23, జూన్ 2022, గురువారం

పిల్లలూ, మనవలూ..

 అల అగ్రహారంలో  ఎత్తు అరుగులున్న ఓ వందేళ్ళనాటి పెద్ద ఇల్లు.. నాలుగైదు వాకిళ్ళూ, వరండాలూ, పెరడూ.. గదులూ...


ఎర్రటి వేసవికాలపు ఎండలో మెరుస్తూ రాజసంగా కనబడేది...


శలవుల్లో ‘శ ‘ అనగానే రక రకాల ఊర్లనించీ గూడు చేరిన పక్షుల్లా ఆనందంగా ఎగిరొచ్చి వాలిపోయే పిల్లలూ, మనవలూ.. 


చిన్నా, పెద్దా కలిసి ముఫ్ఫైమంది కి తక్కువకాని మనుష్యులు...


“బారెడు పొద్దెక్కాకా వీధరుగులు కడుక్కోరర్రా! పొద్దున్నే కడుక్కోవాలి..” 


పెద్ద కోడలి మాట వినడానికి పిల్లలు నిద్ర లేస్తేగా?


  పిల్లలు రాత్రి ఓ పట్టాన పడుకోరు, పొద్దున్న లేవరు.. ప్రతీ తరంలోనూ ఏ మాత్రం అంతరం లేని నిరంతర ప్రక్రియ ఇది....


మండువాలోనే రాత్రే బకెట్ నీళ్ళు, చెంబూ పెట్టుకుని.. పొద్దు పొడవకుండానే ఆవిడే లేచి వీధి అరుగులు, గుమ్మాలు కడుక్కుని, వాకిట్లో పేణ్ణీళ్ళు కలాపి చల్లి ఓ గుమ్మడిపండో, పనసచెక్కో ముగ్గు వేసి వచ్చేసరికి ముడుచుకుని పడుకున్న పిల్లలు కదలరు.. మంచాల మీది పెద్దలు మెదలరు....


కాఫీ వసారాలో పొయ్యి వెలిగించి డికాక్షన్ వేసే సమయానికి ఒక్కొక్కళ్ళూ ప్రత్యక్షం.. మెట్ల మీద సుఖాసనాలు.. కులాసా కబుర్లు.. సందడి..


' వదినా నాకు పంచదారెక్కువ.. 


అక్కా, నాకు పాలు తక్కువ.. 


నాకు డికాక్షనూ, పంచదారా రెండూ ఎక్కువే.. 


నాకు బాగా వేడిగా ఉండాలి.. నిన్న కాఫీ చల్లారిపోయింది.. 


' అయ్యబాబోయ్! నాకు వేడి ఒద్దు, నాలిక్కాలిపోయింది


 ఇలాంటి రకరకాల ఆదేశాలు, అభ్యర్ధనలు గుర్తు పెట్టుకుని.. అందరికీ కాఫీలిచ్చి.. పొయ్యిలో నిప్పులు బయటకి లాగి మిగతా కాఫీ చెంబులో పోసి వాటిమీద సన్నటి సెగకి పెట్టి, పొలంపనికొచ్చినవారికి అది తాగాలని గుర్తు చేసి నాలుగు చెంబులు నీళ్ళు పోసుకుని, జుట్టు ముడి వేసుకుని బొట్టు పెట్టుకుని వంట ఇంటి ప్రవేశం…


 వంద చదరపు అడుగులుంటుందేమో ఆ గది.. 


ఓ మూలకి పొయ్యి, పెడా.. మరో మూలకి గంజి వార్చుకునే తూము.. 

మెత్తగా దంచిన రాళ్ళ ఉప్పు పెట్టుకునే రాచ్చిప్పసైజుకు సరిపడా జాలకర్ర అనే ఓ చిన్న కిటికీ..


ఆ చిన్న గదిలో రెండు కూరలు, పప్పు, పులుసు, పచ్చడి, వేడి వేడి గా పొగలు కక్కే అన్నం వీటితో పసందైన భోజనం.. ఈ లోపుల ‘ఆకలో రామచంద్రా!’  అని ఏడ్చే పిల్లలకి తరవాణి చద్దన్నాలు


అందరి భోజనాలు కానిచ్చి,  ఆకులు తీసి పేడలు పెట్టి, అలసిన నడుముని నట్టింటి గడపకు జేరేసేసరికి మధ్యాహ్నం టీ వేళే..


 టీతో పకోడీలో, చెగోడీలో.. అదీ కాకపోతే పనసపళ్ళో..


మళ్ళీ ఇంతమందికీ రాత్రి భోజనాలో ఫలహారాలో అంటే బలుహారాలే.. రొట్టెముక్కలో, ఉప్పుడుపిండో.. ఇలా.. 


ఉప్పు, మిరపకాయల దగ్గరనించీ ఎండపెట్టుకుని దంపించి పెట్టుకునే ఊరగాయ కారాలూ..


ఆవకాయలూ, ఆల్చిప్పలకీ, కత్తిపీటలకీ నాలుగిళ్ళకీ పిల్లలని పంపి తెప్పించుకుని,  అరుగంతా పరిచి పెట్టే తొక్కుపచ్చడీ, మాగాయ ముక్కలూ.. దరిమిలా జాడీలకెక్కే ఊరగాయలూ..


పంచ మీదకి పాకిన బూడిద గుమ్మడికాయల్ని అలాగే తరిగి ఇంగువ ఘుమాయింపులతో పాటు పెట్టే గుమ్మడి వడియాలు, పొట్టు వడియాలు, చిట్టి వడియాలూ. మజ్జిగ మిరపకాయలూ..


కాలాన్ని బట్టి గింజలు తీసుకుని దాచుకునే చింతపండు ముద్దలూ..


రాత్రి నానబెట్టి మర్నాడు దంపించుకునే అటుకుల ధాన్యాలూ..


బియ్యం తడిపి పిండి కొట్టి వండే జంతికలూ, అరిసెలూ..


కొత్తనోములూ, పాత నోములూ అంటే దొంతరలుగా వేసే వందలాది అట్లూ..


ఈ లోపు గ్రహణాలూ, పుణ్యాహవచనాలు, శుద్ధి వేళలంటూ చింతపండు పెట్టి రాజుగారి సింహాసనాలంత ఉండే దేవుడి సింహాసనల్ని, సామాన్లనీ తోముకోవడాలు..


సాయంత్రమవుతూనే ముగ్గు పిండి,  మెత్తటి బట్టా పెట్టి లాంతర్లు తుడుచుకోవడాలు. కిరసనాయిలు పోసుకుని రెడీగా ఉంచడాలూ..


పాతచీరలతో బొంతలూ, పెరటిలో పండే బూరుగుదూదితో దిళ్ళూ, పరుపులూ కుట్టడాలు, కుట్టించడాలు...


ఇంట్లో బాలింతలో, పథ్యం వాళ్ళో ఉంటే వారికి ప్రత్యేక వంటలూ..


ఇంకా ఎన్ని మర్చిపోయానో నాకు గుర్తు లేదు.. 


ఇలా ఎడతెగని పనులతో అలుపెరగక తిరిగే అలనాటి అతివలు...


ఇంటివారి ఆకలినే కాక అభిరుచులనెరిగి వండి, వడ్డించే ఆ అన్నపూర్ణలు...


వీటన్నింటి మధ్యలో.. ఏడాదికో సారో, రెండుసార్లో పుట్టిళ్ళకి వెళ్ళేటప్పుడో, పేరంటానికి వెళ్ళేటప్పుడో తప్ప వీధిముఖం చూడని అసూర్యంపశ్యలు 


మా అమ్మమ్మతరం వాళ్ళు.. 


ఇప్పుడు లాక్ డవున్ పేరిట మనం పడుతున్నామనుకుంటున్న కష్టాలను, ‘తెల్లారింది.. వండామా, తిన్నామా, తోమామా’ అన్నట్లుగా గడుస్తున్న మన పరిస్థితిని చూస్తే ఏమంటారో? 


" ఇదీ ఓ పెద్ద విషయమేనటర్రా? అంటారో...


" ఇందులో ఇంత బాధ పడిపోవడానికేముందో అని ఆశ్చర్యపోతారో?


అనిపించి నవ్వొచ్చింది.. 

ఏదైనా నేర్పతరం కానీ మాన్పతరమా? అన్నట్టు.. ఆఫీస్ పనికో, మరొకదానికో బయటకు వెళ్తే కానీ గడవని తరం మనది.. అందుకే కాళ్ళు, చేతులు కట్టేసినట్టు ఈ విలవిల..


ఇదీ గడిచిపోతుంది.. 


మళ్ళీ అంతా మామూలవుతుంది.. 


నేడు మబ్బేసి,  మసకేసినా రేపు వెలుగొస్తుంది..


 ఇంట్లో ఉండవలసి వచ్చినందుకు బాధ పడక, క్షేమంగా ఉండడానికి మనకో చక్కటి ఇల్లు, మనతోడుగా మనదనుకునే ఒక కుటుంబం..


 నాలుగు నంబర్లు నొక్కితే కనిపించి, వినిపించడమే కాదు, మనకోసం కలత పడే నలుగురు స్నేహితులూ.. 


నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళే వెసులుబాటు ఉన్నాయని సంతోషిద్దాం.. 


మనకు కలిగింది కావలసిన వారితో పంచుకుందాం..


సర్వే జనా సుఖినోభవంతు..

కామెంట్‌లు లేవు: