*శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష..!!*
*సకృదేవ ప్రపన్నాయ*
*తవాస్మీతి చ యాచతే*
*అభయం సర్వభూతేభ్యో*
*దదాంయేతద్ వ్రతం మమ.*
(యుద్ధ కాండ సర్గ వ 18 శ్లోకం 35.)
ఈ శ్లోకం రామాయణం మొత్తం లోకి సార భూతమైన శ్లోకము. శ్రీరామచంద్రుడు జీవులదరికీ ఇచ్చిన వాగ్దానం ఇది.
ఈ శ్లోకంలో అభయం అనే మాట ఒకటి ఉంది. దాని అర్థం తెలుసుకోవాలి అనుకుంటే, భయ కారణా లేమిటో ముందుగా తెలుసుకోవాలి. సాధారణంగా అభయం అంటే శత్రువుల నుంచి భయం లేకుండా ఉండడం అనుకుంటాము. వేదాంత పరిభాషలో శత్రువులు అంటే అరిషడ్వర్గాలు ( కామక్రోధాలు వగైరా. అరి అంటే శత్రువు అని అర్థం). ఇవి లోపలి శత్రువులు. వీటివల్లనే బయట శత్రువులు తయారవుతారు. కామం వల్ల రావణాసురుడికి రాముడితో వైరం. లోభం వల్ల దుర్యోధనుడికి పాండవులతో వైరం. ప్రపంచంలో ఎక్కడ ఏ తగాదా వచ్చినా చూడండి అక్కడ పైన చెప్పిన ఆరింటిలో ఏదో ఒకటి ఉంటుంది.
శత్రుభయం తీసేస్తే మిగిలింది అనుకోని ఆపదలు. భూకంపాల నుంచి భయము. వరదల నుంచి భయము. ఆఖరలో దరిద్రం నుంచి భయము. రోగాల నుంచి భయము. అన్నిటి కంటే పెద్ద భయం, మృత్యువు నుంచి.
ఉన్నది పోతుందేమో, కోరుకునేది రాదేమో అనే చిన్న భయాల దగ్గరనుంచీ, చని పోతానేమో అనే భయము, చనిపోయిన తర్వాత ఏమి అవుతుందో అనే భయం దాకా అన్ని భయాలకు శ్రీరాముడు ఇస్తానన్న ఈ అభయం జవాబు చెప్ప గలదు. అది అంత శక్తివంతమైన అభయము. *భగవద్గీతలో "యోగక్షేమం వహామ్యహం" అన్న మాట* ఏదైతే ఉందో ( భగవద్గీత 9 వ అధ్యాయం 22 వ శ్లోకం) అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది.
అభయం ఎవరికి ఇస్తాను ఎప్పుడు ఇస్తాను అనేది భగవంతుడు స్పష్టం చేశాడు. అభయాన్ని ఆయన ప్రపన్నులకు ఇస్తా నన్నాడు. ప్రపన్నులు అంటే శరణు కోరే వాళ్ళు. వాళ్లు కనుక ఆయనతో తవాస్మి అని అంటే వాళ్లకు అభయం ఇస్తాను అనేది ఆయన ప్రతిజ్ఞ. తవాస్మి అంటే నేను నీ వాడిని అని భగవంతుడితో అనడం. తవాస్మి అన్నా ప్రపద్యే అన్నా ఒకటే. సకృదేవ అంటే ఒకసారి అంటే చాలు అని. యాచతే అంటే దీనంగా అడగడం. "అన్నీ వదిలిపెట్టి నిన్నే నమ్ముకున్నాను అంటూ దీనంగా శరణం కోరిన వారికి నేను అభయమిస్తాను." భూతేభ్యో అంటే అందరి నుంచి అని అందరి కొరకు అని రెండర్థాలు ఉన్నాయి. అలా అన్న వాళ్లందరికీ అభయమిస్తానని ఒకటి. ఎవరినుంచైనా నీకు అభయమిస్తానని ఇంకొకటీ అర్ధాలు. శరణాగతికి ఆరు లక్షణాలు ఉన్నాయంటారు.ఈ శ్లోకంలో అవన్నీ సూచనగా ఉన్నాయి.
*అన్యధా శరణం నాస్తి*
*త్వమేవ శరణం మమ*
*తస్మాత్ కారుణ్య భావేన*
*రక్ష రక్ష జనార్ధన.*
ఇది ప్రసిద్ధమైన శరణాగతి శ్లోకం. ఈ మాట అనేస్తే భగవంతుడు అభయ మిస్తాడా? చాలా సులభంగా అనిపిస్తుంది. అడవులకు వెళ్లి నియమాలతో తపస్సు చేయడం కంటే ఇది సులభం. కానీ ఇక్కడ కొన్ని జాగ్రత్తలు చెప్పాలి.
భగవంతుడు మనతో ఒక ఒప్పందానికి వచ్చాడు. ఆ ఒప్పందానికి సంబంధించిన నియమాలు ఇట్లా ఉన్నాయి. మనం కనుక సత్యమైన శరణాగతి చేస్తే ఆయన సత్యమైన అభయం ఇస్తాడు. మనం కనుక దొంగ శరణాగతి చేస్తే ఆయన కూడా దొంగ అభయం ఇస్తాడు. మనం తాత్కాలిక శరణాగతి చేస్తే తాత్కాలిక ఆభయం వస్తుంది. శాశ్వత శరణాగతి చేస్తే శాశ్వత అభయం వస్తుంది. పిండి కొద్దీ రొట్టె. మనం ఎంత పిండి ఇస్తే ఆయన మనకు దానికి సరిపడా రొట్టె చేసి ఇస్తాడు. ఇందులో కల్తీలు మోసాలు ఆయన వైపు నుంచి ఉండవు. మనం ఇచ్చే పిండిలో కల్తీలు, కొలతల్లో తప్పులూ మొదలైనవి లేకుండా మనమే జాగ్రత్తపడాలి. ఈ నియమాలు భగవద్గీతలో 4వ అధ్యాయం 11 వ శ్లోకం మొదటి పాదంలో ఉన్నాయి. కాబట్టి శరణాగతి అనేది మనసు లోపల్నుంచి ఆర్తితో నిజాయితీతో రావాలి. అప్పుడే అది ఫలిస్తుంది.
అభయము అంటే శ్రీరామరక్ష. రక్షణ మాత్రమే ఇస్తే ఎట్లా మిగిలిన కోరికలు తీరవద్దా అని సందేహ పడతారేమో. అట్లా ఉండదు. గదిలో పెట్టి తాళం పెట్టి, రక్షిస్తాను అన్న వాడు మనకు అవసరమైన అన్నమూ మనకు కావలసిన కాలక్షేపమూ మొదలైన వన్నీ ఏర్పాటు చెయ్యాలి కదా. అవి లేకపోతే రక్షణకు అర్థమే ఉండదు. కాబట్టి అవన్నీ ఆయనే చూసు కుంటాడు. యోగక్షేమం వహామ్యహం అంటే అదే మరి.
మనం ఇప్పుడు చర్చించుకుంటున్న శ్లోకం రామాయణంలో విభీషణుడికి అభయ ప్రదానం చేసే ఘట్టం లోనిది. విభీషణుడు శరణాగతి చేసేటప్పుడు అవి కావాలివి ఇవి కావాలి అని కోరుకోలేదు. విభీషణుడికి అభయం లభించిన తరువాత లంకా సామ్రాజ్యం మొత్తం లభిస్తుంది. చిరంజీవిగా ఉండే భాగ్యం కూడా లభిస్తుంది. శ్రీరాముడు అడగకుండా అవన్నీ ఇచ్చాడు. ఎవరికైనా అంతకు మించి "యోగక్షేమం" మరేమి ఉంటుంది. శ్రీరామరక్ష అంటే అది.
పురాణాలలో ప్రహ్లాదుడు అంబరీషుడు బలి చక్రవర్తి గజేంద్రుడు వీళ్లంతా శరణాగతి చేసి భగవంతుని రక్షణ లోకి వచ్చినవాళ్లు. అయనను నమ్మి బాగు పడినవాళ్లు.
*రాముడు మాట ఇచ్చేశాడు. ఆయన మాట తప్పడు. ఇప్పుడు మనమేం చేయాలి అన్నది ప్రశ్న.*
*పవని నాగ ప్రదీప్.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి