7, సెప్టెంబర్ 2021, మంగళవారం

సంస్కృత మహాభాగవతం

 *7.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఆరవ అధ్యాయము*


*బ్రహ్మాదిదేవతలు 'పరంధామమునకు విచ్చేయుము' అని శ్రీకృష్ణుని అర్థించుట - భగవానుని ఆదేశముతో ప్రభాసతీర్థమునకు వెళ్ళుటకు సిద్ధమగుచున్న యాదవులను చూచి ఉద్ధవుడు శ్రీకృష్ణుని కడకు ఏతెంచుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*6.17 (పదిహేడవ శ్లోకము)*


*తత్తస్థుషశ్చ జగతశ్చ భవానధీశో యన్మాయయోత్థగుణవిక్రియయోపనీతాన్|*


*అర్థాంజుషన్నపి హృషీకపతే న లిప్తో యేఽన్యే స్వతః పరిహృతాదపి బిభ్యతి స్మ॥12392॥*


హృషీకేశా! స్థావరజంగమాత్మకమైన ఈ జగత్తునకు నీవు అధీశుడవు. మాయయొక్క గుణముల సంక్షోభము వలన ఈ జగత్తు ఉత్పన్నమైనది. నీవు ఇంద్రియములకు స్వామివి. జీవాత్మగా నీవు ఆ ఇంద్రియార్థములను అనుభవించుచున్నను వాటిచే లిప్తుడవుగావు (ఆ ఫలితములు నిన్ను అంటవు). కానీ, స్వయముగా ఆ భోగములను (ఇంద్రియ సుఖములను) త్యజించిన యోగులుగూడ విషయములకు సంబంధించిన పూర్వసంస్కారములకు భయపడుచుందురు.


*6.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*స్మాయావలోకలవదర్శితభావహారిభ్రూమండలప్రహితసౌరతమంత్రశౌండైః|*


*పత్న్యస్తు షోడశసహస్రమనంగబాణైర్యస్యేంద్రియం విమథితుం కరణైర్న విభ్వ్యః॥12393॥*


ప్రభూ! నీ పదునారువేలమంది పత్నులు చిరునవ్వులొలికించుచు, తమ కటాక్షవీక్షణములచే మనోహరములైన హావభావములతోను, సురతాలాపములతోను తమ కామబాణములను నీపై ఎంతగా ప్రయోగించినను అవి నీ ఇంద్రియములను మథించుటద్వారా వశపరచుకొనటకు ఏమాత్రమూ సమర్థములు కావు.


*6.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*విభ్వ్యస్తవామృతకథోదవహాస్త్రిలోక్యాః పాదావనేజసరితః శమలాని హంతుమ్|*॥


*ఆనుశ్రవం శ్రుతిభిరంఘ్రిజమంగసంగైస్తీర్థద్వయం శుచిషదస్త ఉపస్పృశంతి॥12394॥*


నీ వలన ప్రభవించిన రెండు పవిత్రనదులు ముల్లోకములయందలి పాపములను అన్నింటిని పూర్తిగా ప్రక్షాళనమొనర్చుటకు సమర్థములు. వాటిలో ఒకటి నీ కథామృతమనెడి నది. దానిని నిరంతరము చెవులార గ్రోలెడివారి హృదయములు పునీతములగును. రెండవది నీ పాదములనుండి ప్రభవించిన గంగానది. అందు స్నానమొనర్చిన వారు పవిత్రులగుదురు. పవిత్రములైన ఈ రెండు నదులను పుణ్యాత్ములైన సజ్జనులు ఎల్లప్పుడును సేవించుచు ఇహపరలాభములను పొందుచుందురు" అనుచు దేవతలు పరమాత్ముని స్తుతించిరి.


*బాదరాయణిరువాచ*


*6.20 (ఇరువదియవ శ్లోకము)*


*ఇత్యభిష్టూయ విబుధైః సేశః శతధృతిర్హరిమ్|*


*అభ్యభాషత గోవిందం ప్రణమ్యాంబరమాశ్రితః॥12395॥*


*శ్రీశుకుడు వచించెను* పరీక్షిన్మహారాజా! పరమశివుదు, బ్రహ్మదేవుడు, తదితర దేవతలు శ్రీహరిని ఇట్లు స్తుతించిన పిమ్మట వారు ఆ స్వామికి ప్రణమిల్లి ఆకాశమున నిలిచిరి. అంతట బ్రహ్మ శ్రీకృష్ణునకు ఇట్లు విన్నవించెను.


*బ్రహ్మోవాచ*


*6.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*భూమేర్భారావతారాయ పురా విజ్ఞాపితః ప్రభో|*


*త్వమస్మాభిరశేషాత్మంస్తత్తథైవోపపాదితమ్॥12396॥*


*బ్రహ్మదేవుడు పలికెను* "సర్వాంతర్యామివైన ఓ ప్రభూ! భూభారమును తొలగించుటకై ఈ లోకమున అవతరింపుమని ఇదివరలో మేము నీకు విన్నవించి యుంటిమి. నీవు మా ప్రార్థనను మన్నించి, యథోచితముగా మా అభ్యర్థనను పూర్తిచేసితివి.


*6.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*ధర్మశ్చ స్థాపితః సత్సు సత్యసంధేషు వై త్వయా|*


*కీర్తిశ్చ దిక్షు విక్షిప్తా సర్వలోకమలాపహా॥12397॥*


సత్యసంధులైన సత్పురుషుల పరిరక్షణమునకై నీవు ధర్మస్థాపన మొనర్చుటవలన నీ కీర్తి దిగంతములవరకును వ్యాపించినది. నీ దివ్యలీలలను కీర్తించుటవలనను, వినుటవలనను జనుల మనోమాలిన్యములు పూర్తిగా క్షాళితములైపోవును.


*6.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*అవతీర్య యదోర్వంశే బిభ్రద్రూపమనుత్తమమ్|*


*కర్మాణ్యుద్దామవృత్తాని హితాయ జగతోఽకృథాః॥12398॥*


*6.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*యాని తే చరితానీశ మనుష్యాః సాధవః కలౌ|*


*శృణ్వంతః కీర్తయంతశ్చ తరిష్యంత్యంజసా తమః॥12399॥*


మహాత్మా! నీవు సర్వోత్తమమైన దివ్యరూపముతో యదువంశమున అవతరించితివి. లోకకల్యాణమునకై అద్భుతములైన ఘనకార్యములను ఆచరించితివి. సర్వేశ్వరా! కలియుగమునందలి జనులు నీ దివ్యలీలామృతమును తనివిదీర గ్రోలుదురు. వాటిని పారవశ్యముతో కీర్తింతురు. వారు అజ్ఞానాంధకారమునుండి బయటపడి తరింతురు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: