25, మార్చి 2023, శనివారం

ప్రవచనం - పారాయణం - ప్రాణ రక్షణం


🙏🙏🙏🙏🙏:

 ప్రవచనం - పారాయణం - ప్రాణ రక్షణం


పరమాచార్య స్వామివారి భక్తులైన బ్రహ్మశ్రీ వళత్తూర్ శ్రీ రాజగోపాల శర్మ గారు ప్రముఖ సంస్కృత విద్వాంసులు. వేదశాస్త్రాలను పాఠశాల ప్రణాళిక ద్వారా నేర్చుకున్నారు. చిన్నవయసులో కుంబకోణం గోవింద దీక్షితర్ రాజ వేద పాఠశాలలో చదువుకుంటూ సంస్కృతం కూడా నేర్చుకున్నారు. ఆచారం, అనుష్టానం, ఉన్నత విలువలు కలిగిన మనిషి. తరువాత మద్రాసు సంస్కృత కాలేజిలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.


సంస్కృత బోధన చెయ్యాలని వారికి మక్కువ ఎక్కువ. దాంతో వారికి ఎందఱో శిష్యులయ్యారు. వారు మామూలు విద్యార్థులు కాదు. వారి వద్ద సంస్కృతం నేర్చుకునే అదృష్టం పొందిన ధన్యాత్ములు. చాలా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న పెద్దవారు కూడా వారికి విద్యార్థులే. కొంతమంది ఇతర భాషలందు నిష్ణాతులు కూడా.


భారతీయ విద్యాభవన్ మైలాపూర్ చెన్నై శాఖ శాస్త్రిగారి శక్తిసామర్త్యాలకి నిలవెత్తు సాక్ష్యం. ఆదినుండే వారు సంస్కృత అభివృద్ధి మండలికి వారు అధ్యక్షులు. ఇరవైఏడేళ్ళ పదవీకాలంలో వేలమంది విద్యార్థులు సంస్కృతం నేర్చుకోవడానికి కారణభూతులయ్యారు. ఎందరో విద్యార్థులు వారిని కులగురువుగా భావించేవారు.


వారు సంస్కృత కళాశాలలో చదువు ముగించుకున్న తరువాత కుంబకోణం వెళ్లి పళమనేరి ఆయుర్ అయ్యర్ వేద పాఠశాలలో చదివారు. తరువాత చెన్నై రామకృష్ణ మిషన్ పాఠశాలలో ఇరవైఆరేళ్ళ పాటు సంస్కృత అధ్యాపకులుగా చేశారు.


నలభై సంవత్సరాల క్రితం రామకృష్ణ మిషన్ పాఠశాలలో ఉన్నప్పుడు పురాణ ప్రవచన సభను నెలకొల్పి, చెన్నై రామకృష్ణ మిషన్ సెంట్రల్ ఎలిమెంటరి స్కూల్ ఆడిటోరియంలో వారంలో మూడురోజుల పాటు ప్రవచనాలు చెప్పేవారు.


ఆ సమయంలో కూడా నీటి కొరత వల్ల ప్రజలు చాలా ఇబ్బందిపడేవారు. అప్పుడు మహానుభావులు రాజాజీ చెన్నై స్టేట్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. రాష్ట్రం మొత్తం పూజలు, ప్రార్థనలు చెయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


అప్పుడు కొందరు ఆస్తికులు నా వద్దకు వచ్చి, మహాభారతంలోని విరాటపర్వం పారాయణ చెయ్యవలసిందిగా అడిగారు. దాదాపు రెండు నెలల పాటు పారాయణ చేశాను. అప్పుడు రెండు మూడు సార్లు భగవంతుడు మాకు వర్షాలు ప్రసాదించాడు.


దాని తరువాత చాలామంది నన్ను మొత్తం మహాభారతం ప్రవచనం చెప్పమని అడగడం ప్రారంభించారు. ఆచార్యుల అనుగ్రహంతో సంపూర్ణ మహాభారత ప్రవచనానికి శ్రీకారం చుట్టాను. వారానికి మూడు రోజుల చొప్పున మొత్తం పూర్తవడానికి నాలుగున్నర సంవత్సరాలు పట్టింది. ధన, వస్తు ఇతర రూపేణా సహాయం కావాలని ఎవ్వరిని అర్థించింది లేదు. ధనసహాయం చెయ్యమని ప్రవచనంలో చెప్పింది లేదు. కేవలం ఒక చిన్న హుండి పెట్టాము ఎవరికీ తోచినది వారు వెయ్యడానికి. కేవలం పరమాచార్య స్వామివారి అనుగ్రహం వల్లనే నాలుగున్నర సంవత్సరాల పాటు ఏ అడ్డంకి లేకుండా జరిగింది. రోజూ ప్రవచనానికి ముందు నేను విష్ణుసహస్రం పారాయణ చేసేవాడిని. ఈ ప్రవచనం విజయవంతమవడంలో ఇది కూడా ఒక కారణం అని ప్రగాఢ విశ్వాసం.


దీని తరువాత పద్దెనిమిది పర్వాలకు గాను పద్దెనిమిది ఆదివారాలు పాటు పద్దెనిమిదివేల సార్లు విష్ణుసహస్రనామ పారాయణ నిర్వహించాలని సంకల్పించాను. ఆస్తికుల అభ్యర్ధన మేరకు వివిధ చోట్ల దిన్ని నిర్వహించడం జరిగింది. పదిహేడు వారాలు పూర్తైన తరువాత చివరిదైన పద్దెనిమిదవ వారం పారాయణ స్థలంపై చర్చలు జరుగుతున్నాయి.


చెన్నై పర్యటన నిమిత్తం వచ్చిన పరమాచార్య స్వామివారు అభిరామపురంలోని శ్రీ శంకర గురుకులంలో మకాం చేస్తున్నారు. మేము శ్రీవారిని దర్శించి మా చివరి పారాయణ గురించి తెలిపాము. స్వామివారు చివరి పారాయణ తాము ఇప్పుడున్న ప్రదేశంలోనే జరపమని, దాన్ని ఇక్కడున్న అందరికి మైకులో తెలియజేయమని ఆజ్ఞాపించారు.


మరుసటిరోజు ద్వాదశి కావడంతో పారణకు ముందే పద్దెనిమిది వేలు పూర్తిచేయ్యడానికి మాకు చాలా తక్కువ సమయం ఉంది. పారాయణకు ముందు కలశపూజ, లక్ష్మినారాయణుల పటానికి పూజ చెయ్యడం మాకు ఆనవాయితీ. ఆరోజు కూడా ఆ ప్రకారమే చేశాము. ఎంతసేపటికి పారాయణ పూర్తికాగలదని పరమాచార్య స్వామివారు అడిగారు. ఆరోజు పారాయణకి చాలామంది వచ్చినందువల్ల త్వరగానే పూర్తిచేస్తాము అని చెప్పాను.


స్వామివారు ఇచ్చే తీర్థం స్వికరించేందుకు వచ్చిన భక్తుల కోసమని వెదురు కర్రలతో వరుసలు ఏర్పాటు చెయ్యవలసివచ్చింది. పారాయణ పూర్తై, దీపారాధన ప్రారంభించాము. ఘంటానాదం వినబడగానే భక్తులందరూ ఒక్కసారిగా “పుండరిక వరద . . .” అని ఎలుగెత్తి చెబుతున్నారు. అది వినగానే పరమాచార్య స్వామివారు వెదురుకర్రలను దాటుకుంటూ దీపారాధన దర్శనానికి వచ్చారు. దీపారాధన మొదలవగానే తనకు తెలపమని శిష్యులకు స్వామివారు తెలిపారని మాకు తరువాత తెలిసింది. నేను కుంభజప తీర్థాన్ని, పూలదండలను స్వామివారికి సమర్పించడానికి తిసుకునివెళ్ళాను. అది మహాజప తీర్థం కావున దాన్ని ఉంచడానికి ఒక చెక్కబల్లను తెప్పించారు స్వామివారు.


మామిడి ఆకులతో ఆ తీర్థజలాన్ని అందరిపైన ప్రోక్షించారు. తరువాత దాన్ని తీర్థంగా ఇచ్చారు. ఒక పెద్ద పళ్ళెంలో తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు, టెంకాయ, పూలమాలలు, పద్దెనిమిది రూపాయి నాణాలు స్వామివారి పాదాలకు సమర్పించాను.


“పూర్తైన పదిహేడు పారాయణాలు ఇలాగే చేశావా?” అని అడిగారు స్వామివారు. అవునని చెప్పగా మరలా అడిగారు. నాకు కళ్ళల్లో నీరు తిరిగి, “అవును. మా శక్తి కొలది పెరియవ” అని చెప్పాను. పారాయణ చేసివారిని అక్కడే భోజనం చెయ్యమన్నారు. పరమాచార్య స్వామివారు సంతోషంతో చాలాసేపు నాతో మాట్లాడారు. పూర్తిగా సంస్కృతంలోనే మాట్లాడి చివరకు మమ్మల్ని ఆశీర్వదిస్తూ, “మహాత్ ఇథం కార్యం సౌభాగ్యోదయ ప్రవర్తతే” అని అన్నారు.


సాయింత్రం లక్ష్మినారాయణుల చిత్రపటాన్ని తేవడానికి గురుకులానికి వెళ్లాను. అది పరమాచార్య స్వామివారు సంస్కృత కళాశాలకు వెళ్ళే సమయం. శ్రీవారు అభిరామపురం నుండి మొదలై నాగేశ్వరరావు పార్కు వీధి, కర్పగాంబళ్ వీధి గుండా వెళ్తారు. చేతిలో చిత్రపటంతో నేను కూడా భక్తులతో చేరి ముందుగా నడుస్తున్నాను. కర్పగాంబళ్ వీధిలోకి వెళ్ళబోతుండగా, ఒక వ్యక్తీ నావద్దకు పరిగెడుతూ వచ్చి, “స్వామివారు మీ ఇంటి మీదుగానే వెళ్తున్నారు” అని చెప్పాడు. నేను నివ్వెరపోయాను. అందరితోనే వస్తున్నా నాకు తెలియకపోవడమేమిటని వెంటనే ఇంటికి పరిగెత్తాను.


వెంటనే ఇంటిముందు కళ్ళాపి చెల్లి, ముగ్గులు వేయడానికి సమాయత్తపరిచాను. మావిడాకుల తోరణం కట్టి, చేతిలో ఉన్న పటాన్ని ఒక కుర్చీలో పెట్టి, పూలహారం వేసి, ఒక దీపం వెలిగించాను. పూర్ణకుంభం, కర్పూరహారతి పళ్ళెం సిద్ధం చేశాము. త్వరితగతిన అన్నీ సిద్ధం చేశాము. ఆ విధి గుండా పరమాచార్య స్వామివారు వెళ్తున్నారని జనమంతా దారికిరువైపులా నిలబడ్డారు.


ఇరుగుపొరుగు వారు మేము అందరమూ కలిసి ముకుళిత హస్తాలతో స్వామివారి కోసం బయట ఎదురుచూస్తున్నాము. నాకు అంతటి అర్హత లేదని స్వామివారిని ఇంటికి ఆహ్వానించలేదు. సాధారణంగా నాగేశ్వరరావు పార్కు వీధి, కర్పగాంబళ్ వీధి, వివేకానంద కళాశాల తూర్పు వీధి, సుల్లివాన్ గార్డన్ వీధి గుండా సంస్కృత కళాశాలకు వెళ్ళే మార్గమును వదిలి ఇలా ఆగమిస్తున్నారు.


ఎంతోమంది ఆ దివ్యచరణ కమలములు తమ ఇంటికి రావాలని ఆర్తితో ఎదురుచూస్తుంటే, నాకు కలిగిన భాగ్యానికి కళ్ళు తడి అవుతున్నాయి. ఇప్పుడు స్వామివారు వస్తున్న మార్గాన్ని శిష్యులు ఖచ్చితంగా వద్దు అని చెప్పి ఉంటారు. ఎందుకంటే ఆ మార్గమంతా నల్ల జండాలు, గోడలపై నాస్తిక వాదనలు రాశారు. కాని అటువంటి స్థలాన్ని వారి పాదముల చేత తరింపచేయాలనుకున్నారేమో. ఒకసారి టి. నగర్ లోని యునైటెడ్ ఇండియా కాలనికి ఒక మురికివాడ గుండా వెళ్ళడానికి అడ్డు చెప్పినప్పుడు, “అంతటి దారుణమైన పరిస్థితులు ఉన్న ప్రాంతమా? అయితే తప్పక వెళ్ళవలసింది ఆటే” అని అన్నారు.


మా ఇంటి ముందర పెద్ద గుంపు ఏర్పడింది. పరమాచార్య స్వామివారు లోపలికొచ్చి, ముగ్గు వేసిన చెక్కబల్లపై కూర్చున్నారు. పూర్ణకుంభ పాదపూజ, హారతి చేశాము. నా భార్యాపిల్లలలతో పాటు స్వామివారికి ముమ్మారు ప్రదక్షిణ చేసి, నేలపై పడి నమస్కరించాము. స్వామివారు లోపల ఉన్న లక్ష్మినారాయణుల చిత్రపటాన్ని చూపిస్తూ “పూజకు పెట్టిన ఈ లక్ష్మి నారాయణుల చిత్రపటంతో వీరు నాలుగున్నర సంవత్సరాలు మహాభారత ప్రవచనం, మూడు లక్షలా ఇరవైనాలుగువేల విష్ణు సహస్రనామ పారాయణం చేశారు” అని చెప్తూ పటాన్ని చూడటానికి త్రోవ ఇవ్వవలసినదిగా అక్కడున్నవారిని పక్కకు జరగమని చెప్పట్లు చరిచారు.


ఆ పటాన్ని తదేకదృష్టితో చూస్తూ, “రాజగోపాలా!” అని దగ్గరకు పిలిచారు. నేను ఉంటున్న ఆ పాత ఇంటిని ఒకసారి పరీక్షగా చూసి, “ఇదే మీ ఇల్లు. ఈ ఇంట్లోనే నువ్వు ఉండడం” అని అన్నారు. అవును అని చెప్పగా, మమ్మల్ని మరొక్కసారి నమస్కరించమని ఆదేశించారు. అందరమూ శ్రీవారికి నమస్కరించాము. కేవలం కొద్దిరోజుల్లోనే ఆ పాత ఇంటిని వదిలి, ఇప్పుడున్న పెద్దదైన ఈ కొత్త ఇంటికి వెళ్ళగలిగాము. ఇక్కడకు వచ్చిన తరువాత కాలంతోపాటు ఇంట్లోకూడా శుభకార్యాలు, పెళ్ళిళ్ళు జరిగాయి.


కేదార్ నాథ్, బదరీనాథ్ యాత్ర కూడా వెళ్ళే అవకాశం వచ్చింది. మహాస్వామివారు మదురైలో మకాం చేస్తున్నప్పుడు, ఈ యాత్రకోసం వారి ఆశీస్సులు అర్థించగా, “మొత్తం కుటుంబం అంతా వెళ్ళండి. బదరీనాథ్ మాత్రమె కాదు. కేదార్ నాథ్ కూడా వెళ్ళండి” అని అన్నారు. అప్పుడు ప్రపంచమంతా గ్రహాల అష్టగ్రహ కూటమి గురించి భయపడుతున్న కాలం. దానికి పరిహారంగా కేదార్ నాథ్ వెళ్ళమని ఒక ఒక రుద్రాక్ష మాలను అనుగ్రహించారు.


వారి అనుగ్రహం వల్ల వచ్చిన ఆటంకాలను అధిగమించి యాత్ర పూర్తీ చేశాము. బదరీనాథ్ వెళ్ళేదారిలో హిమాలయ పర్వతాల నుండి కొండ చెరియలు పడుతుండడంతో హృషికేశ్ లో మా ప్రయాణం ఆలస్యం అయ్యింది. రెండు మూడు రోజుల తరువాత మా ప్రయాణం ప్రారంభమైనా ఎక్కువ రద్దీ వల్ల హృషికేశ్ లో ఇంకా కొన్ని రోజులు ఉండిపోవాలేమో అనుకున్నాము.


మేము బస చేస్తున్న నేపాలి ఆశ్రమం వారి అభ్యర్ధన మేరకు పురాణ ప్రవచనాలు మొదలుపెట్టాను. నేను సంస్కృతంలో చెబుతుంటే, ఒక గురూజీ హిందీలో అనువదించి చెప్పేవారు. స్వామివారి అనుగ్రహం వల్ల ఉత్తరాదివారు కూడా నా ప్రవచనాలను ఇష్టపడేవారు. చివర్లో మా యాత్ర ఇబ్బందుల గురించి చెప్పాను. ఉత్తరాదివారికీ సంస్కృత పండితులపై ఉన్న గౌరవ మర్యాదలు ఆ రోజే నాకు అవగతమయ్యాయి.


వాళ్ళల్లోనుండి ఒకతను లేచి, “మిమ్మల్ని బదరీనాథ్ తీసుకుని వెళ్ళే బాధ్యత నాది. ఉదయం సిద్ధంగా ఉండండి. మీతోపాటు ఎందరున్నారు?” అని అడిగాడు. అలాగే అతను మాట నిలుపుకున్నాడు. బదరీనాథ్ లో దర్శనమప్పుడు కూడా రద్దీ వల్ల చాలా ఇబ్బంది పడ్డాము. కాని ఎవరో మమ్మల్ని గుర్తుపట్టి అన్ని సదుపాయాలూ చేసేవారు. ఇదంతా కేవలం పరమాచార్య స్వామివారి అనుగ్రహం మాత్రమె. మొత్తానికి కేదార్ నాథ్ యాత్ర కూడా ముగించాము.


దాదాపు యాత్రకు వెళ్ళిన ఇరవై మందిమీ క్షేమంగా చెన్నై చేరుకున్నాము. మా క్షేమసమాచారముల గురించి వాకబు చూస్తూ, చాలామంది బంధువులూ, శిష్యులూ ఫోన్లు చేస్తున్నారు. ఇంతమంది చెయ్యడానికి కారణమేంటో తరువాత నాకు తెలిసింది. మేము తిరిగొచ్చిన తరువాత హిమాలయాల్లో భారీగా కొండచరియలు పడి చాలామంది యాత్రీకులు గాయపడ్డారని వార్తలు వచ్చాయి.


రెండు మూడు రోజుల్లో ఇలయత్తాంగుడిలో మకాం చేస్తున్న పరమాచార్య స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. గంగానుండి తెచ్చిన తీర్థాన్ని స్వామివారి ముందుంచాను. అప్పుడే ధనుష్కోటి తీర్థం కూడా వచ్చింది. మరుసటిరోజు పరమాచార్య స్వామివారు స్నానం చేస్తున్నప్పుడు రెండు తీర్థాలను శరీరంపై వేసుకున్నారు. అది చూడగానే మాకు చాలా ఆనందం కలిగింది. ఇతర భక్తులతో పాటు మేము కూడా స్నానాలు ఆచరించాము.


తరువాత స్వామివారు మా యాత్రా విశేషాల గురించి అడుగుతూ, “హిమాలయాల్లో కొండచరియలు పడుతున్నాయని విన్నాను” అని అన్నారు. “మాకు కవచం ఉనడడం వల్ల మాకు అవేవీ ఇబ్బంది కలిగించలేదు” అని అన్నాను. “కవచమా?” అని అడిగారు. నా మేడలో ఉన్న రుద్రాక్షమాలను తాకి, “మీ ఆశీస్సులు ఈరూపంలో మావద్ద ఉన్నప్పుడు, మాకు ఇబ్బంది ఏముంది” అని చెప్పాను. స్వామివారు నవ్వారు. వారికి నమస్కరించి మేము వెనుదిరిగాము.


ఇది జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినా, వాటి జ్ఞాపకం ఇంకా తాజాగానే ఉంది.


--- పరంథమన్ వి. నారాయణన్, ‘పరమాచార్యర్’ నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కళద్వారా చిత్తశాంతి


గ్రంథ పఠనంవల్ల, ఉపన్యాస శ్రవణంవల్ల మనస్సుకు భావగ్రహణం చక్కగా లభిస్తుంది. ఆ ఉపన్యాసమేగానముతో కూడుకునివుంటే హరికథా కాలక్షేపంవలె మరీ మనోరంజక మవుతుంది. అలాగే గ్రంథంకూడా శబ్దార్థాలంకారాలతో విభావాదివర్ణనలతో కూడుకుని ఉంటే అందలి భావసౌందర్యం ఎంతో హృదయంగమ మవుతుంది. ఆ గ్రంథములే మహాకవి రచిత కావ్యములయితే మరి చెప్పేదేమిటి? కావ్యములు- శ్రవ్యములు-వినదగినవి. దృశ్యములు-చూడదగినవి, అని రెండు విధాలు. దృశ్యకావ్యములనే నాటకము లంటాము. చెవితో విన్నదానికంటే రంగస్థలమందు కండ్ల ఎదుట ప్రదర్శితమైనభావం సరాసరిగా హృదయాన హత్తుకొంటుంది. భాస కాళిదాస భవభూత్యాదులగు మహాకవులు చిరకాలమునాడే ఇట్టినాటకాలు రచించారు. 


అచ్చుయంత్రం వచ్చినపిమ్మటచేతితో గ్రంథప్రతుల్లు వ్రాసుకునే శ్రమ తప్పిపోయి, వేలకొలది ప్రతులిట్టే సిద్దమవు తున్నవి. అట్లే ఇపుడు సినిమావచ్చింది కనుక, నాటకాన్ని నటులు మాటిమాటికి ప్రదర్శింపనక్కరలేదు. ప్రదర్శనాన్ని ఒక్కసారి సినిమాతీస్తే, దాన్నినే ఎన్ని సార్లయినా మనం చూస్తూవుండవచ్చు. 


చిత్త మందుపుట్టే రసభావాలన్నిటికీ నాటకమందు ప్రవేశమున్నప్పటికీ ఒక్కొక్క నాటకం ఒక్కొక్కరసాన్ని ప్రధానంగాను, తక్కినవానిని అప్రధానంగాను ప్రదర్శిస్తూంది. ప్రధానమైన అంగిరసానికి తక్కినవి అంగములుగా ఉంటవి. మహావీరచరితం, వేణీ సంహారము అనే నాటకాలలో వీరం ప్రధానరసం. అట్లేశృంగార హాస్య కరుణాదులు కొన్ని నాటకాలలో ప్రాధాన్యం వహిస్తవి. నవరసాలలో శాంతరసం అగ్రగణ్యం. ఒక్కొక్క విధమయిన చిత్తవికారంవల్ల శృంగారాదిరసాలు పుట్టుతవి. శాంతరసం అట్టిదికాదు. వృత్తిరహితమై నిర్వికారమైన చిత్తస్థితినే శాంతమంటాము. కనుకశాంతమును నవరసాదులలో గణించకూడదనే మతభేదం ఉంది. ఆలంకారికులలో ఇతర రసములందు చింతాజడత్వాది వ్యభిచారిభావాలకు ప్రాధాన్యం వుంటుంది. కనుక స్థిరమైన ఆనందాన్ని కలిగించవు. శాంతరసము నిర్వికారము, సాత్త్వికము కావడంవల్ల దానిచే అభంగురము, సుస్థిరము అయిన ఆనందం లభిస్తుంది. త్యాగయ్యగారు చెప్పినట్లు ''శాంతములేక సౌఖ్యములేదు.'' కావున యితర రసములందుండే రంజకత్వము, ఉద్దీపనము లేకున్నను శాంతమునకు స్వతః రసత్వమున్నదని చెప్పవచ్చు. 


జిహ్వకు రుచినిపుట్టించే కటుతిక్తావ్లుకషాయాదిషడ్రసములు కూడా ఈ నవరసాల వంటివే. ఈ షడ్రసాలు పాళ్ల చొప్పున ఒంటొంటితో కలిసి సంతోషాన్ని కలిగిస్తవే కాని, స్వభావముచే సాత్వికములు కావు. నాలుకపై రుచుల నుద్దీపింపచేసి ఇవి మనస్సును తల్లడిపెట్టుటేతప్ప చిత్తమునకు శాంతి నివ్వజాలవు. వీనిలోచక్కెరమున్నగు వానియందు మాధుర్యం లభిస్తుంది. ఆమాధురంకూడ మితిమీరితే మొగంమొత్తుతుంది. ఎంత అనుభవించినాతృప్తితీరని మాధుర్యంమరొకటి వున్నది. దానినే మధు-రసమంటారు. రుచినిపుట్టించేషడ్రసాలలో ఏదీ అందులో కలియదు. అది సాత్వికము, శ్రీకృష్ణుడారగించేదదే! విశుద్ధవర్ణము. కేవల సాత్వికము అయిన నవనీతమే ఆ పదార్ధం, కృష్ణునినోటినిండా వెన్నా, మనమునిండా ఆనందమూను, ఆవెన్నచే మొగముమొత్తదు తనివితీరదు. వెన్నయందు లభించే మధురరసమే శాంతరసం. 

రంగులప్రస్తావం వచ్చినప్పుడు వానిలో నలుపు తెలుపు అంటూ బేధంచేస్తాము. నలుపు తెలుపు వేర్వేరుగా మన కంటికి కనుబడునేగాని, నిజానికవి వర్ణములు కావని సైన్సు చెబుతుంది. సూర్యుడు ఏడుగుర్రాలరథంమీదప్రయాణంచేస్తున్నట్లు పురాణములు వర్ణిస్తవి. వేదములుకూడా సూర్యుని సప్తాశ్వుడంటున్నవి. ఈయశ్వశబ్దానికి, నిరుక్తం కిరణమని అర్థంచెపుతున్నది. కావున సప్తాశ్వుడంటే సప్తకిరణాలుకలవాడని గ్రహించాలి. పూర్వం సంపన్నులఇండ్లలో స్ఫటికగోళములుగృహములకలంకారంగా వ్రేలాడుతూవుండేవి. వానిలో దీపములు వెలిగించేవారు. ఆగోళములు దీపములతో వూగులాడినప్పుడు ఏడురంగులుగా కనుపించేవి. ఆఏడువర్ణములు ఏకమైనప్పుడు తెల్గగా కనుపించునేకాని, తెలుపు వేరేరంగు కాదు. శుద్ధమైన తేజస్సే తెల్లగా కనిపిస్తుంది. ఆవిశుద్ధకాంతిని మూడుపలకల కాచఖండములోనుండి చూస్తే ఏడురంగులుగా కానవస్తుంది. ఈ యేడురంగులను సమపాళ్లుగా కలిపితే తెల్లని తేజము లభిస్తుందని సైన్సు తెలియచెప్పుతున్నది. చమురు దీపం ఎర్రగాకనుపిస్తుంది. చమురునందు ఆయెరుపుపాళ్లెక్కువగా వుండుటే దానికి కారణం. 


నేతి దివ్వెయం దంత ఎరుపు కనిపించదు. నూనెకంటె నేయి పరిశుద్ధం కనుకనే దేవాలయములందు గర్భగుడిలో స్వామిసన్నిధిని నేతిదివ్వెలు వెలిగిస్తారు. నిర్మలమైన ఆవెలుగు నందు రంగు కనిపించదు. 


బంగారము, వెండి, ఇనుము మొదలైన లోహములను నిప్పులలో కాల్చి ప్రజ్వలింపజేసినపుడు ఆయాలోహాలనుబట్టి ఆజ్వాలయందు భిన్నవర్ణములుగోచరిస్తవి. ఇచట ఇంకో విశేషమేమిటంటే సూర్యకాంతిని వర్ణదర్శినితో పరిశీలిస్తే దానియందీ లోహాలుకనిపించుతవట. ఇవేకాక హేలియం అనే మరో ధాతువుకూడా సూర్యకాంతియందున్నదట. ఈహేలియమనే శబ్దం సూర్యుడనే అర్థంగల లాటిన్ శబ్దం నుంచి పుట్టింది. సంస్కృతభాషయందు సూర్యుణ్ణి చెప్పే 'హేళి' అనేశబ్దమున్నది. ఈ హేలియం సూర్యునియందేతప్ప భూమియందులభించదట. ఈవిశ్వాన్ని 'హేలియో సెంట్రిక్' అంటారు. అం టే విశ్వానికి సూర్యుడే కేంద్రమనితాత్పర్యం. హేళిశబ్దంనుంచే హేలియో సెంట్రిక్ శబ్దంకూడా పుట్టిందని మనం గమనించాలి. 


సూర్యకాంతికి లేనట్లే స్ఫటికానికి గూడా రంగులేదు. అంతేకాదు, నీటికిగూడా రంగులేదు. శుద్ధస్ఫటికానికి పరీక్ష ఏమిటంటే, దానిని నీటిలో వేసినపుడది కనుపించగూడదు. కంటి కగుపించు వస్తువులలో స్ఫటికానికి రంగులేనట్లే రుచి చూచే వస్తువులలో వెన్నకుగూడా రుచిలేదు. ఈరెండివలెనే నవరసాలలో శాంతముగూడ నిర్మలం, పరిశుద్ధమూను, శాంత రసమందు మనస్సు వృత్తిరహితమై, సమాధిని పొందుతుంది. రసానుభవసమయమందు మనస్సు తన్మయత్వం పొందుతుంది. కనుక శాతరసమం దది శాంతిమయమవుతుంది. 

శృంగారాది రసప్రధానములైన నాటకాలు అనేకంగా వున్నవి. కాని శాంతరసనాటకాలు చాలా అరుదు. నేటి నాటకాలు చూడబోతే కామ క్రోధాదులను ప్రకోపింపజేసి మనుష్యుని అథమస్థితికికొనిపోయేవేతప్ప చిత్తశాంతినిచ్చి ఉన్నతిని కల్గించేవి కానరావు. శాంతరస ప్రధానములగు నాటకములు నేడు లేనే లేవు. 


వెయ్యేండ్ల క్రితం రాజపుత్రస్థానవాసియైన కృష్ణమిశ్రుడనే కవి ప్రబోధ చంద్రోదయమనే శాంతరసప్రధానమైన నాటకం రచించాడు. దీనిని పోలినది మరొకటి లేదు. జ్ఞానమే మోక్ష సాధనమని కథారూపాన చెపుతుందీనాటకం. వివేకుడు, విష్ణు భక్తీ, శ్రద్ధ, కరుణ, ధర్ముడు, వైరాగ్యం, అజ్ఞానం మొదలైన విందు పాత్రలు, ప్రబోధమనే సామ్రాజ్యంకోసం ఇందు ఇరు తెగలకుపోరాటం జరుగుతుంది. అశాంతి కారణమైన తెగ ఓడిపోయి, జ్ఞానఫలమైన శాతిపక్షం జయంపొందుతుంది. ఈనాట కాన్ననుసరించి శ్రీ వేదాంతదేశికులుగూడ సంకల్ప సూర్యోదయమనే నాటక మొకటిరచించారు. పరమేశ్వరాను గ్రహానికి కారణమైన భక్తికి ఇందు ప్రాధాన్యం చెప్పబడింది. 


నాటక ప్రదర్శనాన్ని చూడటంవల్ల చిత్తశుద్ధీ, చిత్తశాంతీ కలుగవలెనేకాని కామాదులు ప్రకోపింపకూడదు. నేటి నాటకాలు, సినిమాలూ కామాదులను ప్రకోపింపజేయుటే పనిగా పెట్టుకొని ప్రజాసంఘములకు పరస్పరద్వేషం కలిగిస్తూ ఒక్కొక్కసంఘాన్ని పరిహాసపాత్రము చేస్తూదానిపట్ల అసూయా క్రోధాలను రేకెత్తిస్తున్నవి. పూర్వం నాటక ప్రయోగంకోసం ఏర్పడినతెగనుభరతపుత్రులనేవారు. నాటకాలాడడమే వారికి స్వధర్మంగా వుండేది. వారికదే జీవనాధారమైనవృత్తి. ఇతర వృత్తులు స్వధర్మములలో గల తెగలవారు ఈనాట్యవృత్తిలో ప్రవేశిస్తేభరతపుత్రుల వృత్తికిభంగం కలిగించినవారవుతారు. అంతేకాదు, స్వధర్మమును విడనాడి పరధర్మాన్ని స్వీకరించుటచే తమధర్మానికి చేటూ, సంఘానికిహాని చేకూర్చినవారవుతారు. నాట్యజీవనులైన భరతపుత్రులకు కొన్ని నియమాలుఉండేవి. పురుషుడు స్త్రీవేషం ధరించి నటించరాదు. స్త్రీపాత్రధరించిన పురుషుని చూడడంపాపమన్నారు. నాటకంలో దంపతులవేషం ధరించే స్త్రీపురుషులు నిజంగా దంపతు లయ్యుండాలేకాని పరపురుషునకు భార్యగా స్త్రీనటింపగూడదు. నేటినాటకాలలో సినిమాలలో ఈనియమాన్ని ఉల్లంఘించటంవల్ల సంఘంలో బహిరంగంగానూ, చాటుమాటునా అవినీతి ప్రబలిపోతున్నది. ఇంతకు నేటి బాటకాలు కామాదిప్రశోపనమే పనిగా పెట్టు కొన్నవనీ, చిత్తశాంతినీ, ఆనందాన్నీ చేకూర్చే నాటకాలు మృగ్యమైనవనేదే సారాంశం.   


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


--- “జగద్గురు బోధలు” నుండి


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: