ధర్మాకృతి : పరమ గురువుల అనుగ్రహం - 1
1905ప్రాంతాలలో పరమగురువులు తిండివనం సమీప గ్రామాలలో పర్యటన చేస్తున్నారు. పెరుముక్కల్ చాతుర్మాస్య సమయంలో శ్రీసుబ్రహ్మణ్య శాస్త్రి గారు సకుటుంబంగా స్వామివారిని దర్శించారు. అప్పుడు స్వామివారు చంద్రమౌళీశ్వర పూజలో ఉన్నారు. పూజ చేస్తున్నంతసేపూ స్వామివారు గిణిని పరీక్షగా చూస్తూనే ఉన్నారు. మొదటి కలయికలోనే మరి వారికేమి స్ఫురించిందో! మరి మన స్వామివారి కేమి తోచిందో వారి మాటలలోనే చెప్పుకుందాం.
“వారిని చూస్తున్నప్పుడు మిగతా మనుష్యులనందరినీ చూసినపుడు కలిగే భావం కలగలేదు. పూర్వకాలపు ఋషీంద్రులనో మునీంద్రులనో ఎవరో ఒక మహానుభావుని దర్శించిన భావన అప్పటివరకూ ఎవరి యెడా ఏర్పడని ఒక పూజ్య భావం ఏర్పడింది. అంతవరకూ నాటకాలలో ఋషులను చూశాను కానీ వారి యెడ ఈ రకమైన పూజ్య భావం కలగలేదు. వారిపైన పూజ్య భావమే కాదు ఒక ప్రియం కలిగింది. ఎంతో ఆత్మీయులను, కావలసిన వారిని చూసిన భావం. ఏదో దర్శనం చేసుకొని పోదాం అని వచ్చిన నాకు వారి వద్దనే ఎల్లకాలం ఉండిపోవాలనే తీవ్ర ఆకాంక్ష ఏర్పడింది”.
పూజ పూర్తి అయిన తరువాత స్వామివారు గిణిని దగ్గరకు పిలిచి అనేక ప్రశ్నలు వేసి వీరి చురుకుదనానికి, సమయస్ఫూర్తికి ఎంతో అబ్బురపడ్డారు. చాలా సమయం బాలునితో గడిపిన తరువాత అందరి సమక్షంలో ఈ బాలుడు ఎంతో గొప్ప వాడవుతాడని చెప్పారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అది ఎంతో పెద్ద ఆశీర్వాదంగా తీసుకొని తమ పిల్లవాడు గొప్ప ప్రభుత్వోద్యోగి అవుతాడనుకొని సంతోష పడ్డారు. జగద్గురువులవుతారనే ఆలోచన వారికి ఏ కోశానా లేదు. అలాంటి ఆలోచన కలగడానికి కూడా అప్పటి పీఠాదిపతులకు వయస్సు ఎక్కువ లేదు. వారిముందు పీఠాదిపతులు 40 ఏళ్ళు పీఠాధిపత్యం నిర్వహించారు. అయితే పూజ చేస్తున్నంత సేపు తీక్షణంగా చూస్తూనే ఉండిపోయిన స్వామివారి మనస్సులో ఏమి భావం కలిగి ఉంటుంది? వారికి గిణి తమ వారసులవుతారనే భావం మనస్సులో మెదిలి ఉండాలి. అలా అనుకోవడానికి తగిన ఆధారాలు తరువాతి సంఘటనలో కన్పిస్తున్నాయి. మరి 12సంవత్సరాల మన గిణి ఏమనుకున్నారో?
“అంత పెద్ద స్వామికి మనమీద ఇంత ప్రియం ఏమిటి? పొంగిపోయాను. వారు సర్వ సాధారణమైన ప్రశ్నలే వేశారు. క్లాసులో మంచి మార్కులు వస్తున్నాయి కదా! మరి నిన్ను క్లాసు మానిటర్ ణి చేశారా? రోజూ సంధ్యావందనం విడువకుండా చేస్తున్నావా? సూక్తాలు, శ్లోకాలూ చెప్పుకొంటున్నావా? సంస్కృతం ఏమైనా నేర్చుకొంటున్నావా? లాంటివి?.
“వారి తీక్షణమైన చూపు నాలో స్పిరిట్యువల్ గా మార్పు తెచ్చిందా అనే విషయం నాకు తెలియదు. దాని గురించి ఆలోచించే మనస్సు, వయస్సు అప్పటికి నాకు లేవు. అస్సలు స్పిరిట్ అంటే ఏమిటో కూడా అప్పుడు నాకు తెలియదు. మానిటర్ వా అన్న ప్రశ్నలో నాయకత్వ లక్షణాలున్నాయా అని పరిశీలించారు అని మీరు చెప్పుకొంటే చెప్పుకోండి. నాకు మాత్రం వారడిగిన ప్రశ్నలు సర్వసాధారణంగానే తోచాయి. పసివాని తొక్కు పలుకులు వినడానికి రకరకాలుగా ప్రశ్నించే పెద్దల ప్రశ్నలుగానే తోచాయి.
బాలుని తరచుగా తమ వద్దకు తీసుకొని రావలసినదిగా చెబుతూ అనుగ్రహ ప్రసాదాలు ఇచ్చి పంపారు స్వామివారు. శాస్త్రిగారు అది ఆజ్ఞగా తీసుకొని తరచూ గిణితో కలసి స్వామివారిని దర్శించడం అలవాటు చేసుకున్నారు. అయితే గిణికి ఏర్పడిన ప్రియం మూలాన తండ్రితోనే కాక విడిగా కూడా దగ్గరలో ఉన్న ప్రదేశాలన్నింటిలోనూ వీలయినప్పుడల్లా వెళ్ళి దర్శనం చేసుకోనారంభించారు. పెరుముక్కల్ విశ్వరూప యాత్ర సందర్భంగా స్వామివారు ఒక దేవాలయం నుండి బయటకు వచ్చేటప్పుడు గుంపులో దూరంగా మన గిణి ఉన్నారు. బయటకు వస్తూనే సూటిగా గిణి కళ్ళల్లోకి చూశారట. ఆ చూపు మన మహాస్వామి వారి స్మృతి పథంలో నిత్యనూతనంగా నిలిచిపోయింది. “ఆ వీక్షణం నా మస్తిష్కంలో ఒకానొక అలజడిని రేపింది. ఆ అలజడిని వివరించేందుకు సరి అయిన పదములు దొరకడం లేదు. తదాదిగ మనస్సులో మళ్ళీ మళ్ళీ స్వామివారిని దర్శించాలని ఒకటే ఆరాటం తహ తహ అంటారు స్వామివారు. దీక్షల్లో మూడు రకాలు గదా! గిణికి స్వామివారు మత్స్య దీక్ష(నయన దీక్ష)ను అనుగ్రహించారేమో అయితే ఈ విషయం మహాస్వామివారినడిగితే మీరంతా పెద్దవాళ్ళు పెద్దపెద్ద విషయాలన్నీ తెలిసిన వారు కాబట్టి ప్రతి విషయాన్ని ఏదో పెద్ద విశేషం చేసి చెప్పగలరు అని చురకలేస్తారు.
(సశేషం)
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి