భక్తి మకరందం
(శృ౦గేరి శారదా పీఠం 35వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్ధ మహాస్వామి వారి బోధనలు)
పరమాత్మ దయ అందరిమీద ప్రసరిస్తుంది. విభీషణుడిని తమతో చేర్చుకోవద్దని సలహా ఇచ్చినప్పుడు రాముడు సుగ్రీవునికి “నన్ను శరణాగతి చేసినవాడిని ఎవరికైనా నిర్భయత్వం పరిపూర్ణ రక్షణ ప్రసాదిస్తానని” చెప్పలేదా? పరిపూర్ణ శరణాగతుడికి దేనిగురించి దిగులు చెందవలసిన అవసరం లేదు ఎందుకంటె వాని బాగోగులు స్వయంగా స్వామి చూసుకుంటాడు. నన్నే నిరతం నమ్ముకున్నవాడిని నేను వెన్నంటి వుంటాను అని ఉద్దవునికి కృష్ణుడు చెప్పాడు కదా.
దేవుడిని నమ్ముకున్నవాడికి ఏమాత్రం కష్టాలు వుండవనడం కూడా అసమంజసమే. ఆయన కేవలం దయాగుణ పూర్ణుడే కాదు ధర్మ చక్రవర్తి. అతడి పూర్వజన్మలలో ఘోరమైన పాతకాలు చేసుంటే అతడికి ఈ జన్మలో నామమాత్రం శిక్ష లేకుండా వదలడు. ఆయన కర్మ సాక్షి. ఒక న్యాయమూర్తి ఎందరినో పొట్టన పెట్టుకున్న ఒక కరుడు గట్టిన దోషిని శిక్షించకుండా వదిలేస్తే అతడు సంఘానికి అన్యాయం చేసినవాడు అవుతాడు. కానీ అతడు చేసిన పుణ్యాలను, అతడు చేసిన పరిస్థుతులను, దాని తర్వాత అతడు పొందిన క్షోభను పరిగణలోకి తీసుకుని శిక్షను తగ్గించవచ్చును. అలాగే భగవంతుడు కూడా అతడి నిబద్ధతను పరిశీలించి పెద్ద శిక్షను చిన్నగా చేసి అతడిని కరుణించవచ్చును. ఒక తల్లి తన బిడ్డ వక్రమార్గంలో వెడుతుంటే దండించదా, అలా అని అతడి మీద ప్రేమ లేదంటారా?
భగవంతుడు సర్వవ్యాపి, సర్వసాక్షి, దయాసముద్రుడు. కావున దేవునికి తెలియనిది ఏమి వుండదు. మన అవసరాలన్నీ ఆయనకు తెలుసు. నాకిది కావాలి అది కావాలి అని ఆయన్ను విసిగించకూడదు. మనల్ని పుట్టించినవాడికి తెలియదా మనకు ఏమి కావాలో? అతగాడికి భక్తి లోపం ఉన్నట్టయితే ఆయన మీద నమ్మకం తక్కువగా ఉన్నట్టయితే అపుడు తన కోర్కెల చిట్టాను ప్రస్తావిస్తూ కోరికలు కోరుకుంటాడు. వారు ఆశించినది వచినప్పుడు మోదం, రానప్పుడు ఖేదం పొందుతూవుంటారు. కానీ భగవంతుడు తనకు ఏమిచ్చినా అది ఆయన అనుగ్రహం అని స్వీకరించినవాడి బాగోగులు దగ్గరుండి చూసుకుంటాడు. బాధ బెంగ కేవలం మనం అనుభవిస్తున్న ఖేదానికి సహాయకారులే కానీ వాటిని తగ్గించే లక్షణాలు కాదు. కావున కేవలం ఆయన మీద పరిపూర్ణ విశ్వాసంతో ఆయన మనకు ఏమి చేసినా ఆయన దయ అని సరిపెట్టుకుని నిత్యతృప్తులుగా వుండి ఆయనను సేవించడo మనకు అన్ని విధాల శ్రేయోదాయకం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి