9, ఆగస్టు 2021, సోమవారం

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*963వ నామ మంత్రము* 9.8.2021


*ఓం శమాత్మికాయై నమః*


సకల ప్రపంచ లయ స్వరూపురాలైన జగదాంబకు నమస్కారము.


ఇంద్రియ నిగ్రహము ఆత్మస్వరూపంగా గలిగిన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శమాత్మికా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం శమాత్మికాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి కరుణచే శాంతస్వభావులై, జనరంజకమైన సంభాషణలతో పలువురి హృదయాలను గెలిచినవారై, భౌతికపరముగా శాంతిసౌఖ్యములు, ఆముష్మికపరముగా కైవల్యసాధనా పటిమయు సంప్రాప్తింపజేసికొందురు.


శమము అనగా ప్రపంచములు ఉపశమించుట. సృష్టి అనేది సమస్తజీవకోటి ఏర్పడడం, ఊపశమించుటయనగా కల్పాంతమందు లయం కావడం. అమ్మవారు లయస్వరూపిణి. గనుక *శమాత్మికా* యని అనబడినది. నృశింహతాపనీయోపనిషత్తునందు *ప్రపంచోపశమము, శివము, శాంతము, అద్వైతము మరియు తురీయముగా తలచుచున్నారని గలదు. ఇంకొకవిధంగా చూస్తే *శమ్* సుఖము, *ఆత్మికా* అనగా స్వరూపము. పరమేశ్వరి సుఖస్వరూపురాలు. సాధకుడు మూలానారంలోని కుండలినీ శక్తిని మేల్కలిపి, సుషుమ్నా మార్గముద్వారా పయనింపజేయును. గ్రంథిత్రయ ఛేదనము, షట్చక్రములు దాటట జరిగిన తరువాత, ఆ కుండలినీ శక్తి సహస్రారంలో చంద్రమండలము చేరుతుంది. మూడున్నర చుట్టలుగా , సర్పాకృతిలో ఉన్న కుండలినీ శక్తి సహస్రారంలో చంద్రమండలం చేరగానే, అక్కడఉన్న ఆహ్లాదతకు సుధాధారలు వర్షింపజేస్తుంది. ఆ సుధాధారలు సాధకుని డెబ్బది రెండువేల నాడీమండలము తడిసి ముద్దచేయడంతో, సాధకునికి కలిగే సుఖానుభూతి వర్ణనాతీతమ. ఇక మళ్ళీ జన్మలు అవసరంలేని బ్రహ్మానందస్థితిని పొందుతాడు. అంతటి సుఖమును తన భక్తునికి పరమేశ్వరి సంప్రాప్తింపజేస్తుంది. ఆవిధముగా అమ్మవారు సుఖమును చేకూర్చే సుఖస్వరూపురాలు గనుకనే ఆ తల్లి *శమాత్మికా* యని అనబడినది.


కామక్రోధాదులు లేని (అరిషడ్వర్గములు లేని) అమ్మవారు శాంతస్వరూపురాలు. అరిషడ్వర్గములకు అతీతమైనది. గనుకనే *శమాత్మికా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శమాత్మికాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: