6, సెప్టెంబర్ 2021, సోమవారం

సంస్కృత మహాభాగవతం*

 *6.09.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఆరవ అధ్యాయము*


*బ్రహ్మాదిదేవతలు 'పరంధామమునకు విచ్చేయుము' అని శ్రీకృష్ణుని అర్థించుట - భగవానుని ఆదేశముతో ప్రభాసతీర్థమునకు వెళ్ళుటకు సిద్ధమగుచున్న యాదవులను చూచి ఉద్ధవుడు శ్రీకృష్ణుని కడకు ఏతెంచుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*6.11 (పదకొండవ శ్లోకము)*


*యశ్చింత్యతే ప్రయతపాణిభిరధ్వరాగ్నౌ త్రయ్యా నిరుక్తవిధినేశ హవిర్గృహీత్వా|*


*అధ్యాత్మయోగ ఉత యోగిభిరాత్మమాయాం 6'&ॐ జిజ్ఞాసుభిః పరమభాగవతైః పరీష్టః॥12386॥*


పరమేశ్వరా! ఋత్విక్కులు వేదోక్తవిధుల అంజలిద్వారా హవిస్సులను దీసికొని ఆహవనీయాది యజ్ఞాగ్నులయందు అర్చించు సమయమున నీ చరణకమలములను స్మరించుచుందురు. యోగులు అధ్యాత్మయోగముద్వారా నీ తత్త్వమును ఎరుంగుటకై సర్వదా నీ పాదపద్మములనే ధ్యానించుచుందురు. నీ మాయాస్వరూపమును తెలిసికొనగోరు భాగవతోత్తములు నీ పాదారవిందములనే సేవించుచుందురు. ఈ విధముగా నీ పరమభక్తులు నీ చరణకమలములనే సర్వారాధ్యములుగా భావించి వాటిని ఉపాసించుచుందురు. అట్టి నీ పాదపద్మములు, మా పాపరాశిని భస్మము చేయుగాక.


 *6.12 (పండ్రెండవ శ్లోకము)*


*పర్యుష్టయా తవ విభో వనమాలయేయం సంస్పర్ధినీ భగవతీ ప్రతిపత్నివచ్ఛ్రీః|*

యః

 *సుప్రణీతమముయార్హణమాదదన్నో భూయాత్సదాంఘ్రిరశుభాశయధూమకేతుః॥12387॥*


సర్వేశ్వరా! నీ భక్తులు ప్రేమతో నీకు వనమాలను సమర్పించుచుందురు. దానిని నీవు ఆదరముగా స్వీకరించుచుందువు. భక్తులయెడ నీకు గల వాత్సల్యమునకు ఇది తార్కాణము. పూజ్యురాలైన లక్ష్మీదేవి నీ వక్షస్థలమునందు నిత్యనపాయనియై యుండును. నీ పాదములవరకు వ్యాపించియున్న తులసీమాలను, అట్లే భక్తులపై నీకు గల వాత్సల్య వైభవములను గాంచి ఆ దేవి సవతివలె ఈర్ష్యపడుచుండును. వాస్తవముగా తులసీమాలను అర్పించుటవలననే నీ పూజ సార్థకమై నీవు ప్రసన్నుడవు అగుదువు. అట్టి నీ పాదారవిందములు మా అశుభములను రూపుమాపుగాక!


 *6.13 (పదమూడవ శ్లోకము)*


*కేతుస్త్రివిక్రమయుతస్త్రిపతత్పతాకో యస్తే భయాభయకరోఽసురదేవచమ్వోః|*


*స్వర్గాయ సాధుషు ఖలేష్వితరాయ భూమన్ పాదః పునాతు భగవన్ భజతామఘం నః॥12388॥*


పరమేశ్వరా! వామనావతారమున నీవు మూడు అడుగులతో ముల్లోకములను ఆక్రమించితివి. ఒక పాదముతో సత్యలోకమును ఆక్రమించితివి. అచట నీ పాదము నుండి జనించిన గంగాజలమలతో బ్రహ్మదేవుడు నీ పాదములను కడిగెను. ఆ గంగాజలమే త్రిలోకమల యందును ప్రవహించుచు నీ కీర్తిని సకలలోకములయందును వ్యాపింపజేయు పతాకమైనది. నీ త్రివిక్రమావతారము అసురసేనలకు భయమును కలిగించును. నీ భక్తులకును, దేవతలకును అభయమునిచ్చును. నీ చరణకమలములు సాధుపురుషలకు పరమపదప్రాప్తిని గూర్చెడి సాధనములు. కాని వీటిని అవహేళన చేసినవాడు నరకకూపములో పడిపోవును. అట్టి నీ దివ్యపాదములు మా ౌక్షైైైక్షపాపములను పారద్రోలి మమ్ములను పవిత్రులనుజేయుగాక!


 *6.14 (పదునాలుగవ శ్లోకము)*


*నస్యోతగావ ఇవ యస్య వశే భవంతి బ్రహ్మాదయస్తనుభృతో మిథురర్ద్యమానాః|*


*కాలస్య తే ప్రకృతిపూరుషయోః పరస్య శం నస్తనోతు చరణః పురుషోత్తమస్య॥12389॥*


పురుషోత్తమా! ముక్కుత్రాళ్ళువేయబడిన వృషభములు తమ యజమాని అధీనములో నుండునట్లు పిపీలికాది బ్రహ్మపర్యంతముగల దేహధారులందరును పరస్పరము బాధించుకొనుచున్నను కాలస్వరూపుడవైన నీకు వశవర్తులై యుందురు. నీవు ప్రకృతి పురుషులకును అతీతుడవు. అట్టి పరమాత్మవైన నీ యొక్క చరణకమలములు మాకు శుభములను ఒసంగుగాక!


 *6.15 (పదిహేనవ శ్లోకము)*


*అస్యాసి హేతురుదయస్థితిసంయమానామవ్యక్తజీవమహతామపి కాలమాహుః|*


*సోఽయం త్రిణాభిరఖిలాపచయే ప్రవృత్తః కాలో గభీరరయ ఉత్తమపూరుషస్త్వమ్॥12390॥*


దేవా! ఈ జగత్తుయొక్క ఉత్పత్తి స్థితి లయములకు కారణము నీవే. ఏలయన ప్రకృతి, పురుష, మహత్తత్త్వములను నియంత్రించునట్టి కాలపురుషుడవు నీవేయని వేదములు ఉద్ఘోషించుచున్నవి. శీత, గ్రీష్మ, వర్షాకాలములనెడి నాభిత్రయముతోగూడిన సంవత్సరరూపములో నీవు సకలజీవులను క్షయోన్ముఖముగా నడిపించెడి కాలపురుషుడవు. నీ గమనము గంభీరమైనది, మిక్కిలి వేగవంతమైనది. అట్టి పురుషోత్తముడవైన నీ చరణకమలములకు నమస్కారము.


 *6.16 (పదహారవ శ్లోకము)*


*త్వత్తః పుమాన్ సమధిగమ్య యయా స్వవీర్యం ధత్తే మహాంతమివ గర్భమమోఘవీర్యః|*


*సోఽయం తయానుగత ఆత్మన ఆండకోశం హైమం ససర్జ బహిరావరణైరుపేతమ్॥12391॥*


స్వామీ! సూత్రాత్ముడు, హిరణ్యగర్భుడు ఐన పురుషుడు నీ అమోఘమైన తేజస్సును పొంది, దాని ప్రభావమున మహత్తత్ప్వమును ధరించెను. హిరణ్యగర్భుడైన ఆ బ్రహ్మయే మాయతోగూడి, 'పృథ్వి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తత్త్వము' అను ఏడు ఆవరణములుగల సువర్ణమయమైన బ్రహ్మాండమును రచించెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: