6, సెప్టెంబర్ 2021, సోమవారం

సంస్కృత మహాభాగవతం*

 *6.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఆరవ అధ్యాయము*


*బ్రహ్మాదిదేవతలు 'పరంధామమునకు విచ్చేయుము' అని శ్రీకృష్ణుని అర్థించుట - భగవానుని ఆదేశముతో ప్రభాసతీర్థమునకు వెళ్ళుటకు సిద్ధమగుచున్న యాదవులను చూచి ఉద్ధవుడు శ్రీకృష్ణుని కడకు ఏతెంచుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*6.6 (ఆరవ శ్లోకము)*


*స్వర్గోద్యానోపగైర్మాల్యైశ్ఛాదయంతో యుదూత్తమమ్|*


*గీర్భిశ్చిత్రపదార్థాభిస్తుష్టువుర్జగదీశ్వరమ్॥12381॥*


బ్రహ్మాదిదేవతలు స్వర్గమునగల నందనవనము, ఇతర ఉపవనములయందలి దివ్యకుసుమములతో ఆ యదువంశోత్తముని అలంకరించిరి. ఇంకను వారు చిత్రవిచిత్రములైన, అర్థవంతములగు వాక్కులతో ఆ జగదీశ్వరుని ఇట్లు ప్రస్తుతించిరి-


*దేవా ఊచుః*


*6.7 (ఏడవ శ్లోకము)*


*నతాః స్మ తే నాథ పదారవిందం బుద్ధీంద్రియప్రాణమనోవచోభిః|*


*యచ్చింత్యతేఽన్తర్హృది భావయుక్తైర్ముముక్షుభిః కర్మమయోరుపాశాత్॥12382॥*


*దేవతలు ఇట్లు స్తుతించిరి* "ప్రభూ! ముముక్షువులు (మోక్షేచ్ఛగలవారు) దృఢమైన తమ సంసారకర్మ బంధములనుండి విముక్తిని పొందుటకై తమ హృదయ కమలములయందు నీ పాదపద్మములను భక్తిశ్రద్ధలతో నిరంతరము స్మరించుచుందురు. అట్టి నీ పాదారవిందములకు మా బుద్ధి, ఇంద్రియములు, ప్రాణము, మనస్సు, వాక్కులతో మేము ప్రణమిల్లుచున్నాము.


*6.8 (ఎనిమిదవ శ్లోకము)*


*త్వం మాయయా త్రిగుణయాఽఽత్మని దుర్విభావ్యం వ్యక్తం సృజస్యవసి లుంపసి తద్గుణస్థః|*


*నైతైర్భవానజిత కర్మభిరజ్యతే వై యత్స్వే సుఖేఽవ్యవహితేఽభిరతోఽనవద్యః॥12383॥*


పరమపురుషా! త్రిగుణాత్మకమైన నీ మాయ సులభముగా బోధపడదు. కాని అట్టి మాయద్వారా నీవు నీ నుండియే ఈ దృశ్యజగత్తును లీలగా వ్యక్తమొనర్చుచున్నావు. రజోగుణము ద్వారా జగత్తును సృష్టింతువు. సత్త్వగుణముద్వారా దానిని పాలింతువు. తమోగుణముద్వారా దానిని లయమొనర్తువు. ఐనను ఆ కర్మలు, కర్మఫలములు నీకు అంటవు. ఏలయన, నీవు త్రిగుణాతీతుడవు, ఆత్మారాముడవు. నిన్ను మాయ కప్పివేయజాలదు. నీవు నిరంజనుడవు. పరమానంద స్వరూపుడవు.


*6.9 (తొమ్మిదవ శ్లోకము)*


*శుద్ధిర్నృణాం న తు తథేడ్య దురాశయానాం విద్యాశ్రుతాధ్యయనదానతపఃక్రియాభిః|*


*సత్త్వాత్మనామృషభ తే యశసి ప్రవృద్ధసచ్ఛ్రద్ధయా శ్రవణసంభృతయా యథా స్యాత్॥12384॥*


సకలలోకపూజ్యుడవైన పురుషోత్తమా! అంతఃకరణశుద్ధిలేని జనులయొక్క చిత్తములు విద్యాభ్యాసము వలనగాని, వేదాధ్యయనమువలనగాని, దానములూ, తపస్సులు యజ్ఞాదిక్రియలు మొదలగు వాటివలనగాని సంపూర్ణముగా పరిశుద్ధి నొందజాలవు. కాని అంతఃకరణశుద్ధిగల నీ భక్తులు నీ అద్భుతలీలలను గూర్చిన కథలను, నీ ప్రభావములను, నీ యశస్సును, శుభప్రదములైన నీ గుణములను వర్ణించెదరు, వినెదరు. అందువలన వారికి నీయందు భక్తిశ్రద్ధలు ఏర్పడి, వెంటనే వారి అంతఃకరణములు పునీతమలగును (అంతఃకరణశుద్ధి లేనప్పుడు వేదాధ్యయనములు, విద్యాభ్యాసములు మొదలగునవి సత్ఫలితములను ఈయజాలవు).


*6.10 (పదియవ శ్లోకము)*


*స్యాన్నస్తవాంఘ్రిరశుభాశయధూమకేతుః క్షేమాయ యో మునిభిరార్ద్రహృదోహ్యమానః|*


*యః సాత్వతైః సమవిభూతయ ఆత్మవద్భిర్వ్యూహేఽర్చితః సవనశః స్వరతిక్రమాయ॥12385॥*


మునీశ్వరులు తమక్షేమమును కోరుతూ ప్రేమార్ధ్రములైన తమ హృదయములలో నీ పాదపద్మములను నిరంతరము ధ్యానించుచుందురు. సత్త్వగుణసంపన్నులగు, జితేంద్రియులైన నీ భక్తులు సమానైశ్వర్యములను పొందుటకై వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అను నీ చతుర్వ్యూహరూపమున మూడుపూటలా నీ పాదములను ఆరాధించుచుందురు. వారు స్వర్గమును అతిక్రమించి వైకుంఠపదమును పొందుటకై వాటిని అర్చించుచుందురు. అట్టి నీ పాదారవిందములు మా పాపవాసనలను భస్మమొనర్చుటకు అగ్నిస్వరూపము అగునుగాక!


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: