23, జూన్ 2022, గురువారం

అయ్యకోనేరు అంతరంగం

 👆

🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

నాకు నచ్చిన శ్రీ కొచ్చెర్లకోట జగదీశ్ గారి కథనం "అయ్యకోనేరు అంతరంగం"

                🌷🌷🌷

మేలు కోరేవాణ్ణి మేలుకొమ్మంటూ సున్నితంగా లేపుతున్నారు అయ్యవారు. తూరుపుదిక్కు సూర్యుడికి అప్పటివరకూ పాలు కుడిపి, సాయంత్రందాకా భూలోకంలో ఆడుకురమ్మని తన పాలిండ్ల పర్వతాల మధ్యనుండి పంపేసింది. ఆ పిల్లాడు కంటికింపుగా బయటపడిన వాడు మధ్యాహ్నానికల్లా లోకులందరికీ కంటగింపుగా మారతాడు. 


ఎక్కడినుండి బయల్దేరిందో కరిమబ్బుల గుంపొకటి వడివడిగా పరుగెడుతూ అయ్యకోనేటి దగ్గరకొచ్చి ఆగింది. ఏ మేఘసందేశాలు అందుకుందో సరస్సంతా ఒక్కసారి జలజలా నవ్వింది. దక్షిణగట్టునున్న కుర్రాడొకడు ఏమీ తోచక విసిరిన గులకరాయికి కితకితలొచ్చి కిలకిలమంది. అలా మొదలైన ఒక్కో అలా చెరువంతా పాకేసింది.


పైనుండి ఈ పరవాశాల్ని గమనిస్తున్న మబ్బులక్కలన్నీ వాటిలో అవి మాటాడుకోవడం మొదలెట్టాయి.


‘ఇదుందే, ఈ కోనేరు... నా చిన్నతనాలనించీ చూస్తున్నానే! కాస్తంత వానకే కడుపు నింపేసుకుంటుంది. గట్టునున్నవాళ్లని చూసి గలగలమంటుంది. 


ఆ మొదటి మెట్టుమీద ఆదిభట్లాయన కూర్చునీవాడు గ్యాపకం వున్నాడా నీకూ?’ అంది మేఘమాల. 


‘నాకు తెలీకేం? పడమర గట్టునున్న వేణుగోపాలస్వామి మఠంలో తన శిష్యులందరికీ విద్య నేర్పీవాడు. సభనెలా రక్తి కట్టించాలి, వినేవాడిని తన కథాగానంతో ఎలా కట్టిపడెయ్యాలి, అసలు కథనీది ఎలా చెబితే మహరాజు సైతం మాటాడకుండా కూర్చుని వింటాడూ అనే సంగతులన్నీ ఆ మీసాల పంతులు చెబుతూ వుంటే ఒళ్లు ఝల్లుమనీదనుకో! ఆ కథలన్నీ విన్నాకనే ఆ కోనేట బండరాయిగా ఉండీదాన్ని కాస్తా కరిగి కన్నీరై ఇలా మబ్బుగా మారిపోయాను!’ అంటూ కంటనీరు పెట్టుకుంది సౌదామిని.


‘ఈ దక్షిణగట్టున కూర్చుని సామాజిక రుగ్మతలకి పిండం పెట్టేసిన గురజాడాయన పాదాలింకా గుర్తే నాకు! తెలుసునా? నిక్షేపంగా కాపరాలు చేసుకునే సాంప్రదాయ వాదుల మీద దయాదాక్షిణ్యాలు లేకుండా అక్షర బాణాలేసి సమాజాన్ని ప్రక్షాళన చేస్తానంటూ బయల్దేరాడు. అదేదో నాటకమొకటి సెలవిచ్చాడు. అబ్బో, మా చిన్నతనాల్లో మేమూ చూశాంలే! ఒక్కో మాటా గుండేసి పేల్చీసినట్టే అనుకో!’ మొయిద నుంచొచ్చిన పెద్ద మొయిలమ్మ మొదలెట్టింది.


అన్నీ కలిసి ఆ కోనేటి మీద చేరి కాసేపు కబుర్లాడుకుని, లోపలున్నదంతా కురిసి, మురిసిపోయాయి.


అప్పటివరకూ నిశ్శబ్దంగా తడిసి ముద్దైన కోనేరు తన అనుభవాల్ని చెప్పడం మొదలెట్టింది....


‘ఇప్పటికీ ఈ గట్లమీద సాయంకాలమైతే చాలు గొప్పలకు పోయే గిరీశాలు, గోల్ గప్పాలు తింటూ మోడర్న్ వెంకటేశాలు బోలెడంతమంది. జనానికి జెల్ల కొట్టీసి, రోజుగడుపుకునీ రామప్పంతుళ్లూ ఉన్నారిప్పటికీ! పదిమంది మంచీ కోరే సౌజన్యారావు పంతుళ్లు, కష్టకాలంలో చక్రం అడ్డేసి ఆదుకునే కరటకశాస్తుర్లూ కనబడతారిక్కడ.


మధురవాణిని మాత్రం ఇప్పటికీ చూడలేదమ్మలూ! అదొక తీరని కల!


మనం చూసిన సుబ్బికి మల్లే గట్టిగా బిగించి కట్టిన జడా, అందులోకి అల్లా ఉత్తర గట్టున జయంతివారింట్లోంచి తెంపుకొచ్చిన బంతిపూవొకటి పెట్టుకున్న ఆడపిల్లలెవర్నీ ఈమధ్య చూణ్ణేలేదనుకో! నేమానివారి కుర్రాడల్లే జుత్తు విరబోసుకున్న అమ్మాయిలే ఎప్పుడూ కనబడతున్నారు.


తూర్పుగట్టు మీదుండీ ఆంజనేయస్వామికి మంగళవారమొస్తే చాలు.... అప్పాలే, ఆకలే, ఆకులే... అంటూ ఒకటే గోల! తెల్లవారుతూనే ఒళ్లంతా సింధూరం మెత్తేసుకుని కోపం వచ్చినట్టు కనబడతాడా? కానీ ఎంత చల్లటి చూపో? ఈ కోనేరంత పెద్ద మనసున్న దేవుడు! ఇంకా ఈ గట్లమీద కొట్టే కొబ్బరిచిప్పల చప్పుళ్లు, కొత్తకోడళ్లని తిట్టే అత్తగార్ల దెప్పుళ్లు కూడా వినేదాన్ని! అప్పుడప్పుడు మధురమైన సంగీతమూ వినబడీది. 


అదెక్కడో పడమటి కుర్రాడొకడు వచ్చీసి, పట్రాయనాయన దగ్గిర పట్టుబట్టి పాట నేర్చుకున్నాడు. ఆ ఖంగుకి సినిమాల హంగు కలిస్తే చెప్పేదేముంది? ఆయన మది శారదాదేవి మందిరం. ఆ సుశీలమ్మతో యుగళాల కోసమే పుట్టిన గళమది! 


వెన్నెల రోజుల్లో ఈ గట్టున కూర్చుని ‘ఎచటనుండి వీచెనో ఈ చల్లనిగాలి?’ అంటూ పాట వినీవారు ఈ ఇళ్లవాళ్లందరూ! ఇదేం పాటరోయ్ అంటూ నేనూ ఓ చెవటు పడీసీదాన్ని. అంత ఖంగుమనీ కంఠాన్నీ దొంగలాగ మార్చీసి, మత్తుగా పాడుతోంటే  భంగు తిన్నట్టుండీదనుకో! 


అటువైపు చూసేవా? ఆ ఎత్తరుగుల ఇళ్లన్నీ ఇప్పుడంతా బోసిగా కనబడుతున్నాయి కదూ? ఆ దేవరకొండాయన ఠీవిగా కూర్చునుంటే చుట్టూతా అంతాచేరి భువనవిజయంలా వుండీదనుకో! ఇప్పుడు వాళ్ల మనవలంతా టీవీల ముందు కూర్చుంటుంటే ఆ అరుగుల మనసు విరిగి, వీధికుక్కల మొరుగులవుతున్నాయి. 


ఒకటొకటిగా డాబాలన్నీ మేడలైపోయాయి. వాహనాలకి కూడా చోటులేనంత ఇరుకిరుకుగా తయారైపోయారు. దారినపొయ్యే దానయ్యల దాహం కోసం మజ్జిగలిచ్చేవారు పూర్వం. ఇప్పుడా మంచిమనసులన్నీ ‘చలివేంద్ర’జాల మహేంద్రజాలాలతో రాజకీయ మయమైపోయాయి.


కార్తీకం నెల్లాళ్లూ ఆ ఆవునెయ్యి వాసనా, పత్తి కాలిన పరిమళమూ, నిత్యం మోగుతూ నా గుండె ఝల్లుమనిపించే ఆ గుడిగంటా ఎంతిష్టమో నాకు! సరాసరి కైలాసం నుంచి వచ్చీసి ఇక్కడ శంకరుడు మఠం వేసుకు కూర్చున్నాడనిపిస్తుందిస్మీ నాకీ ‘శంకరమఠం’ చూస్తే!


రేతిరయితే చాలు, చీకటొచ్చి నన్నూ, నా కడుపున ఉన్న ఈ బండల్నీ కౌగిలించేస్తుంది. అదెంత భయమో తెలుసా మీకు? ఎవరొచ్చి పలకరిస్తారు? రెండో ఆట చూసొచ్చి ఇటుగా నడుచుకుంటూ వెళ్లే వాళ్లు రేలంగోడి హాస్యం కబుర్లవీ చెప్పుకుంటూ నవ్వుకుంటూ వెళ్తూండీవారు. అదైనా కాసేపే! ఆ తరవాత భయంకరమైన నిశ్శబ్దం! 


కానీ కార్తీకమాసంలోని, క్షీరాబ్ది ద్వాదశికీ, ఇంకా శివరాత్రినాడూ ఈ ఊరివాళ్లంతా కలిసి కొబ్బరిచిప్పల్లోను, అరటిదొప్పల్లోను వెలిగించి వదిలే దీపాలు చూడంగానే నాకు సంబరంగా వుండీది. ఇక ఆ నెల్లాళ్లూ రాత్రుళ్లసలు భయమనీదే ఉండీది కాదు. వాటన్నిటినీ రాతిరంతా ఆరిపోకుండా కాపాడుకుంటూ భయంలేకుండా గడిపీవాళ్లం.


ఎన్నోటి జ్ఞాపకాలనుకున్నావు? దీపావళొస్తే చాలు, కుర్రాళ్లంతా చేరి ఈ గట్లమ్మట జువ్వలూ, సిసింద్రీలూ వేసుకుంటూ పోటీపడీవారు. 


బట్టలుతికీవాళ్లు, గేదెల్ని కడిగేవాళ్లయితే సరేసరి! 


ఇక నాకసలు నచ్చనిదొకటే!


ఎవరినైనా మట్టితోనే తయారుచేసి మట్టిలో కలిపేస్తాడు ఆ దేవుడు. అటువంటి దేవుణ్ణి మాత్రం మట్టితో కాకుండా ఏవేవో కలిపీసి తయారుచెయ్యడం, అవన్నీ తీసుకొచ్చి ఇందులో పారీడం! 


ఎంతకని భరిస్తానే నేనుమాత్రం?


అంతందంగా తయారుచేస్తారా ఆ బొమ్మల్నీ? సాక్షాత్తూ కైలాసాన్నే భూమికి దింపీగల కుమ్మరులున్నారు మనూళ్లో! ఆ బొజ్జ గణపయ్య కళ్లు చూస్తే ఎంత నిబ్బరంగా వుంటుందో మనసంతా! అంత ప్రశాంతంగా వున్నవాడూ వీళ్లు చేసీ అపభ్రంశాలన్నీ చూసీ చూసీ ‘ఎంత తొందరగా నన్ను నిమజ్జనం చేసీస్తారా? అప్పుడు కాదా నాకు హాయి? మరో ఏడాద్దాకా ఈ చల్లనితల్లి కడుపులో నిశ్చింతగా నిద్రపోతాను!’ అనీసుకుంటాడు.


ప్రతియేటా నిమజ్జనాలన్నీ అయ్యేక నాతో ఇవే కబుర్లు! ఒక్కో గణపతీ ఒక్కొక్క కథ చెప్పీవాడు. 


ఎన్నైనా చెప్పండే! నాకీ వూరంటే మమకారం. ఉషోదయాన ఈ చెట్లమీద చేరిన పిట్టలన్నీ బుజ్జిబుజ్జి గొంతులేసుకుని ఊరందర్నీ లేపుతాయి. తెల్లారిలేచి పొలాలకి బయల్దేరీ రైతన్నలు, కలంపట్టుకుని ఈ గట్లమ్మట చేరి కథలూ, కవితలూ సృష్టించే శాలువా కవులూ, అందెల సవ్వడి చేసుకుంటూ బిందెలట్టుకుని నడిచే చందమామలు.. ఎన్నని చెప్పను? తల్లి దగ్గిర కడుపునిండా పాలు తాగీసి, మూతికింకా అంటుకున్న పాలచుక్కలతో ముద్దొచ్చే లేగదూడలు, అమ్మచేతి ముద్దకైనా నోచుకోని ఎందరో అభాగ్యజీవులు.. వీళ్లందర్నీ చూస్తుంటాను!


నాకొక స్వప్నం. ఈ చుట్టూతా అందంగా పూలమొక్కల్ని పెంచీసి, పదిమందీ పడవలేసుకుని హాయిగా నాతో విహరించాలని! వెన్నెలంతా ఏటిపాలవుతోంటే వెర్రికుంకలు ఇళ్లలో బిగదీసుకుని కూర్చుంటారు. నాతో కలిసి ప్రతి పౌర్ణమికీ అంత వెన్నెల్నీ జుర్రేసుకుంటే ఈ రోగాలకీ, రొష్టులకీ ఆ కటకం డాక్టరు కూడా ఇవ్వలేని మందులా పనిచేస్తుంది.


ఎవరైనా వింటారా నా ఘోష?’ అంటూ మౌనంగా రోదించసాగింది.


మేఘాలన్నీ ఎప్పుడో కరిగి నీరైపోయాయి. 


.....జగదీశ్ కొచ్చెర్లకోట

కామెంట్‌లు లేవు: