30, అక్టోబర్ 2021, శనివారం

పాలు.. వాటి కథ..

 పాలు.. వాటి కథ..


పొద్దున్నే వచ్చాడు మిత్రుడు. కీటో డైటింగ్ చేస్తున్నాడుకాబట్టి కాస్త సన్నబడ్డాడు. సరే! కాఫీ తాగుతావా అని అడిగాను, అప్పుడే ఇంట్లోంచి ఘుమఘుమ కాఫీ వొసన వస్తోంది. వేడి వేడి కాఫీ రెడీ ఔతోంది. "అయ్యబాబోయ్!! నేను కాఫీ తాగను" అని అన్నాడు, కాఫీ తాగితే పున్నామ నరకానికి పోతామనేంత ముఖం చిట్లిస్తూ...


సరే పోనీ పాలు!?


పాలు తాగుతాను కానీ!. పాకెట్ పాలైతే తాగను. మీ ఇంట్లో గేదె పాలు ఉంటే ఇవ్వండి‌. అన్నాడు.


నీ కోరిక సింగారం గానూ!. గేదెల్ని నేనెక్కడ నుంచి తీసుకురావాలి సామీ!. ఐనా ప్యాకెట్ పాలు ఏం పాపం చేశాయట?. తాగనంటున్నావ్!? అని అడిగాను.


"నేను అంతా ప్రకృతి సహజమైన పాలే తాగుతాను. ఈ ఇంగ్లీష్ వాళ్ళు పాలల్లో ఏవో కెమికల్స్ కలిపి ఈ పాకెట్ పాల సిస్టం తీసుకొచ్చారు. ఇవి ఆరోగ్యానికసలు మంచిదే కాదు. చాలా డేంజర్!. ఈ రోజు మనకొచ్చే జబ్బులకన్నింటికీ ఈ ప్యాకెట్ పాలే కారణం..." అన్నాడు. ఇంత గ్యానం ఎక్కడిదీ సారుకు అని ఆశ్చర్యంగా చూసే లోపల అతడే అన్నాడు...

"ఇంత జ్ఞానం నాకెక్కడిది అనుకున్నావా?. మొన్ననే ఒక ప్రోగ్రాం అటెండయ్యా!. ఆయన మీ ఆధునిక డాక్టర్ల బండారం మొత్తం బయట పెట్టేశాడు. ప్రపంచమంతా సహజత్వం వైపు ప్రకృతి వైపు ఆరోగ్యం వైపు పయనిస్తుంటే మీ డాక్టర్లు మాత్రమే ఆ ఇంగ్లీషోడు పాశ్చర్ చెప్పినట్టు పాలను పాశ్చరైజేషన్ కు గురిచేసి వాటిని పసలేని పాలుగా మార్చి వాటిని తాగమని అడ్వైజ్ చేస్తున్నారు...అవి తాగటం వలననే సకల జబ్బులూ వస్తున్నాయి" అన్నాడు. ఆవేశంగా.. కాసేపు బుర్ర గిర్రున తిరిగింది. వీళ్ళు ప్రాబ్లం పాశ్చరైజేషన్ తోనా లేక ఇంగ్లీష్ వాళ్ళతోనా అనుకున్నాను. ఈ రేంజ్ గ్యానం అందించిన ఆ సహజ ప్రకృతి అడ్వైజర్ ఎవరో చూడాలని అనుకున్నా. నేను నోట మాట రాక ఆశ్చర్యం పోతుంటే..." నోట మాట రావట్లేదు కదూ!. మీ బండారం బయట పడింది కదూ!" అన్నాడు. ఓర్నీ వీడి దుంపతెగ!. "సరేనబ్బా...! ఇంతకీ గేదె పాలు డైరెక్ట్ గా తాగితే ఏంటంట బెనిఫిట్టు!?'" అనడిగిను.


"అసలే జబ్బులూ రావు. చిన్న పిల్లలకు కూడా ఆ పాలే ఇవ్వాలి. తల్లి పాలు లేకపోతే స్వచ్ఛమైన దేశీ ఆవు పాలు ఇవ్వాలి'" అన్నాడు ఖరాఖండీగా!


నాయనా! ఇటువంటి పిచ్చి పనులు మీరు చేయాలనుకుంటే చేయండి, కానీ పిల్లలకు పాశ్చరైజ్డ్ ఆవు పాలే ఇవ్వండి. పాశ్చరైజేషన్ వలన హాని కారక బ్యాక్టీరియాలు ఎన్నో చంపబడతాయి. ముఖ్యంగా ఈ.కోలై, కాంపైలోబ్యాక్టర్, లిస్టీరియా, సాల్మోనెల్లా, బ్రూసెల్లా, ట్యూబర్క్యులోసిస్, స్ట్రెప్టోకోకస్ వంటివి చంపబడతాయి. పాలను పితికేటపుడు ఆ పశుల కొట్టంలో ఉండే సకల బ్యాక్టీరియాలు పాలలో కలుస్తాయి. కింద ఆ నేలమీద ఉండేటటువంటి పేడ, అక్కడ ముసురుకున్న ఈగలు, పశువుల మూత్రం, గడ్డి, పాలు పిండుతున్న వాడి చేతులు( పొద్దున్నే పిండుతాడు మరి...నైట్ చేతులు ఎక్కడైనా పెట్టుకోచ్చుగాక!) పిండే ఆ బకీట! ఇవన్నీ పరమ పవిత్రంగా ఉన్నాయని నీవనుకుంటే అట్టాగే కానీయ్! కానీ పాలు ఇంతటి unhygienic conditions లో పితకబడతాయి. ఆవు పొదుగుకు ఉండే ఇన్ఫెక్షన్( mastitis)వలన ఆ బ్యాక్టీరియా కూడా అందులో చేరుతాయి. ఈ సకల బ్యాక్టీరియా లనూ వాటి స్పోర్లనూ ఒక్క పాశ్చరైజేషన్ ద్వారా చంపి పడేయొచ్చు. పాశ్చరైజేషన్ లో ఏమీ కెమికల్స్ ని కలపరు. వాటిని ఒక ఉష్ణోగ్రత వద్ద వేడిచేసి కొంత సేపు అదే ఉష్ణోగ్రత వద్ద ఉంచి ఫాస్ట్ గా కూల్ చేస్తారు. ఇలా చేయడం వలన ఎన్నో బ్యాక్టీరియాలు చనిపోతాయని లూయీ పాశ్చర్ కనుగొన్నాడు" అని చెప్పాను. " ఇంకో విషయం ఏమిటంటే un pasturized milk తాగటం వలన ఇటువంటి milk born diseases ఎన్నో విజృంభించిన సందర్భాలు రికార్డై ఉన్నాయి. పెద్దలకే ఈ పాలు హానికరం అంటుంటే చిన్న పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టకూడదు.


అదేం కాదు. పాలల్లో మనిషికి ఉపయోగపడే బ్యాక్టీరియా కూడా ఉంటాయట అవి చనిపోవడం వలన నష్టమే కదా!?. అడిగాడు.


"'మనిషికి ఉపయోగపడే బ్యాక్టీరియా లు మనిషి కడుపులోనే ఉంటాయి. ఈ పాలలో ఎందుకుంటై?. ఆవు లేదా గేదె కడుపులో దానికి అవసరమైన బ్యాక్టీరియాలు ఉంటై, అవి పాలలోకి రావు. ఉదాహరణకు బైఫిడో బ్యాక్టీరియాలు మనిషికీ గేదెకీ కడుపులో ఉంటాయి. ఇపుడు గేదె పాలలో బైఫిడో బ్యాక్టీరియా ఉంటే ఏమని అర్థం!?" సీరియస్ గా అడిగాను. భృకుటి ముడి పెట్టి చూశాడు ..అంతే సీరియస్ గా. సమాధానం రాకపోయేసరికి నేనే చెప్పాను.


" అరే సామీ! మనిషి కడుపులో, గేదె కడుపులో ఉండే ఆ బ్యాక్టీరియా గేదె పాలలోకి ఎలా వస్తాయి!?.. కేవలం ఫీకల్ మ్యాటర్ వలననే కదా బయటకు రావాలి!. అంటే ఆ గేదె పెండతో ఆ పాలు కంటామినేట్ ఐవుండాలి. లేదా ఆ పాలు పితికేవాడు పొద్దున్నే తన వామ హస్తముతో......"'


ఛీ!... నిజమా?...రామ రామా!!"'


"'కృష్ణ కృష్ణా!. అందుకే నీకు సహజత్వమని సొల్లేసినోడెవడో మహా ఘటికుడు. చదువుకున్న నిన్నే బోల్తా కొట్టించాడు చూశావూ!?"" అన్నాను.


మరి పాశ్చరైజేషన్ వలన పాలల్లో శక్తి తగ్గుతుందని, ఆ పాలు వలన ఎముకలు పలుచనవుతాయనీ చెప్పాడే!?. 


వాడి బొంద!. పాలను వేడి చేస్తే పాల ప్రొటీన్ "కేసిన్"' కి ఏమీ కాదు. అలాగే పాలలో ఉండే కాల్షియం ఏమీ ముక్కలైపోదు. కాబట్టి మామూలు పాలలో ఎంత ప్రొటీన్ ఉంటుందో ఎంత కాల్షియం ఉంటుందో పాశ్చరైజ్డ్ పాలల్లో అంతే ఉంటుంది. ఇక పాలలో ఉండే ల్యాక్టోజ్ అనే షుగర్ కొంతమందికి పడదు. అది పాకెట్ పాలా గేదె పాలా అని కాకుండా లాక్టోజ్ ఎక్కడున్నా పడదు. లాక్టేజ్ అనే ఎంజైమ్ కడుపులో లేకపోవడం వలన పాలు అరగక ఇబ్బందులు పడుతూంటారు. దీనిని లాక్టోజ్ ఇంటోలరెన్స్ అంటారు. చిన్న పిల్లల్లో ఇది ఉంటే వాళ్ళ ఎదుగుదల ఉండదు. 


ఔనౌను. దీని గురించి కూడా చెప్పాడు. ఐతే ప్యాకెట్ పాలవలననే ఇది వస్తుందనీ, ఆవు పాలు తాగితే రాదనీ చెప్పాడు. ఇంకా ప్యాకెట్ పాలు తాగితే ఆస్తమా వస్తుందనీ చెప్పాడు.


ఇదీ అబద్దమే! ఆస్త్మా అనేది కొన్ని ప్రోటీన్ లకు రియాక్షన్ గా వస్తుంది. పాలలో కేసీన్ ఉంటుంది. పాశ్చరైజేషన్ వలన కేసిన్ ప్రోటీన్ స్ట్రక్చర్ లో మార్పు ఏమీ ఉండదు. కాబట్టి ఒక వ్యక్తికి కేసీన్ ప్రొటీన్ పడలేదంటే అది ప్యాకెట్ పాలైనా గేదె పాలైనా ఒకటే!. కేవలం ప్యాకెట్ పాలకు మాత్రమే ఆస్తమా వస్తుంది గేదె పాలకు రాదు అని చెప్పడంలో ఏ సైన్సూ లేదు.

కామెంట్‌లు లేవు: