అన్ని విన్నవే, తెలిసినవే ! కాకపోతే ఇపుడెన్ని చెప్పగలరో ?
________________________
(1) సన్నిరాయి దాచిపెడితే పెళ్ళాగిపోతుందా ?
ఇందులో సన్నిరాయి అంటే ఏమిటి ?
(అ) రోలు
(ఆ) రోకలి
(ఇ) గుండ్రాయి
(ఈ) విసుర్రాయి (తిరుగలి)
(2) శ్మశానం, రుద్రభూమి, వల్లకాడు, కాడు > కాటికాపరి, సమాధులు, ఒలుకలమిట్ట, ప్రేతభూమి ఇలా మన భాషలో మనదికాని భాషలో గోరీలకు పేరుంది. ఈనాటికి ఒక మాటను అచ్ఛతెలుగులో జానపదులు ఉపయోగిస్తున్నారు. ఆమాట ఏమిటో చెప్పండి చూద్దాం.
(3) విధవకు వ్యతిరేకార్థమేమిటి ? (భార్య చనిపోయిన పురుషుడిని ఏమంటారు ?)
నాకు తెలుసు మీకు వెధవ అని స్ఫురించిందని కాని అది కాదుగా ?
(4) సామెతలేని మాటలు ఆమెతలేని పెండ్లిలాంటిది, ఇందులో ఆమెత అనగా ?
(అ) వధువు
(ఆ) విందు
(ఇ) డోలుసన్నాయి
(ఈ) వేదమంత్రాలు
(5) జంగమయ్య జంగమయ్య జగడమెట్లవస్తుందో చెప్పు. ముందు బిక్షం పెట్టవే ------- అని అన్నాడట ఆ జంగముడు.
పై సామెతలోని ఖాళీని పూరించుము ?
(6) అయోధ్య ప్రజలు సీతారాములకు నీరాజనం పట్టారు.ఇందులో నీరాజనం అనగా ?
(అ) చలవపందిర్లువేయడం
(ఆ) హారతులు ఇవ్వడం
(ఇ) గందరజతం పూలు చల్లడం
(ఈ) నీరు + జనం = నీరాజనం > చలవపందిర్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాహం తీర్చే ప్రజలు వుండడం.
(7) కరుడుకట్టిన ముజాహిదీన్ తీవ్రవాదులు కాశ్మీరీపండిట్లను పొట్టన పెట్టుకొన్నారు. ఇందులో కరుడుగట్టిన అనగా ?
(అ) నీటి అడుగున గట్టిపడిన లవణాలు, మలినాలు.
(ఆ) కఠినమనస్కులు
(ఇ) కనికరంలేనివారు
(ఈ) రాయిలాంటి హృదయం కలవారు.
(8) వారు పాషాణహృదయులు, వారిది పాషాణ మనస్తత్వం.ఇందులో పాషాణం అనగా ?
(అ) విషం
(ఆ) రాయి
(ఇ) కల్మశం
(ఈ) కఠినం
(9) సరిగా పొందికగా ఉండలేకపోతే కుదురుగా కూర్చోలేవా అనంటారు !
కాని ఇందులో కుదురు అనే పరికరాన్ని ఒకపుడు ఇంట్లో వాడేవారు , ఏమిటా కుదురు ? మీకేమైనా తెలుసా ?
(10) ఉంటే కుండగాలు (కుండకాలు ) లేకుంటే ఎండగాలు ! ఎండగాలమంటే ఏమిటి ?
గమనిక > అన్నింటికి సరైన సమాధానాలు చెప్పినవారిలో మొదటగా చెప్పినవారికి ఓ చిరుకానుక వుంటుంది సుమా !
॥నిర్వహణ॥
_______________________________________జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.
పై ప్రశ్నావళి యొక్క జవాబులను ఎదురు చూసిన మరియు చూచుచున్న సభ్యబృందానికి ఇదిగో వాటికి సరియైన సమాధానాలు.
________________________
1) సన్నిరాయి దాచిపెడితే పెళ్ళాగిపోతుందా ?
ఇందులో సన్నిరాయి అంటే ఏమిటి ?
(అ) రోలు
(ఆ)రోకలి
(ఇ) గుండ్రాయి✅
(ఈ) విసుర్రాయి (తిరుగలి)
(2) శ్మశానం, రుద్రభూమి, వల్లకాడు, కాడు > కాటికాపరి, సమాధులు, ఒలుకలమిట్ట, ప్రేతభూమి ఇలా మనవి మనదికాని భాషలో గోరీలకు పేరుంది. ఈనాటికి ఒక మాటను అచ్ఛతెలుగులో జానపదులు ఉపయోగిస్తున్నారు. ఆమాట ఏమిటో , చెప్పండి చూద్దాం.
సమాధానం:- ఒలికిలి. ఇప్పటికి పల్లెలలో నిన్ను ఒలికిలలో పెట్టా అంటూ తిడుతుంటారు, విన్నాం కదా!
(3) విధవకు వ్యతిరేకార్థమేమిటి ? (భార్య చనిపోయిన పురుషుడిని ఏమంటారు ? నాకు తెలుసు మీకు వెధవ అని స్ఫురించిందని కాని అది కాదుగా ?
సమాధానం > విధురుడు. విధురుడంటే పరిత్యజించబడినవాడు. భార్య మరణించి దూరమైపోయింది కనుక భార్యావియోగిని విధురుడంటారు.
కాని విదురుడు అనరాదు, విదురుడు దృతరాష్ట్రని తమ్ముడు కదా ! విధురుడికి విదురినికి తేడా చూడండి.
(4) సామెతలేని మాటలు ఆమెతలేని పెండ్లిలాంటిది, ఇందులో ఆమెత అనగా ?
(అ) వధువు
(ఆ) విందు✅
(ఇ) డోలుసన్నాయి
(ఈ) వేదమంత్రాలు
(5) జంగమయ్య జంగమయ్య జగడమెట్లవస్తుందో చెప్పు. ముందు బిక్షం పెట్టవే ------- అని అన్నాడట ఆ జంగముడు
పై సామెతలోని ఖాళీని పూరించుము ?
వివరణ: - ఖాళీలో బొచ్చుముండా అని పూరించాలి. ఒకామెకు జగడాలు ఎలా పుడతాయనే సందేహం కలిగి, తనింటికి బిక్షకు వచ్చిన జంగమయ్యను, జంగమయ్య జంగమయ్యా జగడాలెలా పుడతాయని అడిగింది. అందుకా ఆ సాధువు ముందు బిక్షంపెట్టవే బొచ్చుముండా అంటూ కోపంగా సమాధానమిచ్చాడు.
అడుక్కుతినే నాకొడకా, నాబట్ట, నీనోట్లో నా సాడు పొయ్యా అంటూ లంకించుకొందా వనితారత్నం.
ఆ సాధువు శాంతంగా అమ్మా ఇప్పుడర్థమైందా జగడాలు ఎలా పుడతాయో, జగడానికి కారణం నోటిమాటే, మన మాట మృదువుగా వుంటే బంధం పెరుగుతుంది, దురుసుగా వుంటే శత్రుత్వం పెరుగుతుందని ఉపదేశం చేశాడు. నోరుమంచిదైతే ఊరు మంచిదైతుందన్న లోకోక్తి కూడా ఇలాంటిదే.
(6) అయోధ్య ప్రజలు సీతారాములకు నీరాజనం పట్టారు. ఇందులో నీరాజనం అనగా ?
(అ) చలవపందిర్లువేయడం
(ఆ) హారతులు ఇవ్వడం✅
(ఇ) గందరజతం పూలు చల్లడం
(ఈ) నీరు + జనం = నీరాజనం > చలవపందిర్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం.
(7) కరుడుకట్టిన ముజాహిదీన్ ఉగ్రవాదులు కాశ్మీరీపండిట్లను పొట్టన పెట్టుకొన్నారు. ఇందులో కరుడుగట్టిన అనగా ?
(అ) నీటి అడుగున గట్టిపడిన లవణాలు✅
(ఆ) కఠినమనస్కులు
(ఇ) కనికరంలేనివారు
(ఈ) రాయిలాంటి హృదయం కలవారు.
వివరణ : - ఓబొక్కెన తీసుకోండి, అందులో నిండుగా నీళ్ళు పోసి కొన్నాళ్ళపాటు అలానే వదిలేసేయండి. కొన్నాళ్ళకు ఆ బకెట్టులోవున్న నీటిలోని లవణాలు, మలినాలు అడుక్కు చేరుకొని గట్టిపడి ముద్దలా అయిపోతాయి. అలా ముద్దలామారి బొక్కెనకిందన అతుక్కుపోయిన ఆ గట్టి పదార్ధం చాకుతో గోకినా, బలవంతంగా గీకినా, అమ్లాలు (ఆసిడ్స్) పోసి కుంచె (బ్రష్) తో తోమినా పూర్తిగాపోదు. అంతో ఇంతో ఏదోరూపంలో అతుక్కొనేవుంటుంది. అడుగు చేరి గట్టిపడిన పదార్థాన్నే కరడు అంటారు. తీవ్రవాదుల మనస్తత్వం కూడా ఇలా కఠినంగానే వుంటుంది కనుక ఈ స్వామ్యాన్ని చెప్పడం జరిగింది.
(8) వారు పాషాణ హృదయులు, వారిది పాషాణ మనస్తత్వం. ఇందులో పాషాణం అనగా ?
(అ) విషం
(ఆ) రాయి✅
(ఇ) కల్మశం
(ఈ) కఠినం
(9) కుదురుగా కూర్చోలేవా !
ఇందులో కుదురు అనే పరికరాన్ని ఒకపుడు ఇంట్లో వాడేవారు , ఏమిటా కుదురు ?
ఇప్పుడైతే పిండిమరలు వడ్లమరలు వచ్చాయి కాని, 50 సంవత్సరాల కిందటి వరకు అమ్మలందరు రుబ్బురోలుకింద రుబ్బు కొనేవారు, తిరుగలి (విసుర్రాయి) తో విసురుకొనేవారు. రోలురోకలితో సజ్జలు, జొన్నలు, కొర్రలు, సాములు వడ్లు దంచుకొంటారు. దంచేటపుడు అవి రోకటిపోటులకు చెదరిపోకుండా వెదురుతో చేసిన కుదురును రోలుపై దంచుకొనేవారు. ఈ తరానికి రోలు, రోకలి,తిరుగలి,కవ్వం, ఉట్టి, కత్తిపీఠ, మూకుడు, పొంత, ముంత, పెనం సంకటికట్టి, తెడ్డు, వంటి గృహోపకరణాలు తెలియవంటే అతిశయోక్తికాదు.
(10) ఉంటే కుండగాలు (కుండకాలు ) లేకుంటే ఎండగాలు ! ఎండగాలమంటే ఏమిటి ?
సమాధానం. ఇది వానాలేదు, వంగడాలేదనే సామెత లాంటిదే. వర్షాలు కురిసి పంటలు పండేకాలం వస్తే బీదాబిక్కి కూలికి వెళతారు, నాలుగు డబ్బులు వస్తాయి. కుండలో ఎసరుపోసి పోయిమీద పెట్టి మంటపెట్టి సంకటో ఊరబిండో వండుకుతింటారు. కుండ పొయ్యి మీద కాలుతుంది కాబట్టి కూలీపోతేనే కుండ కాలుతుందనే అర్థం ఈ సామెతలో సరిపోయింది.
ఇక ఎండకాలడమంటే..
కుండలు కడిగిన తరువాత వాటిని ఎండలో బోర్లిస్తారు. ఎందుకంటే సూర్యరశ్మికి కుండలోనున్న క్రిమికీటకాలు ( బ్యాక్టీరియా, ఫంగస్) నశిస్తాయని. కూలిలేకపోతే కుండపోయిమీదకు ఎక్కికాలకుండా ఎండలోనే ఎండుతూ వుంటుంది కదా! ఇది మనవారి ఆరోగ్య సూత్రమన్నమాట. అందుకే ఎండకాలిందనేమాట ఈ సామెతలో సరిపోయింది.
నేను MA (చరిత్ర) చదివేటపుడు ప్రముఖ రచయిత పులికంటి కృష్ణారెడ్డిగారిని కలవడం జరిగింది. మాటల సందర్భంలో పై సామెతగురించి వివరించమని అడిగినపుడు స్వర్గీయ పైవిధంగా తెలియచేశారు. వారికి కృతజ్ఞతలు.
॥నిర్వహణ॥
_______________________________________జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి