*9.10.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - పదమూడవ అధ్యాయము*
*భగవంతుడు హంసరూపమున సనకాది మహర్షులకు ఉపదేశించుట*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*ఉద్ధవ ఉవాచ*
*13.8 (ఎనిమిదవ శ్లోకము)*
*విదంతి మర్త్యాః ప్రాయేణ విషయాన్ పదమాపదామ్|*
*తథాపి భుంజతే కృష్ణ తత్కథం శ్వఖరాజవత్॥12694॥*
*ఉద్ధవుడు పలికెను* కృష్ణా! విషయభోగములే పెక్కు ఆపదలకు మూలములని సామాన్యముగా మానవులు అందరును ఎరుగుదురు. ఐనను, వారు కుక్కలవలె, గాడిదలవలె, మేకలవలె తద్ద్వారా కలిగే దుఃఖములను భరించుచుందురు. అందులకు కారణమేమి?
*శ్రీభగవానువాచ*
*13.9 (తొమ్మిదవ శ్లోకము)*
*అహమిత్యన్యథా బుద్ధిః ప్రమత్తస్య యథా హృది|*
*ఉత్సర్పతి రజో ఘోరం తతో వైకారికం మనః॥12695॥*
*శ్రీభగవానుడు నుడివెను* "ఉద్ధవా! అజ్ఞానియైనవాడు తన హృదయమునందు *నేను-నాది* అను మిథ్యాభినివేశమును కలిగియుండును. అదియే అతని దుఃఖములకు కారణమగును. వాస్తవముగా మనస్సు *స్వరూపతః* సత్త్వగుణ విశిష్టమైనది. కానీ, అది అహంకార, మమకార, వికారముల కారణముగా ఘోరమైన రజోగుణముచే వ్యాప్తమగును.
*13.10 (పదియవ శ్లోకము)*
*రజోయుక్తస్య మనసః సంకల్పః సవికల్పకః|*
*తతః కామో గుణధ్యానాద్దుఃసహః స్యాద్ధి దుర్మతేః॥12696॥*
*13.11 (పదకొండవ శ్లోకము)*
*కరోతి కామవశగః కర్మాణ్యవిజితేంద్రియః|*
*దుఃఖోదర్కాణి సంపశ్యన్ రజోవేగవిమోహితః॥11697॥*
రజోగుణముచే ఆవృతమైన మనస్సు పలువిధములైన సంకల్ప, వికల్పములను చేయుచు నిరంతరము ఆ విషయములనే స్మరించుచుండును. దానివలన కోరికలు ఉత్పన్నములై బుద్ధి కలుషితమగును.తత్పలితముగా అతడు తన ఇంద్రియములపై అదుపును కోల్పోవును. కామవశుడై రజోగుణవేగముచే మోహితుడై పెక్కు కర్మలలో చిక్కుకొనును. దాని పరిణామమున అతనిని దుఃఖపరంపర క్రమ్ముకొనును.
*13.12 (పండ్రెండవ శ్లోకము)*
*రజస్తమోభ్యాం యదపి విద్వాన్ విక్షిప్తధీః పునః|*
*అతంద్రితో మనో యుంజన్ దోషదృష్టిర్న సజ్జతే॥12698॥*
బుద్ధి రజస్తమోగుణములచేత విక్షిప్తమైనను వివేకవంతుడు మనస్సుచే లోతుగా ఆలోచనచేయుచు, విషయ భోగములవలన ఆపదలే సంభవించునని గ్రహించును. కనుక, అతడు విషయప్రమాదములలో చిక్కుకొనడు. అంతట జాగరూకుడై విషయాసక్తుడుగాక, అతడు తన మనస్సును పరమాత్మయందే లగ్నమొనర్చును.
*13.13 (పదమూడవ శ్లోకము)*
*అప్రమత్తోఽనుయుంజీత మనో మయ్యర్పయంఛనైః|*
*అనిర్విణ్ణో యథా కాలం జితశ్వాసో జితాసనః॥12699॥*
సాధకుడు ఆసనమున స్థిరముగా కూర్చుండి, ప్రాణాయామముద్వారా ప్రాణవాయువును అదుపుచేయవలెను. త్రికాలములయందును యథాశక్తి సావధానుడై యోగాభ్యాసమొనర్చుచు మనస్సును నాయందే లగ్నముచేయవలెను. ఎట్టి ఆటంకములు ఎదురైనను విసుగుచెందక, ఉత్సాహముతో ఈ అభ్యాసమును కొనసాగింపవలెను.
*13.14 (పదునాలుగవ శ్లోకము)*
*ఏతావాన్ యోగ ఆదిష్టో మచ్ఛిష్యైః సనకాదిభిః|*
*సర్వతో మన ఆకృష్య మయ్యద్ధాఽఽవేశ్యతే యథా॥12700॥*
ఉద్ధవా! పూర్వము హంసరూపములో నేను నా శిష్యులైన సనకాది మునులకు ఉపదేశించిన ఈ యోగమును వారు సాధకులకు అందించిరి. సాధకుడు తన మనస్సును అన్నివిధములుగా నిగ్రహించి దానిని నాయందే ఎట్లు లగ్నమొనర్చవలెనో, వారు లోకమునకు వెల్లడించిరి".
*ఉద్ధవ ఉవాచ*
*13.15 (పదిహేనవ శ్లోకము)*
*యదా త్వం సనకాదిభ్యో యేన రూపేణ కేశవ|*
*యోగమాదిష్టవానేతద్రూపమిచ్ఛామి వేదితుమ్॥12701॥*
*ఉద్ధవుడు ప్రశ్నించెను* "కేశవా! నీవు ఈ యోగమును సనకాది మహాత్ములకు ఏ సమయమున, ఏ రూపములో వివరించితివి? తెలిసికొనగోరుచున్నాను.
*శ్రీభగవానువాచ*
*13.16 (పదహారవ శ్లోకము)*
*పుత్రా హిరణ్యగర్భస్య మానసాః సనకాదయః|*
*పప్రచ్ఛుః పితరం సూక్ష్మాం యోగస్యైకాంతికీం గతిమ్॥12702॥*
*శ్రీకృష్ణభగవానుడు నుడివెను* "హిరణ్యగర్భుని మానసపుత్రులైన సనకాది మహర్షులు *దుర్ జ్ఞేయము, అసాధారణము* ఐన ఈ యోగవిధానము యొక్క సూక్ష్మమైన అత్యంతికసీమను గూర్చి తమ తండ్రిని ఇట్లు ప్రశ్నించిరి-
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదమూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి