*9.10.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - పదమూడవ అధ్యాయము*
*భగవంతుడు హంసరూపమున సనకాది మహర్షులకు ఉపదేశించుట*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*సనకాదయ ఊచుః*
*13.17 (పదిహేడవ శ్లోకము)*
*గుణేష్వావిశతే చేతో గుణాశ్చేతసి చ ప్రభో|*
*కథమన్యోన్యసంత్యాగో ముముక్షోరతితితీర్షోః॥12703॥*
*సనకాది మహర్షులు ఇట్లు పలికిరి* "తండ్రీ! చిత్తము శబ్దాది విషయములయందే లగ్నమై యుండును. శబ్దాది విషయములు చిత్తమును తమవైపు లాగుకొనుచుండును. అనగా చిత్తము, విషయము పరస్పరము కలిసిమెలిసి యుండును. ఇట్టి స్థితిలో సంసారసాగరమునుండి బయటపడి, ముక్తిని పొందగోరు పురుషుడు చిత్తము, విషయములు అను ఈ రెండింటినుండి బయటపడుట ఎట్లు?"
*శ్రీభగవానువాచ*
*13.18 (పదునెనిమిదవ శ్లోకము)*
*ఏవం పృష్టో మహాదేవః స్వయంభూర్భూతభావనః|*
*ధ్యాయమానః ప్రశ్నబీజం నాభ్యపద్యత కర్మధీః॥12704॥*
*శ్రీభగవానుడు చెప్పెను* దేవశ్రేష్ఠుడు, స్వయంభువుడు, సృష్టికర్త ఐన బ్రహ్మదేవుడు సనకాది మునుల ప్రశ్నకు తగిన సమాధానమునకై కొంత తడవు తన మనస్సునందు (లోతుగా) ఆలోచించెను. కానీ కర్మాధీను డగుటవలన ఆ పరమేష్ఠికి ప్రశ్నయొక్క ఆధారమేమిటో బోధపడకుండెను?"
*13.19 (పందొమ్మిదవ శ్లోకము)*
*స మామచింతయద్దేవః ప్రశ్నపారతితీర్షయా|*
*తస్యాహం హంసరూపేణ సకాశమగమం తదా॥12705॥*
అప్పుడు సనకాదుల ప్రశ్నకు సమాధానమును తెలిసికొనుటకై బ్రహ్మదేవుడు నన్ను (శ్రీహరిని) స్మరించెను. అంతట నేను అతనికి హంసరూపమున ప్రత్యక్షమైతిని.
*యథాహంసః క్షీరం నీరంచ పృథక్కర్తుం శక్తః, ఏవమ్ అహం గుణాన్, చేతశ్చ సమీచీనోపాయోపదేశేన పృథక్కర్తుమ్ అవతీర్ణః* - హంస నీటీని, పాలను వేఱుచేయుటలో సమర్థమైనది. అట్లే విషయములను, చిత్తమును వేఱుపరచెడి ఉపాయమును ఉపదేశించుటకై హంసరూపమున అవతరించినది. (వీరరాఘవీయ వ్యాఖ్య)
*13.20 (ఇరువదియవ శ్లోకము)*
*దృష్ట్వా మాం త ఉపవ్రజ్య కృత్వా పాదాభివందనమ్|*
*బ్రహ్మాణమగ్రతః కృత్వా పప్రచ్ఛుః కో భవానితి॥12706॥*
అంతట సనకాదిమహర్షులు హంసరూపముననున్న నా కడకు వచ్చి, బ్రహ్మదేవుని ముందుంచుకొని నాకు ప్రణమిల్లిరి. పిదప వారు 'నీవు ఎవరు?' అని ప్రశ్నించిరి.
*13.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*
*ఇత్యహం మునిభిః పృష్టస్తత్త్వజిజ్ఞాసుభిస్తదా|*
*యదవోచమహం తేభ్యస్తదుద్ధవ నిబోధ మే॥12707॥*
ఉద్ధవా! తత్త్వజిజ్ఞాసువులైన సనకాదిమునులు ఇట్లు ప్రశ్నింపగా నేను వారికి తెలిపిన విషయమును ఇప్పుడు నీకు వివరింతును. వినుము.
*13.22 (ఇరువది రెండవ శ్లోకము)*
*వస్తునో యద్యనానాత్వమాత్మనః ప్రశ్న ఈదృశః|*
*కథం ఘటేత వో విప్రా వక్తుర్వా మే క ఆశ్రయః॥12708॥*
*13.23 (ఇరువది మూడవ శ్లోకము)*
*పంచాత్మకేషు భూతేషు సమానేషు చ వస్తుతః|*
*కో భవానితి వః ప్రశ్నో వాచారంభో హ్యనర్థకః॥12709॥*
"విప్రోత్తములారా! మీరు ఆత్మనుగుఱించి నన్ను ప్రశ్నించియున్నచో 'ఆత్మ అంతటను ఒక్కటే. మీలోను, నాలోను, ఆత్మ ఒక్కటే. ఆత్మ తప్ప మరియొక వస్తువు ఏదియును లేదు. ఇట్టి స్థితిలో దేని ఆధారముగా నేను ఎవరినని చెప్పవలెను? వాస్తవముగా పంచమహా భూతములతో (పృథివ్యాపస్తేజోవాయు రాకాశములతో) గూడిన తత్త్వము అన్ని ప్రాణులయందును సమానమే. కనుక 'నీవు ఎవరు?' (కోభవాన్?) అను ప్రశ్న వ్యావహారికముగా సరిపోవచ్చునేమోగాని తాత్త్వికముగా అర్థరహితమైనది.
*13.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*
*మనసా వచసా దృష్ట్యా గృహ్యతేఽన్యైరపీంద్రియైః|*
*అహమేవ న మత్తోఽన్యదితి బుధ్యధ్వమంజసా॥12710॥*
మనస్సు చేతను, వాక్కుచేతను, దృష్టిచేతను, ఇంకను తదితర ఇంద్రియములద్వారాను చూడబడునది. వినబడునది, యోచన చేయుబడునది అంతయు నేనే. నేను తప్ప అన్యమేదియును లేదని నిశ్చయముగా ఎరుంగుడు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదమూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి