*28.10.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - పందొమ్మిదవ అధ్యాయము*
*జ్ఞాన-భక్తి-యమనియమాది సాధనముల వర్ణనము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*శ్రీభగవానువాచ*
*19.33 (ముప్పది మూడవ శ్లోకము)*
*అహింసా సత్యమస్తేయమసంగో హ్రీరసంచయః|*
*ఆస్తిక్యం బ్రహ్మచర్యం చ మౌనం స్థైర్యం క్షమాభయమ్॥12993॥*
*శ్రీకృష్ణభగవానుడు నుడివెను* ఉద్ధవా! అహింస (ప్రాణులయెడ ఎట్టి ద్రోహచింత లేకుండుట), సత్యము (భూతహితమైన భాషణము), అస్తేయము (మనస్సునందు ఇతరుల సొత్తును అపహరించు ధోరణి లేకుండుట), అసంగము (ఎట్టి లౌకిక విషయములయందును ఆసక్తి లేకుండుట), లజ్జ (సిగ్గు), అసంచయము (అవసరమునకు మించి ధనాదికమును కూడబెట్టకుండుట), ఆస్తిక్యము (వేదశాస్త్రముల యందు విశ్వాసము), బ్రహ్మచర్యము (స్త్రీసంగరాహిత్యము), మౌనము (వృథాలాపవర్జనము, భగవన్నామస్మరణము), స్థిరత (నిశ్చలత్వము), క్షమ (తితిక్ష-సహనము), అభయము (నిర్భయత్వము) అను ఈ పన్నెండును యమములు అనబడును.
*19.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*
*శౌచం జపస్తపో హోమః శ్రద్ధాఽఽతిథ్యం మదర్చనమ్|*
*తీర్థాటనం పరార్థేహా తుష్టిరాచార్యసేవనమ్॥12994॥*
శౌచము - బాహ్య శౌచము, అభ్యంతర శౌచము (బాహ్యాభ్యంతర పవిత్రత), జపము (మంత్రమును జపించుట), తపస్సు (శాస్త్రీయ కాయక్లేశము), హోమము (అగ్నికార్యమునందు ఆహుతి సమర్పించుట), శ్రద్ధ (సత్కార్యములయందు పట్టుదల), ఆతిథ్యము (అతిథిసేవ), భగవదారాధనము, తీర్థయాత్ర, పరోపకారబుద్ధి, తుష్టి (దైవికముగా లభించినదానితో తృప్తిచెందుట), గురుసేవ అను ఈ పన్నెండును 'నియమములు' అని యనబడును.
*19.35 (ముప్పది ఐదవ శ్లోకము)*
*ఏతే యమాః సనియమా ఉభయోర్ద్వాదశ స్మృతాః|*
*పుంసాముపాసితాస్తాత యథాకామం దుహంతి హి॥12995॥*
ఈ యమ, నియమములు రెండును పన్నెండేసి విధములు. ఇవి సకామ, నిష్కామసాధకులకు మిగుల ఉపయుక్తములు. నాయనా! వీటిని అనుష్ఠించినవారికి సకలకార్యములు నెరవేరును.
*19.36 (ముప్పది ఆరవ శ్లోకము)*
*శమో మన్నిష్ఠతా బుద్ధేర్దమ ఇంద్రియసంయమః|*
*తితిక్షా దుఃఖసమ్మర్షో జిహ్వోపస్థజయో ధృతిః॥12996॥*
*19.37 (ముప్పది ఏడవ శ్లోకము)*
*దండన్యాసః పరం దానం కామత్యాగస్తపః స్మృతమ్|*
*స్వభావవిజయః శౌర్యం సత్యం చ సమదర్శనమ్॥12997॥*
*శమము* అనగా శాంతి మాత్రమేగాదు. భగవత్పరమైన నిష్ఠతోగూడిన బుద్ధి. *దమము* అనగా బాహ్యేంద్రియ నియమనము. *తితిక్ష* అనగా దుఃఖములను సహించుట. *ధృతి* అనగా జిహ్వ మరియు జననేంద్రియములను జయించుట (వాటి ఉద్వేగమును అణచుట). *దండన్యాసము* అనగా ఏ ప్రాణి యెడలను ద్రోహచింతన లేకుండుట (ఏ ప్రాణినీ దండింపకుండుట). *దానము* అనగా ధనమును అర్హులకు ఇచ్చుటయేగాక, ఇతరులకు (ఆపన్నులకు) అభయమిచ్చుట, *తపస్సు* అనగా భోగములయెడ అపేక్ష లేకుండుట. *శౌర్యము* అనగా కేవలము శత్రువులను జయించుట మాత్రమేగాదు, వాసనలను అన్నింటిని జయించుట. *సత్యము* అనగా కేవలము యదార్థభాషణమేగాదు. సకల ప్రాణులలోను పరమాత్మను దర్శించుట.
*19.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*
*ఋతం చ సూనృతా వాణీ కవిభిః పరికీర్తితా|*
*కర్మస్వసంగమః శౌచం త్యాగః సన్న్యాస ఉచ్యతే॥12998॥*
*ఋతము* అనగా సత్యము మరియు హితభాషణము అని మహాత్ములు పేర్కొనిరి. *శౌచము* అనగా కర్మలయందు ఆసక్తి లేకుండుట. *సన్న్యాసము* అనగా కోరికలను త్యజించుట.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పందొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి