*8.10.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - పదమూడవ అధ్యాయము*
*భగవంతుడు హంసరూపమున సనకాది మహర్షులకు ఉపదేశించుట*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*శ్రీభగవానువాచ*
*13.1 (ప్రథమ శ్లోకము)*
*సత్త్వం రజస్తమ ఇతి గుణా బుద్ధేర్న చాత్మనః|*
*సత్త్వేనాన్యతమౌ హన్యాత్సత్త్వం సత్త్వేన చైవ హి॰12687॥*
*శ్రీభగవానుడు వచించెను* "ఉద్దవా! సత్త్వరజస్తమోగుణములు అను మూడును బుద్ధికి సంబంధించినవేగాని, ఆత్మకు సంబంధించినవిగావు. సత్త్వగుణముద్వారా రజస్తమోగుణములను రూపుమాపవలెను. అంతఃకరణశుద్ధి కలిగిన పిదప సత్త్వగుణమునుగూడ త్యజించి గుణాతీతుడు కావలెను.
*13.2 (రెండవ శ్లోకము)*
*సత్త్వాద్ధర్మో భవేద్వృద్ధాత్పుంసో మద్భక్తిలక్షణః|*
*సాత్త్వికోపాసయా సత్త్వం తతో ధర్మః ప్రవర్తతే॥12688॥*
పురుషుడు సత్త్వగుణ సంపన్నుడైనప్పుడు అతనిలో ఎల్లప్పుడూ భక్తిరూపస్వధర్మము వృద్ధి చెందును. సర్వదా సాత్త్విక పదార్థములను సేవించుటవలననే సత్త్వగుణము పెంపొందును. తద్ద్వారా నాయొక్క భక్తిరూప స్వధర్మము నందు ప్రవృత్తి కలుగుచుండును.
*13.3 (మూడవ శ్లోకము)*
*ధర్మో రజస్తమో హన్యాత్సత్త్వవృద్ధిరనుత్తమః|*
*ఆశు నశ్యతి తన్మూలో హ్యధర్మ ఉభయే హతే॥12689॥*
సత్త్వగుణమువలన సర్వోత్కృష్టమైన ధర్మము వర్ధిల్లును. అట్టి ధర్మము రజోగుణమును, తమోగుణమును నష్టపరచును. రజస్తమోగుణములు నశించుటతోడనే వాటి మూలముగా పుట్టెడు అధర్మము వెంటనే తప్పక సమసిపోవును.
*13.4 (నాలుగవ శ్లోకము)*
*ఆగమోఽపః ప్రజా దేశః కాలః కర్మ చ జన్మ చ|*
*ధ్యానం మంత్రోఽథ సంస్కారో దశైతే గుణహేతవః॥12690॥*
శాస్త్రము, జలము, సంతానము, దేశము, సమయము, కర్మ, జన్మ, ధ్యానము, మంత్రము, సంస్కారము అను ఈ పదియును సాత్త్వికములైనచో సత్త్వగుణము, రాజసములైనచో రజోగుణము, తామసములైనచో తమోగుణము వృద్ధిచెందును.
*13.5 (ఐదవ శ్లోకము)*
*తత్తత్సాత్త్వికమేవైషాం యద్యద్వృద్ధాః ప్రచక్షతే|*
*నిందంతి తామసం తత్తద్రాజసం తదుపేక్షితమ్॥12691॥*
శాస్త్రవేత్తలగువారలు ఆహార - ఆగమాది విషయములయందు ప్రశంసించిన (ఆదరించిన) వాటిని సాత్త్వికములుగను, నిందించిన (నిరాదరించిన) వాటిని తామసములుగను, ఉపేక్షించినవాటిని (నస్తుతం, ననందితం) రాజసములుగను ఎరుంగవలయును.
*13.6 (ఆరవ శ్లోకము)*
*సాత్త్వికాన్యేవ సేవేత పుమాన్ సత్త్వవివృద్ధయే|*
*తతో ధర్మస్తతో జ్ఞానం యావత్స్మృతిరపోహనమ్॥12692॥*
సత్త్వగుణాభివృద్ధి కొరకు సాత్త్వికవస్తువులను మాత్రమే సేవింపవలెను. దానివలన ధర్మము, జ్ఞానము వృద్ధియగును, స్వస్వరూపస్మృతి గలిగి, అన్నివిధములుగా సంశయనివృత్తి యగును. భగవత్తత్త్వజ్ఞానము కలుగునంతవరకును ఇట్లే చేయుచుండవలెను.
*13.7 (ఏడవ శ్లోకము)*
*వేణుసంఘర్షజో వహ్నిర్దగ్ధ్వా శామ్యతి తద్వనమ్|*
*ఏవం గుణవ్యత్యయజో దేహః శామ్యతి తత్క్రియః॥12693॥*
వెదురు కర్రల రాపిడివలన అగ్ని ఏర్పడును. ఆ అగ్ని తనకు మూలమైన ఆ వెదురువనమునే దహించి, శాంతించును. దేహముగూడ గుణములయొక్క వైషమ్యముచే ఉత్పన్నమగును. మిక్కిలి లోతుగా సమాలోచన చేసినపిమ్మట ఆ మథనమువలన జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లును. అది (జ్ఞానాగ్ని) సకల (స్థూల, సూక్ష్మ, కారణ) శరీరములను, గుణములను దగ్ధమొనర్చి స్వయముగా శాంతమగును.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదమూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి