23, జూన్ 2022, గురువారం

కాళిదాసజయంతి

 నేడు *మహాకవి"కాళిదాసజయంతి"*


ఆమహనీయుని,

కుడుగరగా,

కాళిదాస మనోవిశ్లేషణం !


సంస్కృత కవుల్లో కవికుల తిలకుఁడు కాళిదాసు స్థానం విశిష్ఠ మైనది. మనోవిశ్లేషణలో కాళిదాసుని మించిన వారులేరు. అతడు రచించిన నాటక త్రయంలో " అభిజ్ఙాన శాకుంతలమ్ " సర్వోత్తమమని విజ్ఙుల అభిప్రాయం.


శ్లో: కావ్యేషు నాటకం రమ్యమ్ నాటకేషు శకుంతలా 


తత్రాపి చతుర్ధోంకః తత్ర శ్లోక చతుష్టయమ్ - అన్నారు


కావ్యాలలో నాటకము  అందమైనదట (మనస్సును వెంటనే ఆకర్షించ గలదని యభిప్రాయం. అది దృశ్యమవటంవల్ల) 


అలాంటి నాటకాలలో కాళిదాస కృత శకుంతల నాటకం సర్వోత్తమం. అందులోకూడా నాల్గవ అంకం చాలారమ్యమైనది. 


అందులోకూడా నాలుగు శ్లోకాలు అసమానమైనవి . అనిదీని యర్ధం.


ఆనాలుగింటిలోకూడా శిఖరాయమానమైనది " కణ్వుడు శకుంతలను అత్తవారింటికి పంపుతూ తనలోతాను


మథనపడే ఆసన్నివేశాన్ని వివరించే శ్లోకం నిరుపమానం. చతుర్ధాంకం మొత్తం శకుంతల నత్తవారింటికి పంపే ఘట్టమే! ఆ ఘట్టాన్ని  మానవజీవితానికి అతి దగ్గరగా నడిపించి నిరుపమానమైన తన మనోవిశ్లేషణా చాతుర్యాన్ని  బహుముఖాలుగా వెల్లడించాడు కాళిదాసు.


శ్లో: యాస్యత్యద్య శకుంతలేతి హృదయం సంస్పృష్ఠముత్కంఠయా 


కంఠః స్తంభిత బాష్పవృత్తి కలుషః చింతాజడమ్ దర్శనమ్ 


వైక్లబ్య మమ తావదీదృశమహో స్నేహా దరణ్యౌకసః 


పీడ్యంతే గృహిణః కథన్ను తనయా విశ్లేష దుఃఖైర్నవైః !!


భావం: "ఈరోజు శకుంతల అత్తవారింటికి వెళుతూంటే , పిల్లవెళ్ళిపోతూందే అనే బాధతో నాహృదయ మెంతో ఉద్విగ్నతకు లోనవు తున్నది. కన్నుల నీరునిండుటచే చూపు మందగించింది. గొంతు బొంగురు బోయింది. అరణ్యవాసంచేస్తూ వీతసంగులమై తపోవృత్తి నవలంబించే మావంటివారే యింత బాధననుభవిస్తోంటే, లోకంలో ఆడపిల్లలను కనిపెంచిన తలిదండ్రులు వారిని అత్తవారింటికంపు నపుడు ఇంకెంతగా బాధపడతారోగదా! "-అనిమనస్సులో వాపోతాడు.


ఈమనోసంఘర్షణను కాళిదాసు యెంత సహజంగా చిత్రించాడోచిత్తగించారుగదా!


ఈనాటకాన్ని తెలుగున కనువదించిన కందుకూరి వీరేశలింగం పంతులుగారు అనువాదంలో మూలానికి వన్నె బెడుతూ యెలా అనువదించారో చూడండి!


ఉ: "కొందలమందె డెందము" , శకుంతల తానిపుడేగునంచయో 


క్రందుగ భాష్పరోధమున కంఠమునుం జడె ,దృష్టి మాంద్యమున్


బొందె , "నొకింత" బెంచిన తపోధనులే యిటుగుంద , నెంతగాఁ 


గుందెదరో? తమంత గను కూఁతులఁబాయు గృహస్తు లక్కటా!


అచ్చతెనుగు పదాలతో ముచ్చటగా సాగిన వీరి యనువాదంలో మూలభావం చక్కగా యిమిడి పోయింది. అంతేగాదు మూడవ పాదంలో " ఒకింత బెంచిన" అనే వాక్యంతో మూలానికి చక్కని వన్నెలు దిద్ది మెఱుగులు పెట్టారు.


మేం యీమెని పెంచిన దెంతకాలం? బహుస్వల్పం! అయినా యింత మమ కారమేమిటో? ఇందేమి మాయో? అనికణ్వుని తలపోతగా నుండి మూలమునకు మెఱుగు పెట్టినది.


ఇంతకూ  శకుంతల నత్తవారింటికి పంపు సన్నివేశమున, మామూలుగా పెండ్లియయిన ఆడుపిల్లనత్తవారింటికి బంపు నపుడు జరుగు ఉద్విగ్నవాతావరణమే,ఇందు కల్పింపబడినది. అన్నిటికన్నాముఖ్యమైనది. తలిదండ్రుల కన్నీటి వాడుక ,కాదుకాదు, అదివేడుకే! అదియునిందు పరికల్పిత మైనది.


ఈవిధంగా మానవాంతరంగాలలోని బాధలగాధలను,వేదనలను ,వేడుకలను, అతిసహజముగా చిత్రించి ,కాళిదాసు తన మనో విశ్లేషణాచాతుర్యాన్ని ప్రదర్శించి  " అభిజ్ఙాన శాకుంతలమ్"- నాటకాన్ని దృశ్యకావ్యాలలో అగ్రభాగాన నిలబెట్టాడు.


                         స్వస్తి!

చొప్పాకట్ల సత్యనారాయణ. 

🙏🌹🙏

కామెంట్‌లు లేవు: