6, డిసెంబర్ 2023, బుధవారం

 *కార్తిక పురాణము - 24*

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

*కార్తిక పురాణము - ఇరవై నాలుగవ అధ్యాయము*


అత్రి ఇట్లు పల్కెను. అగస్త్య మునీంద్రా! నీకు కార్తీకవ్రతమందును, హరిభక్తి యందును ఆసక్తి ఉన్నది. కాన కార్తీకకమహాత్మ్యమును చెప్పెద వినుము. సావధానముగా విన్న ఎడల పాపములు నశించును.


కార్తీకమాసమందు శుక్ల ద్వాదశి హరి బోధిని, ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలమును ఇచ్చును.అన్ని ద్వాదశులలో అధిక ఫలము ఇచ్చునది.సమస్త యజ్ఞములను చేసిన ఫలమును హరిబోధిని యగు ద్వాదశి ఇచ్చును.ఇది కాక ఈ ద్వాదశి హరియందును, ఏకాదశియందును, భక్తినిచ్చును. కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైనది.ద్వాదశి సూర్య చంద్ర గ్రహణముల కంటే అధిక పుణ్యప్రదము. ఏకాదశి కంటే నూరు రెట్లు ఎక్కువది.సమస్త పుణ్యమును ఇచ్చునది. ద్వాదశి నాడు చేసిన పుణ్యము కోటి రెట్లగును.ద్వాదశి పుణ్యదినము గనుక కొంచెముగా ఉన్నను పారణకు ఉపయోగించవలెను.కానీ ద్వాదశిని విడిచి పారణ చేయకూడదు. ఇతర నియమములన్నింటిని విడిచి ద్వాదశి స్వల్ప కాలమందు పారణ చేయవలెను.కానీ పుణ్యమును కోరువారు ద్వాదశిని విడువ కూడదు.

ఏకాదశియందు ఉపవాస మాచరించి మరునాడు ద్వాదశి కాలము అతిక్రమించక భోజనము చేయవలెను.


ఉపవాసముండి మరునాడు ద్వాదశి భోజనము చేయుట పారణ అనబడును.ఈ విషయము తెలిసియె పూర్వమందు పరమ భాగవతుడైన అంబరీష మహారాజు పారణకు ద్వాదశిని విడువలేదు.ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నం భుజించుట పారణ అనబడును.అంతలో దుర్వాస మహాముని వచ్చి ఆతిథ్యమను వంక చేత భోజనమును యాచించెను. అంబరీషుడు సరేనని ద్వాదశి పారణకు దుర్వాసుని రమ్మనెను.దుర్వాసుడు పారణకు అంగీకరించి అనుష్ఠానము కొరకు వెళ్ళెను. ఆనాడు ద్వాదశి అతిస్వల్పముగా ఉండెను.దుర్వాసుడు రాకపోయెను. ద్వాదశి పోవుచున్నది.ఇట్టి సంకటము సంభవించినది.అపుడు హరిభక్తుడైన అంబరీషుడు విచార పడసాగెను.ఈ దుర్వాసుడు ముని శ్రేష్ఠుడు.పారణ కొరకు అంగీకరింపబడినాడు. ఇంతవరకు రాలేదు. ద్వాదశి అతిక్రమించి భుజించిన అధర్మమగును.


బ్రాహ్మణుని కంటె ముందు భుజించిన యెడల కోపించి అగ్నితో సమానుడై ముని శాపమిచ్చును గనుక ఇప్పుడు ఏది కుశలము? ఉపవాసమందెట్లు ఏకాదశిని విడువరాదో అట్లే పారణయందును ద్వాదశిని విడువరాదు.ద్వాదశిని విడిచిన యెడల హరిభక్తిని విడిచిన వాడనగుదును. ఏకాదశినాడు ఉపవాసము చేయక ఏ దోషమునకు పాత్రుడనగుదునో ద్వాదశిని విడిచినయెడల అట్టి దోషమే సంభవించును.ఇదిగాక ద్వాదశీ పారణాతిక్రమణము పన్నెండు ఉపవాసముల ఫలమును పౌగొట్టును.కాన ద్వాదశిని విద్వాంసుడు విడువకూడదు. హరివాసరము పుణ్యదినము గాన విద్వాంసుడు విడువరాదు. దానిని విడిచెనేని పురుషునకు పుణ్యసంచయము చేకూరదు.అనేక జన్మములందు చేసిన పుణ్యము హరివాసరమును విడిచిన యెడల నశించును.అందువలన గలిగెడి పాతకమునకు నివృత్తి లేదు. ఒక్క ద్వాదశి అయినను విడువకూడదు.దీనికి ప్రతీకారము లేదు. అనేక వాక్యాలతో పనియేమున్నది.ఇది నిజము.


హరిభక్తిని విడుచుట యందు నాకు మహా భయమున్నది.కాబట్టి యట్టి సంకటమందు హరిభక్తిని విడుచుట కంటే పారణమే ముఖ్యము.బ్రాహ్మణ శాపమువలన నాకేమియు భయములేదు. శాపము వలన కల్పాంతము దుఃఖము రానిమ్ము. ద్వాదశిని విడిచినచో హరివాసరము (ఏకాదశులు) 10 విడువబడినవియగును.హరివాసరమును విడిచిన యెడల హరిభక్తి లోపించును. గనుక హరిభక్తిని విడుచుట కంటే బ్రాహ్మణ శాపమే కొంచెము మంచిది. కాబట్టి హరిభాక్తికి లోపము తెచ్చుట కంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనము చేసి ద్వాదశి హరివాసరమును పోనివ్వక తద్ద్వారా హరిభక్తిని నిలుపుకొనుట మంచిది. అట్లయిన యెడల హరియే కష్టాలు రాకుండా కాపాడును. అంబరీషుడు ఇట్లు మంచి మనస్సుతో నిశ్చయించుకొని వేదవేత్తలైన బ్రాహ్మణులను ఓ బ్రాహ్మణోత్తములారా! దుర్వాసుడు భోజమునకు వచ్చెదననెను. నేనట్లంగీకరించితిని.ఇప్పటికినీ రాలేదు.ద్వాదశి పోవుచున్నది.గనుక బ్రాహ్మణుని కంటే పూర్వము భోజనము చేసినందున భ్రాహ్మణాతిక్రమణము, ద్వాదాశిలో పారణము చేయకపోతే ద్వాదశ్యతిక్రమణము గలుగును.గనుక మీరు బలాబలమును విచారించి రెండింట్లో ఏది యుక్తమో చెప్పుడు అని అడిగెను.


ఆమాట విని ఆ బ్రాహ్మణులు ధర్మ బుద్ధితో ద్వాదశి యొక్కయు అతిథిగా వచ్చిన బ్రాహ్మణుని యొక్కయు గౌరవ లాఘవములను విచారించి సమస్త భూతములయందును అగ్ని రూపుడైన ఈశ్వరుడే భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూపమైన అన్నమును భుజించుచున్నాడు. ప్రాణ వాయువు వలన జఠరాగ్ని ప్రజ్వలితమగుచుండగా జంతువులకు అన్నమును గోరెడి ఆకలి కలుగుచుండును. ప్రాణ వాయువు చేత కొట్టబడిన జఠరాగ్ని సంతాపమును చేయుటకే క్షుత్పిపాసలనబడును.కాబట్టి ప్రాణ సహితముగా అగ్ని సర్వ సుర పూజితుడగుచున్నాడు. సర్వ భూతములయందున్న అగ్నిని నిత్యమూ పూజించవలెను. తన ఇంటికి వచ్చిన శూద్రుని గానీ, చండాలుని గానీ విడిచి భుజించ రాదు. సాక్షాత్ ప్రథమ వర్ణమైన బ్రాహ్మణుని విడిచి భుజించరాదని చెప్పవలసినది ఏమున్నది? గృహస్థుడు స్వయముగా అతిథిని పిలిచి అతిథికంటే ముందుగా తాను భుజించిన యెడల బ్రాహ్మణావమానమగును. బ్రాహ్మణావమానము చేత ఆయువు, ఐశ్వర్యము, కీర్తి, ధర్మము, ఇవన్నియూ నశించును. ఇది ఏమి, అది ఏమి మనస్సులో ఉండే కోరికై అనగా సంకల్పితమంతయూ నశించును.

బ్రాహ్మణులందరూ స్వర్గమందుండెడి దేవతలే అని చెప్పబడుడురు. దేవతలను తిరస్కరించుట చేత అంతయూ నశించును. జాతి మాత్రము చేతనే బ్రాహ్మణులు దేవతలతో సమానులు. ఈ దుర్వాసుడు తపోవంతుడు. ఇతని విషయమందు చెప్పునదేమున్నది? ఓ రాజా! ఈ బ్రాహ్మణుడు కోపము చేయక పోయిననూ బ్రాహ్మణుని కంటే ముందు భుజించకూడదు.ఈ బ్రాహ్మణునకును ద్వాదశి పారణకు వచ్చెదనని చెప్పి సమయానికి రాకుండుట అన్యాయమై ఉన్నది. ద్వాదశీ పారణను విడిచి పెట్టిన ఏకాదశ్యుపవాసమునకు భంగము వచ్చును. ఏకాదశి త్యాగమునకు ప్రాయశ్చిత్తము లేదు.బ్రాహ్మణాజ్ఞకు ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి ఈ రెండునూ సమానములుగా నున్నవి.ఇందు గురుత్వము, లఘుత్వము మాకు కనిపించుట లేదు. ద్వాదశి కాలమందు పారణ చేయని యెడల హరి భక్తి లోపించును. పారణ చేసిన దుర్వాసుడు శపించును.ఎట్లైనను అనర్థము రాక తప్పదు.అదియు కొద్దిది కాదు.గొప్ప కీడు కలుగును.బ్రాహ్మణులందరూ శాస్త్రములను ఇట్లు న్యాయముగా విచారించి యదార్థమును ఆలోచించి రాజుతో ఇట్లనిరి.


ఇతి శ్రీ స్కాంద పురాణే కార్తిక మహాత్మ్యే చతుర్వింశాధ్యాయ సమాప్తః.

కామెంట్‌లు లేవు: