7, సెప్టెంబర్ 2021, మంగళవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*409వ నామ మంత్రము* 7.9.2021


*ఓం శివప్రియాయై నమః*


శివునికి ప్రియమును చేకూర్చునటువంటి పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శివప్రియా* యను నాలుగక్షరముల నామ మంత్రమును *ఓం శివప్రియాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులను ఆ తల్లి చక్కని ప్రియకరమైన భాషణము కలవారిగను, ప్రియవచనములతో అందరి మనసులను ఆకట్టుకొనువారిగను ప్రవర్తింపజేసి కీర్తిప్రతిష్టలతోబాటు సిరిసంపదలు, జ్ఞానసంపన్నత సంప్రాప్తమగునట్లు అనుగ్రహించును.


పరమేశ్వరి పార్వతిగా కఠోరమైన తపమునొనరించి, పరమేశ్వరునికి ప్రియము కలిగించి పరిణయమాడినది. పరమేశ్వరుడే మహా అందగాడైతే, తానేమీ తీసిపోనట్లు త్రిభువనసుందరియై శివుని తన ప్రియుడుగా పొందినది. ఆయన మనసుకొల్లగొట్టి, పరమేశ్వరుని వామభాగం తనదిగా చేసుకొన్నది. కామేశ్వరుని ఓరగంటచూచుచు, మందహాసచంద్రికలను ఆయనపై రువ్వుచూ, ప్రియవచనములు పలుకుచూ మెల్లగా ఆయన వామాంకమునధిష్ఠించినది. ఆయన మంగళకరుడు అయితే, ఈమె సర్వమంగళ. ఎవరికి ఎవరూ తీసిపోనంత భక్తపరాధీనులు. శివుడు తన ప్రియుడే కాదు. తన ఉపాసకుడై, శ్రీవిద్యోపాసకు డనిపించుకున్నాడు. లోక కల్యాణమునకై క్షీరసాగర మథనమప్పుడు వెలువడిన పరమభయంకరమైన హాలాహలాన్ని గ్రోలించి, శివుడు తన ప్రియుడనియు, తన మాట జవదాటడనియు అనిపించుకొనినది. 


శ్రీచక్రంలోని నాలుగు సమద్విబాహు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి శివుణ్ణి లేదా పురుష శక్తిని సూచిస్తాయి. అయిదు సమద్విబాహు త్రిభుజాలు నిమ్నముఖంగా ఉండి శక్తిని లేదా స్త్రీని సూచించడమే గాక శ్రీచక్రము శివశక్త్యైక్యమును మాత్రమేగాక, శివుడే పార్వతి, పార్వతియే శివుడు వారిరువురు ఆదిదంపతులు అన్న మాట ఆర్యోక్తి అయినది. కాబట్టి జగన్మాత శివప్రియా యని అనబడినది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం శివప్రియాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: