7, సెప్టెంబర్ 2021, మంగళవారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*పెరుగుపల్లి గోవిందమ్మ..*


"స్వామికి బియ్యం తీసుకొచ్చాను.." అంటూ పాతిక కేజీ ల బరువుండే బియ్యపు బస్తాను స్వయంగా మోసుకొచ్చి మందిరం లో పెట్టేవారు గోవిందమ్మ..ఆవిడ వయసు అరవై ఏళ్ల పై మాటే..సింగరాయకొండ వాస్తవ్యురాలు..పెరుగుపల్లి గోవిందమ్మ గా అందరూ పిలిచేవారు..సౌమ్యంగా..చిరునవ్వుతో..అత్యంత వినయంగా వుంటూ..బియ్యం తో పాటు తులసి తో కట్టిన మాల, మల్లెపూల దండ తీసుకొని..ప్రతి నెలలో రెండుసార్లు మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి దర్శనానికి తప్పకుండా వచ్చేవారు..తాను తెచ్చిన తులసి మాల, మల్లెపూల దండ ను శ్రీ స్వామివారి విగ్రహానికి అర్చక స్వామి అలంకరిస్తే..ఎంతో సంతోషించేవారు..ఆ నిమిషం లో ఆవిడ ముఖం లో కొండంత తృప్తి కనిపించేది..


గోవిందమ్మ గారికి ముగ్గురు సంతానం..ఇద్దరు కుమారులు..ఒక కుమార్తె..పిల్లలు చిన్నవయసులో ఉన్నప్పుడే భర్త అకాలమరణం పాలయ్యారు..చిన్న పిల్లలను పోషించే భారం ఆవిడ మీద పడింది..మొదటి నుంచీ మొగలిచెర్ల లో సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామివారి మీద అచంచల భక్తి విశ్వాసాలు కలిగిన గోవిందమ్మ గారు..ఆ స్వామివారినే నమ్ముకొన్నారు..అంతవరకూ భర్త నిర్వహిస్తున్న రేషన్ దుకాణాన్ని తాను నిర్వహించ సాగారు..గోవిందమ్మ గారికి చదువు లేదు..పిల్లలకు మాత్రం మంచి చదువులే చదివించారు..క్రమం తప్పకుండా శ్రీ స్వామివారి సమాధి ని దర్శించుకొని..ఆ స్వామివారికే తన కష్ట సుఖాలు విన్నవించుకునే వారు..


గోవిందమ్మ గారి కుమారులిద్దరూ ఉద్యోగాల్లో చేరారు..ఒక కుమారుడు అమెరికా లో ఉంటున్నాడు..మరో కుమారుడు బెంగుళూరు లో స్థిర పడ్డాడు..కూతురికి వివాహం చేశారు..అన్ని భాధ్యతలూ తీరిన తరువాత..గోవిందమ్మ గారు మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి వద్దకు నెలలో మూడు నాలుగు సార్లు వచ్చి వెళ్లే వారు..ఎప్పుడైనా గోవిందమ్మ గారు రావడం ఆలస్యం అయితే.."ఈవారం గోవిందమ్మ గారు ఇంకా రాలేదా?.." అని మాలో మేము విచారించుకునే వాళ్ళం..


"ఎన్నడూ నేను ఇబ్బంది పడలేదు..ఏ కష్టం వచ్చినా ..స్వామివారే క్షణాల్లో తీర్చేవారు..నాకు బాధ్యతలన్నీ తీరిపోయాయి అని ఆ స్వామిని మర్చిపోతానా..ఇప్పుడు నాకు ఖాళీ సమయం ఎక్కువగా ఉన్నది కనుక, తరచూ ఇక్కడికి వస్తున్నాను.." అనేవారు..చిత్రమేమిటంటే..ఏమీ చదువుకోకుండా..అమాయకంగా వుండే గోవిందమ్మ గారు..అమెరికాలో ఉన్న కుమారుడి వద్దకు ఒక్కతీ వెళ్లి వచ్చేవారు..


"అమ్మా..మీకు ఎక్కడా ఇబ్బంది కలుగలేదా?..మధ్యలో విమానం కూడా మారాలి కదా?..మరి భాషా సమస్య ఎదురు కాలేదా?..ఎలా వెళ్లగలిగారు?.." అని అడిగితే..పెద్దగా నవ్వేవారు.."నాలుగైదు సార్లు వెళ్లానయ్యా..ఎప్పుడూ ఎటువంటి ఇబ్బందీ కలుగలేదు..విమానం మారేటప్పుడు..ఆ స్వామే ఎవరో ఒకరిని తోడు చేసేవారు..వాళ్ళు నన్ను నేను ఎక్కాల్సిన విమానం లో కూర్చోబెట్టేవారు.." అని భక్తిగా చెప్పేవారు..ఆవిడ తాను చేస్తున్న ప్రతి పనిలోనూ శ్రీ స్వామివారినే చూసేవారు..మొగలిచెర్ల లోని మందిరానికి వచ్చినా..తనపాటికి తాను ప్రదక్షిణాలు చేసి..సమాధి దర్శనం చేసుకొని..ఒక ప్రక్కగా ఒదిగి కూర్చునేవారు..నిరంతరం శ్రీ స్వామివారి నామ స్మరణే..వేరే ఏ విషయాలూ ఆవిడకు పట్టేవి కాదు..ఆరోగ్యం బాగా లేక పోయినా..కూతురు వారిస్తున్నా..అలానే మొగలిచెర్ల కు బస్ లో వచ్చి..శ్రీ స్వామివారి దర్శనం చేసుకునే వారు..


సుమారు ఒకటిన్నర సంవత్సరం క్రితం గోవిందమ్మ గారు మరణించారు..చివరి క్షణం వరకూ శ్రీ స్వామివారినే స్మరిస్తూ గడిపిన గోవిందమ్మ గారు నిజంగా ధన్యజీవి..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: