*ఆఘ్రాతం పరిచుంబితం పరిముహుర్లీఢమ్ పునశ్చర్వితం*
*త్యక్తం వా భువి నీరసేన మనసా తత్ర వ్యథాం మా కృధాః*
*హే సద్రత్న! తవైవ తత్ర కుశలం యద్ వానరేణాదరాత్*
*అంతర్గూఢ విలోకన వ్యసనినా చూర్ణికృతో నాశ్మనా*
భావం:-ఒక కోతికి చక్కటి రత్నం దొరికింది.అదేమిటో దానికి అర్థం కాలేదు.వాసన చూసింది తెలియలేదు.ముద్దులు పెట్టింది, నాకింది దాని స్వరూపం ఏమీ కోతికి తెలియ లేదు.
విసుగొచ్చి నేలమీదికి విసిరి కొట్టింది.అయినా ఆ రత్నం వులుకూ పలుకూ లేదు.దాంతో ఆకోతి రత్నం వైపు అసహ్యంగా చూసింది.ఈ సందర్భంలో కవి ఆ రత్నాన్ని ఓదారుస్తున్నాడు.యేమని?
ఓ రత్నమా!నిన్ను కోతి ఆదరించ లేదనీ,యిన్ని పరీక్షలకు గురిచేసిందనీ దుఃఖించకు
నువ్వు చాలా అదృష్టవంతురాలివి.ఎందుకో తెలుసా?అసలు రత్నమైన నీలో ఏం వుందో
తెలుసుకునే అభిప్రాయం తో ఓ రాతి మీద పెట్టి మరో బండరాతితో కొట్టి పొడి పొడి గా
చేయలేదు.అందుకని నువ్వు అదృష్టవంతురాలివి సంతోషించు.
విశేషార్థం:---.ఒక మహా పండితుడున్నాడు.అతనికి ఆదరణ వుండక పోవచ్చు. దానికి కారణం అతని పాండిత్యపు లోతు తెలిసిన మహానుభావుడు దొరక్క పోవడమే అయితే పండితుడికి మాత్రం పరీక్షలకు కొదవేమీ వుండదు.అన్ని పరీక్షలకూ గురి చేశాక నీవు
పని చేయవు అని తీర్మానం చేసి అవతలి వాళ్ళు అవమాన పరిచినంత మాత్రాన ఈ పండితుడికి అది గౌరవలోపం కానే కాదు.వాళ్ళు యింకో అడుగు ముందుకు పోయి నీది అసలు పాండిత్యమే కాదు అని అజ్ఞానం తో పలక నందుకు ఆ పండితుడు సంతోషించాలి. ఈ కాలము లో జరుగుతున్నది యిదే .
ఒక రత్నవ్యాపారి మాత్రమే రత్నపు విలువ గ్రహించ గలిగినట్టే ఒక పండితుడు మాత్రమే
పండితుడి పాండిత్యాన్ని గుర్తించ గలుగుతాడు.
*విద్వానేవ విజానాతి*
*విద్వజ్జన పరిశ్రమం* *నహి వంధ్యా విజానాతి*
*గుర్వీం ప్రసవ వేదనాం*
అర్థము :-- ఒక విద్వాంసుడు మాత్రమే విద్వాంసులు చేసిన పరిశ్రమను గుర్తించ గలుగుతాడు. ఎలాగైతే ఒక గొడ్రాలికి ప్రసవ వేదన తెలియనట్లే. పండితుడు కానివాడికి
పండితుడి పరిశ్రమ తెలియదు
(భక్తిసుధ ఆధ్యాత్మిక మాసపత్రిక ఫిబ్రవరి 2012 సంచిక నుండి)
సౌజన్యం....
శ్రీమతి సుగుణ. రూపనగుడి
సేకరణ...వేపా.పార్వతీశం,హైదరాబాద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి