25, మార్చి 2023, శనివారం

పరమాత్మ అసలు స్వరూపం

 మనలో కొంత మంది, పరమాత్మ అసలు స్వరూపం తెలుసుకోకుండా, కేవలం దేవాలయాలకు వెళ్లడం, పూజలు చేయడం, నివేదనలు అర్పించడం, దానికి మించిన కోరికలు కోరడం, ఆ కోరికలు తీరకపోతే ఈ దేవుడికి మహిమ లేదనుకోవడం, అక్కడితో ఆగిపోవడం. తనను గురించి కానీ, పరమాత్మ గురించి కానీ తెలుసుకోకపోవడం. ఇటువంటి వారు దేవుడిని కేవలం తమ కోరికలు తీర్చుకోడానికి అంటే తమ స్వార్థానికి వాడుకుంటారు తప్ప భక్తితో కాదు. కాని వీరు తమను తాము భగవద్భక్తులం అని చెప్పుకుంటారు. ఆడంబరంతో, ఆర్భాటాలతో, ఇతరుల మెప్పు కొరకు పూజలు చేస్తారు వాటిని భగవంతుడు స్వీకరించడు, సంపూర్ణ భక్తితో ఆశరహిత ప్రార్థనను మాత్రమే ఆయన స్వీకరిస్తాడు.


మాయను దాటాలంటే శాస్త్రజ్ఞానము, వివేకము, వైరాగ్యము, భగవంతుని మీద భక్తి, శ్రద్ధ, శరణాగతి, భగవంతుని ఆశ్రయించడం కావాలి. దీని కంతా కావాల్సింది శాస్త్ర జ్ఞానం. గురువు దగ్గర నేర్చుకోవడం. సత్యం ఏదో అసత్యం ఏదో తెలుసుకోవడం. అప్పుడు మనను ఆవరించిన మాయ తొలగిపోతుంది. కొంత మంది శాస్త్రాలు చదువుతారు జ్ఞానం సంపాదిస్తారు కానీ, రజోగుణము, తమోగుణములతో కూడిన మాయ వారి జ్ఞానమును కప్పివేస్తుంది. దాని ఫలితంగా తమకు తెలుసు, తమనుమించిన వాడు లేడనుకుంటారు. అందుకే వాళ్లకు దేవుడు కనపడటం లేదు.


Follow : @bhagavadgithaa


       🚩🙏 జై శ్రీ కృష్ణ 🙏🚩

కామెంట్‌లు లేవు: