9, ఆగస్టు 2021, సోమవారం

సంస్కృత మహాభాగవతం*

 *


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఎనుబది ఏడవ అధ్యాయము*


*శ్రుతిగీతలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*పరీక్షిదువాచ*


*87.1 (ప్రథమ శ్లోకము)*


*బ్రహ్మన్ బ్రహ్మణ్యనిర్దేశ్యే నిర్గుణే గుణవృత్తయః|*


*కథం చరంతి శ్రుతయః సాక్షాత్సదసతః పరే॥11961॥*


*పరీక్షిన్మహారాజు పలికెను* బ్రాహ్మణోత్తమా! శుకయోగీ! పరబ్రహ్మము కార్యకారణములకు సర్వధా అతీతము. సత్త్వరజస్తమోగుణములు ఆయనయందు లేవు. అనగా ఆయన త్రిగుణములకు అతీతుడు. నిర్గుణుడు. మనస్సుగాని, వాక్కుగాని సంకేతరూపమునగూడ బ్రహ్మనుగూర్ఛి నిర్దేశింపజాలవు. ఇదమిత్థముగా తెలుపజాలవు. అతడు అవాఙ్మానసగోచరుడు. వేదములు మాత్రము విషయములయొక్క గుణము, జాతి, క్రియా, రూఢి మున్నగు విషయములను నిర్దేశించును *(త్రైగుణ్యవిషయా వేదాః)* ఇట్టి స్థితిలో శ్రుతులు నిర్గుణ పరబ్రహ్మనుగూర్చి ఎట్లు ప్రతిపాదించును? ఏలయన నిర్గుణ వస్తుస్వరూపము వరకు అవి చేరజాలవుగదా!


*శ్రీశుక ఉవాచ*


*87.2 (రెండవ శ్లోకము)*


*బుద్ధీంద్రియమనఃప్రాణాన్ జనానామసృజత్ప్రభుః|*

.

*మాత్రార్థం చ భవార్థం చ ఆత్మనేఽకల్పనాయ చ॥11962॥*


*శ్రీశుకుడు వచించెను* భగవంతుడు నానావిధ ప్రాణులను సృష్టించెను. వారితోపాటుగా బుద్ధిని, ఇంధ్రియములను, మనస్సుసు, ప్రాణములను నిర్మించెను. ఇందులో బుద్ధిద్వారా జ్ఞాపకశక్తిని, ఇంద్రియములద్వారా క్రియాశక్తిని, మనస్సుతో సంకల్పశక్తిని, ప్రాణధారణద్వారా చైతన్యశక్తిని ప్రసాదించెను. మాత్రార్థమ్ అనగా - విషయములను అన్నింటినీ సృజించెను. భవార్థం అనగా - తమ జీవనయాత్ర కొనసాగించుటకై కావలసిన వాటినన్నిటిని సమకూర్చెను. ఉచితానుచిత వివేకముతో వీటినన్నింటిని ఉపయోగించుకొనుచు ఆత్మస్వరూపమును తెలిసికొని తురీయమగు మోక్షమును పొందవచ్చును.


*87.3 (మూడవ శ్లోకము)*


*సైషా హ్యుపనిషద్బ్రాహ్మీ పూర్వేషాం పూర్వజైర్ధృతా|*


*శ్రద్ధయా ధారయేద్యస్తాం క్షేమం గచ్ఛేదకించనః॥11963॥*


ఉపనిషత్తు బ్రహ్మను ప్రతిపాదించును. ఈ ఉపనిషత్తులను పూర్వీకులకంటే పూర్వమునందు జన్మించిన సనకాది మహర్షులు తమ బుద్ధినందు ధరించిరి. ఎవరైతే దీనిని శ్రధ్ధగా తమ బుద్ధినందు ధరించెదరో, వారికి ఎటువంటి సంసారికమైన కోరికలు లేకుండా సమసిపోవును. అంతట క్షేమముగా సంసారసాగరమును దాటి శ్రేయస్సును పొందగలరు.


*87.4 (నాలుగవ శ్లోకము)*


*అత్ర తే వర్ణయిష్యామి గాథాం నారాయణాన్వితామ్|*


*నారదస్య చ సంవాదమృషేర్నారాయణస్య చ॥11964॥*


ఈ విషయమున శ్రీమన్నారాయణునకు సంబంధించిన ఒక వృత్తాంతమును తెలిపెదను. ఇది దేవర్షి నారదునకును, నారాయణ ఋషీశ్వరునకును మధ్య జరిగిన సంవాదము.


*87.5 (ఐదవ శ్లోకము)*


*ఏకదా నారదో లోకాన్ పర్యటన్ భగవత్ప్రియః|*


*సనాతనమృషిం ద్రష్టుం యయౌ నారాయణాశ్రమమ్॥11965॥*


ఒకానొకప్పుడు పరమభక్తుడైన నారదమహర్షి సకలలోకములలో పర్యటించుచు సనాతనుడైన నారాయణ మహర్షిని దర్శించుటకై బదరికాశ్రమమునకు వెళ్ళెను.


*87.6 (ఆరవ శ్లోకము)*


*యో వై భారతవర్షేఽస్మిన్ క్షేమాయ స్వస్తయే నృణామ్|*


*ధర్మజ్ఞానశమోపేతమాకల్పాదాస్థితస్తపః॥11966॥*


పూజ్యుడైన నారాయణమహర్షి మానవాళియొక్క అభ్యుదయమునకై (లౌకిక శుభములకై), మోక్షప్రాప్తికై ఈ భారతదేశమున కల్పాదినుండి ధర్మము, జ్ఞానము, ఇంద్రియనిగ్రహములతో కూడిన మహాతపస్సును ఆచరించెను (నారాయణమహర్షి వర్ణాశ్రమ ధర్మములకు అనుగుణముగా,ప్రకృతి పురుషుల విలక్షణత్వము వెల్లడించెడి జ్ఞానశోభితముగా, రాగద్వేషరహితముగా తపమాచరించెను).


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఎనబది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: