9, ఆగస్టు 2021, సోమవారం

మొగలిచెర్ల అవధూత

  శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*మల్లెబోయిన సుబ్బమ్మ..*


"స్వామికి బియ్యం తీసుకొచ్చాను..వండి నలుగురికీ పెట్టండి.." అంటూ ఒక ఇరవై ఐదు కేజీల బియ్యపు మూటను పక్కన పెట్టించింది..వయసులో బాగా పెద్దావిడ..మల్లెబోయిన సుబ్బమ్మ అని ఆవిడ పేరు.. ప్రస్తుతం లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెం లో ఉంటున్నది..


ఎన్నో ఏళ్ల నుంచీ ఆవిడ శ్రీ స్వామివారి మందిరానికి వస్తున్నది..వచ్చినప్పుడల్లా తన శక్తి మేరకు బియ్యం లేదా ఇతర వెచ్చాలు కానీ తీసుకొచ్చి అన్నదానానికి ఇవ్వడం జరుగుతున్నది..ఒక సాధారణ భక్తురాలిగానే అనుకుంటూ వున్నాము..కానీ మొన్న ఆదివారం నాడు వచ్చినప్పుడు మాత్రం..నా దగ్గరకు వచ్చి.."అయ్యా..స్వామిని రెండు మూడు నెలల కొకసారన్నా చూడకపోతే వుండలేనయ్యా..నా చిన్నతనం నుంచే ఈ స్వామి తెలుసు..అసలు మా పుట్టిల్లు ఎర్రబల్లె గ్రామమే.. స్వామి వారి ఊరే..నా చిన్నప్పుడు అంటే నాలుగైదేళ్ల వయసులో స్వామివారితో కలిసి ఆడుకునేదాన్ని..ఆయనది నాదీ ఇంచుమించు ఒకే వయసు..మేము యాదవులము.. స్వామి వాళ్ళ ఇంటికి దగ్గరలోనే మా ఇల్లు కూడా ఉండేది.." అన్నది..


శ్రీ స్వామివారి బాల్యం గురించి తనకు తెలిసినంతవరకూ చెప్పింది..అలా చెప్పుకుంటూ మధ్యలో.."స్వామివారు మాలకొండ నుంచి ఇక్కడకు వచ్చి ఈ ఆశ్రమం కట్టించుకునే రోజుల్లో..నేనూ మా నాన్నా ఇటు వైపుగా వెళుతున్నాము..మమ్మల్ని చూసి దగ్గరకు రమ్మనమని పిలిచారు..మా నాన్నతో.."బాగున్నావా కొండయ్యా..." అని ఆప్యాయంగా పలకరించి..నా వైపు చూసి, మా నాన్నతో.."అమ్మాయికి పెళ్లి చేసావా?.." అని అడిగారు..మా నాన్న "చేసాను స్వామీ..పెళ్లి చేసి కూడా దాదాపు ఆరేళ్ళు అవుతున్నది..ఇంకా పిల్లలు పుట్టలేదు.." అని చెప్పాడు..శ్రీ స్వామివారు కొద్దిసేపు గంభీరంగా వున్నారు..తరువాత "కొండయ్యా..ఈ అమ్మాయికి పెళ్లి చేసావు..నీ బాధ్యత తీరింది..కానీ ఈ పిల్లకు సంతాన యోగం లేదు..పిల్లలు పుట్టరు.." అని ఖచ్చితంగా చెప్పారయ్యా..ఆ మాటే నిజం అయింది..నాకు సంతానం లేదు..కానీ..మొదటినుంచీ ఆ స్వామిని పూర్తిగా నమ్ముకొని వున్నాను..మాట చెప్పాడంటే అది జరిగితీరేది..ఆశ్రమం కట్టుకున్న తరువాత..నాలుగైదు సార్లు మా ఊరు వెళుతూ స్వామి వారిని కలిశాను..మౌనంగా వున్నప్పుడు చేయెత్తి ఆశీర్వదించేవాడు..స్వామి సమాధి చెందిన తరువాత ప్రతియేటా మూడు నాలుగు సార్లు ఇక్కడకు వచ్చిపోతున్నాను.."


"పాతికేళ్ల కిందట నాకు జబ్బు చేసింది..ఎంతకూ తగ్గలేదు..మొగలిచెర్ల కు తీసుకెళ్లి స్వామి వారి మందిరం వద్ద పడుకోబెట్టండి..తగ్గిపోతుంది అని నేను మా వాళ్లకు చెప్పాను..సరే అని ఇక్కడకు తీసుకొచ్చారు..ఇక్కడకు వచ్చేసరికి నాకు స్పృహ తప్పి పోయింది..నేను చచ్చిపోయానని అనుకున్నారు..ఈ మంటపం లోపలికి కూడా తీసుకురావొద్దని పూజారులు చెప్పారు..మా వాళ్ళు కూడా నేను చచ్చిపోయానని నమ్మారు..అదిగో ఉత్తరంగా ఆ చివర ఖాళీ స్థలంలో పడుకోబెట్టారు.. అయ్యా..నువ్వు నమ్ము నమ్మకపో..ఆ సమయం లో నా శరీరం పై నుంచి..ఈ స్వామి రెండు అంగల్లో అటునుంచి ఇటు..ఇటునుంచి అటు దాటి నట్టు భ్రమ కలిగింది..వెంటనే స్పృహ వచ్చింది..మా వాళ్ళు ఏడుస్తూ వున్నారు..నేను లేచి కూర్చున్నాను..అందరూ ఆశ్చర్యపోయారు..స్వామి దయవల్ల చచ్చిపోయిన దాన్ని బ్రతికాను..ఎప్పుడు కష్టం వచ్చినా ఆ స్వామిని తలుచుకుంటే..వెంటనే గట్టున పడేస్తున్నాడు..సాక్షాత్తూ నా ముందే వుంటాడయ్యా.." అని కళ్ళకు నీళ్లు పెట్టుకుంటూ చెప్పుకొచ్చింది..


ఎన్నో ఏళ్ల నుంచి సుబ్బమ్మ శ్రీ స్వామివారి మందిరానికి వస్తూ పోతూ వుంటే చూస్తూనే వున్నాము కానీ..ఆవిడ శ్రీ స్వామివారి సమకాలీనురాలని మాకు తెలియదు..ఎన్నడూ ఆ మాట ఆమె చెప్పుకోలేదు కూడా..తన చిన్నతనం నుండే శ్రీ స్వామివారిని మనసారా నమ్మిన సుబ్బమ్మ గారు ఇప్పటికీ ఆ నమ్మకం తోనే జీవిస్తున్నారు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: