6, సెప్టెంబర్ 2021, సోమవారం

కినుక -- కానుక

 డా. దేవులపల్లి పద్మజ

విశాఖపట్టణము

ఫోను 9849692414


కినుక -- కానుక



సాయంత్రం 6గంటలకి ఆఫీసు నుంచి రాగానే తన మనసులో మాట చెప్పాడు రామం. ఆలోచించు వసుధా....నీ కష్టం కొంతైనా తగ్గుతుంది ఇలా చేస్తే.. ఎలా చేస్తే? అంటూ రెట్టించింది వసుధ. అంటే వినలేదనమాట అని లోపలే అనుకుంటూ.. అదే వాయిదాల పధ్ధతి లో వాషింగ్ మిషన్ కొనుక్కుని ఈ సంవత్సరం పెళ్ళి రోజు గుర్తుగా బట్టలు ఏదో మామూలుగా వేసుకునేవాటితో సరిపెట్టేద్దాం...ఏం..సరేనా అన్నాడు రామం.


     అదేమిటంటే మరి ఇది మన పదవ పెళ్ళి రోజు కదా. ఎప్పటికి మిగిలిపోయే అనుభూతులు ఉండాలని పట్టు చీర అడిగాను..పోనీండి కుదరకపోతే. బట్టలు ఉతకడం, ఇల్లు ఊడ్చడం నాకు అలవాటైన పనే కదా! అంటూ సమాధానం చెప్పి , తెచ్చిన కాఫీ కప్పు చేతిలో పెట్టి వంట గదిలో కెళ్ళి ఎంతకీ బయటికి రాలేదు. వంటగదిలోనే పిల్లల చేత చదివిస్తూ పని చేసుకుంటోంది. ఏం చేస్తోందో అనుకుంటూ లోపలికి వెళ్ళి అక్కడే ఉన్న స్టూల్ మీద కూర్చుని సీరియస్ గా కూరలు తరుగుతున్న భార్యకేసి చూస్తూ పిలిచాడు... చేస్తున్న పని ఆపకుండా అతనికేసి తిరిగి ఏమిటి అంది.


ఇంట్లో పని ఎక్కువైపోయి అలసిపోతున్నావు కదా...వీలైతే రెండూ ఆలోచిద్దాం..ఈరోజు ఓ కంపెనీ వారు కొత్తగా తయారు చేసిన వాషింగ్ మిషన్ లు మార్కెట్ కి పరిచయం చేస్తూ మా ఆఫీసు కి వచ్చి, వాయిదాల పధ్ధతి లో తక్కువ మొత్తం చెల్లించి తీసుకునే అవకాశం ఇచ్చారు. మా సెక్షన్ లో ఉన్న కొంతమందికి ఆ సౌకర్యం లేని వారు అందరం కలిసి యాభైమంది ధర విషయం లో ఇంకా తగిస్తే తీసుకుంటామని అడిగాము. దానికి అంగీకరించి ఒక్కొక్కటి ఎనిమిది వేలకు ఖాయం చేసాడు..నువ్వు సంతోషంగా ఒప్పుకుంటావని నా పేరు కూడా ఇచ్చేసాను..అదీ సంగతి...కాస్త నవ్వవా? అంటూ తప్పు చేసిన వాడిలా చెవులు పట్టుకున్నాడు. తండ్రిని చూసి పాప అమ్మా ! డాడీని చూడూ అంటూ అరిచింది.


ఆ అభినయం చూసిన వసుధ గల గలా నవ్వేసింది...జత కలిపాడు రామం... మీకు ఏది మంచిదనిపిస్తే అది చేయండి. నేను ఎపుడైనా అభ్యంతరం చెప్పానా. నేను ఆలోచిస్తున్నాను...మనసులో రెండు ఫోటోలు కనపడ్డాయి పక్క పక్కనే, అంది. అలాగా ఏమిటో అవి...రామం అడిగారు. నేనూ వాయిల్ చీరలో స్టైల్ గా వాషింగ్ మిషన్ పక్కనే నిలబడినది, కంచిపట్టుచీర కట్టుకని పీట మీద కూర్చుని బట్టలు ఉతికేస్తున్నట్టూ రెండు ఫోటోలు కనపడ్డాయి...నేను మొదటి ఫోటోకే టిక్ పెట్టేసాను...అంది. హమ్మయ్యా నా మనసు తేలిక పడింది.. నిన్ను డిసప్పోయంట్ చేసానేమో అనుకున్నాను. అన్నాడు రామం. 

ఎందుకండీ అనవసర విషయాలకి అంత ప్రాధాన్యత ఇవ్వడం..వదిలేయండి..అంది. హాల్లోకి వచ్చి పేపర్ తిరగేస్తూంటే రామం ఆలోచనలు గతంలోకి వెళ్లిపోతున్నాయి కానీ కళ్ళు అక్షరాలవెంట పరిగెట్టడంలేదు.


పది సంవత్సరాల వైవాహిక జీవితం లో ఎప్పుడూ ఏదీ అడగలేదు. పరిస్థితిలకి తగినట్టుగా సర్దుకుపోతూ పరువుకి ఆత్మాభిమానానికి విలువ ఇస్తుంది..చిన్నతనం నుంచి టీచరైన తండ్రి నేర్పిన వాస్తవ పాఠాలు బాగానే నేర్చుకుంది..లేకపోతే అంతంత మాత్రం అయిన తన జీతంతో నేర్పుగా సంసారం నడుపుకొస్తోంది. ఈ దశాబ్ద కాలంలో ఓ పట్టుచీరే కదా అడిగింది. నేను తన మనసు కష్టపెట్టానేమో.. ఎలాగోలా మొదటి మొత్తం వాయిదా ఏర్పాటు చేసి తనకిష్టమైన వంగపండురంగు పట్టు చీర కూడా కొనేసి సర్పైజ్ చేయాలి ఓ నిర్ణయానికి వచ్చి గబగబా తయారై బయటికి వెళ్ళి పోయాడు. 

.

పెళ్ళి రోజు రానే వచ్చింది...ఉదయమే భర్తకి శుభాకాంక్షలు చెప్తూ చేతిలో ఓ డ్రస్ పెట్టి త్వరగా తయారవండి అంది. పిల్లలకు కొత్త బట్టలు వేసి సిధ్ధం చేసింది. రామం వచ్చేసరికి తన పెళ్ళినాటి చీర తో గుడికి వెళ్ళే ప్రయత్నం లో ఉంది. వసుధా! ఒకసారి ఇలా త్వరగా రావాలి గట్టిగా అరిచాడు. ఏమైందో అని కంగారుగా లోపలికి వెళ్ళింది. తన డ్రెసింగ్ టేబుల్ ముందు కూర్చుని వసూ ఇదిగో నాకు తెల్ల వెంట్రుకలొచ్చేసాయి. ఎలా మరి అన్నాడు. హాస్యంగా చాల్లెండి సంబరం.. ముందు దేవుడి దర్శనం చేసుకుని రావాలి రండి అంది .గది బయటికి అడుగులేస్తూ. ఆగు వసూ చేయి పట్టి ఆపి కళ్ళు మూసి, వెనుకనుంచి ఓ చీర ఆమెకి చూట్టేసాడు.. వసుధ కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యం ఆనందంతో ఎందుకండీ ఇవన్నీ అంది. అదేమిటి నువ్వు మాకు కొత్త బట్టలు ఇస్తే మేము కట్చేసుకోవాలి మారు మాట్లాడకుండా. నేను ఇస్తే నువ్వు కూడా మాట్లాడకూడదు. రామం,వసుధా పిల్లలు ఆటోలో దగ్గరలో ఉన్న శివాలయం లో దర్శనం చేసుకుని వచ్చేసారు. భర్త తెచ్చిన వంగపండు రంగు కంచి పట్టు చీర లో ముఫ్ఫై ఐదేళ్ళ వసుధ అందమైనదే.


గులాబ్ జామ్, పులిహోర మధ్యతరగతి పండగ మెనూతో భోజనం చేసి టీ వీ చూస్తుండగా కాలింగ్ బెల్ మోగింది. బాబు వెళ్లి తలుపు తీసాడు. వాషింగ్ మిషన్ తీసుకొచ్చి హాల్ లో పెట్టి, డెమోకి కంపెనీ నుంచి మనిషి వస్తాడని చెప్పి వెళ్లిపోయాడు. తన ఇష్టం, కష్టం కూడా ఆలోచించే భర్తని ఇచ్చిన భగవంతునికి మనసులోనే కృతజ్ఞతలు తెలియజేసింది వసుధారామం.. పిల్లలిద్దరూ కొత్త వస్తువుని చూసి సంబరపడుతూ దానిచుట్టూ చెక్కెర్లు కొడుతున్నారు.


సాయంత్రం రామం, వసుధని, పిల్లలని తీసుకుని షికారుకని బయటికి తీసికెల్లేడు. డాడీ పార్క్ కి వెళదామా అన్నాడు. బాబు వద్దు డాడీ సినిమాకి వెళదాము అంటోంది పాప నవ్వుతూ వాళ్ళకేసి చూసి ముగిసిపోతోంది వసుధ. ఆటో ఎక్కించి ఎపుడూ చూడని ప్రదేశం పేరు చెప్పి తీసికెళ్ళమన్నాడు రామం. ఓ పదినిమిషాల తర్వాత అక్కడ దింపేశాడు 

ఆటో అతను. జనసంచారం ఎక్కువ లేదు గానీ, దూరంగా నిర్మాణంలో ఉన్న ఇళ్ళు కనిపిస్తున్నాయి. ఏమిటి డాడీ ఇక్కడ ఏమీ బాగా లేదు ఆడుకోడానికి..ఇక్కడకి ఎందుకు తీసుకొచ్చారు అని బాబు నిరుత్సాహంగా అడుగుతున్నాడు.

ఓ నాలుగైదు వందల అడుగులు వేసాక అక్కడ ఆగమని పాపని చేయి వదిలి, షర్టు జేబులోంచి ఓ పేపర్ తీసి, భార్య చేతిలో ఉంచి ఇదిగో వసుధా! అంటూ ఆమె చేతిలో ఉంచాడు. ఏమిటిది అంటూ తీసుకుని చూసింది..ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిన రెండు వందల గజాలు వసుధారామం పేరుతో ఉన్న దస్తావేజు..ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏమిటండీ ఇదెలా వచ్చింది. ప్రశ్నలు ఒరవడి కురిపించేస్తోంది..స్వరంలో కంగారూ, ఆశ్చర్యం, ఆనందం కలగలిపేసి.



ప్రశాంతంగా విను, ఆవేశపడకు, నేనూ భారమైన పనేమీ చేయలేదు.. నా ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఓవర్ టైం చేసిన మనీ అంతా వేరే ప్రత్యేకంగా దాస్తూ వచ్చాను...ఈ పన్నెండు సంవత్సరాలలో అది పెరిగి పెద్దదై మనకి ఈ స్థలం కొనిచ్చింది..దీనిని నీ పేరుతోనే కొన్నాను...ఈ రోజు నీకు కానుకగా ఇద్దామని...నీదే ఇది, నేనూ ఇద్దరు పిల్లలు ఫ్రీ ఆఫర్ ...బాగుందా సంతోషమే కదా! అన్నాడు. ఈ కానుక ఇవ్వకపోయినా సంతోషంగా నా కుటుంబంలో నాకు ఎప్పుడూ ఆనందమే...అతని చేయి తీసుకుని అతనిచ్చిన దస్తావేజు చేతిలో పెట్టింది...అయితే నేను , మీ నుంచి ఓ మాట కోరుకుంటున్నాను..ఇస్తారా అంగీకారం.,అంది వసుధ.  



 ఏమిటో అడగండి దేవి గారూ! ఏమీలేదు ఈరోజు గుర్తు గా నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను. .. మనకి దగ్గర లో ఉన్న స్కూల్ లో ఎలిమెంటరీ పిల్లలకు టీచర్ గా నిన్ననే మాట్లాడి వచ్చాను. వచ్చే ఒకటవ తేదీ నుంచి తరగతులు ఇస్తామన్నారు... పదివేలు ఇస్తారు జీతం.. నేను ఆ మొత్తం మనం కట్టుకునే ఇంటి కోసం జమచేస్తూ ఉంటాను.మీరు సరే అంటే చేరిపోతాను వచ్చే నెలలో. తప్పకుండా వెళ్ళండి దేవి గారూ ముందుగా హృదయపూర్వక అభినందనలు కూడా అందిస్తూ, రామం సమాధానం. తనను అర్థం చేసుకునే భర్త లభిస్తే అంతకంటే ఏమి కావాలి ఇల్లాలికి. ఒకరికొకరు పరస్పర అవగాహన తో సంసారనావను లాహిరి లాహిరిలో జగమే ఊగెనుగా పాడుకుంటూ సాగిపోవడమే అనుకుంది వసుధ. చిరు చీకటి పడుతుండగా అక్కడ నుండి బయలుదేరి సినిమాకి టికెట్ 

దొరికితే చూసి, హోటల్ లో భోజనం చేసి ఇంటికి వెళ్లి సంతోషంగా దశమ వివాహ వార్షికోత్సవం జరిగింది. అని తృప్తిగా ఆ జంట మనసులో పదిలంగా రాసుకున్నారు... 


@@@@@

కామెంట్‌లు లేవు: