12, సెప్టెంబర్ 2022, సోమవారం

కోడిగుడ్డంత గోధుమ గింజ

 కోడిగుడ్డంత గోధుమ గింజ 

—-------------------------------------

-లియోటాల్స్టాయ్.


   ఒక రోజు ఒక లోయలో పిల్లలు ఆడుకుంటూండగా కోడిగుడ్డు ఆకారంలో అంతే ప్రమాణంలో ఉన్న ఒక గోధుమ గింజ వారికి దొరికింది.ఆ దారి వెంటే వెళ్తున్న ఒక ప్రయాణీకుడు ఒక కానీ ఇచ్చి దాన్ని కొనేసి, పట్నంలో ఉన్న రాజుకు అదొక అపూర్వ పురాతన వస్తువని అమ్మేసాడు. 


   రాజు తన రాజ్యంలో విజ్ఞులందరినీ పిలిపించి ఆ వస్తువు ఏమిటని అడిగాడు. వారెవరికీ ఎంత చూసినా ఆ వస్తువేమిటో అర్ధం కాలేదు. ఒకరోజు ఒక కోడి ఎక్కడనుంచో  కిటికీలోంచి ఎగిరొచ్చి ముక్కుతో పొడిచి   ఆ గోధుమ గింజకు కన్నం చేసింది. అప్పుడు అందరు విజ్ఞులూ  దాన్ని తరచి  చూసి "రాజా! ఇది కోడిగుడ్డంత ఆకారంలో ఉన్న గోధుమ గింజ" అన్నారు.


    అది వినగానే రాజు ఆశ్చర్యపోయి ఆ విజ్ఞులందరితో అలాంటి గోధుమ గింజ ఈ రాజ్యంలో ఎక్కడ పండుతోందో తెలియజేయమని ఆదేశించాడు. గ్రంథాలన్నీ తిరగేసి తల బద్దలు కొట్టుకున్నా వారికి ఏమీ దొరక్కపోవడంతో  వారందరూ రాజు దగ్గరకు వచ్చి " ప్రభూ! ఎన్ని గ్రంథాలు తిరగేసినా మాకు ఆ ప్రదేశం సంగతి తెలియలేదు. మనం రైతులనే అడగాలి. బహుశా వారిలో ఎవరికైనా వారి తండ్రుల ద్వారా ఇలాంటి గోధుమ గింజలు పండే ప్రాంతం గురించి తెలిసి ఉండవచ్చు" అన్నారు. వెంటనే రాజు తన రాజ్యంలో బతికున్న అత్యంత ముసలి రైతుని వెదకి తన ముందు హాజరు పరచమని ఆదేశించాడు.  వయసుడిగి నడుం వంగిపోయి, పళ్ళన్నీ రాలిపోయి, రెండు కర్రల ఊతతో కష్టం మీద నడవగలిగే ఓ ముసలి రైతును సైనికులు రాజు ముందు హాజరు పరిచారు.

రాజు ఆ గోధుమ గింజను ఆ రైతుకు చూపించినా, తన చూపు బాగా మందగించటంతో అదేమిటో తెలియక చేతుల్లోకి తీసుకుని తడిమాడు. ఆ తరువాత రాజు ఆ రైతుతో " ఓ వృద్ధ కర్షకా! ఇలాంటి గోధుమ గింజలు ఎక్కడ పండుతాయో తెలుసా? నీవెప్పుడైనా ఇలాంటి గోధుమ గింజలు చూడ్డమో లేక పండించడమో చేసావా?" అని అడిగాడు కానీ చెవుడుతో బాధపడుతూండడం మూలాన్న అతి కష్టంతో రాజు అడిగిన ప్రశ్నను అర్ధం చేసుకుని "ప్రభో! ఇలాంటి గోధుమ  గింజలు నేనెప్పుడూ  నాటనూ లేదు, పండించనూ లేదు. అసలు చూడనూ లేదు. బహుశా మా తండ్రి గారికి ఏమైనా తెలిసే అవకాశం ఉంది" అన్నాడు. వెంటనే రాజు ఆ ముసలి రైతు తండ్రిని హాజరు పరచమని ఆదేశించాడు. ఒక చేతికర్ర సహాయంతో నడుస్తూ ఆ రైతు తండ్రి రాజు సభలోకి వచ్చాడు. రాజు అతనికి ఆ గోధుమ గింజను చూపిస్తూ "ఓ వృద్ధ కర్షకా! నీవైనా ఇలాంటి గింజలు మన రాజ్యంలో ఎక్కడ పెరుగుతున్నాయో చెప్ప గలవా? నీవు ఇటువంటి గింజలు ఎప్పుడైనా తెచ్చావా? నీ పొలాలలో ఎప్పుడైనా నాటావా? " అని అడిగాడు.

 

    ఆ వృద్ధుడికీ కొంచం చెవుడు ఉన్నా కొడుకు కన్నా వినికిడిలోనూ, చూపులోనూ కాస్త నయమే. 


     "లేదు. ఇలాంటి గింజలు నా పొలంలో ఎప్పుడూ నాటలేదు, పండించనూలేదు. నేనెప్పుడూ తేలేదు అయినా ఆ రోజుల్లో ఇంకా డబ్బులు చెలామణీలోకి ఇంకా రాలేదు. ప్రతీ మనిషీ తన పంట తానే పండించుకొనేవాడు. ఏదైనా అవసరం ఉంటే ఒకరికొకరు సహాయం చేసుకునే వాళ్ళం. ఇలాంటి గింజలు ఎక్కడ పండేవో నాకు తెలియదు. ఇప్పటికన్నా అప్పుడు పంటలో గింజలు చాలా ఎక్కువే పండేవి. నేనెప్పుడూ ఇలాంటి గింజలు చూడలేదు కానీ మా నాన్న తన కాలంలో గోధుమ గింజలు ఇంతకన్నా చాలా పెద్దవిగా ఉండి ఎంతో పిండినిచ్చేవి అనేవాడు. మీరు అతన్ని అడిగితే ఏమైనా తెలుస్తుంది" అన్నాడు. 


    రాజు ఆ వృద్ధుని తండ్రిని పిలిపించాడు. ఆ వృద్ధుడు  ఏ కర్ర సహాయమూ లేకుండా చక్కగా నడుచుకుంటూ వచ్చాడు. అతడి చూపూ మందగించలేదు. వినికిడి శక్తి బాగా ఉండడమే కాక మాట్లాడే తీరూ ప్రత్యేకంగా ఉంది. రాజు అతనికి ఆ గోధుమ గింజను చూపించాడు. ఆ వృద్ధుడు దాన్ని చేతిలోకి తీసుకుని తిప్పి చూసాడు. 


   "ఇంత మంచి గింజని చాలా కాలం తరువాత చూసాను" అంటూ చిన్న ముక్క తృంచి నోట్లో వేసుకుని రుచి చూసాడు. " ఇది అదే రకమైన గింజే" అన్నాడు.


    "చెప్పు తాతా!" అంటూ రాజు "ఎప్పుడు ఎక్కడ అలాంటి గింజలు పండించబడ్డాయి. మీరు ఎప్పుడైనా అలాంటి గింజలు తీసుకొచ్చారా? మీ పొలాల్లో నాటారా?" అని అడిగాడు. 


     "ఇలాంటి గింజలు మా కాలంలో అన్నిచోట్లా పండేవి. నా యవ్వనపు రోజుల్లో ఇలాంటి గింజలు తినే బతికాను, ఇతరులకూ ఇవే తినిపించాను.  ఇలాంటి గింజలే నాటి పంటలూ పండించే వాళ్ళం" అన్నాడు ఆ వృద్ధుడు.


     రాజు "తాతా! చెప్పు మీరెక్కడైనా కొనేవారా? లేక మీరే పండించేవారా?" అని అడిగాడు.


     వృద్ధుడు చిరునవ్వు చిందించాడు. 


     ఆ వృద్ధుడు "మా రోజులలో రొట్టెను కొనడం అమ్మడం వంటి పాపపు పనిని తలంచనైనా లేదు. మాకు డబ్బు అంటే ఏమిటో తెలియదు. ప్రతీ మనిషికి తనకు సరిపడా తిండి గింజలు వారి దగ్గర ఉండేవి" అన్నాడు.


    "అలా అయితే" అంటూ రాజు "మీ పొలాలు ఎక్కడ ఉన్నాయో చెప్పు, ఎక్కడ ఇలాంటి తిండి గింజలు పండించావో చెప్పు" అన్నాడు.


    ఆ వృద్ధుడు "నా పొలం దేవుడి భూమి. నేనెక్కడ నాగలితో దున్నితే అక్కడే నా భూమి. ఏ మనిషీ ఇది నా సొంత  భూమి అని అనేవాడు కాదు. శ్రమ ఒక్కటే తమ సొంతం అనేవారు ఆనాటి ప్రజలు" అన్నాడు.


     "నా మరో రెండు ప్రశ్నలకు జవాబు చెప్పు" అంటూ రాజు  మరింత వివరిస్తూ " "మొదటి ప్రశ్న: "అప్పుడు అలాంటి గింజలు పండించిన భూమి ఇప్పుడు ఎందుకు పండించటం లేదు? రెండవ ప్రశ్న: ఎందుకు నీ మనవడు రెండు కర్రల ఊతంగా చేసుకుని నడుస్తున్నాడు, నీ కొడుకు ఒకే కర్ర ఊతంగా చేసుకుని నడుస్తున్నాడు, నీవు మాత్రం ఏ ఊతం లేకుండా నడుస్తున్నావు, నీ కళ్ళు కూడా కాంతివంతంగా ఉన్నాయి, నీ పళ్ళూ గట్టిగానే ఉన్నాయి, నీ మాట్లాడే తీరూ స్పష్టంగా, వీనుల విందుగా ఉంది. మనుషుల్లో ఆ గుణాలన్నీ ఇప్పుడెందుకిలా మారిపోతున్నాయి అన్నాడు.


 "అప్పుడలా ఉండి ఇప్పుడు ఆ గుణాలు ఎందుకిలా మారిపోతున్నాయంటే ఆ రోజుల్లో మనుషులు ఎవరి శ్రమ మీద వారు బతికేవారు, మరొకరి శ్రమపై ఆధారపడేవారు కాదు. పాత రోజుల్లో దేవుడు చేసిన చట్టం ప్రకారమే జీవించేవారు. వారికి ఏదైతే తమ స్వంతమో వాటితోనే సంతోషంగా ఉండేవారు, ఇతరులు ఉత్పత్తి చేసిన వాటిని ఆపేక్షించేవారు కాదు" అన్నాడు.


                        ****** 


ఆర్.ఎస్. వెంకటేశ్వరన్. 


(A Grain as Big as a Hen's Egg అన్న టాల్ష్టాయ్ కథకు ఆంగ్లం నుంచి అనువాదం)


వెంకటేశ్వరన్ ఋషి నారద సుబ్రహ్మన్యం వాల్ నుండి సేకరణ

కామెంట్‌లు లేవు: