6, సెప్టెంబర్ 2021, సోమవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*991వ నామ మంత్రము* 6.9.2021


*ఓం షడధ్వాతీత రూపిణ్యై నమః*


మంత్రశాస్త్రమందలి షడధ్వములను (1.పదాధ్వము, 2. భువనాధ్వము, 3. వర్ణాధ్వము, 4. తత్త్వాధ్వము, 5. కలాధ్వము, 6. మంత్రాధ్వము అను మార్గములను) అతిక్రమించిన రూపము గలిగిన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *షడధ్వాతీత రూపిణీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం షడధ్వాతీత రూపిణ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులకు ఆ తల్లి కరుణచే బ్రహ్మజ్ఞాన తత్త్వమును తెలియదగు మార్గము సుగమమగును.


అధ్వము అనగా మార్గము. షడాధ్వము అనగా ఆరు మార్గములు. మంత్రశాస్త్రములో పదాధ్వ, భువనాధ్వ, వర్ణాధ్వ, తత్త్వాధ్వ, కలాధ్వ, మంత్రాధ్వ అను ఆరు ఉపాసనా మార్గములు గలవు. ఇందులో వర్ణాధ్వము, పదాధ్వము, మంత్రాధ్వము అను మూడును విమర్శాంశములు. అనగా నామాత్మకమగు శబ్ద బ్రహ్మ స్వరూపములు. ఇవి శక్తిరూపములు. కలాధ్వము, తత్త్వాధ్వము, భువనాధ్వము అను ఈ మూడును ప్రకాశాంశ స్వరూపములు. అనగా రూపాత్మక బ్రహ్మస్వరూపములు. ఇవి శివరూపములు. ఈ వివరము విరూపాక్ష పంచాశికయందు చెప్పబడినది. దీనిని బట్టి మంత్రశాస్త్రములో ఆరు అధ్వములు (మార్గములు) ఉండగా అందులో మూడు శక్తిరూపములు, మూడు శివరూపములు. 


జ్ఞానార్ణవ తంత్రములో "శ్రీచక్రమందు షడధ్వములు గలవనియు, అట్టి షడధ్వములతో గూడిన శ్రీచక్రమును చింతించవలయునని చెప్పబడినది. అలాగే దక్షిణామూర్తి సంహితయందుగూడ షడధ్వ స్వరూపము వివరింపబడి,అట్టి షడధ్వములు గల శ్రీచక్రమును భావించవలయునని చెప్పబడినది. ఈ షడధ్వములు (ఆరు మార్గములు) శ్రీచక్రోపాసనా మార్గములు అని తెలియగలము. ఈ మార్గములలో నిరంతరము, కలకాలము సాధనచేసినచో దేవీ ఉపాసనా విధానము తెలియును. ఏదైనా పనిచేయునపుడు వివిధమార్గములు ఉంటాయి. ఏ మార్గములో ఆ పని శాస్త్రసమ్మతముగాను, ఆమోదయోగ్యముగాను నిర్వహింపబడుతుందో, ఆ మార్గములో ముందుకు వెళ్ళినటులే , శ్రీచక్రార్చనకు కూడా ఉపాసనా మార్గములు ఉన్నవి. ఈ ఉపాసనా మార్గములను సాధకుడు శ్రీచక్రార్చనలో అనుసరించడం జరుగుతుంది. ఈ ఆరుమార్గాలు ఆ పరమాత్మవలననే కలుగుతున్నాయి. ఇది సాధకులవరకు మాత్రమే. అమ్మవారు వీటన్నిటికి అతీతమైన స్వరూపము గలిగినది.. గనుకనే ఆ తల్లి *షడధ్వాతీత రూపిణీ* యని అనబడినది. 


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం షడధ్వాతీత రూపిణ్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

.*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*745వ నామ మంత్రము*


*ఓం జరాధ్వాంత రవిప్రభాయై నమః*


ముసలితనపు అగచాట్లనే చీకట్లను పోగొట్టడానికి తానొక రవికిరణమై విరాజిల్లు జగజ్జననికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *జరాధ్వాంతరవిప్రభా* యను ఎనిమిదక్షరముల నామ మంత్రమును *ఓం జరాధ్వాంత రవిప్రభాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు సాధకునకు, వయసు మీదపడి ముసలితనము వచ్చినా, జగన్మాత ఆరాధనకు అవరోధమయే ముసలితనపు అగచాట్లు లేకుండా కాపాడును. సుఖశాంతులు ప్రసాదించి, ఆత్మానందానుభూతితో తరింపజేయును.


జరా అనగా ముసలితనము (అనే) ధ్వాంత అనగా చీకటి (కి) రవిప్రభా అనగా సూర్యకిరణముల (వంటిది).


జీవితంలో చివరియవస్థ వృద్ధాప్యము. వృద్ధాప్యం చాలా భారమైనది. పరమాత్మ తనను తీసుకుపోతే చాలు అనుకునే అవస్థ వృద్ధాప్యము. కాటికి కాళ్ళు, కూటికి నోరు చాపుకుని ఉన్న పరిస్థితి. కళ్ళు సరిగా కనబడవు, చెవులు సరిగా వినిపించవు, ఇష్టంగా ఏదైనా తినాలంటే అరగని పరిస్థితి, నాలుగడుగులు వేసి నడవాలంటే కర్ర చేతికి ఉండాలి. ఇదే జరాధ్వాంతము (ముసలితనపు చీకటి) అంటే. తనభక్తులకు ముసలితనం అనే చీకట్లు పోగొట్టడానికి తానొక రవికిరణమై జగన్మాత విరాజిల్లుచున్నది గనుకనే ఆ తల్లి *జరాధ్వాంతరవిప్రభా* యను నామము కలిగియున్నది. ఈ సందర్భంలోనే ఆదిశంకరులు సౌందర్యలహరిలో ఇలా అన్నారు:

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*సేకరణ*


*పూర్తిగా చదివితే ఆదిశంకరులు ఏమి చెప్పారో అర్థమవుతుంది*


 

*నరం వర్షీయాంసం - నయనవిరసం నర్మసు జడం*


*తవాపాంగాలోకే - పతితమనుధావంతి శతశః |*


*గలద్వేణీబంధాః - కుచకలశ విస్త్రిస్త సిచయా*


*హటాత్ త్రుట్యత్కాంచ్యో - విగలిత దుకూలా యువతయః॥*


దేవి కటాక్షమహిమా వైభవం వలన ఎంతటి వికారరూపుడైన ముదుసలి కూడా సుందరాంగులను మోహింపజేయగలడు.


*భావము:*

అమ్మా..నీ కృపాకటాక్ష వీక్షణం అపూర్వము కదా తల్లీ..ఏ పురుషునిపై నీ కరుణ దృష్టి ప్రసరిస్తుందో అతను వయసుడిగిన ముసలివాడైననూ, కనుచూపు మందగించి కన్నులకు పుసులు కట్టి అందవిహీనముగా ఉన్నా, కామ కళా చతుర పరిహాస నర్మభాషణములందు మూఢుడే అయినా వాడు నీ కడగంటి చూపుల కారుణ్యమునకు పాత్రుడగుటచే అతనిలో మన్మథుని దర్శించి మధవతులైన జవ్వనపు నవ యవ్వనవతులు వందలాదిగా అతని చుట్టూ గుమిగూడి, తమ జడముడులు కురులు విడిపోతున్నా పయోధరములపై పయ్యెదలు తొలగిపోవుచున్నా, తమ నడుముకి ఉన్న రతనాల మొలనూల్లు క్రిందకి జారిపోతున్నా తాము కట్టుకున్న వలువలు విడివడి ఊడిపోవుచున్నా వడివడిగా బిరబిర పరుగులిడి వచ్చి, బిడియము వీడి తమను స్వీకరించమని నీ దయాభిషిక్తుని వెనుక వెంటబడుచుందురు.


అమ్మవారి కడగంటి చూపు ఎంత మహత్తరమైన ప్రభావం కలదో శ్రీశంకరులు చమత్కారంగా చెబుతున్నారు.


*నరం వర్షీయాంసం* అంటే బాగా వయసు మీదబడ్డ ముసలివా డయిన మనిషి.


*నరం నయనవిరసం* అంటే కళ్ళకు ఏమాత్రం ఇంపుగా లేని ఆకారం కలవాడైన మనిషి.


*నరం నర్మసు జడం* అంటే వఠ్ఠి మందబుధ్ధి, ఓ సరసం చట్టుబండలూ తెలియని మానవుడు. ఇలాంటి వాడిని ఎవరైనా మెచ్చుకుంటారా?


ఇలాంటి మగవాడిని ఏయువతి ఐనా కన్నెత్తి చూస్తుందా?


ఒక్కనాటికీ అలా ఏ యువతీ కూడా చేయదు.


*అపాంగం* అంటే క్రీగంటి చూపు అని అర్థం. *ఆలోకనం* అంటే చూడటం. తవ + అపాంగే + ఆలోకే -> తవాపాంగేలోకే అంటె అమ్మా నీ యొక్క కడగంటి చూపు అని ప్రస్తావిస్తున్నారు ఇక్కడ.


*తవాపాంగేలోకే పతితమ్‌* అంటే ఏ పురుషుడి మీద ఐతే అమ్మా నీ‌ యొక్క కడగంటి చూపు పడిందో వాడు అని, వాడికి పట్టే అదృష్టాన్ని వర్ణిస్తున్నారు.


ఏమిటట వాడికి పట్టే అదృష్టం?  వాడు ఎంతగా పనికిమాలిన వాడైనా సరే,  అంటే చీకు ముసలాడైనా, కురూపి ఐనా, మందబుధ్ధి ఐనా సరే, వాడిని శతశః యువతయః అనుధావంతి అని అంటున్నారు. అంటే వందలకొద్దీ అమ్మాయిలు వెంటబడి పరుగులు పెడతారట వాడి కోసం. ఎందుకు? వాడికి అమ్మ కడగంటి చూపుల దయ దొరికిన కారణంగా.


ఆ వెంటబడటం కూడా ఏలాగనుకున్నారు?


*గలద్వేణీ బంధః* అనగా  జుట్టుముడి జారిపోతున్న వాళ్ళూగానూ,


*కుచకలశ విస్రస్త సిచయా* అనగా గుండెలనుండి పైటలు జారిపోతున్న వాళ్ళు గానూ,


*హఠాత్ తృట్యత్ కాంచ్యః* అనగా  హఠాత్తుగా మొలనూలు జరిపోతున్నవాళ్ళు గానూ


*విగళిత దుకూలాః* అనగా కట్టుబట్టలు ఊడిపోతున్నవాళ్ళుగానూ


ఆ మహానుభావుడి వెంట *శతశః* అంటే వందలమంది అమ్మాయిలు పరుగులు తీస్తూ వెంబడిస్తారట.


అదీ అమ్మవారి కడగంటి చూపు ఒక్కటి దక్కితే ఎంత ఘనమైన జగన్మోహనత్వం కలుగుతుందో ఎలాంటివాడికైనా అని శ్రీశంకరులు అనటం.


ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం‌ ప్రస్తావించాలి.  ఒకప్పుడు విశ్వనాథ సత్యనారాయణగారు అందరికీ అక్షరాలు వచ్చాయి కాని అందరూ చదువరులు కారు అన్నట్లుగా వ్యాఖ్యానించారు ఏదో సందర్భంలో.  ఇక్కడ ఈ‌ శ్లోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే రకరకాలుగా అర్థాలు తీసే ప్రమాదం ఉంది చదువరుల్లో కొందరు.  ఇలా ఒకే శ్లోకం లేదా ఒకే మాట జనంలో రకరకాలు అర్థం కావటానికి కారణం అధికార బేధం. ఈ‌ అధికార బేధం అనేది జన్మజన్మాంతరాలుగా సంపాదించుకొన్నదీ, ఈ‌ జన్మలో మనం మెఱుగు దిద్దుకుంటున్నదీ ఐన సంస్కారపు తీరుతెన్నులను బట్టి వస్తుంది. అదెలాగూ అంటే చూడండి.


అనధికారులుగా ఉన్నవాళ్ళు ఈ‌ శ్లోకం చదివి, చూసారా మీరేమో ఆ శంకరాచార్యులను ఇంతవారూ‌ అంతవారూ అంటారు, గొప్ప విజ్ఞానీ, వేదాంతీ అంటారు. అలాంటి వాడు ఇంత పచ్చి శృంగారవర్ణనతో వ్రాయటం ఏమిటీ అదీ‌ అమ్మవారి మిష పెట్టి? ఇదంతా చూస్తే ఈ వేదంతమూ వగైరా అంతా డొల్ల - పైపై మాటలే.  తలలు బోడులైన తలపులు బోడులా అన్నట్లు ఈయన తలలో చాలా పైత్యం ఉందీ‌ అని హేళన చేస్తారు.  దానికి కారణం? వాళ్ళకు శ్లోకంలో *ముక్కస్య ముక్కార్థః* అన్నట్లుగా అన్వయం చూసుకొని అదే దానికి నిజమైన అర్థం అనుకుని అక్కడే ఆగిపోవటం.  అంతే కాదు. వాళ్ళలో చాలా మంది విమర్శించటానికి నోరు చేసుకుందుకు ఎక్కడ సందు దొరుకుతుందా అని రంధ్రాన్వేషణ చేయటం కోసమే చదవటం మరొక ముఖ్యకారణం. వీళ్ళకి శ్లోకంలో మరేదన్నా అంతరార్థం ఉందా అన్నది పట్టదు. ఒక వేళ ఎవరన్నా సూచించినా బుధ్ధికి ఎక్కదు.  వీళ్ళతో‌ సమయం వృధా చేసుకోకూడదు.


అల్పాధికారులు కొందరుంటారు.  వాళ్ళూ శ్లోకంలో ప్రతిపదార్థం మాత్రమే గ్రహిస్తారు. విస్మయం చెందుతారు. ఓహో ఈ‌ శ్లోకం వలన స్త్రీవశ్యం లాంటి ప్రయోజనాలున్నాయన్న మాట అనుకుంటారు. వాళ్ళలో కొందరికి ఇలాంటీ అవసరాలు తోచవచ్చును.  వాళ్ళు ఇంక అటువంటి కోరికలతో శ్లోకాన్ని పారాయణం చేస్తారు. గీతలో భగవంతుడు చెప్పిన అర్థార్థులు వీరు. వీళ్ళకి లభించే ఫలితం స్వల్పమే. ఎందుకంటే వీళ్ళు చిత్తశుధ్ధితో శ్లోకాన్ని అవగతం చేసుకోలేదు కాబట్టి.


మధ్యమాధికారుల సంగతి. వీళ్ళకు శ్లోకంలో ఏదో‌ సంకేతికార్థం ఉండవచ్చును అనిపిస్తుంది. శంకరులు వెఱ్ఱివారా కేవలం‌ శృంగారదృష్టితో వ్రాయటానికి? అందుచేత సరైన అర్థం కోసం ఆరాటపడతారు. వారి సహజమైన భక్తిప్రపత్తుల కారణంగా సరిగా అర్థం చేసుకొనటానికి మరింత శ్రమిస్తారు. ఎవరైనా ఉత్తమాధికారులు అటువంటి సాంకేతికమైన సమధానంతో శ్లోకాన్ని అన్వయం చేస్తే ఆనందిస్తారు. 


ఉత్తమాధికారులు కొందరు. వారి సంఖ్య స్వల్పంగా ఉంటుంది. వారు పూర్వజన్మ సుకృతం కారణంగా ఈ శ్లోకంలో ఉన్న విషయాన్ని సరైన దృక్పధంతో అర్థంచేసుకో గలరు. వారు అమ్మవారిని గురించి శ్రీశంకరులు ఇలా ఎందుకు చెప్పారు అని విస్మయపడరు. మనలా పైపై అర్థం వారిని భ్రమపెట్టలేదు కాబట్టి. వీరు ఇతరులకు దిశానిర్దేశం చేయగలరు. ఇలాంటి వారి గురించే స్వయం తీర్ణః పరాం స్తారయతి అని చెప్పారు.


ఇప్పుడు ఈ‌ శ్లోకాన్ని మరింత నిశితంగా పరిశీలిద్దాం. మూడు రకాలైనా అసమర్థులను గురించి ప్రస్తావిస్తూ శ్లోకారంభం చేసారు.  వయస్సుచేత సామాజికంగా వెనుకబాటు తనానికి గురౌతున్నవాళ్ళనీ,  లోకం కంటికి ఆనని వాళ్ళనీ, మాటకారి తనం లేక ఈ లోకంలో నెగ్గుకుని రాలేకపోతున్న వాళ్ళనీ‌ ప్రస్తావించారు.


వయసులో ఎంత వెలుగు వెలిగినా, వయసుడిగి, ఆర్జన కరువై, ఇతరుల సహాయం మీద ఆధారపడ్డవారిని ఈ లోకం ఇప్పుడే కాదు ఆ శ్రీశంకరుల రోజుల్లోనూ‌ లోకువగానే చూసేది మరి.  భజగోవింద శ్లోకాల్లో, యావద్విత్తో పార్జనసక్త: తావన్నిజ పరివారో రక్త:। పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపీ న పృఛ్ఛతి గేహే అని చెప్పారు కదా? ఇంట్లో పడి ఉన్న ముసలాణ్ణి ఎవరు పట్టించుకుంటారూ అని!  వీళ్ళకి దేవుడే దిక్కు.


లోకం కంటికి ఆనకపోవటం అనేది ముఖ్యంగా ఆ వ్యక్తి వయస్సూ, వర్చస్సూ, సామాజికస్థితిగతులూ వగైరా సంతతుల మీద ఆధారపడి ఉంటుంది అని అందరూ ఒప్పుకుంటారు. సామాజికగౌరవం అనేది కేవలం ప్రతిభమీదనే లభించే అవకాశం తక్కువే. అలాంటి గౌరవం నోచుకోని వారికి భగవంతుడే సహాయం చేయాలి.


కొందరికి వయస్సూ ఉంటుంది. సామాజికంగా అన్ని ఆనుకూలతలూ ఉంటాయి. కాని ఏమీ మాటకారి తనం ఉండదు. పెళుసుమాటలో, నంగిమాటలో, సభాపిరికితనమో వీరిని జనామోదం పొందకుండా అడ్డుపడతాయి. ఇందులో చాలామందికి ఆ సమస్యను అధిగమించే దారి కనబడదు. వారికి కూడా భగవత్సహాయం అవసరమే.


*శ్రీశంకరులు ఇలా ఏ కారణంగా జనామోదానికి దూరం అవుతున్నా సరే, అమ్మని వేడుకోండయ్యా అని సలహా ఇస్తున్నారు. ఆవిడ వాడి కేసి తిరిగి ఏమీ చేయనక్కర లేదు.  కేవలం ఒక్క సారి కడగంటితో చూస్తే చాలు వాడి వెంట సమాజం అంతా సమ్మోహితులై వెంటబడి మరీ గౌరవాదరాలలో ముంచెత్తుతారు అని నొక్కి చెబుతున్నారు. ఇలా లోకసమ్మోహనశక్తిని అమ్మ కడగంటి చూపు అనుగ్రహించటం అన్న దాంట్లొ సమ్మోహనం అన్న మాటమీద శృంగారపరమైన విస్తృతి కల్పిస్తూ, ఒక అసమర్థుడైన వాడి వెంట అమ్మ అనుగ్రహం స్త్రీజనాన్ని పరుగులు పెట్టించటం అనే ఉదాహరణగా చెప్పారు అంతే*


అమ్మ కడగంటి చూపు అంత శక్తిమంతమైనదా అని ఎవరికైన సంశయం ఉంటే ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి నోట అక్షరమ్ముక్క లేని ఒక కుర్రవాణ్ణి అమ్మ క్రీగంటి చూపు మహాకవి కాళిదాసు అనే కవికుల గురువును చేసిన సంగతిని.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


ముసలితనం ఎవరికీ శాపం కాదు. అది జీవితమనే పుస్తకాన్ని చదివి, జీవితమంటే ఏమిటో సవివరంగా అందరికీ తెలియజేయడానికి మాత్రమే.


ముసలితనం అనేది బాధ్యతలు తీరిపోయిన అవస్థ. ఏమైనా చేద్దామన్నా వద్దనేవారే ఉంటారు. అంతవరకూ జీవితంలో పరమాత్మను స్మరించడం జరగకపోతే కనీసం ఈ అవస్థలోనైనా పరమాత్మని మనసారా స్మరించుకునే అవకాశం.


తనకు సద్గతులు కలగాలన్నా, తెలిసిగాని, తెలియక గాని చేసిన పాపకర్మల ఫలముల దోషప్రభావంతగ్గాలన్నా, రోగములావహించకుండా, అనాయాస మరణం సంభవించాలంటే జగన్మాత నామస్మరణ ఒక్కటే శరణ్యం. గనుక జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం జరాధ్వాంతరవిప్రభాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.



*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*408వ నామ మంత్రము*  6.9.2021


*ఓం శివంకర్యై నమః* 


తన భక్తులకు మంగళమగు బ్రహ్మత్వమును కలిగించు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శివంకరీ* యను నాలుగక్షరముల నామ మంత్రమును *ఓం శివంకర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి వారి జీవనమంతయు మంగళమయముగా చేయును మరియు శాంతిసౌఖ్యమయమైన జీవనము కలుగునట్లు అనుగ్రహించును.


జగన్మాత తన భక్తుని మంగళకరుడైన శివరూపునిగా జేయును. తన భక్తులయొక్క అజ్ఞాన (అవిద్యా) పాశములను విడగొట్టి వారికి ఏ బ్రహ్మస్వరూపము గలదో ఆ బ్రహ్మ స్వరూపమును అనుగ్రహించును. భక్తుడు జ్ఞానస్వరూపుడై తనను తాను పరబ్రహ్మ స్వరూపునిగా భావించును. అట్లు తనను తాను పరబ్రహ్మస్వరూపునిగా భావించిన అతడు బ్రహ్మత్వ సిద్ధిని పొందుతాడు.  ఇది అంతయు అంతః పూజయే. అంతః పూజ చేసిన సాధకునికి కోరిన కోరికలు అప్రయత్నంగా నెరవేరుతాయి. సాధకునిలో అజ్ఞాన తిమిరములు పోయి జ్ఞానజ్యోతులతో ప్రకాశవంతుడౌతాడు. సాధకులకు సర్వము శుభమయము చేస్తుంది. శివుడు అంటేనే మంగళ స్వరూపుడు గనుక శివస్వరూపము దాల్చిన సాధకుడు మంగళస్వరూపుడౌతాడు. అంతటితో సాధకుడు ఆత్మానందానుభూతిని పొందుతాడు.  శివసాయుజ్యము లభింపజేస్తుంది ఆ పరమేశ్వరి.  తన భక్తులలో శివత్వము ప్రసాదించి మంగళస్వరూపులుగా జేస్తుంది గనుక అమ్మవారు *శివంకరీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శివంకర్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: