6, డిసెంబర్ 2023, బుధవారం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *98వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*శుక్రగ్రహ చరిత్ర - 10*


శుక్రుడు కచుడికి ఆశ్రమ గోవుల ఆలనా పాలనా అప్పగించాడు. అనధ్యయన సమయంలో ఆవులను అరణ్యానికి తోలుకు వెళ్ళి మేపడం , పూలూ , పళ్ళూ , సమిధలూ , దర్భలూ తీసుకురావడం కచుడికి నిత్య కృత్యమైపోయింది.


ఏ పని అయినా సరే , అది ఎంతటి పని అయినా సరే , గురువు కాలితో చెప్తే , చేత్తో చేస్తూ ఆయన వాత్సల్యాన్ని అచిరకాలంలోనే సొంతం చేసుకున్నాడు కచుడు. వినయంతో , విధేయతతో , సంయమనంతో - త్రికరణశుద్ధిగా శుశ్రూష చేస్తున్న కచుడికి తన హృదయంలో ప్రత్యేక స్థానం యిచ్చాడు శుక్రుడు.


అనునిత్యమూ మధురమైన ఫలాలూ , మనోహర సుగంధాలు వెదజల్లే పువ్వులూ తెస్తూ దేవయానికి అత్యంత సన్నిహితుడయ్యాడు కచుడు. ఆశ్రమ కార్యకలాపాలలో , గోశాలను తీర్చిద్దిడంలో దేవయానికి సహాయం చేస్తూ మృదుమధురంగా ఆమెతో సంభాషిస్తూ ఆమె అభిమానాన్నీ చూరగొన్నాడు.


ఆశ్రమానికి మొట్టమొదటిసారి వచ్చిన క్షణాలలోనే , కచుడి పట్ల ఆకర్షితురాలైన దేవయాని , అతడి సాన్నిహిత్యాన్నీ , సంభాషణలనూ తనలో అంకురించిన ప్రేమకు ప్రోత్సాహక లక్షణాలుగా అర్థం చేసుకుంది. అచిరకాలంలోనే ఆమె కచుడిని ప్రాణప్రదంగా ప్రేమించసాగింది. తండ్రి శుక్రుడు కచుడికి తన హృదయంలో స్థానం కల్పిస్తే , దేవయాని కచుడికి తన హృదయాన్నే యిచ్చివేసింది !


కచుడి పట్ల గురుదేవుల వాత్సల్యమూ , గురుపుత్రి ప్రేమా పెరుగుతున్న విధంగా , వాటితోబాటే - కచుడిపట్ల అసుర శిష్యులతో ద్వేషమూ పెరగ సాగింది ; నీడలాగా ! కచుడు గురువు గారికి ప్రియ శిష్యుడు కావడం ; గురువుగారు అతన్ని అమిత వాత్సల్యంతో చూడడం వారికి నచ్చలేదు.


*"కచుడు మన శత్రువుల గురువు పుత్రుడు. ఆగర్భ విరోధాన్ని విస్మరించి మన గురువుగారు ఆ మోసగాణ్ని మనకన్నా మిన్నగా చూసుకుంటున్నారు. ఈ దారుణాన్ని సాగనివ్వకూడదు"* అన్నాడు వయసులో పెద్దవాడైన అసుర శిష్యుడు.


*"ఏం చేద్దాం ?”* ఇతర శిష్యులు అడిగారు.


*“ఈ రోజు ఆ కచుడు గోవులతో అరణ్యంలోకి వెళ్ళాక , చాటుగా వెళ్ళి , చంపేద్దాం !”*


*"ఔనౌను ! ఈ సమస్యకు అదొక్కటే పరిష్కారం !"* ఇతర అసుర శిష్యులు ఉత్సాహంగా అన్నారు.


అనుకున్నట్టుగానే ఆ రాక్షసులు - హోమధేనువులను కాస్తున్న కచుణ్ణి ఒక చెట్టు బోదెకు బంధించి , వధించి వెళ్ళిపోయారు !


చీకటి పడుతోంది. అరణ్యానికి కచుడితోపాటు వెళ్ళిన ధేనువులు ఆశ్రమానికి తిరిగి చేరాయి. అయినా , కచుడు రాలేదు. కచుడికోసం ఆశ్రమ ప్రాంగణంలో ఆత్రుతగా నిరీక్షిస్తున్న దేవయాని కచుడు ఇంకా రాకపోయే సరికి భయపడి పోయింది. అరణ్య మధ్యంలో కచుడికి ఏదైనా ఆపద సంభవించిందా ? క్రూరమృగాల వల్లగాని , విష సర్పాల వల్ల గానీ , నిశాచరుల వల్లగానీ అతడికి ప్రమాదం జరిగిందా ? ఆందోళన కలిగించే ఆలోచనలతో దేవయాని హృదయం తల్లడిల్లి పోయింది.


ఆమె తండ్రి వద్దకు పరుగు పెట్టింది. *“నాన్నా... ధేనువులన్నీ తోడు లేకుండా అరణ్యం నుండి తిరిగి వచ్చాయి. సూర్యాస్తమయమై పోయింది. గాడాంధకారం అలముకుంది. కచుడు రాలేదు ! ఏదైనా ఆపద పాలయ్యాడేమో , నాన్నా ! నాకు భయంగా వుంది !"* అంది కన్నీళ్ళు తుడుచుకుంటూ.


శుక్రుడు కూతురివైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. *"ఏడుస్తున్నావా , దేవయానీ !”*


*"అవున్నాన్నా ! కచుడు నా ఆరోప్రాణం నాన్నా ! అతడికి ఏమైందో చెప్పు నాన్నా !”* శుక్రుడు ఏకాగ్రతతో , అర్ధనిమీలిత నేత్రాలతో దృష్టిని జ్ఞానోన్ముఖం చేశాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి , కూతురి ముఖంలోకి చూశాడు.


*“కచుడు మరణించాడు... అరణ్యంలో ఎవరో అతన్ని చెట్టుకు కట్టి , వధించారు...”* 


*"నాన్నా !"* దేవయాని బావురుమంది.


*"భయపడకమ్మా ! కచుడు బ్రతుకుతాడు ! మృతసంజీవని ఉందిగా తల్లీ !"* శుక్రుడు వోదార్పుగా అన్నాడు. *"నువ్వు వెళ్ళి ఆ కన్నీటిని కడిగి , ముఖాన్ని ప్రసన్నం చేసుకో !"*


దేవయాని నవ్వు ముఖంతో చూసి , ఉత్సాహంగా ఆశ్రమం వైపు వెళ్ళింది. శుక్రుడు మృతసంజీవని విద్యను ఆవాహన చేశాడు. 'మృతసంజీవనీ విద్యాదేవత' ప్రసన్నమైన , ప్రశాంతమైన ఆకారంతో ఆయన ముందు సాక్షాత్కరించింది.


*"సంజీవనీ ! కచుడు నా ప్రియశిష్యుడు. అతని శవం అరణ్యంలో వుంది. అతనికి ప్రాణం పోసి తీసుకురా !"* శుక్రుడు ఆజ్ఞాపించాడు.


ఆ వెంటనే మృతసంజీవనీ విద్యాదేవత వాయువేగంతో అరణ్యం వైపు వెళ్ళింది. పునర్జీవితుడిని చేసిన కచుడిని వెంట బెట్టుకుని వచ్చింది. అతన్ని శుక్రుడి ముందు నిలిపి అదృశ్యమైంది.


దేవయాని ఉత్సాహంతో పరుగెట్టుకుంటూ అక్కడికి వచ్చింది. చిరునవ్వులు చిందుతున్న ఆమె ముఖం ఆనంద బాష్పాలతో తడుస్తోంది. క్షణకాలం కచుడిని ప్రేమగా చూసింది. మెల్లగా తండ్రి వైపు తిరిగింది. శుక్రుడు సగర్వంగా చిరునవ్వు నవ్వుకున్నాడు.


*“నాన్నా !”* అంటూ దేవయాని శుక్రుణ్ని కౌగిలించుకుంది. శుక్రుడి అరచెయ్యి వాత్సల్యభారంతో ఆమె వీపు మీద నెమ్మదిగా కదులుతూ , నిమురుతోంది.


*“కచా ! నువ్వు రాకపోయేసరికి దేవయాని భయ విహ్వల అయిపోయింది సుమా ! నిన్ను పునర్జీవితుణ్ణి చేస్తానని మాట యిచ్చేదాకా నన్ను వదల లేదు ! నా తల్లికి నువ్వంటే ప్రాణం !"* శుక్రుడు దేవయాని వీపు నిమురుతూ , ఆమె భుజం మీద నుంచి చూస్తూ అన్నాడు.


*“అది నా అదృష్టం గురుదేవా !”* కచుడు కృతజ్ఞతాభావంతో అన్నాడు.


*“అమ్మ నీ కోసం ఎదురు చూస్తోంది కచా ! రా ! వెళ్లాం !"* అంది ప్రేమగా దేవయాని.


**********************************


కచుడు ఆశ్రమ కుటీరంలో కూర్చుని , ఉదయం శుక్రాచార్యుడు బోధించిన సూక్తం వల్లె వేసుకుంటున్నాడు. గాలి ఒక్కసారిగా విసురుగా వీచింది. ప్రమిదలో దీపం రెపరెపలాడింది. కచుడు ద్వారం వైపు చూశాడు. తలుపు తెరిచి , లోపలికి వచ్చిన దేవయాని తలుపు మూస్తోంది. గాలి వీచిన కారణం అర్థమైంది కచుడికి.ఛ


దేవయాని అతని వైపు తిరిగింది. శ్వేత వస్త్రాలలో , దేవ కన్యలా ధగధగలాడుతోందామె. పొడుగాటి జుత్తు , గుండ్రటి ముఖం. సూర్యరశ్మిలో తళుక్కుమనే జంట సరోవరాల్లా మెరుస్తున్న కళ్ళు...


*"కచా ! ఏం జరిగింది అరణ్యంలో... ?"* వయ్యారం వొలికే నడకతో అతన్ని సమీపిస్తూ అడిగింది దేవయాని.


*"తెలీదు...”*


*"నిన్ను... నిన్ను... వధించిన వాళ్ళు ఎవరు ?”* దేవయాని అతని సమీపంలో కూర్చుంది.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

కామెంట్‌లు లేవు: