25, మార్చి 2023, శనివారం

సద్గురు బోధలు

 🙏 నమస్కారం అండి 🙏


🙏 *ఓం నారాయణ- ఆది నారాయణ* 🙏


*గ్రంథం:* అమృత వాక్కులు, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య బోధలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*సత్యం, ధర్మం - ఆచరణ*


వీటిని తప్పిన వారంతా చేతికి చిక్కిన మాణిక్యమును దక్కించుకోలేని దౌర్భాగ్యులయ్యారు. శ్రీ స్వామివారి దివ్య సన్నిధికి దూరమయ్యారు. అలా శ్రీ స్వామివారికి దూరమైన వారు కొందరు దివంగతులైనారు. మరికొందరు శ్రీ స్వామివారు ఉండగనే వారి సన్నిధి వదలి వెళ్ళిపోయారు. మరి సత్యం, ధర్మం తప్పని శ్రీ రోశిరెడ్డి వంటి మహా భక్తులు ఒక్కొక్కప్పుడు సాటిసేవకుల పరిహాసాలు, నిందలు, దూషణల ఓర్చుకోలేక శ్రీ స్వామివారిని వదిలి వెళ్ళిపోవాలని చూస్తేగూడ సర్వజ్ఞులైన శ్రీ స్వామివారు వారిని తనకు దూరం కానివ్వలేదు. 


*"అయ్యా ఎవరో ఏమో అన్నారని వెళ్ళిపోవాలంటావా?. పంటచేను వదలి పరిగ ఏరుకుంటావా?.. ఊర్లోకెళ్ళి అన్ని నూకలు తెచ్చుకుని జావకాచుకుని తాగి ఇక్కడ ఉండయ్యా"* అని చెప్పి వెళ్ళేవారిని ఆపి తన దివ్యసన్నిధి ప్రసాదించారు. చివరిదశలో ఎవరిసేవనూ తీసుకోకుండా పూర్తిప్రజ్ఞతో తనువు చాలించేటట్లు చేశారు. మరి తక్కిన వారిని *పొయ్యేవాళ్ళను పోనిచ్చేదేగదయ్యా* అన్నారు. సత్యం, ధర్మం తప్పిన వాళ్ళకు శ్రీ స్వామివారు కొన్ని హెచ్చరికలు చేసి వదిలేస్తారని అర్థం.


జిహ్వరుచికొరకు ఇతరులవద్ద తిని మొహమాటపడి తమ ధర్మం తప్పిన వారు కొందరు, సంఘం దృష్టిలో గొప్పవారుగా ఉండాలని సేవకాధర్మమే మరచి అహంకరించినవారు కొందరు. ధనాశకులోనై శ్రీ స్వామివారు సర్వజ్ఞులని మరచి మనమాటలను, చేతలను, ఆలోచనలు అనుక్షణం సాక్షిగా గమనిస్తూ తగు ఫలితాలిస్తారనే సత్యం మరచినవారు ఇంకొందరు శ్రీ స్వామివారికి దూరమయ్యారు.


రోశిరెడ్డిగారు శ్రీస్వామివారి ఆజ్ఞలను కఠోర దీక్షతో ప్రాణానికి తెగించి ఆచరించేవారు. అందుకే వారిని *"నీది భీష్ముని పట్టుదలయ్యా"* అని వ్రాయించారు. రోశిరెడ్డిగారు ఇతరుల మొహమాటాలకు, వత్తిళ్ళకు లొంగి శ్రీ స్వామివారిని తాకి నమస్కరించుకోనిచ్చేవారు కాదు. శ్రీ స్వామివారిని ఇతరులు తాకకుండా కాపలా ఉండే తనధర్మాన్ని అంతచక్కగా ఆచరించి శ్రీ స్వామి వారి సంపూర్ణ కృప పొందిన భాగ్యశాలి అయ్యాడు. మనలను కూడా వారి ఆచరణ చూసి నేర్చుకోమన్నారు.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ - 

వారు మనకు చేసిన మేలేమి? మన జీవితాలలో నింపిన వెలుగేమి?


మన దేశంలో ఒక్కొక్క చోట ఒక్క రీతిలో సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి.. కొన్ని చోట్ల శక్తీ ఆరాధన ఉంటె, కొన్ని చోట్ల శివ లేక విష్ణు ఆరాధనలు, కొన్ని చోట్ల ఇతర దేవతారాధనలు. గురుపీఠాలను అనుసరించి వారి ఆచారవ్యవహారాలతో ముడిపెట్టుకున్న ఇంకొంతమంది. కానీ అక్కడక్కడా మాత్రమే, మనము గురువాక్యాన్ని అనుసరించి తమ జీవితాలను దిద్దుకునే వారిని చూస్తాము. భగవంతుడు ఎప్పుడు ఒక అవతారాన్ని తీసుకున్నా, ఆ అవతారంలో గురువుకు ప్రాధాన్యతనివ్వడం మన పురాణాల్లో కూడా చూస్తాం. హనుమంతుడిని ఒక గొప్ప సాధకుడుగా, సుందరకాండ ఎన్నో యోగ రహస్యాలను తెలిపే గ్రంథంగా వర్ణిస్తారు. కానీ, ఇన్ని చూసిన ఇన్ని విన్నా, చాలామందిమి, గురువు కోసం ఆరాటపడడం చూడం. గుడికి వెళ్లి భగవంతుణ్ణి ప్రార్థిస్తాం కానీ, గురువు కోసం తపించం. ఎవరు దొరికితే మన జీవితానికి సార్ధకత ఉంటుందో, ఎవరైతే మన అస్తవ్యస్త జీవితాలను సరి అయిన మార్గంలో నడపగలడో, ఎవరైతే భగవంతుని జ్ఞాన స్వరూపంగా భూమి మీద వెలిసిందో, అటువంటి గురువు గురుంచి మాత్రం తెలుసుకోవాలనే జిజ్ఞాస ఇసుమంతైనా ఉండదు. ఇది చాలా మంది జీవితాలలో ఒక ఒరవడిగా వచ్చేసింది. 


అసలు జీవితం అంటే ఏమిటో, ఎలా జీవించాలో తెలపగలిగేది ఒక్క గురువు మాత్రమే. ఈ గురువులు రకరకాలుగా మన జీవితంలో తారసపడతారు. కానీ జీవిత లక్ష్యమైన భగవంతుని తెలుసుకోవడం అనే ప్రక్రియ మాత్రం, ఒక్క సద్గురువు మాత్రమే చెయ్యగలడు. ఈ గురువు ఎవ్వరు, సద్గురువు ఎవ్వరు అనే విషయాలు మనకు సరళంగా తెలియచెప్పే వారు కూడా సద్గురువులే! జీవితం నడుపుకునే రీతి పట్ల అవగాహన పెంచి, అందరి పట్ల మరియు అన్నింటి పట్ల కృతజ్ఞతతో ఉండేటట్టు మన దృక్పధాన్ని మార్చి మన జీవితంలో వెలుగు నిమ్పగలిగేది ఒక్క సద్గురువు మాత్రమే!


మన దేశంలో కొన్ని చోట్ల అదృష్టం కొద్దీ ఈ గురుసాంప్రదాయం దృఢంగా వెలుగుతోంది. అటువంటి గురుసాంప్రదాయాన్ని, మన తెలుగువారికి అందించి, వారి బాగు కోసం మహాత్ములు అంటే ఏమిటో తెలిపి, వారి జీవిత చరిత్రలు అందచేసి, వివిధ సాధనా మార్గాలు అందచేసిన మహనీయులు, సద్గురువులు పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు! మహాత్ములు అంటే ఎవరో, వారు తిరుగాడిన ప్రదేశాలు, వారు దేహం వదిలేసినా కూడా, ఆ దేహాలు ఎంత పవిత్రమో, వాటిని ఎలా పూజించాలో, వారి చరిత్ర పఠన ద్వారా మనకు వచ్చే ప్రయోజనమేంటో, ఇవన్నీ తెలిపి మన జీవితాలలో వెలుగు నింపే ప్రయత్నం చేశారు! 


శిరిడీ సాయినాథుని ఈ యుగావతారమని, ఈ కాలంలో ఎదురయ్యే ప్రతీ సమస్యకు అయన పరిష్కారం చూపారని, అంతటి మహనీయుడు ఈ కాలంలో రాలేదని, అయన సమర్ధ సద్గురువని తెలుపుతూ, 20 సంవత్సరాల పాటు కృషి చేసి, అయన జీవిత చరిత్ర తెలుగువారికి అందించారు! ఈ గ్రంథాన్ని ఎందరో చదివి ఒక అద్భుత గ్రంథమని పేర్కొనడమే కాక, దీనికి సాయినాథుని ఆశీస్సులు ఎలా అందాయో చెప్పారు. ఈ గ్రంథాన్ని ఎంతో మంది తమ కష్టాలు తీరే సాధనగా చేసుకొని, నెమ్మదిగా ఒక నిత్యపారాయణ గ్రంథంగా తమ జీవితాలలో భాగం చేసుకున్నారు!


భగవంతుడే మనపై కరుణతో ఆ సమర్ధ సద్గురుడైన సాయినాథుని మనకు పరిచయం చేయాలని, ఈ కాలంలో, పూజ్య ఆచార్యునిగా మనకు అందించి, ఈ గ్రంథాన్ని వారి ద్వారా అందించి, ఆ గ్రంథానికి తమకు భేదం లేదని కూడా చూపించారు! ఇది అంతా, మనకు ఈ మాత్రమైనా తెలియడం మన పూర్వ జన్మ సుకృతం. ఇప్పటికైనా మన తరువాత తరానికి ఈ జీవిత సత్యాన్ని తెలిపే బాధ్యత మన అందరిదీ. 


పూజ్య ఆచార్యుని ఆరాధన మహోత్సవం (మార్చ్ 28, తిథి ప్రకారం మరియు ఏప్రిల్ 12 తేదీ ప్రకారం) జరుపుకునే వేళ, మన అందరి బాధ్యతగా అందరికీ ఆ సద్గురుని బోధలు పరిచయం చేద్దాం! మన తరువాత తరాన్ని వారి అడుగుజాడల్లో, వారి బోధల మీద అవగాహన పెంచుకుని నడిచేలా చేద్దాం!


జై సాయి మాస్టర్.


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు: