7, సెప్టెంబర్ 2021, మంగళవారం

హేమహస్తి

 నిన్న హిరణ్యరథదానం వరకు తెలుసుకొన్నాం, నేడు హేమహస్తి నుండి తెలుసుకొందాం.

-------------------


(9) హేమహస్తి మహదానం > హేమం అంటే బంగారం, హస్తి అనగా ఏనుగు. బంగారంతో ఏనుగుశిల్పాలను తయారుచేసి అర్హులైన పురోహిత, పండిత, బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, చండాలురకు దానం చేయడమేనని నా అభిప్రాయం.


(10) హేమలాంగుల మహదానం > లాంగులి అంటే నాగలి, మడక. వ్యవసాయానికి ప్రధానమైంది నాగలే కదా! బంజరు భూములను అటవీభూములను ఉషరక్షేత్రాలు మొదలైన భూములను వినియోగంలోనికి తెచ్చి వ్యవసాయాభివృద్ధి చేయడం పాలకుని లక్షణం. అందుకే బంగారుతో నాగలి శిల్పాలు తయారుచేసి, ఏరువాకరోజున అర్హులైన కర్షకులకు దానం చేయడమే హేమలాంగుల దానమని నా ఊహ.


(11) పంచలాంగుల దానం > ఇది కూడా పైలాంటిదే, కాకపోతే స్వర్ణంతోపాటు వెండి, పంచలోహాలు, ఇనుము, కర్రలతో నాగళ్ళను తయారుచేసి మంత్రోక్తంగా పంచవర్ణాలకు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, చండాలర జాతులకు దానం చేయడం. ఈ దానం ముఖ్యవుద్దేశ్యమని నా భావన. 


(12) విశ్వచక్ర మహాదానం > చరిత్రలో క్రింది శ్లోకం విశ్వచక్ర మహదానం గురించి చెప్పబడింది.


"సమగ్రహారాన్ దదతోహాగ్రహార దానాం కియద్యస్య వదాన్యమౌలే: 

కింవా బహ్వచ్యఖిల విశ్వచక్ర బ్రహ్మండ దాతు: కి మదేయమస్తి: "


 ఇమ్మడి నృసింహదేవరాయలు ఈ శాసనం (1505 ACE)లో విశ్వచక్ర దానం గురించి మాత్రమే ప్రస్తావించడం జరిగింది. దానపద్ధతి,వివరాలు లేవు. బహుశా వైష్ణవ అగ్రహారీకులకో, శ్రోత్రియందారులకో భూములనో అగ్రహారాలనో దానం చేయడమని భావించాల్సి వస్తోంది.


(13) కల్పలతమహాదానం > బహుశా ఇది కూడా గతంలో చెప్పుకొన్న కల్పవృక్షంలాంటిదైవుండవచ్చును. కాకపోతే పూజాపద్ధతులు క్రతువులు వేరుగా వుండవచ్చును.


(14) సప్తసాగరమహాదానం > ఏడు నుండి వేయివరకు పలముల (తులములు అనుకొందాం ) బంగారు కుండలను చేయించి, వాటిలో ఒక్కోదానిలో లవణం (ఉప్పు), పాలు, నెయ్యి, బెల్లం, పెరుగు, పంచదార, పుణ్యనదులనుండి తెచ్చిన పవిత్రజలాలను పోసి, బంగారుతో చేయబడిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, సూర్య, చంద్ర, లక్ష్మి, పార్వతి విగ్రహాలను వుంచి, కుండలను ఆభరణములతో నింపి సప్తమహసముద్రాలను ఆహ్వానించి, ఆ భాండాలను అర్హులైన పంచవర్ణాలకు దానం చేయడమే సప్తసాగర మహాదానం.


(15) రత్నధేనుమహదానం > బంగారుతో ఆవుదూడల బంగారు బొమ్మలను తయారుచేసి, ఆవు నోటిలో 81 పద్మరాగాలను, నాసికాగ్రము (ముక్కుపై) 100 పుష్పరాగాలను, నొసటిపై బంగారు తిలకం ధరింపచేసి, కండ్లలో 100 మౌక్తికాలను, రెండు కనుబొమలపై 100 విద్రుమములు,

రెండు చెవులకు రెండు పెద్ద మౌక్తికాలను చేర్చి, బంగారుకొమ్ములు బాగుగాచేసి, నూరువజ్రాలతో తలను అలంకరింపచేసి, మెడపై 100 వజ్రాలను, మూపుపై 100 నీలములు చేర్చి, 100 వైడూర్యములతో ప్రక్కలను అలంకరించాలి,


అదేవిధంగా ఆవుకు అలంకరించిన నవరత్నాలలోని సగభాగం వజ్రవైడూర్యాలతో దూడను అలంకరించి బ్రాహ్మణులకు, మిగిలిన చతుర్వర్ణాలకు దానంచేయడమే రత్నధేను మహాదానం.


(16) భూతఘట్టన మహదానం > ? తెలిసిన ప్రాజ్ఞులు తెలియచేస్తే సంతోషం.

(సేకరణ)

..................................................................................... జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

కామెంట్‌లు లేవు: