11, జులై 2020, శనివారం

*కుబేర పచ్చ కుంకుమ*

భారతదేశంలో పసుపు కుంకుమలను మంగళకరమైనవిగా సౌభాగ్యచిహ్నాలుగా భావించి పవిత్రంగా చూసుకుంటారు.

ఏ శుభకార్యానికైనా , పూజలకైనా  ముందుగా సిధ్ధం చేసుకునేవి  పసుపు కుంకుమలే.   పసుపులో - 
పచ్చి పసుపు , కస్తూరి పసుపు,  ఛాయ పసుపు కొమ్ములు, దుంప పసుపు  అని పలు రకాలు. 

అలాగే కుంకుమలలో పలు రకాలు వున్నాయి.   ఎరుపు , ముదురు ఎరుపు ,  సింధూరపు
రంగు,  మీనాక్షీ  కుంకుమ( ఈ కుంకుమ మొగలిపూవుల సువాసనతో వుంటుంది) మొ.  ఎక్కువగా వాడుకలో వున్నవి.

కానీ , కుంకుమలో ఆకుపచ్చ రంగు కుంకుమ గురించి ఎప్పుడైనా విన్నారా ?
 దీనినే కుబేరపచ్చ కుంకుమ అంటారు.  

కుబేర పచ్చ కుంకుమ ప్రత్యేకత  కలది.  ఆ కుంకుమని ఎలా  పూజించాలో కూడా తెలుసుకుందాము. 
పురాణాలలో వర్ణించబడిన ఈ కుంకుమ 
కుబేరునికి ప్రీతికరమైనది . అలాగే ప్రీతికరమైన రంగు
కూడా యీ పచ్చ రంగే.

దీనిగురించి శివపురాణం
యిలా వివరించింది. 

పరమశివుని
 భక్తుడైన కుబేరుడు
ఒకసారి కైలాసానికి వెళ్ళాడు. ఏకాంతంగావున్న శివపార్వతులను చూశాడు.
నిత్యం దేవిని  పవిత్రంగా ఆరాధించే కుబేరునికి ఆనాడు
అంబికను దర్శించగానే
కామవికారానికి  
లోనయ్యాడు. ఒక్క క్షణం ఆవిడను తన
భార్యగా వూహించుకున్నాడు.

సర్వం తెలిసిన సర్వేశ్వరునికి 
కోపం వచ్చింది, శివుని
అర్ధభాగమైన సతీదేవి ఉగ్రురాలైనది.
ఇద్దరూ కుబేరుని వైపు ఉగ్రంగా చూశారు. 
ఆ చూపుల తీక్షణతకు
కుబేరుని దేహంకాలి కమిలిపోయింది. 
కుబేరుడు గడగడా వణికి పోయాడు .
పరమశివుని కాళ్ళపైబడి మన్నించమని
వేడుకున్నాడు. 

" మా ఇద్దరి కోపం వలన  ఏర్పడిన యీ ఉగ్రత  , మాఇరువురి శాంత స్వరూపాలు ఒకటైనప్పుడు
చల్లదనంగా మారుతుంది.
ఆ చల్లదనమే  నీ దేహాన్ని తాకి
 నీ చర్మం
 కమిలిపోవడం తగ్గి మామూలు రూపం లభిస్తుంది"  అని  పరమేశ్వరుడు  దీవించాడు.

పరమేశ్వరుడే గతి అని
స్తోత్రాలతో స్తుతించ సాగాడు.
శీఘ్రంగా నే పార్వతీ పరమేశ్వరులు కుబేరుని కరుణించారు.  వారి అనుగ్రహంతో శరీరానికి స్వస్ధత చేకూరింది. 
అయినా శరీరం కాలిన ప్రదేశాలలో  తప్పుకి శిక్ష గా మచ్చలు శాశ్వతంగా వుండిపోయాయి.

పరమేశ్వరుని కంఠం చుట్టూగల  నీలం వర్ణం, పార్వతీ దేవి పసిమి ఛాయ (అంబిక మంగళరూపిణిగా దర్శన మిచ్చినప్పుడు, పసుపు వర్ణంగానే  దర్శనమిస్తుంది.  ఆ పసుపు వర్ణాన్ని  ..తన దేహానికి పసుపు నలుగుపెట్టి తీసిన
పసుపుతో  వినాయకమూర్తిని  చేయడం మనకు  తెలుసు. )
ఈ నీల వర్ణం , ఆ పసుపు వర్ణం రెండూ కలసినప్పుడు అక్కడ
ఒక అద్భుతం  జరిగింది. 
ఆ  రెండింటి కరుణా కిరణాలు పడిన 
ప్రదేశంలోని మట్టి అంతా ఆకుపచ్చగా మారి పోయింది. 
( నీలం..పసుపు  రంగులను మిశ్రం చేస్తే
ఆకుపచ్చ రంగు ఏర్పడుతుంది) .
 కుబేరుడు ఆ ఆకుపచ్చ మట్టిని తన శరీరానికి పూసుకోగానే మాడి కమిలిన దేహమంతా మామూలు స్థితిని పొంది శివపార్వతుల ఆగ్రహంనుండి
విముక్తి పొందాడు .
అంతే కాకుండా పచ్చమట్టిని
తన పట్టణానికి తీసుకొని వెళ్ళి , నిత్యం శరీరానికి
ధరించేవాడు.  ఆనాటి
నుండి పచ్చ వర్ణం కుబేరునికి ప్రీతిపాత్రమయింది. పచ్చని రంగు కుంకుమ
కుబేర చిహ్నంగా  మారింది. 

మహావిష్ణువు వర్ణం కూడా పచ్చనిదేనని పురాణాలు తెలుపుతున్నాయి. 
పరమ భక్తులైన ఆళ్వార్లు
" పచ్చమామలై పోల్  మేని" ( పచ్చని పర్వతం వంటి గంభీరాకృతి కలవాడు) గలవాడు విష్ణువు
అని కీర్తించారు.

శ్రీమన్నారాయణునికి పచ్చని వర్ణం
ఎలా వచ్చిందంటే .. పాలకడలిలో  శయనించే శ్రీమహావిష్ణువు,
ఆకాశం నుండి ప్రసరించబడే
నీలవర్ణాన్ని తాను ధరించి నీలవర్ణ మేఘశ్యాముడిగా దర్శనమిచ్చేవాడు.  ఆయన అర్ధాంగి అయిన శ్రీ మహాలక్ష్మి
మహావిష్ణువు వక్షస్ధలమున నివాసమేర్పర్చుకున్నది.
అందువలన ఆమె మేనికాంతి  మహా విష్ణువుపైబడి ఆయన దేహం పచ్చని వర్ణంగా మారింది.  మహా లక్ష్మీ యొక్క మేలిమి బంగారు ఛాయ, 
నీలమేఘ శ్యాముని వర్ణంతో కలసి  పచ్చని వర్ణమై మెరసింది పరంధాముని
మేని అని  ఆళ్వార్లందరూ
మహావిష్ణువు ని స్తుతించారు.

పుణ్యనగరాలలో ప్రముఖ క్షేత్రంగా  విశిష్టత కలిగిన కాంచీమామనగరం లో
శ్రీమహావిష్ణువు పచ్చవర్ణ పెరుమాళ్ గా దర్శనమిస్తున్నాడు. 

పరంధాముడు భార్గవీ సమేతంగా  అనుగ్రహించడాన్ని తీసుకున్నా, పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహించినట్లు తీసుకున్నా
పచ్చని రంగు మంగళకరము , శుభప్రదము అయింది.

పచ్చ వర్ణ సాలగ్రామమును
సాక్షాత్తూ నారాయణ స్వరూపంగా పూజిస్తారు.
పచ్చవర్ణ మరకత లింగాన్ని
ఆరాధించడం వలన కలిగే శుభాలు మనకి తెలుసు. 

పచ్చ వర్ణం ఐశ్వర్యానికి
చిహ్నమైనందున, సిరిసంపదలకోసం ప్రార్ధించే ఆలయాలలో, కుబేరుని
ఆలయాలలోను  ఆకు పచ్చరంగు కుంకుమనే  ప్రసాదంగా వినియోగిస్తారు.

మంగళకరమైన పచ్చవర్ణ కుంకుమ  వుండే స్ధలంలో
మహావిష్ణువు ,
మహాలక్ష్మి
కలసి నివసిస్తారు.   పార్వతీ పరమేశ్వరులు కూడా కరుణతో
ఆశీర్వదిస్తారు.

కుబేరుని అనుగ్రహం కలుగుతుంది.  ఇందరి దేవతల అనుగ్రహాం లభించే చోట ఎల్లప్పుడూ
సుభిక్షంగానే వుంటుంది. 
సర్వ శుభాలు కలుగుతాయి.  తలచిన కార్యాలు సఫలీకృతమౌతాయి.
జీవితం సుఖ సంతోషాలతో
నిండి వుంటుంది.

కామెంట్‌లు లేవు: