యము, అలక్షణము, అచింత్యము, అన్యాపదేశము, ఏకాత్మ, ప్రపంచోపశమము, శాంతము, శివము, అద్వైతము అదియే చతుర్థపాదము. అదియే ఆత్మ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి